పాకిస్తాన్: దాదాపు లక్ష రూపాయలు పలికిన అరుదైన చేప

ఫొటో సోర్స్, PETER KYNE
- రచయిత, రియాజ్ సుహైల్
- హోదా, బీబీసీ ఉర్దూ.కామ్, కరాచీ
పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఇరాన్ సముద్ర సరిహద్దు సమీపంలో మత్స్యకారులకు చాలా అరుదైన రంపపు చేప దొరికింది. పాకిస్తాన్ సముద్ర సరిహద్దులో చాలా అరుదుగా కనిపించే ఈ సాఫిష్ అంతరించిపోయే దశలో ఉంది.
అంతరించిపోతుండటంతో సింధ్, బలూచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు 2016 సంవత్సరం నుండి వీటి వేట, వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించాయి. అయినప్పటికీ ఇప్పటికీ అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు.
''అక్టోబర్ 29న, ఇరాన్‌కు సమీపంలో పాక్‌లోని జివాన్‌లోని గటార్ ప్రాంతంలో మత్స్యకారుల వలలో ఒక రంపపు చేప చిక్కింది. దీనిని స్థానిక మార్కెట్‌లో విక్రయించారు'' అని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) పేర్కొంది.
ఈ ప్రాంతం చాలా దూరంలో ఉందని, పట్టుకున్న చేపల పొడవు లేదా బరువు గురించి ఏమీ చెప్పలేమని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ సలహాదారు మువాజమ్ ఖాన్ పేర్కొన్నారు. అయితే పట్టుకున్న చేపల బరువు 70 నుండి 80 కిలోలు ఉండవచ్చని ఫోటోలను బట్టి తెలుస్తోంది.
2018లో సింధ్ సముద్ర ప్రాంతంలోని కజార్ క్రీక్‌లో సుమారు 15 అడుగుల పొడవైన రంపపు చేప లభ్యమైంది. మృతిచెందిన రంపపు చేపను గుర్తించినట్లు మత్స్యకారులు తెలిపారు. సుమారు 1,320 కిలోల బరువున్న చేపను రూ.90 వేలకు కొనుగోలు చేశారు.

ఫొటో సోర్స్, WWF PAKISTAN
రంపపు చేపలు ఎక్కడ దొరుకుతాయి?
పాకిస్తాన్‌లో సింధ్, బలూచిస్తాన్ సముద్రాలలో రంపపు చేపలు కనిపిస్తాయి.
''ఇవి తీరప్రాంతాల చేపలు, సముద్రంలో ఎక్కువగా బయటకు కనిపించవు. సింధూ డెల్టా వెంబడి ఉన్న బలూచిస్తాన్ ప్రాంతాలైన.. సోన్మియాని, కల్మట్, పస్ని, జీవని, గ్వాదర్‌లు వీటి కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడే ఇవి ఆహారాన్ని పొందుతాయి'' అని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ సలహాదారు మువాజమ్ ఖాన్ తెలిపారు.
"రంపపు చేప చిన్నపిల్ల పరిమాణం రెండు నుండి రెండున్నర అడుగుల వరకు ఉంటుంది. అయితే పెద్ద చేప తలతోపాటూ కొలిస్తే, దాని పొడవు 13 నుండి 14 అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు నుండి ఆరు అడుగుల వరకు రంపంలా ఉండే ముక్కును కలిగి ఉంటుంది. పాకిస్తాన్‌లో మూడు జాతుల రంపపు చేపలను కనుగొన్నారు'' అని మువాజమ్ ఖాన్ పేర్కొన్నారు.
''అతిపెద్ద రంపపు చేప పొడవు ఏడు మీటర్లు లేదా 23 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇవి శరీరం లోపల గుడ్లు పెడతాయి. వీటి వయోజన వయస్సు 10 సంవత్సరాలు. అయితే మొత్తం 25 నుండి 30 సంవత్సరాలు జీవిస్తాయి'' అని ఎన్సైక్లోప్డియా బ్రిటానికా పేర్కొంది.
ప్రతిరోజూ కనీసం రెండు రంపపు చేపలు కనిపించేవి
రంపపు చేపలు పాకిస్తాన్‌లో 70వ దశకంలో పెద్ద సంఖ్యలో లభ్యమయ్యేవి.
బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో కూడా మువాజమ్ ఖాన్ నివసించారు. ఆయన తన యవ్వనంలో కొంత భాగాన్ని పస్నిలో గడిపానని, అక్కడ ప్రతిరోజూ కనీసం ఒకటి నుండి రెండు రంపపు చేపలు కనిపించేవని చెప్పారు.
"ఆ రోజుల్లో ఈ చేపలు విరివిగా దొరికేవి. జీవనీలో రెండు ఇళ్ల సరిహద్దుల నిర్మాణంలో ఈ చేపల దంతాలను వాడారు. వీటిపైన వలను కప్పి ఉంచేవారు. ఇతర ప్రాంతాలలో కూడా, కొన్ని గృహాలకు అలాంటి సరిహద్దులు ఉండేవి"

ఫొటో సోర్స్, PETER KYNE
రంపపు చేపకు అతి పెత్త శత్రువు నైలాన్ వల
ఇండస్ డెల్టా నుండి ఇరాన్ తీరం వరకు, మత్స్యకారులు నైలాన్ వలలను ఉపయోగిస్తారు. దీనిని ముస్కా వల అని కూడా పిలుస్తారు. దీనిని సముద్రపు చేపలను పట్టుకోవడానికి ఉపయోగిస్తారని మువాజమ్ ఖాన్ తెలిపారు.
"రంపపు చేపల విషయంలో విషాదం ఏమిటంటే, దాని తలపై పెద్ద రంపంలాంటి ముక్కు ఉండటం. వీటివల్ల ఇతర చేపల కంటే సులువుగా ఇవి వలలో చిక్కుకుపోతాయి. పత్తితో తయారు చేసిన వలలు వాడినప్పుడు, ఈ చేపలు వాటి తీగలని సులువుగా కత్తిరించేవి. కానీ నైలాన్ వలలు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. రంపపు చేప కత్తిరించలేనంత దృఢంగా వీటిని తయారు చేశారు. దీంతో ఈ జాతి అంతరించిపోవడానికి నైలాన్ వల అతిపెద్ద కారణం అయింది"
కనీసం 20 దేశాల్లో రంపపు చేపలు స్థానికంగా అంతరించిపోయాయని, మరో 43 దేశాల్లో కనీసం ఒక జాతి రంపపు చేపను కోల్పోయాయని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదించింది. వీటిలో అమెరికా కూడా ఉంది. ఇక్కడ 1961 నుండి పెద్ద దంతాల జాతికి చెందిన రంపపు చేపలు కనిపించలేదు.
సైన్స్ అడ్వాన్సెస్ మ్యాగజైన్ ప్రకారం.. ఇప్పుడు రంపపు చేపలు అంతరించిపోయిన దేశాలలో చైనా, ఇరాక్, హైతీ, జపాన్, తైమూర్ లెస్టే, ఎల్ సాల్వడార్, తైవాన్, జిబౌటి, బ్రూనై ఉన్నాయి. అయితే అమెరికా, ఆస్ట్రేలియా రంపపు చేపలకు బలమైన స్థావరాలుగా ఉన్నాయి. ఇక్కడ రంపపు చేపలను రక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, DAVID WACKENFELT
రంపపు చేప ఉపయోగాలు
మువాజమ్ ఖాన్ ప్రకారం.. పాకిస్తాన్‌లో రంపపు చేపల వల్ల ప్రత్యేక ఉపయోగం అంటూ ఏమీ లేదు. దాని మాంసం ఇతర షార్క్ చేపల మాదిరిగానే గుట్టు చప్పుడుకాకుండా అమ్మేస్తుంటారు.
ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీకి చెందిన సముద్ర జీవశాస్త్రవేత్త కోలిన్ సింఫొండోఫర్ నేషనల్ జియోగ్రాఫిక్‌తో మాట్లాడుతూ.. వాటి ఫిన్స్‌కి(రెక్కలు) మార్కెట్‌లో ధర ఎక్కువ. వాటి దంతాలను మధ్య, దక్షిణ అమెరికాలో కొడిపందాలలో ఉపయోగిస్తుంటారు.
రంపపు చేపల రెక్కలు, దంతాలు, మాంసాన్ని.. విడివిడిగా ఆహారానికి లేదా ఔషధ తయారీలో, కొడిపందాలలో ఉపయోగించడానికి కొనుగోలు చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- Hyperemesis: గర్భం దాల్చి వారాలు గడిచినా వాంతులు తగ్గట్లేదు, ఎందుకిలా? వాంతుల వల్ల బిడ్డకు హాని ఉంటుందా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








