విశాఖపట్నం: ఏజెన్సీలో అందని సెల్ సిగ్నల్, బయోమెట్రిక్ కోసం గిరిజనుల కష్టాలు

వెలగపాడులో ఈ చెట్టు దగ్గర సిగ్నల్ అంతరాయం ఉండదని అధికారులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, వెలగపాడులో ఈ చెట్టు దగ్గర సిగ్నల్ అంతరాయం ఉండదని అధికారులు చెబుతున్నారు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

వెలగలపాడు.. విశాఖజిల్లా అనంతగిరి మండలంలోని ఓ ఏజెన్సీ గ్రామం ఇది. ఈ గ్రామంలో కేవలం 30 ఇళ్లు ఉంటాయి. 110 మంది జనాభా ఉంటారు.

అయితే ఈ గ్రామంలోని ఒక చెట్టు దగ్గరకు మాత్రం ప్రతి వారం వందలమంది గిరిజనులు వస్తుంటారు.

ఈ చెట్టును చేరుకోవడానికి దాదాపు 25 గ్రామాల ప్రజలు సగటున 15 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తుంటారు.

ఇదంతా ఆ చెట్టు పరిసరప్రాంతాల్లో ఉండే 'సిగ్నల్' కోసం. అంటే ఇక్కడ తప్ప ఆ ప్రాంతంలో వేరే ఎక్కడా మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా అందవు. దాంతో, ఇక్కడకు వస్తేనే బయోమెట్రిక్ వేయడం సాధ్యమై గిరిజనానికి ప్రభుత్వ పథకాలు దక్కుతున్నాయి.

టెక్నాలజీ ద్వారా ప్రజలకు సౌకర్యాలు అందుతుంటే, విశాఖ ఏజెన్సీలో మాత్రం ఆ టెక్నాలజీ కోసమే గిరిజనం అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వ పథకాలు అందుకునే విషయంలో సెల్ సిగ్నల్ సమస్యను ఎదుర్కొంటున్న ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది.

సిగ్నల్ లేకపోవడం వల్ల కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నది నిజమే అయినా, చాలా గ్రామాల్లో సిగ్నల్ బాగానే వస్తున్నప్పటికీ ప్రభుత్వ సిబ్బంది వారి సౌకర్యం కోసం తమను కష్టపెడుతున్నారని గిరిజనులు చెప్పారు.

ఈ పరిస్థితిని బీబీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లింది.

గిరిజనులతో సిబ్బంది

ఫొటో సోర్స్, BBC/Srinivas

డబ్బులు కావాలంటే రండి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఉపాధి హామీ లాంటి పథకాల కోసం లబ్ధిదారులు తమ ఫోన్ నెంబరు ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. దాని కోసం ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్, ఫిజికల్ వెరిఫికేషన్ ఇలాంటి మొత్తం ప్రక్రియ కోసం ప్రభుత్వ సిబ్బంది చాలాసార్లు లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు.

అయితే, ఇదంతా సవ్యంగా జరగాలంటే నాణ్యమైన నెటెవర్క్ కలిగిన ఇంటర్నెట్, సెల్ సిగ్నల్ ఉండాలి.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సిగ్నలే ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇంకా సెల్ సిగ్నల్ లేకపోవడం ప్రభుత్వ పథకాలు అందుకునే లబ్ధిదారులకు, అందించే సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

సిగ్నల్ ఎక్కడ ఉందో అక్కడికి రావాలని, రాకపోతే మీకు పథకాల ద్వారా అందే డబ్బులు రావని వలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారని పాలబంద గ్రామానికి చెందిన షణ్ముకరావు బీబీసీకి చెప్పారు.

"మీ గ్రామంలో సిగ్నల్ ఉండదు...ఆ సిగ్నల్ వెలగలపాడులో ఉంది. అందుకే అంతా అక్కడికి వస్తే బయోమెట్రిక్ చేసి...డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తాం. మీరు రాకపోతే మీకు పథకాల డబ్బులు రావు. ఈ విషయం గ్రామంలో అందరికీ చెప్పండి అని వలంటీర్, మిగతా ప్రభుత్వ సిబ్బంది అంటారు. అందుకే, వాళ్లు చెప్పిన తేదీకి ఈ చెట్టు దగ్గరకు వస్తాం. నేను ఉపాధి హామీ జాబ్ కార్డు కోసం వచ్చా, అయితే వచ్చే వారం మళ్లీ రమ్మన్నారు. మా ఊరు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు, కొండపైకి ఎక్కాలి. సిబ్బంది ఇలా పదే పదే తిప్పడం మాకు కష్టంగా ఉంది" అన్నారు.

కిక్కిరిసిన జీపుల్లో గిరిజన మహిళల ప్రమాదక ప్రయాణం

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, కిక్కిరిసిన జీపుల్లో గిరిజన మహిళల ప్రమాదక ప్రయాణం

బయోమెట్రిక్ కోసంబండెనక బండికట్టి

ఏజెన్సీలోని కొన్ని గ్రామాలు కొండదిగువన ఉంటే, ఎక్కువ గ్రామాలు కొండలపైనే ఉంటాయి. వీటిలో కొండ చివర్లలో ఉండే గ్రామాలు ఉంటాయి.

వెలగలపాడుకు సిగ్నల్ కోసం వచ్చేవాళ్లలో కొండ దిగువన, కొండపైన ఉండేవారు కూడా ఉంటారు.

చింతపాక, మల్లంపేట, పినకోట, ఆరిమానుగరవు, వీరభ్రదపురం, బల్లగరువు, కొత్తబురగ, పాతబురగ, సిందులపాడు, పరపత్తి, దిబ్బపాలెం లాంటివి కొండ కింది గ్రామాలయితే, కొమ్మంతి, దాయత్తి, రాచకిలం, గుర్రాలబయలు, పీచుమామిడి, కరకవలస, పాలబంద, రెడ్డిపాడు, తట్టపూడి, పందిరిమామిడి వంటివి కొండ పైన ఉంటాయి.

గిరిజనులు

ఫొటో సోర్స్, BBC/Srinivas

వీరంతా బయోమెట్రిక్ వేలిముద్రల కోసం కిక్కిరిన ఆటోలు, వ్యాన్లలో వెలగలపాడుకు వస్తుంటారు. మహిళలు కూడా వాహనాల్లో వేలాడుతూ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తుంటారు.

ప్రభుత్వ పథకాల కోసం ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తుంటామని, కానీ తీరా వచ్చాక అవి లేవు, ఇవి లేవు మళ్లీ తీసుకురండి అంటారని, ఇవన్నీ తమ గ్రామాల్లోనే వచ్చి చేస్తే తమ కష్టాలు తీరిపోతాయని పీచుమామిడికి చెందిన వెంకట సురేఖ బీబీసికి తన బాధ చెప్పుకున్నారు.

"ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మాకు కాస్త ఆసరగా ఉంటున్నాయి. అయితే వాటిని పొందడం కోసం మేం పడే కష్టాలు ఎక్కువైపోతున్నాయి. సిగ్నల్ ఉన్న ఏరియాకు వెళ్లకపోతే డబ్బులు పోతాయని, దూరమైనా అందరం ఆటోలు, వ్యాన్లు పెట్టుకుని వస్తున్నాం. పోనీ పనైతే పర్వాలేదు. కానీ ఏవో కాగితాలు లేవు మళ్లీ తీసుకురండి అంటారు. మా ఊర్లో అయితే అన్నీ ఉంటాయి. ఇంతదూరం వచ్చాక. అవి లేవు, ఇవి లేవంటే ఎలా తెస్తాం? అని ఆవేదన చెందారు.

నడవలేని యువకుడిని డోలీలో మోసుకెళ్తున్న గిరిజనులు

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, నడవలేని యువకుడిని డోలీలో మోసుకెళ్తున్న గిరిజనులు

డోలీల్లో వృద్ధులు, రోగులు

పథకాలు అందుకోవాలంటే బయోమెట్రిక్ వేలిముద్రలు, ఓటీపీలు తప్పనిసరి అయ్యాయి. ఇవి లేకపోతే పథకాలు లబ్ధిదారులకు అందవు. దీంతో బయోమెట్రిక్ కోసం దూరాలైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్రయాణాలు పిల్లల తల్లులకు, వృద్ధులు, వికలాంగులకు కష్టంగా మారుతున్నాయి.

పిల్లల తల్లులు తమ బిడ్లలతోనే కిక్కిరిసిన వాహనాల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది.

ఇక వృద్ధులు, వికలాంగులు అయితే నరకం అనుభవిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారిని డోలీ కట్టుకుని తీసుకొస్తున్నారు.

చండి బిడ్డతో నడిచి వెళ్తున్న తల్లి

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఆ డోలీల్లోనే వారిని సిగ్నల్ ఉన్న చోటుకు మోసుకెళ్లి వారి వేలి ముద్రలు వేయించి పెన్షన్లు, ఇతర పథకాలు అందుకుంటున్నారు.

కొందరు ప్రభుత్వ సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాంలోకి ఈ మాత్రం దూరం రావడంమే గొప్ప అని అంటున్నారని గిరిజనులు చెప్పారు.

దాదాపు ఏజెన్సీల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పథకాల లబ్ధి పొందాలన్నా, ఆధార్ అనుసంధానం చేయాలన్నా, ఆఖరి రేషన్ పొందాలన్నా గిరిజనులు అన్నింటికి ఇబ్బందులు పడాల్సిందే.

ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల రోడ్డు పౌకర్యం లేని గ్రామాలే ఎక్కువ. దీంతో ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చే వారు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంటిపిల్లలతో రాకపోకలు చాలా కష్టంగా ఉంటోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పథకాల కోసం పడిగాపులు

ఫొటో సోర్స్, BBC/Srinivas

సిగ్నల్ ఉంది...సిబ్బంది రావాలి...

ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో సెల్ టవర్లు లేకపోవడం, సెల్ టవర్లు ఉన్న కొన్ని గ్రామాల్లో నాణ్యమైన సిగ్నల్ అందకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి.

అయితే, పూర్తిగా సెల్ సిగ్నల్ ఉన్న గ్రామాలకు కూడా ప్రభుత్వ సిబ్బంది రావడం లేదని కొన్ని గ్రామాల గిరిజనులు చెప్తున్నారు.

కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడక్కడా నెట్ వర్క్ సమస్యలు ఉన్నా... సమస్యలేని గ్రామాలకు కూడా వెళ్లని ప్రభుత్వ సిబ్బంది గిరిజనుల్నే తాము చెప్పిన చోటుకు రప్పించుకుంటున్నారు.

ఏజెన్సీలోని కొండ దిగువ ప్రాంతాల కంటే...కొండపైకి వెళ్లే కొద్దీ వచ్చే గ్రామాలు, కొండపైన ఉన్న గ్రామాలకు సిగ్నల్ సమస్య దాదాపు లేదు.

అయినా కూడా, అక్కడి ప్రజలు బయోమెట్రిక్ కోసం ప్రభుత్వ సిబ్బంది చెప్పిన చోటుకు వెళ్లాల్సి వస్తోంది. మా ఊర్లో సిగ్నల్ ఉంది. అక్కడికే రావాలంటూ గిరిజనులు చాలా చోట్ల అందోళనలు చేపట్టారు.

బయోమెట్రిక్ వేలిముద్ర వేస్తున్న గిరిజన మహిళ

ఫొటో సోర్స్, BBC/Srinivas

దాయర్తి గ్రామానికి చెందిన సుధాకర్ రావు సిగ్నల్ ఉన్నప్పటికీ తమ గ్రామంలోని వంద మందికి పైగా చార్జీలు పెట్టుకుని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని బీబీసీకి చెప్పారు.

"పథకాల కోసం మా గ్రామంలో 150 మంది కిందకు రావాల్సి వస్తుంది. అయితే మా గ్రామంలో సిగ్నల్ ఉంది. అయినా కూడా సిబ్బంది రావడం లేదు. ఒకరో, ఇద్దరో సిబ్బంది మా గ్రామానికి వస్తే సరిపోయేదానికి...మేం వందమందికి పైగా ఇక్కడికి రావాల్సి వస్తోంది. సిగ్నల్ ఉన్నా మేం ఇంత దూర ప్రయాణాలు చేయడం, ఛార్జీలు పెట్టుకుని కిందకు రావడం ఎందుకో అర్థం కావడం లేదు" అన్నారు.

చుట్టుపక్కల గ్రామాల్లో వెలగలపాడులో మాత్రమే సిగ్నల్ ఉంటుందని, మిగతా చోట్ల సిగ్నల్ లేదని ఉపాధి హామీ పథకం సిబ్బంది బీబీసీకి చెప్పారు.

సిగ్నల్ వస్తుంది కాబట్టే అక్కడికి రమ్మని చెప్తున్నామని, నాణ్యమైన ఇంటర్నెట్ లేకుండా డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయడం, బయోమెట్రిక్‌కు వేలి ముద్రలు తీసుకోవడం కుదరడం లేదని అంటున్నారు. వెలగపాడు దగ్గర నెట్‌వర్క్ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఫుల్‌గా ఉంటుందని తెలిపారు.

అధికారులు రమ్మన్న ప్రాంతాలకు తరలివెళ్తున్న గిరిజనులు

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, అధికారులు రమ్మన్న ప్రాంతాలకు తరలివెళ్తున్న గిరిజనులు

టూరిజానికి టవర్లు...గిరిజనానికి కష్టాలు...

ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అది తగ్గించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది.

అందులో భాగంగానే విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో 150 సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా విశాఖ ఏజెన్సీలోని చాలా చోట్ల సెల్ టవర్లు ఏర్పాటు చేశారు.

అయితే, ఇవన్నీ ప్రజల కోసం కాకుండా, టూరిజం దృష్టిలో పెట్టుకుని వేసినట్లుగా ఉందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

"అనంతగిరి మండంలో సెల్ సిగ్నల్ సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలకు సమీపంలో చోడవరం, దేవరాపల్లి మండలాల్లో సెల్ టవర్లు ఉన్నాయి. వీటి సిగ్నల్ కొన్ని గ్రామాలకు అందుతుంది. మిగతావి వాటి పరిధిలో లేవు. అందుకే సెల్ సమస్య ఉన్న గ్రామాల్లో సచివాలయం పరిధిలోనే సెల్ టవర్లు నిర్మించి, అక్కడే ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ చేయాలి. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెల్ టవర్లను టూరిజానికి ఊతమిచ్చే విధంగా అరుకు, తైడా, డముకు, కాశీపట్నం లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లోని కొన్ని టవర్లను నక్సల్స్ ధ్వంసం చేశారు. కారణం ఏదైనా ఇప్పుడు గిరిజనులు సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు" అని గిరిజన సంఘం నాయకులు కిల్లో రాము అన్నారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, BBC/Srinivas

లబ్ధిదారుల దగ్గరకే సిబ్బంది: పీవో

పథకాలు పొందడానికి, గిరిజనులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను, అలాగే సిగ్నల్ ఉన్న ప్రాంతాలకు కూడా ప్రభుత్వ సిబ్బంది వెళ్లడంలేదనే అంశాలను బీబీసీ ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ దృష్టికి తీసుకుని వెళ్లింది.

స్పందించిన ఆయన అలాంటి సమస్యలు పరిష్కరించడానికే తాము మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

"సెల్ సిగ్నల్స్, నెట్ వర్క్ సమస్యలు ఉన్న మాట నిజమే. దాని కోసం మేం మండలానికి ఒకటి చొప్పున 11 మెబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి అక్కడ వారి వేలిముద్రలు, ఇతర సమాచారం సేకరిస్తుంది. వీటికి సిగ్నల్‌తో పని లేదు. ఆఫ్ లైన్ మోడ్‌లో పనిచేస్తాయి. వాటిని తర్వాత అన్లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సిగ్నల్ సమస్యలున్న ప్రాంతాల్లో టవర్ల నిర్మాణానికి బీఎస్ఎన్ఎల్, జియో సంస్థలతో మాట్లాడాం. బ్యాంక్ అకౌంట్లు తీసుకునే విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే సంచార బ్యాంక్ వాహనాల ద్వారా గ్రామాల్లోకి వెళ్లి అక్కడే అకౌంట్లు కూడా ఓపెన్ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాం" అన్నారు.

సిగ్నల్ ఉన్నా గ్రామాలకు వెళ్లకుండా గిరిజనులను ఇబ్బందిపెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ తెలిపారు.

"సిగ్నల్ కోసం ప్రజలందరినీ ఒక చోటుకు రమ్మని చెప్పాలని సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు లేవు. అలాగే సిగ్నల్ లేవనే కారణం చెప్పి అక్కడి వారిని, వేరే ప్రాంతానికి రమ్మని చెప్పడం సరికాదు. సిగ్నల్ ఉన్న గ్రామాలు, దూరంగా ఉన్నాయని, కొండలపై ఉన్నాయని సిబ్బంది వెళ్లడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. వారిపై చర్యలు తీసుకుంటాం. మెబైల్ ఆధార్ కేంద్రాలను వినియోగించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రక్రియను ఆయా గ్రామాల్లోనే పూర్తి చేసేలా చూస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)