ఏపీ: ఆక్వా ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రికార్డు ధరలతో రొయ్యలు, చేపల సాగుదారులకు లాభాలు

రొయ్యలు
ఫొటో క్యాప్షన్, రొయ్యలు
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆక్వా ఉత్పత్తిదారుల్లో ఆనందం కనిపిస్తోంది. రొయ్యల దిగుబడులు ఎలా ఉన్నప్పటికీ మార్కెట్లో అమాంతంగా పెరిగిన ధరలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో దక్కుతున్న ధరలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి ఈ ధరలు చేరడం అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా నిరుడు ఇదే సీజన్‌లో రొయ్య 50 కౌంట్(కేజీకి తూగే రొయ్యల సంఖ్య) ధర ఈసారి 100 కౌంట్‌కి కూడా దక్కుతోంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరింది. ఈసారి మార్కెట్ ధరలతో మరింత మంది ఆక్వా రంగంవైపు మళ్లుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే సాగు పెరుగుతున్నా, కొందరు సామాన్య రైతులు మాత్రం చితికిపోతున్నారు. అసలు సమస్యలేంటి, ఏపీ ఈ స్థాయికి రావడానికి కారణాలేంటి.

కరోనా తర్వాత కోలుకుంటున్నారు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వివిధ రంగాల మీద ప్రభావం చూపినట్టుగానే ఏపీలో ఆక్వా రైతులనూ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. కొన్ని చోట్ల రొయ్యలను భారీ పెట్టుబడులతో ఉత్పత్తి చేసినా కొనుగోలు చేసేవారు లేక రైతులు చితికిపోయారు. ముఖ్యంగా ఎగుమతులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు.

కానీ ఈసారి మార్కెట్ తీరుతో కరోనా నష్టాల నుంచి గట్టెక్కగలమనే ధీమా కనిపిస్తోంది. ఐదు నెలలుగా వనామీ రొయ్యల ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 30 కౌంట్ అంటే కిలోకి 30 రొయ్యలు తూగితే వాటికి రూ. 620 వరకూ ధర పలుకుతోంది.

ఇప్పుడు ఉత్పత్తి సిద్ధం చేసి, పట్టుబడులకు ( చేపలు పట్టుకోవడానికి) దిగుతున్న వారికి ఇది ఆనందాన్నిస్తోంది. ఎగుమతులు ఊపందుకోవడంతో మార్కెట్ పుంజుకుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉత్పత్తి తగ్గడం వల్లనే ఇంత ఎక్కువ ధరలంటూ కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు.

''ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో చెరువుల్లో పిల్ల వేస్తాం. అది తయారయి, పట్టుబడికి వచ్చే సరికి మే నెలాఖరు వస్తుంది. కాబట్టి ఈ సీజన్లో అందుబాటులో ఉన్న చెరువులు తక్కువ ఉంటాయి. ఉత్పత్తి తగ్గడంతో వ్యాపారాలు ధరలు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో కోవిడ్ రాకముందు ధరల కన్నా ఎక్కువే ఉన్నాయి. దానివల్ల కొందరైనా కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్నారు. కానీ ఎన్నాళ్లు నిలబడతాయన్నది చెప్పలేం. ఇప్పుడు పట్టుబడి పడుతున్న వారికి మాత్రం లాభాలకు అవకాశం ఉంటుంది'' అని కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఆక్వా రైతు అంబటి ఆంజనేయులు బీబీసీతో అన్నారు..

సెప్టెంబర్ నుంచి ఈ ధరలు ఇలా పెరుగుతున్నాయని, నిలకడగా ఉంటే ఆక్వా సాగుదారుల సమస్యలు చాలా వరకూ తీరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో సాగయ్యే రొయ్యల్లో 70శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి
ఫొటో క్యాప్షన్, ఏపీలో సాగయ్యే రొయ్యల్లో 70శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి

ఏటేటా పెరుగుతున్న ఉత్పత్తులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగులో ప్రధానంగా రొయ్యలు, చేపలు, పీతలు ఉత్పత్తి చేస్తుంటారు. వాటిలో 95 శాతానికి పైగా రొయ్యలు పండిస్తున్నారు. తొలుత టైగర్ రొయ్యలు పండించేవారు. కానీ గడిచిన దశాబ్దంన్నరగా అంతా వనామీ రకం రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం 2020-21లో రాష్ట్రంలో 74,512 హెక్టార్లలో రొయ్యల సాగు చేశారు. దాని ద్వారా 6,39,894 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. మొత్తం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. ఏపీ నుంచి 20లక్షల మెట్రిక్ టన్నుల చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్నవాటిలో 98.65 శాతం ఫ్రోజెన్ ష్రింప్ ఉంది.

ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో 70.74 శాతం అమెరికాకి వెళుతున్నాయి. ఆ తర్వాత చైనాకి 12.74 శాతం ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటుగా జపాన్ సహా పలు దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా విలువ 2014-15లో 28.99 మిలియన్ యూఎస్ డాలర్ల నుంచి 2020-21లో 36.17 మిలియన్ యూఎస్ డాలర్లకు చేరింది. ఆ ఏడాదిలో 9.63 శాతం వృద్ధి రేటుతో 15,832 కోట్ల రూపాయల విలువ చేసే ఆక్వా ఎగుమతులు ఏపీ నుంచి జరగడం విశేషం. ఇది దేశీయ ఎగుమతుల్లో మూడోవంతు కన్నా ఎక్కువ.

ఆక్వా ఎగుమతుల విలువ ప్రకారం ఏపీ తర్వాత తమిళనాడు 13 శాతం, గుజరాత్ 10 శాతం, ఒడిశా నుంచి 7 శాతం చొప్పున జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాతి మూడు రాష్ట్రాల విలువ కలిపినా ఏపీ ఎగుమతులతో సమానం కాలేకపోవడం గమనార్హం.

వీడియో క్యాప్షన్, సముద్రంలో మత్స్య సంపదను నాశనం చేస్తున్న రాకాసి చేపలివీ

ఆక్వాసాగు ఎలా మొదలైంది

ఆంధ్రప్రదేశ్ ని ఒకప్పుడు దేశానికి ధాన్యాగారంగా భావించేవారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేవారు. కానీ ప్రస్తుతం ఆక్వా ఆంధ్రాగా మారుతోంది. 1980ల చివర్లో ఏపీలో ఆక్వా సాగు మొదలయ్యిందని మత్స్యశాఖ నిపుణులు చెబుతున్నారు. తొలుత చేపల సాగుతో మొదలై, ఆ తర్వాత టైగర్ రొయ్యల వైపు మొగ్గుచూపారు.

సుమారు దశాబ్దకాలం పైగా టైగర్ రొయ్యలు సాగు చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ కి అనుగుణంగా వనామీ రొయ్యలకు మళ్లినట్టు మత్స్యశాఖలో రిటైర్డ్ జాయింట్ డైరక్టర్ ఎ.అమరేందర్ బీబీసీతో అన్నారు.

వరిపంట సాగు జరిగిన ప్రాంతాల్లోనే తొలుత ఆక్వా వచ్చింది. గోదావరి నుంచి నెల్లూరు జిల్లాల వరకూ ఆక్వా ఉత్పత్తులు ఎక్కువగా జరుగుతాయి. అందులో తొలుత పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోనే చేపల ఉత్పత్తి ఎక్కువగా కనిపించింది. చేపలు దాదాపుగా దేశీయ అవసరాలకే వినియోగిస్తారు. నేటికీ ఈశాన్య రాష్ట్రాలకే అత్యధికంగా ఎగుమతులు చేస్తారు. కానీ 1990లలో సరళీకరణ విధానాల మూలంగా అంతర్జాతీయ మార్కెట్లు తెరుచుకున్నాయి. ఫలితంగా రొయ్యలు సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం మొదలయ్యింది. అది క్రమంగా విస్తరిస్తూ 2000 సంవత్సరం తర్వాత వేగవంతమైంది. గడిచిన దశాబ్దకాలంలో దాదాపు రెట్టింపు అయ్యిందని ఆయన వివరించారు.

సరళీకరణ కారణంగా పారిశ్రామిక రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులకు పెరిగిన ఆక్వా సాగు అద్దంపడుతుందని ఆయన బీబీసీతో అన్నారు.

సరళీకరణ విధానాల తర్వాత రొయ్యల సాగు ఊపందుకుంది
ఫొటో క్యాప్షన్, సరళీకరణ విధానాల తర్వాత రొయ్యల సాగు ఊపందుకుంది

కలిసొచ్చిన అంశాలు

''సుదీర్ఘ సముద్ర తీరం ఉండడం ఒక్కటే సానుకూలం కాదు. వాతావరణం, నీటి నాణ్యత కూడా ప్రధానం. అన్నింటికీ మించి ఆక్వా ఉత్పత్తిదారుల్లో సమర్థత కూడా దోహదపడింది. ప్రభుత్వం నుంచి కూడా దానికి తగ్గట్టుగా చేదోడు లభించడంతో రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు విస్తృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రానికి అందని స్థాయికి, విదేశీ మారకద్రవ్యం సాధించడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై విద్యుత్ అందిస్తోంది. యూనిట్ రూ. 1.50 కే అందిస్తున్నాం. ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. సీడ్, ఫీడ్ విషయంలో రాజీ లేకుండా చట్టాలు కూడా రూపొందించాం. ఆక్వా సాగుదారులకు అన్ని రకాలుగా తోడ్పడేలా స్థానిక మార్కెట్ కూడా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది'' అని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు.

దేశంలో ఏపీ కన్నా పలు రాష్ట్రాలు ఆక్వా సాగులో ఒకప్పుడు ముందుండేవి. కానీ ఇటీవల మారిన పరిస్థితుల్లో ఏపీ దూసుకుపోయినట్టుగా పెరిగిన విస్తీర్ణం, జరిగిన ఉత్పత్తి లెక్కలు చెబుతున్నాయి.

కొత్తగా ఆక్వాజోన్లుగా గుర్తించి మరింతగా రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నట్టు కన్నబాబు బీబీసీకి తెలిపారు. కొన్నిచోట్ల వినియోగంలో లేని చెరువులను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే దిశలో ప్రోత్సహకాలు ఇస్తున్నామని వివరించారు.

వీడియో క్యాప్షన్, వల లేకుండా చేపలు పట్టడం ఇంత సులువా

హేచరీలతో ఉపాధి ..

దేశవ్యాప్తంగా వనామీ రొయ్యల ఉత్పత్తులకు అవసరమైన రొయ్య పిల్ల ఏపీ నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఒడిశా, గుజరాత్, తమిళనాడు సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు ఏపీ నుంచి సీడ్ తీసుకెళుతుండడం విశేషం.

రొయ్య సీడ్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం ప్రధాన స్థావరాలుగా ఉన్నాయి. అందులోనూ కాకినాడ తీరానికి సమీపంలో ఉన్న వందల హేచరీల నుంచి నిత్యం సీడ్ తరలిస్తూ ఉంటారు.

రొయ్యల సీడ్ ఉత్పత్తి చేసే హేచరీలలో దాదాపుగా 40వేల మందికి ఉపాధి లభిస్తోంది. అయితే నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే లాభాపేక్షతో మరికొందరు హేచరీ యజమానులు మాత్రం నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి.

''హేచరీ యజమానులకు కూడా చాలా సమస్యలున్నాయి. ముఖ్యంగా సీడ్ ధర స్థిరంగా ఉండదు. ఈ సీజన్లో అతి తక్కువ ధర ఉంది. ఓవైపు అన్ని ధరలు పెరుగుతున్నా సీడ్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. నిర్వహణభారం కారణంగా కొందరు సీడ్ ఉత్పత్తిదారులు నాసిరకంగా చేస్తున్నారు. రైతులు కూడా ధర తక్కువగా వస్తుందనే కారణంతో దళారీలను నమ్ముకుని అలాంటి సీడ్ కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అక్కడ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. హేచరీ యజమానుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి'' అని కాకినాడ సమీపంలో ఓ హేచరీ యజమాని ఎం. రవికాంత్ బీబీసీతో అన్నారు.

ఏపీలో ఆక్వా అభివృద్ధిలో హేచరీల పాత్ర కూడా కీలకమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు.

సీడ్, ఫీడ్ ధరలపై నియంత్రణ అవసరమని రైతులు అంటున్నారు
ఫొటో క్యాప్షన్, సీడ్, ఫీడ్ ధరలపై నియంత్రణ అవసరమని రైతులు అంటున్నారు

‘నాణ్యమైన సీడ్, ఫీడ్ ధరల నియంత్రణ అవసరం’

రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కొంత వెనుకబడిన ఏపీకి ఎగుమతుల్లో ఆక్వా రంగమే ప్రధాన వనరుగా ఉంది.

కొన్ని ఉద్యాన పంటలతో పాటుగా ఆక్వా సాగు ఏపీకి గుర్తింపు లభిస్తోంది.

అయితే ఆక్వా రైతుల్లో అత్యధికులు మాత్రం సంతృప్తిగా లేరని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన గొట్టుముక్కల కల్యాణ్ వర్మ బీబీసీతో అన్నారు.

''మా తండ్రుల కాలంలో చేపల సాగుతో మొదలయ్యింది. ఆ తర్వాత టైగర్ రొయ్య దశ దాటి వనామీ వరకూ వచ్చాము. కానీ చాలామంది రైతులకు సరయిన అవగాహన ఉండడం లేదు.

ఎదుటి వారికి లాభాలు వచ్చాయనే ఆతృతలో నాణ్యమైన సీడ్ విషయంలో ప్రాధాన్యతనివ్వడం లేదు. అది పెట్టుబడి పెట్టిన తర్వాత సవాలక్ష సమస్యలకు కారణం అవుతోంది.

వైరస్ లు వ్యాపించి చేతికందిన దశలో పంట నాశనం అవుతోంది. నష్టాల్లో ముంచుతోంది. . ఫీడ్ ధరల నియంత్రణలో ఉండడం లేదు.

ఆక్వా ఫీడ్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణలోకి వస్తే మేలు జరుగుతుంది'' అన్నారు కల్యాణ్ వర్మ

చెరువుల లీజులు చాలా ఎక్కువగా పెరిగిపోయాయని మహాదేవపట్నానికి చెందిన రైతు వేగేశ్న మహేష్ వర్మ అన్నారు.

లీజులతో పాటుగా మార్కెట్ లో స్థిరత్వం లేకపోవడం కూడా చాలా సమస్య అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వరుస నష్టాలతో కొందరు తవ్విని చెరువులను కూడా ఎందుకూ పనికిరాకుండా వదిలేశారు. అలాంటి వారిని ఆదుకోవాలి అంటూ బీబీసీకి తెలిపారు.

ఆక్వా సాగుతో లాభాలు మంచిదే అయినా, పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు
ఫొటో క్యాప్షన్, ఆక్వా సాగుతో లాభాలు మంచిదే అయినా, పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు

'పర్యావరణ సమస్యలను గుర్తెరగాలి'

''ఆక్వా సాగు కారణంగా తీర ప్రాంతంలో తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. పర్యావరణం దెబ్బతింటోంది.

భూగర్భ జలాలు కూడా ఉప్పుమయం అవుతున్నాయి.

ప్రజల ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతోంది. దీర్ఘకాలంలో ఇది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. రొయ్యల చెరువుల్లో ఉపయోగించే రసాయనాలు కూడా భూసారాన్ని నాశనం చేస్తోంది.

అయినా ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. లాభాలు అర్జిస్తున్న ఆక్వా సాగు ప్రోత్సహిస్తూ పోతే ఎదురయ్యే ఇతర సమస్యలను గమనంలో ఉంచుకోవాలి.

పర్యావరణానికి జరుగుతున్న హాని అదుపుచేసేందుకు ప్రయత్నించాలి. అనుమతుల్లేకుండా తవ్వేస్తున్న చెరువులను తొలగించాలి'' అని పర్యావరణ సమస్యల మీద పనిచేస్తున్న ఎస్.ఎన్. రమేష్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ గోల్డ్ ఫిష్ అమెరికాను భయపెడుతోంది

ఆక్వా సాగు కారణంగా ఎదురవుతున్న తాగునీటి సమస్యలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే వందల గ్రామాల్లో నీరు ఉప్పుమయం కావడంతో పూర్తిగా క్యాన్లతో నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని తెలిపారు.

ఆక్వా సాగు వేగంగా విస్తరిస్తున్న దశలో ఇలాంటి సమస్యలకు కూడా కారణమవుతోంది. ఇప్పటికే వేల ఎకరాల్లో వరి, కొబ్బరి తోటలను తొలగించి, రొయ్యల చెరువులుగా మార్చేశారు.

కొన్ని చోట్ల సముద్రతీరంలో నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారు. మడ అడవులకు కూడా రక్షణ లేకుండా చేస్తున్నారు.

ఇలాంటి వాటిని అదుపుచేయకపోతే వాటి ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దానిని కూడా గమనంలో ఉంచుకోవాలని పలువురు ఆశిస్తున్నారు.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)