యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ యుద్ధాన్ని నడిపిస్తున్నారు, మరి పుతిన్‌ను నడిపిస్తున్నదెవరు

పుతిన్ తన ఆంతరంగికులతో దూరంగా కూర్చుని మాట్లాడటం చాలా అరుదుగా కనిపిస్తుంది

ఫొటో సోర్స్, RUSSIAN PRESIDENCY

ఫొటో క్యాప్షన్, పుతిన్ తన ఆంతరంగికులతో దూరంగా కూర్చుని మాట్లాడటం చాలా అరుదుగా కనిపిస్తుంది
    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకాకి కావడమే కాక, తన దేశాన్ని ఆర్ధికంగా దెబ్బతినే ప్రమాదంలోకి నెట్టారు.

ఇటీవల తన ఆంతరంగికులతో జరిగిన సమావేశంలో పుతిన్ వారికి చాలా దూరంగా కూర్చుని కనిపించారు. ఇది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయనకు అత్యంత సన్నిహితులు అని చెప్పుకునే వారితో జరిపిన రెండు సమావేశాలలో ఆయన ఇలాగే దూరం పాటించారు.

కమాండర్ ఇన్‌ చీఫ్‌గా యుక్రెయిన్ ఆక్రమణ నిర్ణయం పూర్తిగా ఆయనదే అయినా, చాలా విషయాల్లో పుతిన్ తనకు అత్యంత విధేయులైన ఆంతరంగికుల సలహాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పుతిన్‌కు సలహాలిచ్చేవారిలో చాలామంది గతంలో రష్యన్ సెక్యూరిటీ సర్వీస్‌లో ఆయనతోపాటు కెరీర్ ప్రారంభించినవారే.

మరి ఇప్పుడు తన పాలనలో అత్యంత నిర్ణయాత్మక దశలో ఉన్న పుతిన్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్న కీలకమైన వ్యక్తులు ఎవరు, ఆయన ఎవరి మాటలు వింటున్నారు?

రక్షణమంత్రి

యుక్రెయిన్‌ను నిస్సైనికీకరించాలని, పాశ్చాత్య దేశాల నుంచి రష్యాకు ముప్పు పొంచి ఉందంటూ పుతిన్ ధోరణిలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను రక్షణమంత్రి సెర్గీ షోయిగు మాత్రమే. పుతిన్‌తో కలిసి సరదాగా సైబీరియాలో చేపలు పట్టడటానికి కూడా వెళుతుంటారు షోయిగు.

ఒక దశలో పుతిన్ వారసుడు ఆయనే అన్న ప్రచారం కూడా సాగింది. ఈ కింద ఫొటో చూడండి. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన షోయిగు టేబుల్ ఆ చివరన, సాయుధ దళాల అధిపతి పక్కన కూర్చున్నారు. మరి ఆయన మాట పుతిన్‌కు వినిపిస్తుందా? పుతిన్ చెవి అంతదూరం వెళ్లి వినగలుగుతుందా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు.

అంతరంగికులైన ఇద్దరు వ్యక్తులతో దూరంగా కూర్చుని మాట్లాడుతున్న పుతిన్

ఫొటో సోర్స్, REUTERS/KREMLIN

ఫొటో క్యాప్షన్, అంతరంగికులైన ఇద్దరు వ్యక్తులతో దూరంగా కూర్చుని మాట్లాడుతున్న పుతిన్

ఈ ఫొటో మూడు రోజుల కిందటిది. యుక్రేనియన్ సైన్యం నుంచి అనూహ్యమైన ప్రతిఘటనతో రష్యా సైన్యం నైతిక స్థైర్యం కోల్పోయిన సందర్భంలోనిది.

"షోయిగు కీయెవ్‌కు మార్చింగ్ చేయాల్సి ఉంది. ఆయన రక్షణమంత్రి. విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది'' అని సాయుధ పోరాటాల నిపుణుడు వెరా మిరోనోవా అన్నారు.

2014లో క్రైమియాను స్వాధీనం చేసుకున్న క్రెడిట్‌ను షోయిగు తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన ఇప్పుడు జీఆర్‌యు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రెండు నెర్వ్ ఏజెంట్ (విష ప్రయోగం) ఆపరేషన్లు ఆయన నాయకత్వంలోనే జరిగాయి. 2018లో యూకేలోని శాలిస్‌బరీలో, 2020లో సైబీరియాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ పై నెర్వ్ ఏజెంట్ దాడులు జరిగాయి.

ఈ ఫొటోను మరీ దగ్గరగా చూస్తే వారు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమానికి వచ్చినట్లు ఉందని వెరా మిరోనోవా అన్నారు.

వెలెరి గెరాసిమొవ్ , రక్షణమంత్రి సెర్గీ షోయిగు

ఫొటో సోర్స్, EPA/KREMLIN POOL

ఫొటో క్యాప్షన్, వెలెరి గెరాసిమొవ్ , రక్షణమంత్రి సెర్గీ షోయిగు

ఈ ఫొటోలో షోయిగును అలా చూడటానికి ఇబ్బందిగా అనిపించినా, అధ్యక్షుడిని ప్రభావితం చేయగల వ్యక్తి ఆయనేనని రష్యా భద్రతా నిపుణుడు, రచయిత ఆండ్రీ సోల్డాటోవ్ వ్యాఖ్యానించారు.

"షోయిగు కేవలం సైన్యానికి బాధ్యత వహించడమే కాదు, కొంత వరకు రష్యన్ భావజాలానికి కూడా బాధ్యత వహిస్తారు. రష్యన్ భావజాలం అంతా చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ఆయనకు దానిపై పట్టు బాగా ఉంది'' సోల్డాటోవ్ అన్నారు.

రష్యన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అధిపతి

అధినేత ఆదేశాల మేరకు యూక్రెయిన్‌పై దండెత్తడం, పనిని వేగంగా పూర్తి చేయడం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వలెరీ గెరాసిమోవ్ బాధ్యత. ఈ మేరకు ఆయన తన పని చేసుకుపోతున్నారు. .

1999 చెచెన్ యుద్ధంలో సైన్యానికి నాయకత్వం వహించినప్పటి నుంచి పుతిన్ సైనిక వ్యవహారాలలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. యుక్రెయిన్ కోసం రూపొందించిన సైనిక ప్రణాళికలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో బెలారుస్‌లో జరిగిన మిలిటరీ విన్యాసాలను ఆయనే పర్యవేక్షించారు.

నవ్వు ముఖం కనిపించని సీరియస్ వ్యక్తిగా ఆయనకు పేరుంది. క్రైమియాను స్వాధీనం చేసుకోవడంలో ఆయనది ప్రధాన పాత్ర.

యుక్రెయిన్‌ పై దాడుల విషయంలో ఆయన మందకొడిగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఆయనను పక్కన పెట్టారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఇది గిట్టని వారు కొందరు సృష్టించిన వార్త అని ఆండ్రీ సోల్డటోవ్ అంటున్నారు.

''పుతిన్ ప్రతి రోడ్డును, ప్రతి బెటాలియన్‌ను కంట్రోల్ చేయలేరు. వలెరి గెరాసిమోవ్ ఇప్పటికీ కీలక స్థానంలో ఉన్నారు. అయితే, ఆయనకు పదవి ఉంది, వ్యూహాలు రచిస్తారు తప్ప మిలిటరీ శిక్షణ తీసుకున్న వ్యక్తి కాదు'' అన్నారాయన.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?
సెక్యురిటీ కౌన్సిల్ సెక్రటరీ

"పట్రుషెవ్ అత్యంత నిశిత దృష్టి కలవాడు. రష్యాను లొంగదీసుకునేందుకు పశ్చిమ దేశాలు ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాయని బలంగా నమ్ముతారు'' అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో రష్యన్ పాలిటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బెన్ నోబుల్ అన్నారు.

1970లలో ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌, అప్పటి లెనిన్ గ్రాడ్‌ లో కలిసి పని చేసినప్పటి నుంచి పుతిన్‌కు అత్యంత సన్నిహితులు, విధేయులైన ముగ్గురిలో నికోలాయ్ పట్రుషెవ్ ఒకరు. మిగిలిన ఇద్దరు సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్, ఫారిన్ ఇంటెలిజెన్స్ హెడ్ సెర్గీ నర్యష్కిన్. ప్రెసిడెంట్ అంతర్గత సలహాదారుల సర్కిల్‌ను ‘సిలోవికి’ లేదా ‘ఎన్‌ఫోర్సర్‌’లు అని పిలుస్తారు. వారిలో కూడా ఈ ముగ్గురే పుతిన్‌కు అత్యంత సన్నిహితులు.

నికోలాయ్ పట్రుషెవ్‌లాగా ప్రెసిడెంట్ మీద ప్రభావం చూపగలిగిన వ్యక్తులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ పాలనా కాలంలో పాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేజీబీలో పుతిన్‌తో కలిసి పని చేశారు పట్రుషెవ్. దాని స్థానంలో వచ్చి ఎఫ్ఎస్‌బీకి 1999 నుండి 2008 వరకు నాయకత్వం వహించారాయన.

అమెరికా లక్ష్యం రష్యాను విచ్ఛిన్నం చేయడమేనని దాడికి మూడు రోజులు ముందు జరిగిన సమావేశంలో పట్రుషెవ్ అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం ఒక పెద్ద థియేటర్‌లాంటి భవనంలో జరిగింది. అధ్యక్షుడు టేబుల్ వేసుకుని కూర్చోగా, ఆయన భద్రతా సలహాదారుల బృందంలో ఒక్కొక్కరు యుక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలకు స్వాతంత్ర్యం ప్రకటించడం పై తమ అభిప్రాయాన్ని వినిపించారు.

‘‘నికోలాయ్ పట్రుషెవ్ ఈ టెస్టులో పాసయ్యారు. పుతిన్‌ను యుద్ధానికి ప్రేరేపించిన వ్యక్తి ఆయనే. ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత పుతిన్ తన వ్యూహాన్ని మరింత ముందుకు పోనిచ్చారు'' అని బెన్ నోబుల్ అన్నారు.

ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ డైరక్టర్

ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా, నిఘా భద్రతా వ్యవస్థల నుంచి వచ్చిన సమాచారాన్నే పుతిన్ నమ్ముతారని క్రెమ్లిన్ పరిశీలకులు అంటారు. అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ పుతిన్ అంతర్గత విభాగాలలో కీలకమైన వ్యక్తిగా కనిపిస్తారు.

పుతిన్ పాత కేజీబీ సహచరులలో అలెగ్జాండర్ కూడా ఒకరు. పట్రుషెవ్ తర్వాత ఎఫ్ఎస్‌బీ నాయకత్వాన్ని చేతిలోకి తీసుకున్నారు అలెగ్జాండర్. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రెసిడెంట్‌కు సన్నిహితులనీ, కానీ ఇద్దరిలో ఎవరు ఏం చెబుతున్నారో, ఎవరి మాటలను ఆయన ఆచరణలో పెడుతున్నారో చెప్పడం కష్టమని బెన్ నోబెల్ అన్నారు.

చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాల అమలులో ఎఫ్ఎస్‌బీ పాత్ర చాలా కీలకం. అలెగ్జాండర్ కీలకమైన వ్యక్తే అయినా, అధ్యక్షుడి మాటను కాదనేశక్తి గానీ, ఇతరుల మాదిరిగా స్వేచ్ఛగా సలహాలిచ్చే స్థాయిగానీ ఆయనకు లేవని ఆండ్రీ సోల్డాటోవ్ అభిప్రాయపడ్డారు.

ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్

సెయింట్ పీటర్స్‌బర్గ్ మిత్రత్రయంలో చాలా కాలంపాటు పుతిన్ కు సన్నిహితంగా ఉన్నవ్యక్తులలో సెర్గీ నర్యష్కిన్ ఒకరు.

అయితే, ఆయన ఇటీవల జరిగిన భద్రతా మండలి సమావేశంలో తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేక తడబడ్డారు. పరిస్థితి ఎలా ఉందని అడిగినప్పుడు నర్యష్కిన్ కంగారుపడుతూ ఇంకేదో చెప్పబోయారు. అప్పుడు అధ్యక్షుడు కల్పించుకుని ''మనం చర్చిస్తున్నది అది కాదు'' అని అన్నారు.

అయితే, ఈ సుదీర్ఘమైన సమావేశాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేయాలనుకున్న క్రెమ్లిన్, ఆయన తడబడిన దృశ్యాలను మాత్రం టెలివిజన్ ప్రేక్షకులకు చూపించాలని స్పష్టంగా నిర్ణయించుకుంది. కానీ, తాము ఈ దృశ్యాలను ఎంజాయ్ చేశామని ఆండ్రీ సోల్డాటోవ్ అన్నారు. "పుతిన్ తన ఇన్నర్ సర్కిల్ మిత్రులతో అప్పుడప్పుడు ఆటాడుకుంటారు. ఆయన్ను ఫూల్ చేయాడానికి ప్రయత్నించారు'' అని అన్నారు.

2004లో పుతిన్ అధికారం చేపట్టినప్పుడు నర్యష్కిన్ ఆయన వెంటే ఉన్నారు. కొన్నాళ్లు పార్లమెంటు స్పీకర్‌గా పని చేశారు. రష్యన్ హిస్టారికల్ సొసైటీకి నాయకుడిగా పని చేశారు. సోల్డాటోవ్ దృష్టిలో నర్యష్కిన్ అధ్యక్షుడి చర్యలకు సైద్ధాంతిక కారణాలను అందించే పనిలో ఉంటారు.

గత ఏడాది బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ఎప్పుడూ నెర్వ్ ఏజెంట్ దాడులు చేయలేదని, ఇతర దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకోలేదని నర్యష్కిన్ స్పష్టం చేశారు.

వీడియో క్యాప్షన్, కుటుంబాన్ని వదిలి యుద్దానికి వెళ్తున్న యుక్రెయిన్ పౌరులు
విదేశీ వ్యవహారాల మంత్రి

18 సంవత్సరాల పాటు రష్యాకు అత్యంత సీనియర్ దౌత్యవేత్తగా పని చేశారు సెర్గీ లావ్రొవ్. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు పెద్దగా పాత్ర లేకపోయినా రష్యా వాదనను ప్రపంచానికి వినిపిస్తుంటారు.

ఆయన కాస్త చమత్కారి కూడా. రష్యా భౌగోళిక చరిత్ర మీద బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌కు పరిజ్ఞానం లేదంటూ ఓ సందర్భంలో ఎగతాళి చేశారు. అంతకు ముందు సంవత్సరం, ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్‌ను కూడా ఇలాగే అవమానపరిచే ప్రయత్నం చేశారు.

కాకపోతే, యుక్రెయిన్ వ్యవహారాలకు ఆయన చాలాకాలంగా దూరంగా ఉన్నారు. యుక్రెయిన్‌పై దాడికి సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమావేశంలో ఆయన ప్రసంగానికి నిరసనగా చాలామంది వాకౌట్ చేస్తున్నా ఆయన లెక్క చేయలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఫెడరేషన్ కౌన్సిల్ ఛైర్‌వుమన్

పుతిన్ సన్నిహితుల బృందలో ఏకైన మహిళ వాలెంటినా మత్వియెంకో. విదేశాలలో రష్యన్ దళాల మోహరింపుకు సంబంధించి ఆమె ఎగువ సభ నుంచి అనుకూల ఓటును, ఆమోద ముద్రను సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాతనే దాడులకు బీజం పడింది.

వాలెంటినా కూడా సెయింట్ పీటర్స్‌బర్గ్ నాటి పుతిన్ విధేయ మిత్రుల్లో ఒకరు. 2014లో క్రైమియాను స్వాధీనం చేసుకోవడంలో కూడా ఆమె ఇలాగే సహాయపడ్డారు.

కానీ, ప్రాథమిక నిర్ణయాల తీసుకునే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు లేదు. పుతిన్ ఎవరెవరిని పిలుస్తున్నారో, ఎవరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పగలవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.రష్యా అధ్యక్షుడు అప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఇది అందరి అభిప్రాయం అనిపించడం ఆమె చేసే పని.

నేషనల్ గార్డ్ డైరెక్టర్

పుతిన్ మాజీ అంగరక్షకుడు విక్టర్ జొలొటొవ్. ఇప్పుడాయన రోస్వాగార్డియా అని పిలిచే రష్యా నేషనల్ గార్డ్ సంస్థకు అధిపతి. రొమేనియా సామ్రాజ్య పాలకుల మాదిరిగా పుతిన్ తన చుట్టు వ్యక్తిగత సైన్యంలా ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పని చేసిన వ్యక్తిని అధినేతను చేయడం ద్వారా విధేయతకు పుతిన్ ప్రాధాన్యమిచ్చారు. నేషనల్ గార్డ్స్ సిబ్బందిని 4 లక్షలకు చేర్చారు విక్టర్.

ఈ దండయాత్రను కొన్ని రోజుల వ్యవధిలో పూర్తి చేయాలనేది రష్యా ప్రణాళిక అని వెరా మిరోనోవా అభిప్రాయపడ్డారు. సైన్యం విఫలమవుతున్నట్లు కనిపించినప్పుడు, నేషనల్ గార్డ్ నాయకత్వాన్ని తన చేతిలోకి తీసుకుంటోంది.

ఇక్కడ సమస్య ఏంటంటే, నేషనల్ గార్డ్‌కు సైనిక శిక్షణ లేదు. ఈ దళానికి ట్యాంకులు లేనందున వీరు కూడా దాడికి గురయ్యే ప్రమాదం ఉంది.

పుతిన్ ఇంకా ఎవరి మాట వింటారు?

ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్‌కు ఆర్థిక వ్యవస్థను రక్షించే మరో పెద్ద బాధ్యత ఉంది. ఆయన యుద్ధం గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. రాజకీయ విశ్లేషకుడు యెవ్జెనీ మించెంకో ప్రకారం, మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్, చమురు దిగ్గజ కంపెనీ రోస్నెట్ సీఈవో ఇగోర్ సెచిన్ కూడా అధ్యక్షుడికి సన్నిహితంగా ఉన్నారు.

ప్రెసిడెంట్ చిన్ననాటి స్నేహితులైన బిలియనీర్ సోదరులు బోరిస్, ఆర్కాడీ రోటెన్‌బర్గ్ కూడా పుతిన్‌తో స్నేహం కొనసాగిస్తున్నారు. 2020లో ఫోర్బ్స్ మేగజైన్ రష్యాలోని అత్యంత సంపన్న కుటుంబంగా వారిని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)