రొమాన్స్‌లో మహిళలు యాక్టివ్‌గా ఉంటే తప్పా, కామసూత్ర పుట్టిన దేశంలో ఎందుకీ పరిస్థితి?

ఖజురహో శిల్పం ముద్దు ఎందుకు పెట్టుకోవాలి? ముద్దు ఎలా పెట్టుకోవాలి?

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సరళకు పెళ్ళై అయిదేళ్ళు కావస్తోంది. ఆమె కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తోంది. చలాకీగా, హుషారుగా ఉంటుంది. సంస్థలో అత్యున్నత స్థానంలో, తన పర్యవేక్షణలో కనీసం 10 బృందాలు పని చేస్తూ ఉంటాయి. ధైర్యంగా మాట్లాడుతుంది. సంస్థ వ్యవహారాల్లో తెలివితేటలతో, కార్యదక్షతతో పని చేస్తుంది. ఆమెకిప్పుడు 30 సంవత్సరాలు.

కానీ, ఇదే స్వాతంత్య్రం ఆమెకింట్లో లేదు. ఆమెకున్న సొంత అభిప్రాయాలు, కోరికలు మాత్రం భర్తతో చెప్పలేదు.ఇంటి విషయాలు, ఆర్ధిక వ్యవహారాలు, రాజకీయాలు అన్నీ మాట్లాడుకుంటారు. వారికింకా పిల్లలు లేరు.

కానీ, ఆమె వ్యక్తిగత కోరికల విషయంలో భర్త దగ్గర కూడా నోరు విప్పలేదు. భర్తకు కోరిక కలిగినప్పుడు మాత్రమే తన దగ్గరకొస్తాడని చెప్పారు.

ఆమె మానసిక స్థితి లేదా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆమె కోరికలను ఎప్పుడైనా వెలిబుచ్చడానికి ప్రయత్నించినా, "సంసార స్త్రీవేనా" అనే ప్రశ్న ఎదురవుతుంది అని సరళ చెప్పారు.

"నాకేం కావాలో తనకు తెలియదు. నోరు విప్పి మాట్లాడితే, గతంలో ఏదైనా అనుభవం ఉందా? ఆఫీసులో ఎవరితోనైనా సంబంధం ఉందా?" అనే ప్రశ్నలు ఎదురవుతాయి" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"రొమాన్స్‌లో యాక్టివ్‌గా ఉంటే ఎక్కడ నేర్చుకున్నావు? అని అడుగుతారు. దాంతో, నేను తటస్థంగా ఉండిపోతాను" అని అన్నారు.

"హాయిగా సాగిపోతున్న సంసారమే, కానీ, పెళ్ళిలో ముఖ్య భాగమైన శారీరక సుఖం విషయానికొచ్చేసరికి మాత్రం నాకేం కావాలో, నా ఇష్టాలేంటో చెప్పే ధైర్యం, చనువు లేవు" అని అన్నారు.

ప్రేమను మర్చిపోతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

భాగస్వామితో సెక్స్ గురించి సులభంగా మాట్లాడేవారిలో సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లడం తక్కువగా ఉంటుందని బ్రిటన్‌లో 2017లో లైంగిక ప్రవర్తన, జీవన శైలి గురించి నిర్వహించిన ఒక జాతీయ సర్వేతెలిపింది.

అంతరిక్షంలో సగం, భూభాగంలో సగం, అన్ని రంగాలలో సమానం అని చెబుతున్న స్త్రీ పురుష సమానత్వం స్త్రీ కోరిక వ్యక్తపరిచే విషయంలో ఎందుకు కనిపించటం లేదు? ఇది సంస్కృతిలో లోపమా? లేదా సమాజపు ఆలోచనా తీరులోనా? కోరికను వ్యక్తపరిచే మహిళను తప్పుగా చూసే సంస్కృతి ఎక్కడ నుంచి పుట్టింది?

ఆండాళ్ పాశురాల్లో కూడా విరహముంది

స్త్రీ పురుషుల మధ్య నెలకొన్న భావవ్యక్తీకరణే వారి మధ్య మానసిక, శారీరక బంధానికి బలమైన పునాది వేస్తుంది" అని "ద ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్" పుస్తకం రాసిన డాక్టర్ సీమా ఆనంద్‌ అంటారు.

ప్రేమను మర్చిపోతున్నారు

ఫొటో సోర్స్, SEEMA ANAND

"భారతీయ సంస్కృతిని, చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహిళలు స్వేచ్ఛగా ప్రవర్తించారు. జానా బాయ్, అక్క మహాదేవి, మీరా బాయ్ లాంటి వారు తమ ప్రేమను స్వేచ్ఛగా వెలిబుచ్చారు" అని చెన్నైకు చెందిన డాన్స్ చరిత్రకారులు స్వర్ణమాల్య బీబీసీతో అన్నారు.

ఆండాళ్ కవితల్లో భక్తితో పాటు విరహం కూడా ఉంది. 17వ శతాబ్ధానికి చెందిన ముద్దుపళని, పసుపులేటి రంగాజమ్మ కూడా శృంగార పదాలను రాశారు" అని అంటారు స్వర్ణమాల్య.

భక్తి సాహిత్యంలో మొల్ల లాంటి వారున్నారు కానీ, శృంగార సాహిత్యంలో మహిళలు లేరంటారు హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి జయప్రభ.

"ముద్దుపళని రచనల్లో ఆమె ఒక వేశ్య అని తెలుస్తుంది. వేశ్య శృంగార సాహిత్యాన్ని రచించడం సమాజం ఆమోదించింది కానీ, సాధారణ స్త్రీలు కాదు" అని ఆమె అంటారు.

స్వర్ణమాల్య

ఫొటో సోర్స్, Dr.SwarnaMalya/TheAtticProuducion

ఫొటో క్యాప్షన్, స్వర్ణమాల్య

బ్రిటిష్ పాలన, విధానాల వల్లే స్త్రీ స్వేచ్ఛ, కోరిక, శృంగారం గురించి మాట్లాడటం తప్పుగా చూడటం మొదలయింది" అని ఇన్ ఫినిట్ వెరైటీ: హిస్టరీ ఆఫ్ డిజైర్" పుస్తక రచయత మాధవి మెనన్ అంటారు.

ఇదే అభిప్రాయాన్ని రుక్మిణి, అవిషి పుస్తకాల రచయిత్రి సాయి స్వరూప ఐయ్యర్ కూడా వ్యక్తం చేశారు.

"కోరికను వ్యక్తపరచడం ప్రాచీన సంస్కృతిలో ఎన్నడూ తప్పుగా పరిగణించలేదు. కాకపొతే, ఈ వ్యక్తీకరణ కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం చేశారు. గాథా సప్తశతి, రాధికా సాంత్వనం లాంటి కావ్యాల్లో శృంగార రసం ధైర్యంగా వ్యక్తీకరించేవారు" అని ఆమె గుర్తు చేశారు.

సాయి స్వరూప ఐయ్యర్

ఫొటో సోర్స్, SAI SWAROOPA

ఫొటో క్యాప్షన్, సాయి స్వరూప ఐయ్యర్

పురుషుడు శృంగార కావ్యాలు రాస్తే తప్పు లేదా?

"అల్లసాని పెద్దన లాంటి కవులు వరూధినీ ప్రవరాఖ్యుల కావ్యం రాసినప్పుడు ప్రతిఘటన ఎదురవ్వలేదు. పురుషుడు శృంగార సాహిత్యాన్ని రాయడాన్ని సమాజం ఆమోదిస్తూనే ఉంది" అని అంటారు జయప్రభ.

"వరూధినిని ఒక గంధర్వ కాంతగా చూపించడంతో, సమాజానికి ఆమె విలువల పట్ల ప్రశ్నలు ఎదురవ్వలేదని అభిప్రాయపడ్డారు. సాధారణ స్త్రీ విరహాన్ని ప్రదర్శిస్తే, అన్ని కాలాల్లోనూ తప్పుగానే చూశారు" అని అంటారు ఆమె.

"ప్రబంధ సాహిత్యమంతా శృంగారమే అని అంటూ, బృహత్ కథలో చెప్పిన కొన్ని శృంగార కధల్లో కూడా నాయిక గీత దాటకుండా ప్రవర్తించాల్సిన నియమాలనే ఉద్ఘాటించారు" అని గుర్తు చేశారు.

"స్వామీ రారా అంటే ఎవరు? ఈ పదాలతో దేముడిని పిలుస్తున్నారా? ప్రియుడినా, భర్తనా?" అని ప్రశ్నించారు. శృంగార రసానికి భక్తిని జోడించి ఆమోదయోగ్యమయ్యేలా చేశారని అంటారు జయప్రభ.

వీడియో క్యాప్షన్, హెచ్‌ఐవీని జయించిన మొదటి మహిళ ఈమేనా..

"నెలసరి గురించి మాట్లాడటం కూడా తప్పే"

"ఆధునిక మహిళ నెలసరి గురించి, పురిటినొప్పుల గురించి రాసినా, శృంగారం గురించి వ్యక్తపరిచినా బరితెగించింది" అనే ముద్ర వేసేస్తారు" అని జయప్రభ అన్నారు.

"నేను నెలసరిలో ఉన్నాను, దగ్గరకి వచ్చే వేళ కాదంటూ" అలమేలు మంగ వెంకటేశ్వర స్వామికి చెప్పిన అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయని ఎమరీ యూనివర్సిటీ తెలుగు సంస్కృతి, సాహిత్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ హర్షిత కామత్ అంటారు.

భారతదేశంలో మహిళలు రాసిన సాహిత్యానికి సామాజిక ఆమోదం పొందటం కోసం పురుషుని పేరుతో ప్రచారం చేశారంటూ, క్షేత్రయ్య రచించారని చెప్పే చాలా పదాలు ఆ కాలంలో తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో ఉన్న దేవదాసీలు రచించినవి అని హర్షిత తన "ది డిసప్పీరెన్స్ ఆఫ్ విమెన్స్ వాయిసెస్ ఇన్ ఇరోటిక్ పోయెట్రీ" అనే పరిశోధన పత్రంలో వాదిస్తారు.

స్వర్ణమాల్య

ఫొటో సోర్స్, Dr.SwarnaMalya/TheAtticProuducion

ఫొటో క్యాప్షన్, స్వర్ణమాల్య

ఈ స్వేచ్ఛ ఎప్పుడు అంతమయింది?

"ఏది తప్పు, ఏది సరైనది అని విక్టోరియా పాలకుల దృష్టితో చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి తప్పొప్పుల బేరీజు మొదలయిందని అంటారు" స్వర్ణమాల్య.

ప్రతీ విషయానికి బ్రిటిష్ పాలకులను తప్పు పట్టకూడదని ఎంత అనుకున్నప్పటికీ, ప్రతీ అంశం వారి సామాజిక, న్యాయ, రాజకీయ విధానాల దగ్గరకొచ్చే ఆగింది" అని మాధవి మెనన్ స్క్రోల్ వెబ్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"బ్రిటిష్ పాలకులు భారతీయ శిల్పకళ, చిత్రాలు, కృష్ణునికి సంబంధించిన కథలు, ద్రౌపదికి ఐదుగురు భర్తలుండటం లాంటి విషయాలను చూసి చాలా గాభరా చెందారు. దీనిని బహుభర్త్రత్వానికి, విచ్చలవిడి లైంగిక సంబంధాలకు ప్రతీకగా చూశారు" అని అంటారు మాధవి.

"భారతదేశంలో కొన్ని తరాలుగా ఉన్న హిజ్రా సంస్కృతిని క్రిమినల్ తెగల చట్టం 1871 పరిధిలోకి తీసుకొచ్చి నేరంగా మార్చారు. పురుషులు మహిళల్లా వస్త్రాలు ధరించి బహిరంగంగా పాటలు పాడటం, నృత్యం చేయడం లాంటివి చేస్తే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఈ చట్టమే వారి జీవనాధారాన్ని అంతం చేసి వారు వీధుల్లో అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది" అని మాధవి చెప్పారు.

"మహిళలు బహిరంగంగా కోరికను వ్యక్తపరచకూడదనే విషయం సంస్కృతిలో నాటుకుపోయింది. విద్య, పోర్న్ అన్నీ పురుషుడి సుఖానికే ప్రాధాన్యత ఇస్తాయి. వీటి గురించి బహిరంగంగా మాట్లాడే వాళ్ళను విమర్శించడం లేదా తప్పు చేసినవారిలా చూస్తారు. మనకి ఆరోగ్యవంతమైన సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం" అని బ్లాగర్ డాక్టర్ ఆరతి బళ్లారి బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

పితృస్వామ్యం కూడా కారణమా?

"ప్రేమలో కోరిక, శృంగారం ఒక భాగమే, కానీ మహిళలు శృంగార భావనలను వ్యక్తపరచడం మాత్రం సమాజం తప్పుగాచూస్తుంది. పితృస్వామ్య భావన కూడా మహిళ స్వేచ్ఛను కొంత వరకు హరించింది" అని స్వర్ణమాల్య అంటారు.

"సంస్కృతి నిర్వచనంలో ఇమడని అంశాలను తప్పుగా చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి దానిని మధుర భక్తిగా మార్చి సమర్ధించుకోవడం మొదలుపెట్టారు" అని ఆమె అన్నారు.

"సమాజంలో ద్వంద్వ ధోరణి మారాలి, పురుషుడు సాహిత్యాన్ని రాయడం, దానిని స్త్రీ ద్వారా ప్రదర్శింప చేసే ధోరణి మారాలి" అని అంటారు జయప్రభ.

"కామసూత్ర రచించిన కాలంలో లైంగిక విజ్ఞానం గురించి చర్చలు సురక్షిత ప్రదేశాల్లో, నమ్మశక్యమైన వ్యక్తుల మధ్య చోటు చేసుకునేవి. కానీ, నేడున్న ఆన్ లైన్ స్పేస్ వీటిని చర్చించేందుకు సురక్షితం కాదు. ఎవరి మీదైనా ఎవరికిష్టమైన అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు" అని సాయి స్వరూప అన్నారు.

"దురదృష్టవశాత్తు కూతురుకు లైంగిక విజ్ఞానం గురించి చెప్పాల్సిన తల్లి కూడా చాలా సార్లు ఇలాంటి విషయాలు మాట్లాడటాన్ని తప్పుగానే చూస్తోంది. కాలం మారుతోందని అనుకుంటున్నాను" అని స్వరూప అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)