తాత్కాలికంగా దూకుడు తగ్గించిన రష్యా సేనలు – బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ
రష్యా సేనలు తమ దూకుడును తాత్కాలికంగా తగ్గించాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘తీవ్రమైన వ్యూహాత్మకమైన సమస్యలు, యుక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన’ ఇందుకు కారణమని చెబుతూ రక్షణ శాఖ ట్వీట్ చేసింది.
“రష్యా సేనలు యుక్రెయిన్‌లో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను దాటుకుంటూ పోతున్నాయి. వాటిని చుట్టుముట్టి ఏకాకిని చేసే ప్రయత్నంలో ఉన్నాయి” అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడమే రష్యా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది’ అని కూడా ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, యుక్రెయిన్ రక్షణ కోసం తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఆయుధాలు వదిలిపెట్టమని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ స్పష్టం చేశారు.



















