డ్రైవింగ్ లైసెన్స్: ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండా లైసెన్స్ తీసుకోవచ్చా? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి

డ్రైవింగ్ లైసెన్స్: కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్’’కు కేంద్రం ఇటీవల సవరణలు చేసింది.
    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లైసెన్స్ నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

‘‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్’’కు సవరణ చేస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి వచ్చాయి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం మనం స్థానిక రవాణా శాఖ ఆఫీసుల(ఆర్‌టీవో) చుట్టూ తిరిగే ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

మరోవైపు స్థానిక ఆర్‌టీవో అధికారుల సమక్షంలో ఇకపై టెస్టు డ్రైవింగ్ ‘‘తప్పనిసరి కాదు’’అని నిబంధనల్లో పేర్కొన్నారు. దీనికి బదులుగా ఫామ్ 5బీని తెరపైకి తీసుకొచ్చారు.

డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇంధనాన్ని పొదుపుచేసే డ్రైవింగ్ విధానాలను నేర్పించడం కూడా శిక్షణలో భాగం చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసంఆర్‌టీవో చుట్టూ తిరిగే బాధను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త నిబంధనలతో ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

కొత్త నిబంధనలు ఏమిటి?

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని రూల్ నంబరు 14లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది ఉంటుంది. లెర్నర్స్ లైసెన్స్, గుర్తింపు పొందిన లైసెన్స్ స్కూల్ నుంచి ధ్రువపత్రం లాంటివి తప్పనిసరని దీనిలో పేర్కొన్నారు.

ఈ ధ్రువపత్రాలు తీసుకొచ్చిన తర్వాత, స్థానిక ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారి ముందు డ్రైవింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మనకు లైసెన్సు జారీ చేస్తారు. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు అన్నింటికీ ఇదే ప్రక్రియను ప్రస్తుతం అనుసరిస్తున్నారు.

అయితే, తాజాగా అధికారుల ముందు డ్రైవింగ్ తప్పనిసరనే నిబంధనను తొలగించారు. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు నిచ్చిన ‘‘డ్రైవింగ్ స్కూళ్ల’’లోనే డ్రైవింగ్ పరీక్షలు పూర్తి చేసుకొని ఫామ్ 5బీని తీసుకొస్తే చాలు.

అంటే మనం డ్రైవింగ్ నేర్చుకున్న స్కూల్‌లోనే అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్లను ఆర్టీవో కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

అయితే ,దీని కోసం డ్రైవింగ్ స్కూల్స్ ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

‌డ్రైవింగ్ స్కూళ్లకు ఇలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైనట్లు రాష్ట్ర రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాద్ రావు చెప్పారు.

మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి లైసెన్సుల కోసం ఏ డ్రైవింగ్ సంస్థా తమ దగ్గరకు రాలేదని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం టెస్ట్ డ్రైవింగ్ తప్పని సరి కాదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త నిబంధనల ప్రకారం టెస్ట్ డ్రైవింగ్ తప్పని సరి కాదు.

డ్రైవింగ్ స్కూల్స్‌కు నిబంధనలు ఏమిటి?

ఫామ్ 5బీ జారీ చేసేలా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందేందుకు డ్రైవింగ్ సంస్థలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించారు.

ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, తేలికపాటి వాహనాలు నడిపేందుకు శిక్షణ ఇచ్చే సంస్థలకు ట్రైనింగ్ కోసం కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలి. ద్విచక్ర వాహనాలు, చిన్న వ్యాన్‌లు తేలికపాటి వాహనాల కిందకు వస్తాయి.

అదే పెద్ద వాహనాల డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చే సంస్థలకైతే రెండు ఎకరాల స్థలం తప్పనిసరి.

డ్రైవింగ్ పాఠాలు చెప్పేవారు కూడా కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి.

నగరాల్లో ఎకరం, రెండెకరాల స్థలాన్ని ట్రైనింగ్ కోసం కేటాయించడం తమలాంటి చిన్న సంస్థలకు చాలా కష్టమని హైదరాబాద్‌కు చెందిన ఎలీట్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత రాజేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇంధనాన్ని పొదుపు చేసే డ్రైవింగ్ విధానాలను నేర్పించడం కూడా శిక్షణలో భాగం చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇంధనాన్ని పొదుపు చేసే డ్రైవింగ్ విధానాలను నేర్పించడం కూడా శిక్షణలో భాగం చేశారు

శిక్షణలో అవి తప్పనిసరి..

డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చే విధానంలోనూ ఇప్పుడు మార్పులు తీసుకొచ్చారు. డ్రైవింగ్ పాఠాల కోర్సు నాలుగు వారాల వ్యవధిలో 29 గంటలకు పైనే ఉండాలి.

ఈ కోర్సును రెండు భాగాలుగా విభజించాలి. మొదటిది ప్రాక్టికల్స్, రెండోది థియరీ.

ప్రాక్టికల్స్‌లో భాగంగా కనీసం 21 గంటలపాటు డ్రైవింగ్‌పై మౌలిక అంశాల గురించి చెప్పాలి. దీనిలో నాలుగు గంటలు సిమ్యులేటరపై లెర్నింగ్ కోసం కేటాయించాలి.

అంటే వర్షం పడినప్పుడు, పొగ మంచు ఎదురైనప్పుడు, రాత్రి పూట ఎలా డ్రైవింగ్ చేయాలో సిమ్యులేటర్‌పై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

థియరీ పార్ట్ కనీసం 8 గంటలు ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి? లాంటి నిబంధనలను థియరీలో నేర్పిస్తారు. అయితే ఇంధనం ఆదాపై పాఠాలు కూడా చెప్పేలా కొత్తగా మార్పులు తీసుకొచ్చారు.

అదే భారీ వాహనాల విషయానికి వస్తే 38 గంటలకుపైనే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో 17 గంటలు థియరీ కాగా.. 21 గంటలు ప్రాక్టికల్స్ ఉండాలి. దీనిలో మూడు గంటలు సిమ్యులేటర్‌పై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

‘‘నాలుగు చక్రాల వాహనాల సిమ్యులేటర్ వ్యవస్థలు కొనుగోలు చేయాలంటే రూ.6 లక్షలకుపైనే ఖర్చు అవుతుంది. అంత పెద్దపెద్ద మొత్తం సమకూర్చుకోవడం చిన్న చిన్న డైవింగ్ స్కూల్స్‌కు చాలా కష్టం’’అని రాజేశ్ రెడ్డి చెప్పారు.

డ్రైవింగ్ నేర్చుకున్న స్కూల్‌లోనే అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్లను ఆర్టీవోలో సమర్పిస్తే సరిపోతుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రైవింగ్ నేర్చుకున్న స్కూల్‌లోనే అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్లను ఆర్టీవోలో సమర్పిస్తే సరిపోతుంది

అవి సమకూర్చుకోవాలి..

కేంద్రం సూచించిన నిబంధనలు పాటిస్తూ ఎవరైనా డ్రైవింగ్ కేంద్రాలు పెట్టొచ్చు. అదనంగా గుర్తింపు కోసం రాష్ట్ర రవాణా శాఖకు రూ.50,000ను రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు ట్రైనింగ్ ఇచ్చే వాహనాల కోసం సరిపడా పార్కింగ్ స్థలాన్ని కూడా ట్రైనింగ్ కేంద్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

మల్టీమీడియా ప్రొజెక్టర్, కంప్యూటర్లు లాంటి సదుపాయాలు కలిగిన రెండు తరగతి గదులను ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ విధానాలు, ప్రథమ చికిత్స లాంటివి నేర్పేందుకు ఇవి ఉపయోగపడతాయి.

అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక డ్రైవింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. రివర్స్ డ్రైవింగ్, స్లోప్ డ్రైవింగ్ వంటి అంశాలపై కూడా శిక్షణ ఇచ్చేలా ఇవి ఉండాలి.

మరోవైపు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని కూడా కేంద్రాలు అనుసరించాలి. దీని వల్ల ఒకరికి బదులు వేరొకరు శిక్షణలో కూర్చోకుండా అడ్డుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

ఈ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతుంటారు. అన్ని నిబంధనల ప్రకారమే నడిపిస్తున్నామని చెప్పే రికార్డులను ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అనుసరించకపోతే, గుర్తింపును రద్దుచేసే ముప్పుంటుంది.

డ్రైవింగ్ స్కూళ్లకు ఇలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రైవింగ్ స్కూళ్లకు ఇలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది.

అన్నీ సవ్యంగా ఉంటే అనుమతి

‘‘ఇప్పటి వరకు మన దగ్గర ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్లు లేవు. అయితే ఇటీవల కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవింగ్ స్కూల్ మా దగ్గరకు వచ్చింది. తమ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సదుపాయాలు ఉన్నాయని, పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరింది. వారి దగ్గర ఏం సదుపాయాలు ఉన్నాయి? ఎలా శిక్షణ ఇస్తున్నారు? లాంటి అంశాలను పరిశీలిస్తున్నాం’’అని ప్రసాద్ రావు చెప్పారు.

‘‘అన్నీ సవ్యంగా ఉంటే, లెర్నర్ లైసెన్స్‌తోపాటు రెగ్యులర్ లెసెన్సులకు పరీక్షలు నిర్వహించే అనుమతులు వారికి జారీచేస్తాం. నెమ్మదిగా మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశముంది.’’

‘‘ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ట్రైనింగ్ స్కూళ్లు దాదాపుగా లేవు. కొత్త స్కూల్స్ వచ్చే వరకు... ఎప్పటిలానే ఆర్టీవో ఆఫీసుకు రావాల్సి ఉంటుంది’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆర్టీవో అధికారుల ఎదుట వాహనం నడపకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)