Women's day స్పెషల్: 'మహిళా నవోదయం' - మహిళల కోసం, మహిళలు రాసే వార్తలతో.. మహిళలే నడుపుతున్న పత్రిక

నవోదయం పత్రిక

ఫొటో సోర్స్, BBC/Tulasi prasad reddy

    • రచయిత, తులసీప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

మహిళా నవోదయం... ఇదొక కంప్లీట్ విమెన్ మ్యాగజైన్. మహిళల కోసం, మహిళలు రాసే వార్తా కథనాలతో, మహిళలే ప్రచురిస్తున్న పత్రిక. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు కేంద్రంగా రెండు దశాబ్దాలుగా 'మహిళా నవోదయం' పత్రిక నడుస్తోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా బీబీసీ ఈ స్పూర్తిదాయక కథనాన్నిఅందిస్తోంది.

పూర్తిగా మహిళల సమన్వయంతో నడుస్తున్న 'మహిళా నవోదయం' పత్రిక గ్రామీణ మహిళలు స్వయం సహాయక బృందాల ద్వారా సాధిస్తున్న విజయాలను, పల్లెల్లోని సమస్యలను అందరి దృష్టికీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

చిత్తూరు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రామీణ మహిళలు ఈ పత్రిక కోసం రిపోర్టర్లుగా పని చేస్తున్నారు. వార్తలను నివేదించడం, సరిదిద్దడం, ప్రచురించడం, పత్రికను పంపిణీ చేయడం వంటి బాధ్యతలన్నీ ఇక్కడ మహిళలే నిర్వర్తిస్తుంటారు.

నవోదయం మహిళా సిబ్బంది

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, మహిళా నవోదయం పత్రిక కోసం పనిచేసే మహిళా బృందం

2001లో ప్రారంభం

2001 సంవత్సరంలో వెలుగు కార్యక్రమం కింద చిత్తూరు జిల్లాలో మహిళా నవోదయం మొదలైంది. నాటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సర్ప్) ప్రాజెక్ట్ డైరెక్టర్ జయేష్ రంజన్‌ ఆలోచన నుంచే ఉదయించింది మహిళా నవోదయం.

పేద మహిళల కోసం ప్రింట్ మీడియాలో ఒక గళం ఉండాలని ఆయన భావించారు. అలా 2001 అగస్ట్ 15న మహిళా నవోదయం పత్రిక ప్రారంభమైంది. తొలి సంచిక 8 పేజీలతో వచ్చింది. తొలి రోజుల్లో గ్రామీణ మహిళల్లో చదవడం, రాయడం తెలిసిన పన్నెండు మంది మహిళా రిపోర్టర్లను నియమించారు.

వీరంతా ఆ సమయంలో కూలి పనులు, వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవారు. నాడు వీరికి వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులతో శిక్షణ ఇప్పించారు జయేష్ రంజన్.

12 మంది మహిళా రిపోర్టర్ల కోసం మొత్తం జిల్లాను పన్నెండు క్లస్టర్లుగా విభజించి, ఒక్కొక్కరికి అయిదు మండలాల చొప్పున వార్తలు సేకరించే బాధ్యతలు అప్పగించారు.

ఈ పత్రికలో స్వయం సహాయక బృందాల సభ్యుల సక్సెస్ స్టోరీలతో పాటూ ఆయా ప్రాంతాల్లోని అవినీతి, గ్రామీణ ప్రజల ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా వార్తలు రాస్తుంటారు. బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా మీద కూడా పోరాడుతోంది మహిళా నవోదయం.

నవోదయం పత్రిక ప్రింటింగ్

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

700 నుంచి 50 వేల కాపీలకు...

2001లో సుమారు 700 కాపీలతో మొదలైన మహిళా నవోదయం సర్క్యులేషన్ ఇప్పుడు 50 వేలకు చేరినట్లు చిత్తూరు జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెకక్ట్ డైరెక్టర్ డి.ఎం.కె తులసి అన్నారు.

మహిళా నవోదయం పత్రిక పబ్లిష్ చేసే వార్తలను డీఆర్‌డీఏ మానిటర్ చేస్తుంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల విజయ గాథలు పబ్లిష్ అయ్యే ముందు డీఆర్‌డీఏకి వస్తాయని తులసి తెలిపారు. ఈ కథనాలను ప్రింట్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేసిన తరువాత మాత్రమే అవి ప్రచురణకు వెళ్తాయని ఆమె వివరించారు.

'2001లో ప్రారంభమైనప్పుడు చాలా తక్కువ కాపీలు ప్రింట్ చేసేవారు. కానీ ప్రస్తుతం 50 వేల కాపీలు ప్రింట్ అవుతున్నాయి. విజయవాడతోపాటు మిగతా జిల్లాలకు కూడా వాటిని పంపిణీ చేస్తున్నామ'ని తులసి అన్నారు.

ఈ పత్రికకు డేటా న్యూస్ ఫీచర్, లాడ్లీ మీడియా అవార్డులు కూడా వచ్చాయి.

నవోదయం పత్రిక

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

మహిళల విజయగాథలను నలుగురికి తెలుపుతూ...

మహిళా నవోదయం రిపోర్టర్లు తమ క్లస్టర్‌లోని స్వయం సహాయక బృందాల సభ్యులు సాధించిన విజయాలను వెలుగులోకి తెస్తుంటారు.

స్వయం సహాయక సంఘాల్లో చేరక ముందు ఆడవాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయి? చేరిన తరువాత వారి పరిస్థితి ఎలా మారిందో పరిశీలించి కథనాలు రాస్తామని వాయల్పాడులో మహిళా నవోదయం రిపోర్టర్‌గా పనిచేస్తున్న చంద్రకళ అన్నారు.

స్వయం సహాయక బృందాల్లో చేరడం ద్వారా తమ పిల్లలను ఎలా డాక్టర్లు, ఇంజనీర్లు చేశారో రాస్తామని తెలిపారు.

'బాడుగ ఆటోలు నడిపేవారు ఎలా ఓనర్ అయ్యారు? కార్లు, టెంపోలు తిప్పేవారితోపాటు హోట‌ళ్లు, గార్మెంట్ షాపులు పెట్టుకున్న వారి గురించి ఎన్నో కథనాలు రాశామ'ని చంద్రకళ వివరించారు.

నవోదయంలో సుమారు 20 ఏళ్లుగా ఆమె పని చేస్తున్నారు. వ్యాపారాల్లో మంచి స్థాయికి చేరిన ఒంట‌రి మహిళల విజయాల గురించి క‌థ‌నాలు రాశామని, తాను రాసిన వార్త చదివి భర్త చనిపోయిన ఒక మహిళకు పెన్షన్ మంజూరు కావడం వంటివి తృప్తినిచ్చాయని అన్నారు చంద్రకళ.

నవోదయం రిపోర్టర్

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, రిపోర్టర్ ఇందిరా ప్రియదర్శిని

బాల్య వివాహాలపై పోరాటం

అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడంపైనా పోరాడుతోంది మహిళా నవోదయం.

బాలికలకు అండగా ఉంటూ వారిలో ధైర్యం నింపుతోంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా నవోదయం రిపోర్టర్లలో ఇందిర ప్రియదర్శిని ఒకరు. శ్రీకాళహస్తి దేవుడి పెళ్లి సమయంలో జరిగే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ ఆమె వార్తలు రాశారు. తాను 2005లో మహిళా నవోదయంలో చేరానని, అప్పట్లో శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సమయంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని చెబుతున్నారు ఇందిర.

వాటిని అడ్డుకోడానికి తాము సంఘాల ద్వారా పని చేయడంతోపాటు నవోదయం పత్రికలో బాల్యవివాహాలు చేసుకున్న వారి కష్టాల గురించి వివరంగా వార్తలు రాశామని ఇందిర వివరించారు.

'నువ్వూ చిన్నపిల్లవే. ఎవరైనా నీక్కూడా తాళి కట్టేస్తారేమో జాగ్రత్త అని నన్ను మా సభ్యులు సరదాగా ఆటపట్టించేవారు. అప్పుడు లోలోపల కాస్త భయమేసేది' అని ఇందిర నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

నవోదయం పత్రిక మహిళా బృందం

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఎన్నో కష్టాలు...అవమానాలు

స్వయం సహాయక బృందాల సభ్యుల విజయగాథలను కథనాలుగా మలిచే పత్రిక జర్నలిస్టులు ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా ముందుకు సాగుతున్నారు. బెదిరింపులు, కుల దూషణలు తట్టుకుని నిలబడుతున్నారు.

ఒకసారి బీసీ హాస్టల్‌లో పిల్లలకు పెడుతున్న తిండి బాగాలేదని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో తిట్టారని తవణంపల్లె రిపోర్టర్ చిన్నక్క అన్నారు.

'ఒకసారి బీసీ హాస్ట‌ల్‌లో అన్నం తిన్నా. చాలా భ‌యంక‌రంగా ఉంది. అక్కడి వారికి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో చూడాలి కదా అన్నా. అప్పుడు వంటామె వ‌చ్చి నా కులం గురించి మాట్లాడింది. మీరు మాలోళ్లు క‌దా.! ఇంత‌కంటే బాగా తింటారా అన్నారు. నేను మా పత్రికలో ఆ వార్త రాశాను. తరువాత ఎమ్మార్వో మిగతా అధికారులు వచ్చి విచారించారు. క‌లెక్ట‌ర్‌కు కూడా కంప్లైంట్ చేశాను' అని చిన్నక్క వివరించారు.

వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కు తగ్గకుండా పోరాడుతున్నామని చిన్నక్క అంటున్నారు.

'మా ఊళ్లోనే ఐదుగురు ఆడపిల్లలున్న తల్లి తన భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ఆమె పిల్లలకు గ్రామస్థులు కొంత సాయం చేశారు. దాంతో సాయం బ‌తికి ఉన్న‌ప్పుడా? చ‌నిపోయిన‌ప్పుడా? అని హెడ్డింగ్‌తో వార్త రాశా. డబ్బుల కోసం ఆమె కడుపునొప్పితో చనిపోయిందని అందరికీ చెప్పిన వాళ్లంతా నాపైకి గొడ‌వ‌కు వ‌చ్చారు. ఆమె చ‌నిపోయాక ఊళ్లోవాళ్లు సాయం చేశారు. అదే ఆమె బ‌తికున్నప్పుడు చేసుంటే, మొగుడికి బుద్ధి చెప్పి ఉంటే ఆమె బతికేది కదా అని రాశా. కానీ ఊర్లో వాళ్లు మా ఇంట్లో వాళ్లు నీకెందుకని తిట్టార'ని తన చేదు అనుభవాలను వివరించారు చిన్నక్క.

జిల్లా సమాఖ్య

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

చందాలతోనే వేతనాలు

మహిళా నవోదయం పత్రికకు జిల్లా సమాఖ్య ఆర్థిక సహకారం అందిస్తోంది. దీనికోసం పనిచేసే ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లిస్తోంది.

ప్రస్తుతం మహిళా నవోదయం పత్రికను చందాదారులు కట్టే చందాలతోనే నడిపిస్తున్నామని అందులో ప్రచురించిన వార్తలకు ఎలాంటి డబ్బూ వసూలు చేయడం లేదని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవితా రాణి తెలిపారు.

'స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే సమాచారం మా రిపోర్టర్లు తీసుకొస్తారు. ఆ సమాచారాన్ని మహిళా నవోదయంలో ప్రచురిస్తాం. పత్రికలో కథనం వేసినందుకు వారి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోం. సంఘాల్లో సభ్యులందరూ పైకి రావాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికను నడిపిస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మేం ఫండింగ్ తీసుకోవటం లేదు. ప్రస్తుతం మా సంఘాల సభ్యులు కట్టే చందాలతోనే దీనిని నడిపిస్తున్నాం. ఇప్పుడు మా పత్రిక సచివాలయాలకు కూడా వెళ్తోంద'ని కవితా రాణి వివరించారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ 100 మంది మహిళలు 2021

స్వయం సహాయక సంఘాల మెంబర్లే ఈ పత్రికకు చందాదారులుగా ఉన్నారని మహిళా నవోదయం పత్రిక ఎడిటర్ రత్నమ్మ చెప్పారు. ప్రింట్ అయిన పత్రికను ఆయా క్లస్టర్లకు చెందిన రిపోర్టర్లే ప్రతి మండలంలోనూ పంచుతారని తెలిపారు.

'మండ‌లంలో స‌మావేశం జ‌రిగేట‌ప్పుడు గ్రామ స‌మాఖ్య ప్రెసిడెంట్ల ద్వారానే ప్ర‌తి సంఘానికి చేరే విధంగా పత్రిక పంపిణీ జ‌రుగుతుంది. మేం గ్రామాలకు వెళ్తాం. అక్కడి సమస్యలు తెలుసుకుని వార్త‌లు రాస్తాం. ఎడిట్ చేస్తాం. ఆ వార్త‌ల‌ను మా ఎడిటోరియ‌ల్ టీమ్ క‌రెక్ష‌న్ చేసిన త‌రువాత కంప్యూట‌ర్‌లో పేజీలను డిజైన్ చేస్తాం. అక్షర దోషాలు సవరించి ప్రూఫ్‌ పీడీ గారికి అంది‌స్తాం. పీడీ గారు ఓకే చేశాక ప్రచురణకు వెళ్తుంది'అని రత్నమ్మ వివరించారు.

నవోదయం రిపోర్టర్లు

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

పేద మహిళలకు ఉపాధి కూడా...

మహిళా నవోదయం పత్రికల్లో పని చేస్తున్నా వారిలో చాలా మంది పేద మహిళలే. ఆర్థిక స్థోమత లేక పెద్ద చదువులు చదవలేని వాళ్లు, భర్తను పోగొట్టుకున్న ఒంటరి మహిళలు మహిళా నవోదయంలో పని చేస్తున్నారు.

ఇప్పుడు తమ కుటుంబానికి ఒక ఆధారం అంటూ ఉందంటే అది మహిళా నవోదయం పత్రికలో పనిచేయడం వల్లే అంటారు రిపోర్ట్ అయిన ఇందిరా ప్రియదర్శిని. బాగా చదువుకోవాలని ఉన్నా కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్ అవగానే మహిళా నవోదయం రిపోర్టర్‌గా చేరానని ఆమె అంటున్నారు. రిపోర్టర్‌గా పని చేస్తూనే ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు ఇందిర.

మహిళా నవోదయంలో పని చేయడం వల్ల వచ్చే జీతంతోనే తన కుటుంబం నడుస్తోందని చెబుతున్నారు చిన్నక్క. తవణంపల్లె మండలంలోని హరిజనవాడకు చెందిన చిన్నక్క పదోతరగతి ఫెయిల్. ముగ్గురు పిల్లలను పోషించడానికి కూలి పనులకు వెళ్లేవాకు. 2005లో నవోదయంలో ఆమె చేరారు. ఆమె భర్త యాక్సిడెంట్‌లో చనిపోయారు.

నవోదయం సిబ్బంది

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

యూట్యూబ్ కోసం శిక్షణ

మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళా నవోదయం సిబ్బంది కూడా కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా నవోదయం జర్నలిస్టులకు ఆధునిక మీడియా ట్రెండ్స్ మీద అందుకు అవసరమైన టెక్నాలజీ మీద శిక్షణ ఇస్తున్నారు.

యూట్యూబ్ చానల్ ప్రారంభించడం కోసం శిక్షణ ఇస్తున్నామని వర్క్ షాపుల ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నామని జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సరిత రెడ్డి తెలిపారు.

'వీరికి నూత‌న కంటెంట్ రైటింగ్ ప‌ద్ధ‌తులు, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, మిక్సింగ్‌లో శిక్షణ అందిస్తున్నాం. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల నుంచి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్స్‌ను ఆహ్వానిస్తున్నాం. వారి ద్వారా వ‌ర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నామ'ని సరిత రెడ్డి వివరించారు.

వీడియో క్యాప్షన్, మహిళా యాక్టివిస్టులు ఎందుకు అదృశ్యమవుతున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)