యుక్రెయిన్-రష్యా యుద్ధాన్ని చైనా ఆపగలదా? షీ జిన్‌పింగ్ చెబితే పుతిన్ వింటారా?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాబిన్ బ్రాంట్
    • హోదా, బీబీసీ న్యుస్, షాంఘై

చైనా, రష్యాల మధ్య కొత్తగా బలపడిన బంధానికి "పరిమితి లేదు" అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక నెల క్రితం ప్రకటించారు.

గత నెల, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించారు. బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో సమావేశమైన తరువాత, ఇరువురూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అనంతరం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఒలింపిక్ గేమ్స్ ముగిసిన కొద్ది రోజుల్లోనే, యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య" ప్రకటించారు పుతిన్.

చైనా ప్రభుత్వం ఈ దాడిని ఖండించలేదు, మన్నించలేదు. అసలు దాన్ని "దండయాత్ర" అని పిలవలేదు కూడా.

వీడియో క్యాప్షన్, కుటుంబాన్ని వదిలి యుద్దానికి వెళ్తున్న యుక్రెయిన్ పౌరులు

తమ విదేశాంగ విధానంలో భాగంగా, తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోమని చైనా చెబుతూ వస్తోంది.

అయితే, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ వారం ప్రారంభంలో సంకేతాలు ఇచ్చారు.

"యుక్రెయిన్ సార్వభౌమాధికారానికి చైనా గట్టి మద్దతు" ఇస్తుందని, "యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరంగా ఎలాంటి ప్రయత్నమైనా చేయడానికి సిద్ధంగా ఉందని" వాంగ్ యి పేర్కొన్నట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

అలాగే, చైనా ప్రభుత్వం ఇటీవల యుక్రెయిన్‌పై సైనిక చర్య పట్ల "విచారం" వ్యక్తం చేసింది. పౌరులకు కలిగే హాని పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న 34 దేశాలలో చైనా కూడా ఒకటి. ఇది కొంచం ఆశ్చర్యపరిచే విషయమేనని నిపుణులు అంటున్నారు. రష్యాకు మద్దతుగా చైనా ఓటు వేస్తుందని చాలామంది ఊహించారు.

పైవన్నీ చైనా విధానంలో మార్పును సూచిస్తున్నాయా?

రష్యాకు "చట్టబద్ధమైన భద్రతా సమస్యలు" ఉన్నాయని గుర్తిస్తూనే, యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించే విధంగా సమతుల్యం సాధించడానికి చైనా ప్రయత్నిస్తోందనడానికి ఇది సంకేతం కావొచ్చు.

ఫిబ్రవరిలో రష్యా, చైనాలు సంతకం చేసిన ఉమ్మడి ఒప్పందాన్ని పరిశీలిస్తే, ఇరు దేశాలూ ఏకకంఠంతో నాటో విస్తరణకు అభ్యంతరాలు తెలిపాయి. భవిష్యత్తులో సన్నిహితంగా పనిచేస్తూ పరస్పర ప్రయోజనాలు సాధించేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన భాగస్వామ్యం ఇది.

వీడియో క్యాప్షన్, 'మా అబ్బాయి శవం జాడ కూడా తెలియడం లేదు' -యుక్రెయిన్‌లో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన

సారూప్యాలు, వ్యత్యాసాలు

పుతిన్‌కు చైనా గట్టి మద్దతు ఇవ్వడానికి లేదా రష్యా దాడిని ఖండించకపోవడానికి ప్రధాన కారణం తైవాన్.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తైవాన్‌ను రౌడీ రాజ్యంగా చైనా పేర్కొంది. తైవాన్, చైనాలో భాగమని షీ జిన్‌పింగ్ విశ్వాసం.

అయితే, రష్యా చేసిన పనే, తైవాన్ విషయంలో చైనా చేస్తే, పశ్చిమ దేశాల నుంచి ఇంతకన్నా కఠినమైన ఆంక్షలు ఎదుర్కునే అవకాశం ఉంది.

కానీ, తైవాన్, యుక్రెయిన్ లాంటిది కాదు. ఈ రెండు దేశాల చట్టపరమైన స్థితి వేరు.

రష్యాకు "చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలు" ఉన్నాయని అంగీకరిస్తూ, దేశ సార్వభౌమత్వానికి పెద్దపీట వేసే తమ విధానాలకు గండి కొడుతూ యుక్రెయిన్‌లో యుద్ధం "సంక్లిష్టమైన, విశిష్టమైన చారిత్రక సందర్భం" అని షీ జిన్‌పింగ్ చెప్పడానికి కారణం తైవాన్ కావొచ్చు.

భవిష్యత్తులో చైనా, తైవాన్‌పై ఇలాంటి దాడికి పాల్పడితే, ఇవే కారణాలను ప్రపంచానికి చూపించవచ్చు. అలాగే, అప్పుడు రష్యా తమకు మద్దతు ఇస్తుందని ఆశిస్తుండవచ్చు.

మరోవైపు, పుతిన్‌కు, జిన్‌పింగ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు. వీరిద్దరూ ఇప్పటివరకూ సుమారు 40 సార్లు ముఖాముఖి కలిశారు.

వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు హారజైన ప్రముఖ నేతల్లో పుతిన్ ఒకరు.

ఇద్దరూ నిరంకుశ పాలనకు మద్దతు తెలిపేవారే. తమ ప్రజలు మాతృభూమి పట్ల మరింత విధేయత కలిగి ఉండాలని కోరుకునేవారే.

చైనా

ఫొటో సోర్స్, AFP

అయితే, రష్యాతో సంబంధాలకు "పరిమితులు లేవు" అని చైనా ప్రకటించడం, అమెరికా, దాని మిత్రదేశాలకు దూరమైనపోవాలన్న ఉద్దేశం కాకపోవచ్చు.

అందునా, ఇటీవల కాలంలో చైనా వాతావరణ మార్పులు, శాంతి మొదలైన అంశాల్లో చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే, ఇక్కడ రాజకీయాలను కూడా పరిగణించాలి. ఓటింగ్ రాజకీయాలు కాకుండా యుద్ధం చేస్తున్న దేశంతో సన్నిహిత సంబంధాలు నెరిపే రాజకీయాలు.

చైనాలో పౌరులు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారన్న దాన్ని చైనా ప్రభుత్వం చాలావరకు సెన్సార్ చేస్తుంది. కానీ, నిమిష నిమిషానికి, పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో అందుతున్న యుద్ధ వార్తలు, రష్యా పట్ల తమ వైఖరిని నిర్ణయించే లెక్కల్లో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు.

కాబట్టి, రష్యాతో సంబంధానికి పరిమితి ఉంటుందని జిన్‌పింగ్ సహా సీనియర్ నాయకులు గ్రహించి, ఒక అడుగు వెనక్కు వేసే అవకాశం ఉంది. లేదా ముందుకొచ్చి రష్యా, యుక్రెయిన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించవచ్చు.

అందుకు సంసిద్ధతను చైనా ఇప్పటికే సూచించినా, ఆ దిశలో ఇంకా అడుగులు వేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)