'నీ జననాంగాన్ని కోస్తా, ఇక నువ్వెరితోనూ పడుకోలేవంటూ బ్లేడుతో బెదిరించేవాడు' - మహిళలపై హింస పెరుగుతోందన్న లాన్సెట్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కమల చిన్నప్పటి నుంచి తనను ప్రేమించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పెళ్లయి 11 ఏళ్ళవుతోంది. కమల జీవితంలో మానసిక హింస పెళ్ళికి ఒక రోజు ముందు నుంచే మొదలయింది.
"నువ్వు మునుపటిలా అందంగా లేవు. పెళ్లి ఆపేస్తాను" అని చేసుకోబోయే వ్యక్తి వేధించారు. ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడారని కమల భావించారు. అప్పటి నుంచి ఆమె ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు.
కానీ, ఆమె పై జరిగే మానసిక, శారీరక వేధింపులు మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే వచ్చాయి.
కమలకు ఒకవైపు ఇంటిపనులతో ఒత్తిడి పెరిగిపోతుంటే, ఆమె భర్తకు మాత్రం సెక్స్ కోరికలు పెరుగుతూ వచ్చాయి. ఈ లోపు వారికిద్దరు పిల్లలు కూడా పుట్టారు.
"అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి సెక్స్‌లో పాల్గొనమని ఒత్తిడి చేసేవారు. వద్దని వారించినా, అలిసిపోయానని చెప్పినా, వేరే వారితో సంబంధాలున్నాయా అని ప్రశ్నించేవారు" అని కమల చెప్పారు. "ఆఖరుకు ఇంటికొచ్చే చాకలి, పనివాళ్ళతో కూడా సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వేధించేవారు" అని ఆమె చెప్పారు.
"ఆఖరుకు మొదటి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు కూడా సెక్స్‌కు అంగీకరించకపోతే, గర్భస్రావం చేయిస్తాననేవారు. ఈ మాటలను తట్టుకోవడం చాలా వేదనగా ఉండేది. నెమ్మదిగా నాకు అతని పై ప్రేమ తగ్గిపోవడం మొదలయింది. చాలా సందర్భాల్లో కత్తి మెడ దగ్గర పెట్టి నన్ను బాగా చూసుకుంటున్నట్లు అందరికీ చెప్పమని బెదిరించేవారు" అని చెప్పిన కమల ఈ వేధింపులు భరించలేక అయిదేళ్ల కిందట కమల పుట్టింటికి వచ్చేశారు. కానీ, పెద్దలందరూ ఆమెకు సర్ది చెప్పి తిరిగి భర్త దగ్గరకు పంపేశారు.
ఆరు నెలల తర్వాత కమలకు తిరిగి వేధింపులు మొదలయ్యాయి.
"ప్రేమ వివాహాల్లో కూడా హింస ఉంటుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హింసకు తావెక్కడ నుంచి వస్తుంది?" అని కమల ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Thinkstock
"ఈ ఏడాది జనవరి 03 రాత్రి బాగా అలిసిపోయి నిద్రపోయిన తర్వాత ఎంత వారిస్తున్నా ఆగకుండా సెక్స్ చేస్తూనే ఉన్నారు. నిద్రమత్తులో మనం ఇద్దరం" అనే మాటలన్నాను. ఆ విషయం నాకు కూడా తెలియదు. వెంటనే నన్ను తట్టి లేపి ఇద్దరెవరు అని అడిగి, నీకు వేరొకరితో సంబంధం ఉందని వేధించడం మొదలుపెట్టారు.
నీ అంతు చూస్తాను అని బెదిరించారు. అప్పటికే ఇంట్లో పండుగకు వచ్చిన బంధువులున్నారు. ఆ తర్వాత రోజు రాత్రి సెక్స్‌కు ఒప్పుకోకపోవడంతో, రాత్రి 11. 30 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు దోమల బ్యాట్‌తో, స్కేల్‌తో కొట్టారు. నాకు మరొకరితో లైంగిక సంబంధం ఉందని ఒప్పుకోమని వేధించారు. ఎంత ప్రతిఘటించినా వినలేదు.
నీ జననాంగాన్ని కోసేస్తాను. ఇక నువ్వు ఎవ్వరితోనూ పడుకోలేవని అంటూ బ్లేడ్ పట్టుకుని వచ్చారు. ఈ లోపు నా పక్కనే పడుకున్న చిన్న కొడుకును లేపి పక్క గదిలో ఉన్న మా ఆడపడుచుని లేపమని చెప్పాను. ఏమి జరుగుతోందని అడుగుతుంటే వాళ్ళను కూడా కసిరించాడు. దాంతో వాళ్ళు తిరిగి వెళ్లిపోయారు." అని ఆమె చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా 15-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 27 % మంది మహిళలు వారి జీవిత కాలంలో ఒక్కసారైనా , మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురైనట్లు లాన్సెట్ అధ్యయనంలో తేలింది.
20-44 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల్లో 26 - 28% అత్యధికంగా జీవితాంతం భాగస్వామి చేతిలో హింసకు గురైనట్లు తేలింది.
అయితే, ఈ వేధింపులు ధనిక దేశాలతో పోల్చి చూస్తే అల్పాదాయ దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. మహిళలపై అత్యధిక హింస ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి
కమల భర్త అంతటితో ఊరుకోలేదు.
"నాతో బలవంతంగా ఒక పుస్తకంలో మాకిద్దరికీ అభిప్రాయ బేధాలు వస్తున్నందువల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని రాయించి సంతకం పెట్టించారు" అని ఆమె చెప్పారు.
ఇదంతా విన్నకమల అత్తగారు మాత్రం, "నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. బంగారం మాత్రం నాకివ్వు. ఆ మూర్ఖుడి వల్ల నీకేమన్నా అయితే, మేము బాధ్యత వహించలేం" అని ఆమెను పుట్టింటికి పంపేశారు.

ఫొటో సోర్స్, Alamy
కమల పిల్లలను తీసుకుని తన పుట్టిల్లు అయిన హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఆమె ఫిబ్రవరి 15న హైదరాబాద్ లోని పోలీసు స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 498 కింద గృహ హింస కేసు నమోదు చేశారు.
అయితే, పోలీసులు, న్యాయవాదులు మాత్రం ఆమెను తిరిగి భర్త దగ్గరకు వెళ్లిపొమ్మని సలహా ఇస్తున్నారు.
చాలా మంది మహిళలు తమ పై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు ఇటువంటి ఆలోచనా ధోరణే కారణమని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల అన్నారు.
మహిళలు, పిల్లలపై జరిగే హింసను పూర్తిగా నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో ఒక లక్ష్యంగా పెట్టుకుంది.ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని పర్యవేక్షించేందుకు లాన్సెట్ అధ్యయనం చేసింది.
మహిళలపై గృహ హింస, వేధింపులు చోటు చేసుకున్నప్పుడు సెక్షన్ 498, మెయింటెనెన్స్ , విడాకులకు కేసులు నమోదు చేస్తాం. కానీ, వాటి పరిష్కారానికి కలిగే జాప్యం, అయ్యే ఖర్చు, మానసిక వేదన, సామాజిక రుగ్మత, భావోద్వేగాల గురించి ఎవరూ పట్టించుకోరు.
గృహ హింస చట్టాలను పటిష్టం చేసి, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేందుకు న్యాయస్థానాలు పూనుకుంటే తప్ప వేధింపులను అరికట్టడం అసాధ్యం. దీని వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ భర్త మీద ఆధారపడి జీవించే మహిళలకు ఊరట లభిస్తుంది. "న్యాయపరమైన ఖర్చులు ఎంత మంది భరించగలరు?" అని ప్రశ్నించారు శ్రీకాంత్.
"స్త్రీ పురుషులిద్దరికీ ఆర్ధిక స్వేచ్ఛ, సమాన ఆస్తి హక్కుల లాంటి విధానాలు అన్ని చోట్లా అమలులో ఉన్నప్పుడు కొంత వరకు పరిష్కారం సాధ్యం అవుతుంది" అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ వ్యాప్తంగా మహిళల హత్యల్లో 38-50% హత్యలను భాగస్వాములే చేశారని లాన్సెట్ అంచనా. దీని వల్ల ప్రభుత్వం, సమాజం, వ్యక్తులకు సామాజిక, ఆర్ధిక నష్టం ఏర్పడేందుకు అవకాశముంది.
2015లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు నిర్దేశించుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోని జెండర్ సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యం కింద మహిళలు, పిల్లల పై జరిగే హింసను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హింసను నిరోధించేందుకు సమాజంలో వివిధ విభాగాల ప్రమేయం, ప్రజారోగ్య విధానాల పటిష్టం చేయడం లాంటివి చేయాలని లాన్సెట్ అధ్యయనం సూచించింది. హింసను అరికట్టేందుకు, హింసలో జీవిస్తున్న మహిళల కోసం అందుబాటులో ఉండాల్సిన సేవలను పెంచాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030ను సాధించేందుకు తగినంతగా లేవని తెలిపింది. ప్రధానంగా హింస జరగకుండా ఆపడం ముఖ్యం అని అంటూ, ఇందుకోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











