రష్యా: ఓలిగార్క్‌లు అంటే ఎవరు, యుద్ధం వస్తే వాళ్ల మీద ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర సందర్భంగా ఓలిగార్క్‌ల వ్యవహారం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క రష్యా యుక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తుండగా, పాశ్చాత్య దేశాలు రష్యా పై ఆంక్షలు విధిస్తున్నాయి.
ఈ ఆంక్షలు ఎదుర్కొనే వారిలో బ్యాంకులతోపాటు, పాశ్చాత్య దేశాలు పుతిన్ 'క్రోనీస్'గా అభివర్ణించే కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. వారినే 'ఓలిగార్క్'లని కూడా అంటారు.
ఈ రష్యన్ ఓలిగార్క్‌లపై పాశ్చాత్య దేశాలు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయి? అసలు ఓలీగార్చ్ లు ఎవరు? వాళ్ల మీద ఆంక్షల వల్ల జరిగేదేంటి ?

ఫొటో సోర్స్, Getty Images
ఓలిగార్క్ లు ఎవరు ?
ఓలిగార్క్ అనే మాటకు చాలా చరిత్ర ఉంది. దానికో ప్రత్యేకమైన అర్ధం కూడా. ఓలిగార్క్ అనే పిలిపించుకునే వ్యక్తి ‘ఓలిగార్క్’ అనే వ్యవస్థకు బలమైన మద్ధతుదారుగా ఉంటారు. 'ఓలిగార్క్స్' అంటే పరిపాలనను నిర్వహించే కొందరు వ్యక్తుల సమూహం.
అయితే, ఇప్పుడు ఈ మాటకు అర్ధం మారిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యాక, ఆర్ధికంగా ఎదిగిన కొందరు బడా వ్యాపారుల వర్గాన్ని ఓలిగార్క్‌లుగా పిలుస్తున్నారు.
గ్రీక్ భాషలో 'ఓలిగోయి' అనే మాటకు 'కొందరు' అని అర్ధం. 'ఆర్ఖీన్' అనే మాటకు పాలించడం అనే అర్ధం ఉంది. అయితే, ఇది 'మోనార్కీ'(మోనోస్-ఒకే పాలకుడు) లేదా 'డెమొక్రసీ'(డెమోస్-ప్రజలు ఎన్నుకున్న పాలకుడు) అనే మాటలకు పూర్తిగా భిన్నమైంది.
పాతకాలంలో ఓలిగార్క్‌లు అని ఎవరిని పిలిచేవారు?
సహజంగా దేశాన్ని పాలించే వర్గానికి సన్నిహితుడిగా ఉండటంతోపాటు, సమాజంలో మతం, బంధుత్వం,హోదా, ఆర్ధిక, భాషాపరమైన విషయాలలో ఉన్నత స్థితి కలిగి ఉన్న వారిని ఓలిగార్క్ అంటారు. వీరు నిత్యం తమ స్వార్ధ ఆర్ధిక ప్రయోజనాల కోసమే పని చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
నేటి 'ఓలిగార్క్'లు
ఒక రాజ్యం లేదా దేశంలో భారీ సంపదతో వ్యాపారాలను నిర్వహించే ఉన్నతశ్రేణి వ్యక్తులను నేడు ఓలిగార్క్‌లని పిలుస్తున్నారు. బ్రిటన్‌లో రష్యాకు చెందిన బిజినెస్‌మ్యాన్ రోమన్ అబ్రమోవిచ్‌ను ఓలిగార్క్‌గా పిలుస్తారు. ఆయన చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు.
అబ్రమోవిచ్ సంపద సుమారు రూ.1 లక్ష కోట్లు. సోవియట్ యూనియన్ పతనం సమయంలో తనకు లభించిన ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం ద్వారా ఆయన ఇంత సంపదను పోగేశారు. అలెగ్జాండర్ లెబెదెవ్ కూడా ఇలాంటి ఓలిగార్క్‌లలో ఒకరు. ఆయన రష్యా పాత సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ-కేజీబీలో పని చేశారు. తర్వాత బ్యాంకర్‌గా మారారు.
ఆయన కుమారుడు ఎవ్గెనీ, లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ పత్రికను నడుపుతున్నారు. ఎవ్గెనీ యూకే పౌరుడు కూడా. దీంతో ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యుడు కాగలిగారు. ఇతర దేశాలలో కూడా ఓలిగార్క్‌లు ఉన్నారు.
యుక్రేనియన్ సమాజం వెనకబాటుకు ఓలిగార్క్‌ల స్వార్ధమే ప్రధాన కారణమని కీయెవ్ కేంద్రంగా పని చేసే యుక్రేనియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఫ్యూచర్(యూఐఎఫ్) అనే సంస్థ విమర్శించింది.1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత పాత ఓలిగార్చ్ లు లియోనిడ్ కుచ్‌మా అధ్యక్షుడిగా ఉన్నకాలలో దేశంలోకి ప్రవాహంలా వచ్చిపడ్డారని యూఐఎఫ్ తన రిపోర్ట్‌లో ఆరోపించింది.
''అధికారులతో కుమ్మక్కయ్యి ఓలిగార్క్‌లు భారీ ఎత్తున ఆస్తులు సంపాదించారు. వీరి లావాదేవీలోల పారదర్శకత లేదు. తమ ఆస్తులను, వ్యాపారాలను రక్షించుకోవడానికి వాళ్లు ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్నారు'' అని ఆ రిపోర్ట్ పేర్కొంది.
''ఒక ప్రత్యేక తరగతికి చెందిన వ్యక్తులు, ఒక ప్రత్యేకమైన మార్గంలో వ్యాపారం నిర్వహిస్తుంటారు. అలాగే ఒక ప్రత్యేక పద్దతుల్లో జీవిస్తుంటారు, అంతే ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుంటారు. వారు నిజమైన వ్యాపారులు కారు. ధనవంతులు మాత్రమే. ఒక పెట్టుబడిదారి దేశంలో ఎదిగే ధనవంతులకు భిన్నంగా వారు ఎదిగారు'' అని విక్టర్ ఆండ్రుసివ్ అన్నారు. యూఐఎఫ్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న విక్టర్, 2019లో వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యన్ ఓలిగార్క్‌లు ఎక్కువమంది ఎందుకుంటారు?
1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాతనే రష్యాలో కూడా ఓలిగార్క్‌లు పెరిగి పోయారని చెబుతారు. కమ్యూనిజం పోయిన తర్వాత రష్యాలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగింది. అందులోనూ పరిశ్రమలు, విద్యుత్, ఫైనాన్స్ రంగాల్లో ఇది ఎక్కువగా సాగింది. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు అనూహ్యంగా ధనవంతులుగా మారారు.
బాగా ప్రభావం చూపగలిగిన వారు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఖనిజాలు, ముడి చమురు, గ్యాస్ రంగాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నారు. అధికారులకు లంచాలు ఇవ్వడం, లేదంటే వారినే తమ సంస్థల్లో డైరెక్టర్లుగా చేర్చుకోవడంలాంటి పనులతో అనుమతులను సులభంగా పొందేవారు.
దేశంలోని ప్రముఖ మీడియ సంస్థలు, చమురు క్షేత్రాలు, స్టీల్ ఫ్యాక్టరీలు, ఇంజినీరింగ్ కంపెనీలు వీరి చేతుల్లో ఉండేవి. తమ లాభాల్లో చాలా కొద్దిభాగాన్ని మాత్రమే పన్నులు కట్టేవారు. మిఖాయిల్ గోర్బచేవ్ తర్వాత వచ్చిన బొరిస్ ఎల్ట్సిన్‌కు 1996 అధ్యక్ష ఎన్నికల కోసం వీరిలో కొందరు నిధులు సమకూర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ కు ఓలిగార్క్‌లకు సంబంధమేంటి?
ఎల్ట్సిన్ నుంచి అధికారం అందుకున్నాక, రష్యాలో ఓలిగార్క్‌ల ప్రాబల్యం పెరిగిందని చెబుతారు. ముఖ్యంగా గతంలో రాజకీయంగా ఆయనకు మద్ధతుగా నిలిచిన వారు మరింత పలుకుబడి సంపాదించారు. అంతేకాదు, పుతిన్‌ను వ్యతిరేకించిన కొందరు అసలైన ఓలిగార్క్‌లు చివరకు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బొరిస్ బెరెజోవ్‌స్కీ లాంటి వారు అలాంటి వారిలో కొందరు.
రష్యాలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా పేరు సంపాదించిన మిఖాయిల్ ఖొదొరోవ్‌స్కీ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.
2019లో ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ దేశంలో ఓలిగార్క్‌లు ఉన్నారు కదా అన్న ప్రశ్నకు, ‘‘అలాంటి వారెవరూ మా దేశంలో లేరు’’ అంటూ పుతిన్ సమాధానం ఇచ్చారు. కానీ, పుతిన్‌తో సాన్నిహిత్యం ఉన్నవారు వ్యాపారంలో త్వరగా ఎదుగుతారన్నది అందరికీ తెలిసిన విషయం.
ఫోర్బ్స్ పత్రిక అంచనాల ప్రకారం బొరిస్ రోటెన్‌బర్గ్ అనే బిజినెస్‌మెన్ ఆస్తుల విలువ రూ. 9వేల కోట్లకు పైగా ఉంటుంది. ''రోటెన్‌బర్గ్ రష్యా అధ్యక్షుడితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వ్యాపారి'' అని ఓ సందర్భంలో యూకే ప్రభుత్వం పేర్కొంది.
యుక్రెయిన్‌లోని దోన్యస్క్, లూహాన్స్క్ ప్రాంతాలను పీపుల్స్ రిపబ్లిక్స్‌గా రష్యా గుర్తించిన వెంటనే రోటెన్‌బర్గ్, ఆయన సోదరుడు ఆర్కడీ వ్యాపారాల మీద యూకే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను కఠినతరం చేయనుంది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా: షేన్ వార్న్ మృతి
- ‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు’ - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- యుక్రెయిన్: ఖార్కియెవ్ బంకర్లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














