ఆంధ్రప్రదేశ్: 'రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు' - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరో మలుపు తిరిగింది. ఏపీ హైకోర్టులో దాఖలయిన పిటిషన్లపై గురువారం తుది తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని పేర్కొంది.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్న దశలో అలాంటి చట్టాలకే అవకాశం లేదని హైకోర్టు పేర్కొనడం ఆసక్తికర అంశంగా మారింది.
'మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు చేయాలి'
అమరావతి విషయంలో సీఆర్‌డీఏ చట్టాలను అమలు చేయాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు చేయాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సిందేనంది.
ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు గుర్తు చేసింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది.
అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు అమరావతి ప్రాంత భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తుది తీర్పులో ప్రస్తావించింది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూనే ఆరు నెలల్లోగా వాటాదారుల ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని హైకోర్టు తెలిపింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని ప్రస్తావిస్తూ రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని వ్యాఖ్యానించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని పేర్కొంది. రాజధాని మార్చడం గానీ, విభజించడం గానీ చేసే హక్కు శాసనసభకు ఉండదని తీర్పులో హైకోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
మూడు రాజధానుల విషయం ఏమవుతుంది?
రాష్ట్ర పునర్విభజన తర్వాత 2015లోనే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొన్ని పనులు జరిగాయి.
2019 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేతులు మారడం అమరావతిలో పరిణామాలను తలకిందులు చేసింది. ఆ ఏడాది డిసెంబర్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి సీఎం జగన్ సభ ముందుకు తీసుకొచ్చారు. 2020 జనవరిలో ఏపీ అసెంబ్లీలో చట్టానికి ఆమోదం దక్కింది.
మండలి ముందు బిల్లులు ప్రతిపాదించగానే అనేక పరిణామాలు జరిగాయి. సెలక్ట్ కమిటీకి ప్రతిపాదిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించగా, దానిని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ మరుసటి రోజునే మండలి రద్దుకి ఏపీ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది.

ఆ తర్వాత జూలైలో మరోసారి మండలి ముందుకు ఆ బిల్లులను పంపించారు. కానీ అప్పుడు కూడా ఆమోదం లభించలేదు. రెండుసార్లు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మండలి తిరస్కరించినా ఆమోదం లభించినట్టేననే నిబంధనలను అవకాశంగా మలచుకుని చట్టంగా మారుస్తున్నట్టు ప్రభుత్వం ముందుకెళ్లింది. గవర్నర్ ఆమోదం కూడా లభించింది.
ఆ చట్టాల మీద పలు అభ్యంతరాలు వచ్చాయి. వందల పిటిషన్లు ఏపీ హైకోర్టు ముందుకొచ్చాయి. అమరావతి జేఏసీ, రాజకీయ పార్టీలు, రైతులు, పలు సంఘాలు, వ్యక్తులు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేశారు.
విచారణ సాగుతున్న దశలో పలుమార్లు ఏపీ హైకోర్టు నుంచి ప్రభుత్వ తీరు మీద వ్యాఖ్యలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు 2021 డిసెంబర్‌లో ప్రకటించింది. మరోసారి ఈ చట్టాలను తీసుకొస్తామని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమేనన్న కేంద్రం
రాజధానులు ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనంటూ కేంద్రం ఈ కేసులో వేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చునంటూ ఏపీ హైకోర్టుకి తెలిపింది.
ఆ తర్వాత పలు సందర్భాల్లో పార్లమెంటులో కూడా పలువురు మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఏపీ హైకోర్టు తుదితీర్పు వెలువరిస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూనే రాజధాని విషయంలో శాసనసభకు అధికారం లేదని పేర్కొంది. దీనిని పలువురు పిటిషనర్లు ఆహ్వానించారు.
వివిధ రాజకీయ పార్టీలు కూడా హైకోర్టు తీర్పుని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించాయి.

రాజధాని వివాదాలకు సీఎం స్వస్తి పలకాలి: టీడీపీ
''రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలి'' అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు.
''రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలి. రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలను ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలి. హైకోర్టు తీర్పు తర్వాతనైనా మేల్కోవాలి'' అని ఆయన అన్నారు.
సీఆర్‌డీఏ చట్టాన్ని, మాస్టర్ ప్లాన్‌ని అమలు చేస్తూ నిర్దిష్ట గడువు విధించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
రైతుల పోరాట విజయం: అమరావతి జేఏసీ
''మేం 807 రోజులుగా పోరాడుతున్నాం. అనేక ఆటంకాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొన్నాం. చివరకు న్యాయపోరాటంలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది'' అని అమరావతి జేఏసీ నేత రాయపాటి శైలజ పేర్కొన్నారు.
''రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అభివృద్ధి జరగాలి. సీఆర్‌డీఏ చట్టాలకు అనుగుణంగా ఏకైక రాజధాని సిద్ధం చేయాలి. అదే రాష్ట్రానికి మంచిది, రైతులకు మంచిది. ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారామె.
ఇది రైతులకు మేలు చేసే తీర్పు అని, ఏపీ రాజధాని వివాదం ఇక ముగిసిపోతుందని భావిస్తున్నామని ఆమె బీబీసీతో చెప్పారు.

తీర్పును పరిశీలించాక స్పందిస్తాం: మంత్రి
ఏపీ హైకోర్టు తాజా తీర్పు మీద అధికార పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు. తుది తీర్పు పరిశీలించిన తర్వాత మాట్లాడుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మోదుగుల చెప్పారు.
ఏపీ హైకోర్టు తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుంటుంది. కానీ అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా లేదా అన్నది సందేహమే.
ఇప్పటికే చట్టాలు ఉపసంహరించుకున్న తరుణంలో అప్పీల్ చేసే అవకాశాలు స్వల్పమేనని అడ్వొకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















