తెలుగువారితోపాటు అనేక రాష్ట్రాల విద్యార్ధులు మెడిసిన్ చదవడానికి యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు?

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నుంచి అనేకమంది విద్యార్దులు యుక్రెయిన్‌లో మెడిసిన్ కోర్సు చదువుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నుంచి అనేకమంది విద్యార్దులు యుక్రెయిన్‌లో మెడిసిన్ కోర్సు చదువుతున్నారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌లో సుమారు 20వేలమంది భారతీయులు అందులోనూ ఎక్కువమంది విద్యార్ధులు ఉన్నట్లు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల విద్యార్ధులు ప్రధానంగా మెడిసిన్, ఇంకా ఇతర కోర్సులు చదివేందుకు యుక్రెయిన్‌లో ఉన్నారు.

యుద్ధం కారణంగా ఇప్పుడు వారందరినీ ఇప్పుడు స్వదేశానికి తీసుకురావడం విదేశాంగ శాఖ, దౌత్యాధికారులకు సవాలుగా మారింది. ఇప్పటికే వందలమంది స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

అయితే, ఇదే సమయంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం, దానితో సంబంధం లేని ఒక కొత్త చర్చను లేపింది. భారతదేశాన్ని వదలి ఎందరో విద్యార్థులు అక్కడ ఎందుకు మెడిసిన్ చదువుతున్నారన్న ప్రశ్న వచ్చింది.

అంత చిన్న దేశాల్లో భారత విద్యార్థులు మెడిసిన్ చదవడం వల్ల ఎన్నో కోట్ల రూపాయల సొమ్ము అక్కడకు చేరుతోందని ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. దానిపై రకరకాల విమర్శలు, వ్యాఖ్యానాలూ వచ్చాయి. మరి డాక్టర్ పట్టా కోసం భారత యువత వెళ్లేంతగా అక్కడ ఏముంది?

ఈ విషయం మరింత లోతుగా అర్థం కావాలంటే భారత విద్యార్థులు ఎక్కువగా మెడిసిన్ చదవడానికి ఎంచుకుంటున్న దేశాల చరిత్ర కూడా ముఖ్యమే. కమ్యూనిస్టు-సోషలిస్ట్ ప్రభావం ఉన్న దేశాల్లో వైద్య రంగం ప్రభుత్వం చేతుల్లో ఉండి చాలా బలంగా ఉంటుంది. క్యూబాతో పాటూ తూర్పు ఐరోపా దేశాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

విదేశాలలో మెడికల్ విద్యకు క్రేజ్ ఉంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాలలో మెడికల్ విద్యకు క్రేజ్ ఉంది

అందుకే పాత సోవియట్ దేశాలు లేదా తూర్పు ఐరోపా దేశాల్లో వైద్య వ్యవస్థ మిగిలిన దేశాలకు భిన్నంగా కనిపిస్తుంది. యుక్రెయిన్ ఒక్కటే కాదు, పోలాండ్, రొమేనియా, బల్గేరియా వంటి దేశాల్లో ఈ విధానం కనిపిస్తుంది.

అక్కడ ప్రివెంటివ్ కేర్ వ్యవస్థలు, ప్రాథమిక వైద్య రంగం బలంగా ఉంటుంది. అలాగే జనాభాకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య రంగ సిబ్బంది నిష్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కావాల్సినంత మంది స్టాఫ్ ఉంటారన్నమాట. కానీ భారతదేశంలో పరిస్థితి అందుకు భిన్నం. ఇక్కడ ఆ నిష్పత్తి చాలా తక్కువ.

''వాళ్లు రెండు దశాబ్దాల ముందుకు ఆలోచించి దానికి తగిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉంచారు. అందుకే అక్కడ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఎక్కువగా ఉంటాయి. ప్రాథమిక వైద్య వ్యవస్థ బలంగా ఉండాలంటే చాలా మంది వైద్యులు, అనుబంధ సిబ్బంది కావాలి. దానికి తగిన ఏర్పాట్లు ఆ దేశాల్లో దశాబ్దాల క్రితమే ఏర్పడి ఉన్నాయి. సోవియట్ దెబ్బతిన్న తరువాత, వారికి ఆ సౌకర్యాలు అవసరానికి మించి మిగిలిపోయాయి'' అని ప్రొఫెసర్. డాక్టర్ బుర్రి రంగారెడ్డి బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా సైనిక చర్యలతో మనం వాడే సరకుల ధరలు ఎందుకు పెరుగుతాయి?

ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆనరరీ ప్రొఫెసర్ గా ఉన్నారు.

సరిగ్గా ఈ పాయింట్ మెడిసిన్ చదవుకోవాలనుకునే భారతీయ విద్యార్ధులకు వరంగా మారింది. ప్రస్తుతం భారత దేశంలో మెడికల్ విద్యకు ఉన్న క్రేజ్, ఖర్చు, కాంపిటిషన్ కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో భారతీయుల చూపు అటువైపు పడింది.

యుక్రెయిన్ నుంచి స్వదేశం చేరుకున్న తెలంగాణ విద్యార్ధులు

ఫొటో సోర్స్, @ktrtrs

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ నుంచి స్వదేశం చేరుకున్న తెలంగాణ విద్యార్ధులు

ఖర్చు తక్కువ

భారతదేశంలో మెడిసిన్ సీటు ప్రభుత్వ కాలేజీలకూ, ప్రైవేటు కాలేజీల్లో నీట్ కన్వీనర్ సీటుకూ, ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీటుకూ-ఈ మూడింటికీ మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాలేజీని బట్టి, రాష్ట్రాన్ని బట్టీ అది మారుతుంది.

''మరీ హై కానీ, మరో లో కానీ మామూలు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటుకు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అదే యుక్రెయిన్ వంటి దేశాల్లో 50 వేల డాలర్లు అంటే 35-40 లక్షల్లో మొత్తం పూర్తయిపోతుంది. దీంతో ఎక్కువ మంది అటు చూస్తునారు'' అన్నారు రంగా రెడ్డి.

''కన్వీనర్ కోటా వస్తే పర్వాలేదు. ప్రభుత్వ కాలేజీలో వేలు, ప్రైవేటు కాలేజీ పది లోపు లక్షల్లో ఖర్చు తేలుతుంది. కానీ మేనేజ్‌మెంట్ సీటుకు నిబంధనల ప్రకారమే గరిష్ఠంగా ఏడాదికి రూ.33 లక్షల వరకూ వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే ఐదేళ్లకు రూ.1 కోటి 25 లక్షల నుంచి రూ.1 కోటి 50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇక హాస్టళ్లూ, పుస్తకాలూ అదనం. అదే యుక్రెయిన్ వంటి దేశాల్లో 35 లక్షల్లో అన్నీ అయిపోతాయి'' అంటూ ఖర్చులో తేడాను విద్యా రంగ నిపుణులు బి.వెంకట ప్రసాద్ బీబీసీకి వివరించారు.

విదేశీ పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

క్రేజ్-కాంపిటిషన్

కేవలం డబ్బు మాత్రమే కాదు. అడ్మిషన్ ప్రక్రియ, అంటే సీటు తెచ్చుకోవడం కూడా భారతదేశంలో కష్టమే. కానీ చాలా తూర్పు ఐరోపా దేశాల్లో ఇది చాలా సులువు.

భారతదేశంలో ప్రస్తుతం ఏటా 16 లక్షల మంది నీట్ రాస్తే అదులో 7 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారు. 9 లక్షల మంది పాస్ కూడా కావడం లేదు. అంటే వారికి నీట్ లో 720 మార్కులకు గానూ, కనీసం 100-150 మార్కులు రాని వారూ ఉన్నారు (కోటా ఆధారంగా కటాఫ్ మారుతుంది.) భారత్ లో ప్రైవేటు కాలేజీలో చదవాలన్నా నీట్ క్వాలిఫై కావాలి. కానీ విదేశాల్లో చదవాలంటే నీట్ అవసరం లేదు.

''వాస్తవానికి 2018లో ఒకసారి విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ క్వాలిఫై కావాలని నిబంధన తెచ్చి, ప్రభుత్వం మళ్లీ వెనక్కు తీసుకుంది'' అని వెంకట ప్రసాద్ అన్నారు.

నీట్ పరీక్ష క్వాలిఫై అయిన తరువాత కూడా, ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాలు కలపి భారతదేశంలో సుమారు 2 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. దీంతో వాటిలో సీట్ రాని వారికి ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ గొప్ప అవకాశంగా కనిపిస్తోంది.

అంటే మెడిసిన్ చదవాలన్న కోరిక బలంగా ఉండి, నీట్ క్వాలిఫై అయినప్పటికీ, సంపన్నులు కాని వారికి ఈ దేశాల్లో ఎంబీబీఎస్ ఒక వరంలా మారింది. అదే సమయంలో ఆయా దేశాల్లో డాక్టర్ బాబు ఉద్యోగమంటే భారత్ లో ఉన్నంత వ్యామోహం లేకపోవడంతో, అక్కడ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఇతర దేశాల వారికి సులువుగా దొరుకుతున్నాయి.

యుక్రెయిన్ వంటి దేశాల్లో, ఆ మాటకొస్తే చాలా యూరోప్, అమెరికా దేశాల్లో ఎంపిక ప్రక్రియ ఇంత కఠినంగా ఉండదు. ఆయా దేశాల్లో విద్యార్థి చదివిన కోర్సుల్లో ఎంత పట్టు ఉందనే కంటే, మెడిసిన్ చదివే సామర్థ్యం ఆసక్తి ఎంత ఉందన్నేది ప్రధాని అర్హతగా చూస్తారు.

భారతీయ విద్యార్ధులు

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, భారతీయ విద్యార్ధులు

చదువుల నాణ్యత ఎంత?

ప్రస్తుతం భారత్ నుంచి 182 దేశాలకు వెళ్లి విద్యార్థులు చదువుతున్నారు. కనీసం 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో రకరకాల కోర్సులు చదువుతున్నారు. కానీ అన్ని కోర్సులూ ఒక ఎత్తు, మెడిసిన్ ఒక ఎత్తు. అందుకే ఎంబీబీఎస్ పై ఇంత చర్చ.

ప్రపపంచమంతా ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ, పాఠాలు చెప్పే విధానం, నేర్చుకునే అవకాశాలు, వాతావరణం, లైబ్రరీ, ల్యాబ్, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు..ఇలా ఎన్నో అంశాలు డాక్టర్ చదువును ప్రభావితం చేస్తాయి. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర ఒకప్పుడు చైనా ఎంబీబీఎస్ డిగ్రీలపై భారత మెడికల్ కౌన్సిల్ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది.

అయితే అన్ని దేశాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు లేవని కాదు. ఆయా దేశాలు తమ స్థానిక పరిస్థితులు, తమ చట్టాలకు అనుగుణంగా ప్రమాణాలు పాటిస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు పాత సోవియట్ దేశాల్లో మెడిసిన్ కూడా రష్యన్ భాషలోనే చెప్పేవారు.

''అప్పట్లో విదేశాలకు మెడిసిన్ కోసం వెళ్తే మొదటి సంవత్సరం అక్కడి భాష నేర్చుకోవడానికి పట్టేది. తరువాత మెడిసిన్ కోర్సులు చెప్పేవారు. కానీ క్రమంగా విదేశీ విద్యార్థులు పెరిగాక, జార్జియా, యుక్రెయిన్, చైనా, కజికిస్తాన్ వంటి దేశాలు ఇంగ్లీషులో కూడా మెడిసిన్ బోధిస్తున్నాయి'' అని రంగారెడ్డి అన్నారు.

భాష సమస్య తీరింది కానీ నాణ్యత విషయంలో మాత్రం విద్యార్థి ఎంపిక చేసిన యూనివర్సిటీ, విద్యార్థిని తీసుకెళ్లిన ఏజెన్సీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయంటున్నారు వెంకట ప్రసాద్. చాలా ఏజెన్సీలు డబ్బుల కోసం విద్యార్థులకు చాలా విషయాలు దాచి పెట్టి తీసుకెళ్తున్నాయనీ దాని వల్ల కూడా ఇబ్బంది ఎదురవుతోందని చెబుతున్నారు.

వైద్య విద్యార్ధులు
ఫొటో క్యాప్షన్, వైద్య విద్యార్ధులు

అన్నీ సక్రమంగా చూసుకుని శ్రద్ధగా కాలేజీకి వెళ్లి మెడిసిన్ చదివిన వారితో ఏ సమస్యా ఉండదు. వారికి భారత్ వెనక్కు వచ్చి తిరిగి పీజీల్లో చేరుతున్నారు. లేదా ప్రాక్టీసూ చేసుకుంటున్నారు. కానీ మెజార్టీ కేసుల్లో ఇలా జరగడం లేదు.

''యుక్రెయిన్ లో భారత ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ వైద్య యూనిర్సిటీలు 19 వరకూ ఉన్నాయి. ఇవి కాక ప్రైవేటు ఉన్నాయి. వాటిల్లో ఒక్కో పద్ధతి ఉంటుంది. మనలా ఏటేటా పరీక్షలు ఉండవు. మొత్తం ఎంబీబీఎస్ కోర్సులో రెండే రెండు పెద్ద పరీక్షలు ఉంటాయి. అవి చాలా కఠినంగా ఉంటాయి. మధ్యలో పరీక్షలు ఇంటర్నల్‌గా ఉంటాయి. వాటి విషయంలో నిర్లక్ష్యం చేసి, చాలామంది విద్యార్థులు చివరికి వచ్చే సరికి దెబ్బతింటున్నారు'' అని వెంకట ప్రసాద్ వివరించారు.

అక్కడి మెడిసిన్ ఫైనల్ పరీక్షలు పాస్ కావడం తేలిక కాదనీ, భారత్ లో లాగా యుక్రెయిన్ లో చాలాచోట్ల అటెండెన్స్ తప్పనిసరికాదని వెంకట ప్రసాద్ అన్నారు. ఈ కారణంగా చాలా ఏజెన్సీలు ఇక్కడ నుంచి పిల్లలను ఆన్‌లైన్ కోర్సులు నడపడానికి లేదా యుక్రెయిన్‌లోనే కోచింగ్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేసి అక్కడ చదివించడం లాంటివి చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, రష్యా- యుక్రెయిన్ సంక్షోభంలో భారత్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతోందా?

''ఇలాంటి చర్యల వల్ల నాణ్యత పడిపోతోంది. పిల్లలు అంతా తెలుసుకునే సరికి పుణ్యకాలం అయిపోతోంది'' అన్నారు వెంకట ప్రసాద్.

ఈ విషయంలో ఎంత దారుణం ఉందంటే, భారత్ నుంచి బయట దేశాలకు వెళ్లి మెడిసిన్ చదవాలంటే నీట్ క్వాలిఫై కానక్కర్లేదు, కానీ నీట్‌కి హాజరు కావాలి. ఆ వివరాలతో నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర నమోదు చేసుకుంటే వారు ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇదంతా ఏజెన్సీ చూసుకుంటుండటంతో, చాలామంది విద్యార్థులకు తమకు ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటుందని కూడా తెలియదు'' అన్నారు వెంకట ప్రసాద్.

భారత్‌తో పోలిస్తే తక్కువ ఫీజులు కావడంతో ఎక్కుమంది విద్యార్ధులు యుక్రెయిన్‌తోపాటు పలు మాజీ సోషలిస్ట్ దేశాలకు వెళుతున్నారు

ఫొటో సోర్స్, @MIB_India

ఫొటో క్యాప్షన్, భారత్‌తో పోలిస్తే తక్కువ ఫీజులు కావడంతో ఎక్కుమంది విద్యార్ధులు యుక్రెయిన్‌తోపాటు పలు మాజీ సోషలిస్ట్ దేశాలకు వెళుతున్నారు

తిరిగి వచ్చాక అసలు సమస్య

సాధారణంగా ఏ దేశంలో మెడిసిన్ పాస్ అయితే ఆ దేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భారత్ లో ప్రాక్టీస్ చేయాలంటే అక్కడ ఎంబీబీఎస్ పాసైన తరవాత కూడా, మరో పరీక్ష పాస్ అవ్వాలి. అప్పుడే హౌస్ సర్జెన్సీకి, పర్మినెంట్ ప్రాక్టీసుకు అనుమతి వస్తుంది.

ఇలా విదేశాల నుంచి వస్తోన్న వారిలో కేవలం 8-10 శాతం మందే భారత ప్రభుత్వం నిర్వహించే పరీక్ష పాస్ అవుతున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా మీడియాతో చెప్పారు. దాంతో విదేశాల్లో కష్టపడి డాక్టర్ డిగ్రీ సాధించినా, చాలామందికి భారత దేశంలో ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది.

భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం నెక్స్ట్ అనే పరీక్ష వీరు రాయాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది విద్యార్థులు తేలిపోతున్నారు.''ఈ పరీక్ష కేవలం 8 శాతం మందే క్వాలిఫై అవుతున్నారు. ఇలాంటి పరీక్షలు ఐదారుసార్లు తప్పిన వారూ ఉన్నారు. పాసై కెరీర్ ప్రారంభించిన వారూ ఉన్నారు'' అని వెంకట ప్రసాద్ వెల్లడించారు.

''ఇదొక్కటే సమస్య కాదు. మెడిసిన్ అంటే నాలుగు గోడల మధ్య కోచింగ్ సెంటర్లలోలా నేర్చుకుంటే సరిపోదు. వారికి సమాజం, సమాజ జీవన శైలి, అక్కడి పరిస్థితులు, వాటి వల్ల వచ్చే వ్యాధులు..ఇలా చాలా అంశాలపై అవగాహన ఉండాలి. అది చాలా మందిలో అది లేదు'' అన్నారు రంగారెడ్డి.

విదేశాలలో చదివి వస్తున్న డాక్టర్లలో కేవలం 8-10 శాతం మందే భారత ప్రభుత్వం నిర్వహించే పరీక్ష పాస్ అవుతున్నారు

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, విదేశాలలో చదివి వస్తున్న డాక్టర్లలో కేవలం 8-10 శాతం మందే భారత ప్రభుత్వం నిర్వహించే పరీక్ష పాస్ అవుతున్నారు

కొంత లాభం

నిజానికి భారతదేశంలో వైద్యులు, వైద్యరంగ సిబ్బంది, రోగులు, జనాభా నిష్పత్తి చాలా తక్కువ ఉంది. కానీ భారత్ లో మెడికల్ కాలేజీలు, పారామెడికల్ శిక్షణా వసతులు అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అదే సమయంలో ఆయా దేశాల్లో అధికంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఒక రకంగా భారత్ కు కావాల్సిన అదనపు డాక్టర్లను అందిస్తున్నాయి.

''మనకు డాక్టర్లు కావాలి. వాళ్ల దగ్గర కాలేజీలు ఉన్నాయి. కాబట్టి వాళ్లు అక్కడ నేర్చుకుని వస్తే ఈ దేశానికే లాభం కదా. కాకపోతే వారిని వచ్చేప్పుడు సరిగా ఫిల్టర్ చేయాలి. మన ప్రభుత్వాలు చేయలేనిది, ఆ దేశాలు చేసి పెడుతున్నాయి అనుకోవచ్చు కదా'' అంటూ డాక్టర్ల కొరతకు విదేశీ వైద్య కొంత పరిష్కారం చూపిస్తోందని అభిప్రాయపడ్డారు రంగారెడ్డి.

''ఇది విన్ విన్ సిచ్యుయేషన్. మనకు సీట్లు కావాలి. వారికి డబ్బు కావాలి''

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)