యుక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల కష్టాలు: నిలబడి 16 గంటల ప్రయాణం.. 8 కిలోమీటర్ల నడక.. స్వదేశం వచ్చేందుకు తెలుగు విద్యార్థుల కష్టాలు

ఫొటో సోర్స్, Rajat Johal
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భారతదేశం నుంచి చదువుకునేందుకు యుక్రెయిన్ వెళ్లిన అనేక మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. కొంతమంది సరిహద్దులను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు, పిల్లల కోసం ఎదురు చూస్తున్న కొంతమంది తల్లితండ్రులతో బీబీసీ మాట్లాడింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా మన్నెగూడెంకు చెందిన ఉష శ్రీ యుక్రెయిన్‌లోని చెర్నివిట్సీ నగరంలో మెడిసిన్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఆమె మార్చి 1న ఇంటికి చేరుకున్నారు.
ఇండియాకి వచ్చే ముందు ఎదుర్కొన్న పరిస్థితిని బీబీసీకి ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, USHASRI
"8 కిలోమీటర్లు నడిచి సరిహద్దులు దాటాం"
"యుద్ధం మొదలవుతుందనే వార్తలు రాగానే, యూనివర్సిటీలో మమ్మల్ని ఇంటికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. నేను మార్చి 7కి ఇండియా రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాను. కానీ, ఫిబ్రవరి 24 నుంచే ఎయిర్ స్పేస్ మూసేశారు. దీంతో ఏం చేయాలో తోచలేదు. ఆ టికెట్ డబ్బులు పోయినట్లే"
"మా రూమ్‌లో నలుగురం ఉండేవాళ్ళం. నాతో పాటు ఉండే మరో ముగ్గురు స్నేహితులు నా కంటే ముందుగానే వెళ్లిపోయారు. రూమ్‌లో ఒక్కదానినే ఉండిపోయాను. మేము ముందుగానే కొని పెట్టుకున్న సరుకులు అక్కడున్న పని వారికిచ్చేశాం. నాకు తిండి తినాలనిపించేది కాదు. భయానికి నిద్రపట్టేది కాదు"
"డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాం. ఫిబ్రవరి 24 నుంచే దేశంలోని ఏటీఎంలలో డబ్బు రావడం ఆగిపోయింది. భారతీయ బ్యాంకుల కార్డులు పని చేయలేదు. దాంతో మాకు దిక్కు తోచలేదు. మరోవైపు యుద్ధ భయం. నేనున్న ప్రదేశంలో పెద్దగా యుద్ధ వాతావరణం లేనప్పటికీ, సైరన్ శబ్ధాలు వినపడగానే ఆందోళన వచ్చేది".
"ఇంతలో నన్ను యుక్రెయిన్ పంపిన కన్సల్టన్సీ సిబ్బంది నుంచి మెసేజీ వచ్చింది. ఫిబ్రవరి 27న వాళ్ళే బస్సు పంపించారు, బస్సులో కొంత దూరం వరకు ప్రయాణించాక, రొమేనియా సరిహద్దుల వరకు మరో 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది".
"దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారితో సరిహద్దుల దగ్గర గందరగోళంగా ఉంది. 3000 మందికి పైగా విద్యార్థులున్నారు".
"నా లగేజీలో ముఖ్యమైన వస్తువులు కూడా పోయాయి. కానీ, పాస్‌పోర్ట్, వీసా చేతిలో ఉండటంతో రాగలిగాను. ప్రాణం కంటే సామాన్లు ముఖ్యం కాదని అనిపించింది".
"రొమేనియాలో ప్రవేశించినప్పటి నుంచి ఎంబసీ, కన్సల్టన్సీ సిబ్బంది, దిల్లీ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భవన్ అధికారులు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దిల్లీ నుంచి బయలుదేరి మార్చి 1 నాటికి ఇంటికి చేరాను. ఇంటికి వచ్చే వరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే ఉన్నాను. నాతో ఉన్న మిగిలిన వారిది కూడా ఇదే పరిస్థితి".
"యుక్రెయిన్ చాలా అందమైన దేశం, అక్కడ ప్రజలు చాలా మంచి వారు. ఆ దేశం స్వతంత్రంగా ఉంటాననడాన్ని రష్యా ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదు. ఈ యుద్ధం వల్ల వచ్చే లాభమేంటో తెలియడం లేదు".
"ఖార్కియెవ్‌లో ఉన్న స్నేహితులకు మాత్రం రావడానికి కష్టంగానే ఉంది. నా స్నేహితులు కొందరు ఇంకా అక్కడ ఉన్నారు. అందరూ క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను" అని ఉష శ్రీ చెప్పారు.

ఫొటో సోర్స్, MURALI N
"ప్రతి రోజూ శివరాత్రే"
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాపూర్‌నగర్‌కు చెందిన కల్పన నల్లోల యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌లో ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతోంది.
ఆమె ఇంకా ఇంటికి చేరలేదు. బుధవారం ఉదయం నాటికి ఆమె లీయెవ్ చేరుకొని అక్కడ నుంచి పోలండ్ సరిహద్దు దగ్గరకు చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కల్పన తండ్రి మురళి నల్లోల బీబీసీతో చెప్పారు.
"నేనొక ఆటో డ్రైవర్‌ని. మేము మా అమ్మాయి చదువు కోసం చాలా అప్పులు చేసి విదేశానికి పంపించాం. ఆమె లీయెవ్ చేరేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.
"ఖార్కియెవ్‌లో తానున్న చోటు నుంచి ట్యాక్సీ పట్టుకుని రైల్వే స్టేషన్‌కు చేరారు. రైలులో 16 గంటల పాటు ప్రయాణం చేసి లీయెవ్‌కు వచ్చారు. రైళ్లలో టాయిలెట్లు కూడా ప్రయాణీకులతో నిండిపోయాయి. మా అమ్మాయి 16 గంటల పాటు నిలబడే ప్రయాణం చేసినట్లు చెప్పింది"
"బుధవారం ఉదయానికి ఆమె ఇంకా పోలండ్ సరిహద్దు చేరలేదు. లీయెవ్ నుంచి పోలండ్ సరిహద్దు చేరేందుకు బస్సు టికెట్ తీసుకున్నారు. పోలండ్ సరిహద్దు చేరితే, అక్కడ నుంచి ఎలా అయినా భారత్ చేరుతుందని ఎదురు చూస్తున్నాం. సొంత డబ్బులతోనే టికెట్లు కొనుక్కున్నారు. వారికక్కడ ఎటువంటి సహాయమూ అందటం లేదు. మా అమ్మాయితో పాటు మరో ముగ్గురు స్నేహితులున్నారు. వారికి తినడానికి తిండి, నీరు కూడా లేదు"
"మాకు నిద్రాహారాలు ఉండటం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రతి రోజూ శివరాత్రిలాగే ఉంది"
"ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, తిరిగి చదువు ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. మా అమ్మాయి ఇంటికి చేరేవరకూ మాకు ఆందోళనగానే ఉంటుంది. మా అమ్మాయితో పాటు అందరూ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను".
"మీడియా ప్రతినిధులుగా మీరేమైనా చేయగలరా? అందరినీ క్షేమంగా చేర్చమని ప్రభుత్వానికి విన్నవించగలరా?" అని కల్పన తండ్రి మురళి నల్లోల అడిగారు.
"యుద్ధం అంటే ఏంటో తెలియదు"
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వైశాలి చెర్నోవిట్సీలో మెడిసిన్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. అయితే, ఆమె ఉండే ప్రాంతంలో ఇంకా పూర్తిగా యుద్ధ వాతావరణం లేదు. ఆమె మార్ఛి 1న ఇంటికి చేరుకున్నారు.
ఇండియాకి వచ్చేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని ఆమె చెప్పారు. ఆమెకు కన్సల్టన్సీ సహాయం అందటంతో సులభంగానే ఇంటికి చేరుకున్నట్లు వివరించారు.
వైశాలి కూడా రొమేనియా సరిహద్దు చేరేందుకు 8 కిలోమీటర్లు నడిచినట్లు చెప్పారు. అక్కడి నుంచి కన్సల్టన్సీ సిబ్బందితో పాటు ఇండియన్ ఎంబసీ సిబ్బంది వారి బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు.
"యుద్ధం అనగానే చాలా ఆందోళన వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇక ఏమి చేయలేక, దీనిని ఎదుర్కోవాల్సిందే అని మానసికంగా సిద్ధమయ్యాను. ఇదొక అనుభవం అనుకున్నాను. మరో గత్యంతరం లేదు".
"ఏటీఎంలు పని చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. కొన్నిటిలో డబ్బు ఉండటం లేదు. సూపర్ మార్కెట్లలో స్టాక్ లేక, ఆహార కొరత కూడా ఎదుర్కొన్నాం. అయితే, నేను వెంటనే బయలుదేరిపోవడంతో, పెద్దగా ఇబ్బంది పడలేదు".
"ఇంకా చాలా మంది స్నేహితులు బంకర్లు, హాస్టళ్లలో ఉన్నారు. కొంత మందితో మాట్లాడుతూ ఉన్నాను. మా యూనివర్సిటీలో చదువుతున్న వారు మాత్రం చాలా మంది సరిహద్దు దాటేసారు".
"ఖార్కియెవ్, కీయెవ్‌లో ఉన్నవారి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది" అని వైశాలి చెప్పారు.
చెర్నివిట్సీ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు కన్సల్టన్సీ సిబ్బంది సహాయం అందుతుండగా, ఖార్కియెవ్, కీయెవ్ ప్రాంతాల్లోని విద్యార్థులు మాత్రం తమ సొంత డబ్బులతో టికెట్లు కొనుక్కుని రావాల్సి వస్తున్నట్లు చెబుతున్నారు.
వీరికి స్థానికంగా సహాయం అందటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సరిహద్దుల దగ్గర భారత రాయబార కార్యాలయ సిబ్బంది సహాయపడతారని ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Vaishali
"పాస్ పోర్ట్, వీసాతో మాత్రమే బయలుదేరారు"
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సిరిపల్లి గ్రామానికి చెందిన మట్టపర్తి కృష్ణ అనూష ఖార్కియెవ్‌లో మెడిసిన్ 5వ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం ఆమె పోలండ్ సరిహద్దు చేరుతున్నట్లు సమాచారం అందినట్లు ఆమె తల్లి లక్ష్మీ బాల బీబీసీతో చెప్పారు. ఆమెతో పాటు మరో 12 మంది విద్యార్థులున్నట్లు చెప్పారు.
"మా అమ్మాయి ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతోంది. యుద్ధం అని తెలియగానే, వాళ్ళు ఫ్లాట్ కిందున్న బంకర్లలోకి వెళ్లిపోయారు. నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. పాప నాన్నగారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు"

ఫొటో సోర్స్, Rajat Johal
"లీయెవ్ చేరేందుకు చాలా ఇబ్బందులు పడింది. దారిలో తినేందుకు ఏమి దొరకలేదు. స్నేహితుల్లో ఒకరి ఫోన్ మాత్రమే వాడుతూ, మిగిలిన ఫోన్ల ఛార్జింగ్ అయిపోకుండా చూసుకుంటున్నారు. వాళ్ళు లగేజి ఏమి లేకుండా కేవలం పాస్‌పోర్ట్ , వీసా పట్టుకుని వస్తున్నారు"
"కొంత మంది రైల్వే స్టేషన్‌కు రావడానికి కూడా ఇబ్బందులు పడి అక్కడే ఉండిపోయారు".
"మా అమ్మాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం" అని మట్టపర్తి కృష్ణ అనూష తల్లి లక్ష్మీ బాల చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నవీన్ శేఖరప్ప: ‘ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’
- వోడ్కా బ్యాన్: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు
- పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?
- యుక్రెయిన్‌లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










