ఆంధ్రప్రదేశ్: సౌదీ నుంచి అమెరికా దాకా... ఆంధ్ర అరటి అంటే ఎందుకంత డిమాండ్?

ఎగుమతికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు
ఫొటో క్యాప్షన్, ఎగుమతికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం...

ఒకనాడు ఆహార పంటల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతోంది. అందులోనూ అరటి సాగు, దిగుబడి ఎక్కువగా ఉంది. ఇటీవల లోక్‌సభకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అరటి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.

అంతేకాదు గత ఏడాది అరటి ఎగుమతుల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. గతంలో మహారాష్ట్ర టాప్‌లో ఉండేది.

విదేశాలకు భారీగా ఆంధ్రా అరటి

భారతదేశంలో అరటిని భారీగా సాగు చేస్తారు. దేశం నుంచి 2020 ఏప్రిల్ నాటికి రూ.447 కోట్ల విలువ చేసే 1,27,230 టన్నుల అరటిని ఎగుమతి చేశారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 47 శాతం అధికం. గత ఏడాది ఒక్క ఏపీ నుంచే 43,935 టన్నుల అరటి ఎగుమతి జరిగింది. అంతకుముందు ఏడాది ఇది 38,500 టన్నులుగా ఉంది. ఈ ఏడాది 50వేల టన్నుల పైబడి ఉంటుందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి.

ఈ ఎగుమతుల విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. ఏపీ నుంచి ప్రధానంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతి చేస్తుండగా, దిగుమతి చేసుకునే దేశాల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది. కడప, అనంతపురం జిల్లాల పరిధిలో పండించే గ్రాండ్-9 రకం అరటికి విదేశాల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది.

విదేశాలలో అరటి పండ్లు -ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాలలో అరటి పండ్లు -ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రాలో పెరుగుతున్న అరటి సాగు

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది సంవత్సరాలుగా అరటి సాగు, ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. 2017-18లో 0.89 లక్షల హెక్టార్లలో అరటిని సాగు చేస్తుండగా అది 2019-20 నాటికి 0.91 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2020-21లో సాగు విస్తీర్ణం 1.08 లక్షల హెక్టార్లు ఉంటుందని అంచనా.

ఇక అరటి దిగుబడి కూడా బాగానే పెరుగుతోంది. 2017-18లో 50 లక్షల టన్నుల అరటి ఉత్పత్తి కాగా 2019-20 నాటికి 58.61 లక్షల టన్నులకు చేరుకుంది. 2020-21లో ఇది సుమారు 65 లక్షల టన్నులు ఉండొచ్చని అంచనా.

భారతదేశం మొత్తం మీద 2017-18లో 8.83 లక్షల హెక్టార్లలో అరటి సాగును చేశారు. 2020-21 నాటికి అది 40వేల హెక్టార్లు పెరిగి 9.22 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 20 వేల హెక్టార్లు. ఇక దేశవ్యాప్తంగా అరటి ఉత్పత్తి 2017-18లో 3.08 కోట్ల టన్నులుగా ఉండగా 2020-21 నాటికి అది 3.33 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. ఇందులో ఏపీ వాటా 15 లక్షల టన్నుల వరకు ఉంటుంది.

ఏపీలో అరటి సాగు పెరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏపీలో అరటి సాగు పెరుగుతోంది

గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అరటి సాగు తీరు

ఆంధ్రాలో అరటి సాగు
వీడియో క్యాప్షన్, ఆహారంగా ఆల్గే

రాయలసీమలో పెరుగుతున్న ఆదరణ

ఆంధ్రప్రదేశ్‌లో అరటి పంట చాలాకాలం పాటు కోస్తా జిల్లాల్లో సాగు చేసేవారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి తీరంలో ఈ పంట ఎక్కువగా పండించేవారు. నేటికీ కోస్తా జిల్లాల్లో అత్యధికులు అరటిని కొబ్బరి సహా వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు. అందువల్ల విస్తీర్ణం పరంగా భారీగానే కనిపించినా దిగుబడులు ఓ మోస్తరుగా ఉండేవి.

మరోవైపు రాయలసీమలో కొంత కాలంగా అరటి వంటి ఉద్యాన పంటల సాగు పెరుగుతోంది. అనంతపురం, కడప ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అరటిని సాగును చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. నీటి సదుపాయాలు, డ్రిప్ ఇరిగేషన్ మెరుగుపడటంతో అరటి సాగు బాగా అభివృద్ధి చెందుతోంది. ఏపీలో అనంతపురం, కడప జిల్లాలను అరటి పంటలో ముందున్న క్లస్టర్‌గా కేంద్రం ప్రకటించింది.

అమెరికాతోపాటు, గల్ప్ దేశాలకు ఏపీ నుంచి అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాతోపాటు, గల్ప్ దేశాలకు ఏపీ నుంచి అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి

తెలంగాణలో స్థిరంగా ఉత్పత్తి

ఇక ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్పత్తి విషయంలో మహారాష్ట్ర, గుజరాత్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 2020-21లో మహారాష్ట్ర అరటి ఉత్పత్తి 46.28 లక్షల టన్నులు, గుజరాత్ 39.04 లక్షల టన్నులు నమోదు కావొచ్చని అంచనా. 37.8 లక్షల టన్నులతో తమిళనాడు నాలుగో స్థానంలో ఉంది.

తెలంగాణలో అరటి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో కొద్ది సంవత్సరాలుగా పెద్దగా మార్పు కనిపించడం లేదు. 2017-18లో 0.23 లక్షల హెక్టార్లలో అరటిని సాగు చేయగా 0.9 లక్షల టన్నుల దిగుబడిని సాధించింది. 2020-21లో సాగు విస్తీర్ణం 0.22 లక్షల హెక్టార్లు, దిగుబడి 10.01 లక్షల టన్నులు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

అరటి గెలలు దించుతున్న కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గెలలు దించుతున్న కార్మికుడు

అరటి సాగుకి ప్రోత్సాహకాలు

రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల పరిధిలో అరటి సాగును పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని, అరటి ఎగుమతుల ద్వారా దేశానికి మేలు జరుగుతున్నందున మరింత తోడ్పాటు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు బీబీసీతో అన్నారు.

ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్, మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలెప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) వంటి పథకాల ద్వారా అరటి రైతులకు అండగా నిలుస్తున్నట్లు చెబుతోంది. ఎంఐడీహెచ్ కింద డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రికి అయ్యే ఖర్చు, సాగుకు సంబంధించిన మెటీరియల్స్ వంటి వాటికి హెక్టారుకు 40శాతం చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.

ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలలో ఇది 50శాతంగా ఉంది. కోల్డ్ స్టోరేజీలు, అరటి పండ్లు పండటానికి ఉపయోగపడే చాంబర్ల వంటి వాటి కోసం క్రెడిట్ లింక్డ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెం అరటి మార్కెట్
ఫొటో క్యాప్షన్, తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెం అరటి మార్కెట్

ఇతర రాష్ట్రాలకూ ఆంధ్రా అరటి

కోస్తా, రాయలసీమలో పండించే అరటి ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తుంది. దిల్లీ, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ఆంధ్రాలో పండించే అరటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని అరటి హోల్ సేల్ వ్యాపారి పరమేశ్ గుప్తా బీబీసీతో అన్నారు.

'ఆంధ్రప్రదేశ్‌ అరటికి మంచి నాణ్యత ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంది. మార్కెట్ సీజన్ల వారీగా ఉంటుంది. జులై నుంచి నవంబర్ వరకూ రేటు బాగా పలుకుతుంది. వేసవిలో మార్కెట్ సాధారణంగా ఉంటుంది. విదేశాలకు ఎగుమతిని చేసే అరటికి సాగు దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగినట్లుగా ఏపీ రైతులు వ్యవహరిస్తున్నారు. సౌదీ, దుబాయ్ వంటి దేశాలకు అరటి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని పరమేశ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఈ ఊరిలో పాలు అమ్మరు
అరటి జాతులలో ఒక రకం
ఫొటో క్యాప్షన్, అరటి జాతులలో ఒక రకం

'సబ్సిడీలు దక్కడం లేదు'

అరటి సాగు చేసే వారిలో సాధారణ రైతాంగం ఎక్కువగా ఉంటున్నారు. అయితే ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, వివిధ పథకాలు...కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలకు, ఇతర ఎగుమతిదారులకు ఉపయోగపడుతున్నాయి తప్ప సామాన్య రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కడం లేదని బండారు సత్తిబాబు అనే రైతు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం ఏనుగు మహల్‌కి చెందిన ఆయన, మూడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగినట్లు ఆయన చెబుతున్నారు.

'అరటి పంట వాతావరణ మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. గాలుల తీవ్రత ఎక్కువైతే పంట మీద ఆశలు వదులుకోవాల్సిందే. పంట కాపాడుకోవడానికి వెదురు సాయంతో మొక్కను నిలబెట్టుకోవాలి. కానీ కష్టపడి పండించిన తర్వాత ధరలు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వమే పంట కొనుగోలు చేసి ఎగుమతి చేస్తే ఉపయోగం ఉంటుంది. సబ్సిడీలు ఇచ్చి, పంటకి మార్కెట్ కల్పిస్తే అరటి రైతుకి ఢోకా ఉండదు’’ అని సత్తిబాబు అభిప్రాయపడ్డారు.

సీజన్‌లో మార్కెట్ యార్డులకు అరటి గెలలు పోటెత్తుతాయి
ఫొటో క్యాప్షన్, సీజన్‌లో మార్కెట్ యార్డులకు అరటి గెలలు పోటెత్తుతాయి

వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా అమ్మకాలు

అరటి మార్కెట్ పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమ ప్రాంతాల్లో నేరుగా అరటి తోటల నుంచే వ్యాపారాలు కొనుగోలు చేసి తరలిస్తుండగా, కోస్తాలో మాత్రం రైతులు తమ పంటను మార్కెట్ కి తీసుకొచ్చి అమ్ముకోవడం చూస్తుంటాం.

రాష్ట్రంలో పేరున్న అరటి మార్కెట్ యార్డులలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఒకటి. సీజన్‌లో ఈ ఒక్క మార్కెట్ నుంచి రోజుకు 200 టన్నుల వరకు ఎగుమతి జరుగుతుంది. సీజన్ కానప్పుడు కూడా రోజుకు వంద టన్నుల వరకు ఎగుమతులు జరుగుతాయని మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు.

'కోనసీమలోని 16 మండలాల నుంచి రైతులు అరటి పంట తీసుకొస్తారు. వ్యాపారులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారు. ఎక్కువగా బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్రకు తరలిస్తారు. సీజన్ ఆధారంగా ధర ఉంటుంది. రైతులు తమ పంట అమ్ముకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. అమ్మకందారులు, కొనుగోలుదారులు నేరుగా ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి ధరల విషయంలో కొంత ప్రయోజనం కనిపిస్తోంది’’ అని రావులపాలెం అరటి మార్కెట్ కార్యదర్శి యాళ్ల భాస్కరరావు బీబీసీతో అన్నారు.

అరటి పంట విస్తీర్ణం పెరుగుతోంది. ఎగుమతులతో విదేశాల్లో ఆంధ్రా అరటికి డిమాండ్ కనిపిస్తోంది. అయితే సాధారణ రైతుకి మరింత తోడ్పాటు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. అది జరిగితే అరటి సాగులో ఆంధ్రా రైతులు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)