ఆంధ్రప్రదేశ్: కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌‌ను లీజుకు ఎందుకిస్తున్నారు, వ్యతిరేకించేవారి వాదనేంటి?

నెల్లూరు జిల్లా నేలటూరులోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, apgenco.gov.in

ఫొటో క్యాప్షన్, నెల్లూరు జిల్లా నేలటూరులోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పలు సందర్భాల్లో విద్యుత్ కోతలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో కరెంట్ ఉండదని చెబితే, ఇప్పుడు ఏపీలో కరెంటు కోతలు చూస్తున్నారంటూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు.

కరెంటు కోతల నివారణకు యూనిట్ 25 రూపాయలకు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది. విద్యుత్ నిరంతర సరఫరా కోసం బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు యూనిట్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం, తన వద్ద విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఉన్న సంస్థను మాత్రం లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే ఏపీ క్యాబినెట్‌లో దీనిపై తీర్మానం కూడా చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ని 25సంవత్సరాలకు లీజుకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

మూడో యూనిట్ అందుబాటులోకి వస్తే...

ఆంధ్రప్రదేశ్‌లో జెన్‌కో ఆధ్వర్యంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లున్నాయి. విజయవాడ, కడప పవర్ ప్లాంట్లను ఏపీ జెన్‌కో స్వయంగా నడుపుతోంది. కృష్ణపట్నంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ని ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వర్యంలో స్థాపించారు. ఏపీ జెన్‌కో నిర్వహణలో సాగుతోంది.

ప్రస్తుతం రెండు యూనిట్లు నడుస్తున్నాయి. 800 మెగావాట్ల చొప్పున 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. ఈ ప్లాంట్ మూడో యూనిట్ నిర్మాణం కూడా పూర్తికావస్తోంది. అది కూడా అందుబాటులోకి వస్తే మరో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం వస్తుంది. ఆ యూనిట్ పనుల్లో 90 శాతం పూర్తయినట్టు ఏపీ జెన్‌కో అధికారుల ప్రకటనలు చెబుతున్నాయి. కృష్ణపట్నం పవర్ ప్లాంట్ కోసం రూ.21 వేల కోట్లు పెట్టుబడితో, 1490 ఎకరాల్లో నిర్మించారు. ఈ ప్లాంటులో ఇంజనీర్లతో సహా అన్ని రకాల కార్మికులు కలిపి 1810 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకి 5 కి.మీ దూరంలో రైతుల నుంచి భూములు సేకరించి ఈ ప్లాంట్ నిర్మించారు. 2014లోనే మొదటి రెండు యూనిట్లు అందుబాటులోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.మూడో యూనిట్ సిద్ధమయితే 2400 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

విద్యుత్ ఉత్పత్తిలో నష్టాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యుత్ ఉత్పత్తిలో నష్టాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది

నష్టాలు వస్తున్నాయంటున్న ప్రభుత్వం

అధికారిక లెక్కల ప్రకారం ఈ థర్మల్‌ ప్లాంటులో ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం రూ.4.64 గా ఉంది. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీలకు గత ఏడాది రూ.10045.61 మేర కోట్లు నష్టాలు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. డిస్కమ్ లతో పాటుగా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ కూడా నష్టాల్లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. బొగ్గు సరఫరా సక్రమంగా జరగకపోవడం, విద్యుత్ ఆర్డర్లు కూడా సామర్థ్యానికి తగ్గట్టుగా లేకపోవడం నష్టాలకు కారణాలని ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆర్.ఉమేశ్ బీబీసీ తో అన్నారు.ప్లాంట్ నష్టాల్లో ఉన్నది నిజమేనని, నిర్వహణ ఖర్చు పెరుగుతోందని, ప్రపంచమంతా థర్మల్ పవర్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సంప్రదాయేతర ఇంధన వనరుల మీద అంతా దృష్టి పెట్టారని నిపుణులు అంటున్నారు. అయితే కృష్ణపట్నంలో నష్టాలకు ప్రభుత్వ విధానాలు కూడా కారణమని వారు చెబుతున్నారు.

‘‘2020-21 సంవత్సరంలో కూడా ఈ ప్లాంటుకు సక్రమంగా బొగ్గు సరఫరా చేసిన కాలంలో రూ.60 కోట్లు లాభాలు వచ్చాయి. అంటే బొగ్గు అందుబాటులో ఉంటే నష్టాలుండవని ఈ లెక్కలే చెబుతున్నాయి. నాసిరకం బొగ్గు కూడా నష్టాలకు కారణమవుతోంది. ‘నాలెడ్జ్‌' అనే కోల్‌ కంపెనీ నుంచి తీసుకొచ్చిన 4 లక్షల టన్నులు బొగ్గు కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ అది వాడకానికి పనికిరాలేదు. ఇప్పటికీ లక్ష టన్నుల వరకూ బొగ్గు పోర్టులోనే గుట్టలుగా పడి ఉంది. దానికి బాధ్యులెవరు’’ అని ఉమేశ్ ప్రశ్నించారు.కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ నష్టాలకు అసలు కారణాలు వదిలేసి లీజుకి అప్పగించడం శ్రేయస్కరం కాదనేది ఉద్యోగుల వాదన.

లీజును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, లీజును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు

రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాల గడువుతో లీజుకు ఇవ్వాలని జనవరి 21న జరిగిన క్యాబినెట్ భేటీలో తీర్మానించింది. దానికి అనుగుణంగా జెన్‌కో అధికార ప్రక్రియ ప్రారంభించింది. అయితే ప్రభుత్వం పేరుకి లీజు అని చెబుతున్నప్పటికీ ప్రైవేటీకరణ చేస్తోందనే విమర్శలు కార్మికుల నుంచి వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఉద్యమం సందర్భంగా ఫిబ్రవరి 27న పోలీసులు పలువురు కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు ‘‘అదానీకి కృష్ణపట్నం పోర్టును అప్పగించారు. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణపట్నం ప్లాంట్ కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ. 200కోట్ల పైనే ఉన్నాయి. వాటిని విడుదల చేస్తే నష్టాలుండవు. కానీ తను ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా నష్టాల్లో ఉందనే పేరుతో ప్రైవేటుకి అప్పగించే పని చేస్తున్నారు’’ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు చెబుతున్నారు

వీడియో క్యాప్షన్, కుటుంబాన్ని వదిలి యుద్దానికి వెళ్తున్న యుక్రెయిన్ పౌరులు

జెన్‌కో నుంచి 30వేల మిలియన్ యూనిట్లు కమిటెడ్ ఆర్డర్ ఉందని, కానీ అందులో 16430 మిలియన్‌ యూనిట్లు మాత్రమే గత సంవత్సరం జెన్‌కో నుంచి వాడుకున్నారని నర్సింగరావు అన్నారు. ‘‘సగం మాత్రమే ప్రభుత్వం జెన్‌కో నుంచి తీసుకుంటే ప్లాంట్లు నష్టాలు పాలుకాక ఏమవుతాయి. 1999-20లో 47 శాతం, 2020-21లో 48 శాతం, 2021-22లో 40 శాతం మాత్రమే డిస్కంలు తీసుకున్నాయి. దాంతో సామర్థ్యం ఉన్నప్పటికీ సగం కంటే తక్కువ మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి వస్తోంది’’ అని నర్సింగరావు అన్నారు.

ప్రైవేటు సంస్థల నుంచి ఎక్కువ ధరలకి కరెంటు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ సంస్థకి ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడమే అసలు సమస్యకు కారణమని, దీనికి లీజుకు పరిష్కారం కాదని ఆయన వాదించారు.

నాసికరకమైన బొగ్గు కొనుగోళ్లు కూడా నష్టాలకు కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు
ఫొటో క్యాప్షన్, నాసికరకమైన బొగ్గు కొనుగోళ్లు కూడా నష్టాలకు కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు

‘‘కేంద్రం విశాఖ ఉక్కును, రాష్ట్రం కృష్ణపట్నం ప్లాంట్‌ను అమ్మేస్తున్నాయి’’

కృష్ణపట్నం ప్లాంటు విషయంలో ప్రభుత్వ వ్యవహారం ప్రజలకు మరింత భారాన్ని మిగుల్చుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

‘‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. మరి కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఎలా ప్రైవేటుకిస్తారు? నష్టాలున్నాయని విశాఖ స్టీల్ గురించి కేంద్రం చెబుతోంది. కృష్ణపట్నం గురించి జగన్ ప్రభుత్వం అదే ప్రచారం చేస్తోంది. నష్టాలు తగ్గించే మార్గాలున్నాయి. దానిని కూడా లీజుకివ్వడం అంటే ప్రభుత్వం మరింత ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడటమే’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.జగన్ ప్రభుత్వం కొత్త సంస్థలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు తీసుకురావడం చేతగాక, ఉన్న సంస్థలను కూడా ప్రైవేటువారికి అప్పగిస్తోందని ఆయన విమర్శించారు.

కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటుపరం చేస్తున్నారనడం నిజం కాదని ప్రభుత్వం అంటోంది

ఫొటో సోర్స్, @YSJAGAN/TWITTER

ఫొటో క్యాప్షన్, కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటుపరం చేస్తున్నారనడం నిజం కాదని ప్రభుత్వం అంటోంది

‘‘నష్టాల నుంచి గట్టెక్కించేందుకే’’

కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేవలం నిర్వహణను మాత్రమే ఏపీ జెన్‌కో నుంచి మరో సంస్థకు బదిలీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ రంగంలో సమస్యలున్నాయన్న ఆయన , గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏల వల్లే నష్టాలు పెరుగుతున్నాయని అన్నారు.

‘‘థర్మల్ పవర్ విషయంలో వస్తున్న సమస్యలతో ఇటీవల విద్యుత్ సరఫరాలో చిన్నపాటి సమస్యలు వచ్చాయి. వాటిని సకాలంలో సరిచేశాం. కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది. నిర్వహణను మాత్రమే అప్పగిస్తాం. అది కూడా ప్లాంట్ ని కాపాడేందుకే’’ అని శ్రీనివాస రెడ్డి బీబీసీతో అన్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవానికి పొంతన లేదనే అభిప్రాయం కార్మికుల్లో వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్లాంట్ పరిరక్షణకు ఈ నిర్ణయం తప్పనిసరి అంటోంది.

కృష్ణపట్నం కొత్త లీజుదారులు ఎవరన్నది త్వరలో నిర్ణయిస్తామని ఏపీ జెన్కో అధికారులు బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)