Shane Warne: 'బాల్ ఆఫ్ ది సెంచరీ' కథ ఇదీ..

- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1993 జూన్ 4వ తేదీ.
ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. 1989లో 4-0 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయి, ఈసారి ఆస్ట్రేలియాను దెబ్బతియాలని ఇంగ్లండ్ జట్టు పట్టుదలగా ఉంది. కానీ, ఆ జట్టు కల ఫలించలేదు. 4-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా జైత్రయాత్ర మొదలైంది. దీనికి ఒక కారణం.. అప్పటి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలన్ బోర్డర్ మాటల్లో చెప్పాలంటే 'ఒక పిల్లోడు'. ఆస్ట్రేలియా జట్టు తురుపుముక్కగా ప్రయోగించిన ఆ యువకుడే షేన్ వార్న్.
యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరుగుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
సమాధానంగా ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.
అలన్ బోర్డర్ తాను ఎంతగానో విశ్వాసం ఉంచిన 'పిల్లోడు' షేన్ వార్న్‌కు బంతి ఇచ్చాడు. ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ మైక్ గాటింగ్‌కు తొలి బంతిని వేశాడు షేన్ వార్న్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కొద్దిపాటి రనప్‌తో వచ్చి, రైట్‌హ్యాండ్ బ్యాటర్ అయిన మైక్ గాటింగ్‌కు వేసిన లెగ్ బ్రేక్ అది.
లెగ్‌స్టంప్‌కు కొన్ని అంగుళాల దూరంలో పడిన ఆ బంతి విపరీతమైన స్పిన్‌తో ఆఫ్ స్టంప్‌వైపు దూసుకొచ్చింది.
తన ఎడమ కాలు ముందకుకు పెట్టి బ్యాట్‌తో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు గాటింగ్. ఆయన లెక్క ప్రకారం ఆ బంతి కాలికి ఉన్న ప్యాడ్‌కు గానీ, బ్యాట్‌కు కానీ తగలాలి.
బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా పడింది కాబట్టి ప్యాడ్‌కు తగిలినా ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) రూపంలో ఔట్ అయ్యేందుకు చాన్స్ ఉండదు.
ఒకవేళ బంతి కొంచెం ఎక్కువగా స్పిన్ అయితే అది బ్యాట్‌కు తగిలి, మళ్లీ కింద పడుతుంది కాబట్టి క్యాచ్ ఔట్ అయ్యే ప్రమాదం కూడా లేదు.
కానీ, విపరీతంగా స్పిన్ అయిన ఆ బంతి మైక్ గాటింగ్ కాలి ప్యాడ్‌ను, చేతిలోని బ్యాట్ డిఫెన్స్‌ను తప్పించుకుని నేరుగా ఆఫ్‌స్టంప్‌ను ఢీకొట్టి బెయిల్స్‌ను కింద పడేసింది.
ఏం జరిగిందో తెలియనట్లు గాటింగ్ కొద్దిసేపు నిర్ఘాంతపోయాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు సంబరాలు చేసుకుంటుండగా.. అదే షాక్‌లో మైదానాన్ని వీడాడు.

ఫొటో సోర్స్, Getty Images
'బాల్ ఆఫ్ ది సెంచరీ'
షేన్ వార్న్ అప్పటికే 11 టెస్టులు ఆడి 31 వికెట్లు తీశాడు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో.. ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుందని భావించి, అతడిని కూడా జట్టులోకి తీసుకున్నారు.
మొదటి టెస్ట్ రెండో రోజు మధ్యాహ్నం లంచ్ ముగిసిన తర్వాత షేన్ వార్న్ తొలి బంతిని వేశాడు. మైక్ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన ఆ బంతే తర్వాతి కాలంలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ', 'గాటింగ్ బాల్'గా పేరొందింది.
గాటింగ్ ఫ్రంట్ ఫుట్ ముందు బంతిని వేయాలని, ఆ బంతిని వీలైనంతగా స్పిన్ చేయాలని భావించినట్లు షేన్ వార్న్ తెలిపాడు.
బంతి పిచ్‌పై పడిన దగ్గర్నుంచి 18 అంగుళాలు మలుపు తిరిగి ఆఫ్ వికెట్‌ను కూల్చింది.
వాస్తవానికి మైక్ గాటింగ్ అప్పటికే ఇంగ్లండ్ తరపున స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడే బ్యాటర్లలో ఒకరు.
''లెగ్‌స్టంప్‌కు రెండు మూడు అంగుళాల దూరంగా పడిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగింది'' అని అప్పట్లో గాటింగ్ చెప్పారు.
''నా కాలు క్రీజులోనే ఉంది. కాబట్టి నేను స్టంప్ ఔట్ అయ్యే అవకాశం లేదు. బంతి నా బ్యాట్‌కు కానీ, గ్లోవ్‌కు కానీ, ప్యాడ్‌కు కానీ తగల్లేదు. కాబట్టి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఇయాన్ హీలీ బెయిల్స్ కిందపడేశాడేమో అనుకున్నా'' అని గాటింగ్ తెలిపారు.
''ఏం జరుగుతోందో గాటింగ్‌కు అర్థం కావట్లేదు. ఇప్పటికీ అతనికి తెలియట్లేదు. వెళ్తూవెళ్తూ అంపైర్ కెన్నీ పాల్మర్‌ను అడిగాడు.. పాల్మర్ కనుబొమ్మలు ఎగరేసి, చిన్నగా తల ఊపాడు. ఆ సమాధానం సరిపోయింది'' అని గాటింగ్ వికెట్ పడిపోయినప్పుడు బీబీసీ రేడియో కామెంటేటర్ వ్యాఖ్యానించారు.
విపరీతైన స్పిన్‌కు కారణం ఏంటి?
అప్పటికే ఫాస్ట్ బౌలర్లు పిచ్‌పై బౌలింగ్ చేశారు. వాళ్లు బాల్ విసిరిన తర్వాత పిచ్ మధ్యలోకి వెళ్లకూడదు. కాబట్టి ఫాలో త్రూలో వాళ్లు పిచ్‌కు కుడివైపు కానీ, ఎడమవైపు కానీ వెళ్లాల్సి ఉంటుంది. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన బాల్ విసురుతారు కాబట్టి తర్వాతి అడుగు బలంగా పడుతుంది. అలా అప్పటికే పిచ్‌పై ఉన్న అడుగులు కూడా వార్న్ స్పిన్‌కు సహకరించి ఉండొచ్చని ఒక విశ్లేషణ.
బీబీసీ స్పోర్ట్స్ ప్రతినిధి స్టీఫన్ షెమిల్ట్ అభిప్రాయం ప్రకారం.. అప్పటికి వరకూ పేస్ బౌలింగే టెస్ట్ మ్యాచ్‌లను గెలిపిస్తుందనే అభిప్రాయాన్ని షేన్ వార్న్ ఒక్క బంతితో మార్చేశాడు. కేవలం యాషెస్ సిరీస్‌నే కాకుండా యావత్ క్రికెట్‌ను కొత్త బాట పట్టించాడు.
ఆ ఒక్క సిరీస్‌లో 34 వికెట్లు తీసిన షేన్ వార్న్ తన కెరీర్ మొత్తం మీద 195 సార్లు ఇంగ్లండ్ ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘నా జీవితాన్ని మార్చేసింది’
ఈ ఒక్క బంతి తన జీవితాన్ని మార్చేసిందని షేన్ వార్న్ అన్నారు.
2018లో ఆయన బీబీసీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా గాటింగ్ బాల్ నా జీవితాన్ని మార్చేసింది. మీకు తెలుసుగా.. బాల్ ఆఫ్ ది సెంచరీగా కూడా అది ఎంపికైంది. యాషెస్‌లో (నా) తొలి బంతిని అలా వేయాలని రాసిపెట్టి ఉన్నట్లుంది.
యాషెస్ సిరీస్ తర్వాత నేను ఏ కౌంటీ గ్రౌండ్‌కు వెళ్లినా చిన్న పిల్లలు జింక్ క్రీమ్ (అప్పట్లో షేన్ వార్న్ తన ముక్కుకు రాసుకున్న రంగు)ను ముక్కుకు రాసుకుని, లెగ్ స్పిన్ వేస్తూ కనిపించేవాళ్లు. అప్పట్లో నాకు 23 ఏళ్లు. లేదా 22 అనుకుంటా. అదంతా జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించేది.
హోటల్ రూమ్ నుంచి బయటకు వస్తే 20 మంది ఫొటోగ్రాఫర్లు వెంటపడేవాళ్లు. తినడానికి వెళ్లినా, పబ్‌లో బీరు తాగుతున్నా కూడా వాళ్లు బయటే కాపుకాసేవాళ్లు.
22 ఏళ్ల వయసులో ఇలాంటిదంతా నేను ఎన్నడూ చూడని అనుభూతి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అన్నది నేర్పేందుకు ప్రత్యేకంగా పాఠశాల అంటూ ఏమీ లేదు.
నేను మాత్రం నాలాగే ఉండేవాడిని. కొన్ని తప్పులు కూడా చేశాను. కానీ, నేను వేరే ఎవరోలాగా మాత్రం నటించలేదు. బహుశా అందుకేనేమో ప్రజలు నన్ను ఇంకా ఇష్టపడుతుంటారు’’ అని షేన్ వార్న్ అన్నారు.
షేన్ వార్న్ తొలి టెస్ట్ భారత్‌తోనే.. తొలి వికెట్ రవిశాస్త్రి
షేన్ వార్న్ టెస్టుల్లో ఆరంగెట్రం చేసింది 1992 జనవరి 2వ తేదీన సిడ్నీలో భారత్‌తో మొదలైన టెస్ట్ మ్యాచ్‌తోనే. ఆ సిరీస్‌లో అది మూడో టెస్టు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 313 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షేన్ వార్న్ 67 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 20 పరుగులు చేశాడు. కపిల్ దేవ్ బౌలింగ్‌లో కీపర్ పండిట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది. ఓపెనర్ రవిశాస్త్రి 206 పరుగులు చేశాడు. వార్న్ తొలి వికెట్ రవిశాస్త్రే. మొత్తం 45 ఓవర్లు బౌలింగ్ చేసిన షేన్ వార్న్ 150 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 148 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తదనంతరకాలంలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు, షేన్ వార్న్ బౌలింగ్‌కు మధ్య చాలాకాలం పాటు పోటీ నడిచింది.
షేన్ వార్న్ మృతికి సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటిస్తూ.. మైదానంలో తమ ఇద్దరి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధం జరిగేదని, మైదానం వెలుపల మాత్రం ఒకరినొకరు పరిహాసాలాడుతూ సరదాగా నడిచేదని వ్యాఖ్యానించాడు. తనకూ, షేన్ వార్న్‌కు క్రికెట్ పిచ్‌పై జరిగిన ఈ ద్వంద్వ యుద్ధం జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప నిధి లాంటివని అభివర్ణించాడు. షేన్ వార్న్‌కు భారతదేశం అంటే ఎల్లప్పుడూ ప్రత్యేకమైన ప్రదేశమని, అలాగే భారతీయులంతా షేన్ వార్న్‌ను ప్రత్యేకంగా భావిస్తారని ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- సౌదీ నుంచి అమెరికా దాకా... ఆంధ్ర అరటి అంటే ఎందుకంత డిమాండ్?
- సెరెబ్రల్ పాల్సీ అంటే ఏంటి? పిల్లలకు ఇది ఎలా వస్తుంది? దీంతో పుట్టినవాళ్లు పిచ్చివాళ్లా?
- యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ యుద్ధాన్ని నడిపిస్తున్నారు, మరి పుతిన్‌ను నడిపిస్తున్నదెవరు
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్ల కన్సల్టేషన్.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










