కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు ఎలా సిద్ధమవుతున్నాయి

కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచమంతా సన్నాహాలు చేస్తోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచమంతా సన్నాహాలు చేస్తోంది
    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ముఖ్యంగా ఆక్సిజన్ అందుబాటుపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. భారీ ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వలను సిద్ధం చేస్తున్నారు.

మూడో వేవ్ కోసం ఇప్పటి వరకూ 12,187 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో రూ.10 వేల డి -టైప్‌ సిలెండర్లు ఆర్డరు ఇచ్చారు.

రూ.267 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.

రాష్ట్రంలో 28 చోట్ల పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం మంజూరు చేయగా, ఏపీ సొంతంగా 113 ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.111 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మూడు చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ నిల్వల ఏర్పాట్లు చేస్తున్నారు. వందకు పైగా పడకలతో కూడిన 39 ఆసుపత్రుల్లో అదనంగా 10 కిలో లీటర్ల ఆక్సిజన్‌ నిల్వలు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

అన్ని జిల్లాల్లో రూ. 49 కోట్ల వ్యయంతో 6,151 అదనపు ఆక్సిజన్ బెడ్లను మూడు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

డీజీ సెట్లకు రూ.36 కోట్లు, ట్రాన్స్ ఫార్మర్లకు రూ.58 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలలో కూడా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

థర్డ్ వేవ్‌కు సన్నద్ధతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు

ఫొటో సోర్స్, YSRCONGRESSPARTY

ఫొటో క్యాప్షన్, థర్డ్ వేవ్‌కు సన్నద్ధతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు

ముఖ్యమంత్రి సమీక్ష

జూన్ 16న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై కరోనా పరిస్థితిని సమీక్షించారు. గ్రామాల్లో జ్వర సర్వే, కోవిడ్ లక్షణాలున్న వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆక్సిజన్ తరువాత, ప్రముఖంగా చిన్న పిల్లల వైద్యంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. దీనిపై జూన్ 16న ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఒక వేళ మూడో వేవ్ వస్తే దానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

పిల్లలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పిల్లల చికిత్సలో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లల వైద్యంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది.

‘‘రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక పిడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా పిడియాట్రిక్స్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అవి పెద్ద వారి బెడ్స్ కన్నా కాస్త వేరుగా ఉంటాయి.

పిడియాట్రిక్ ఐసీయూలు (పీఐసీయూ) , వెంటిలేటర్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాం’’ అని ఏపీ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీత బీబీసీతో చెప్పారు.

థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉండటంతో ఆసుపత్రులతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉండటంతో ఆసుపత్రులతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో లెక్కలు తీశామని, సరిపోకపోతే రిక్రూట్ చేస్తామని గీత తెలిపారు.

‘‘మేం మూడో వేవ్ కోసం నాలుగు విధాలుగా సన్నద్ధం అవుతున్నాం. ఒకటి బెడ్స్, రెండు ఎక్విప్మెంట్, మూడు హ్యూమన్ రిసోర్స్, నాలుగు డాక్టర్లు. ఇలా అన్నీ సిద్ధం చేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లలకు చిన్న మార్పులు చేసి పిల్లలకూ వాడవచ్చని తెలిసింది. ఆ ఏర్పాట్లూ చేస్తున్నాం’’ అంటూ వివరించారు డాక్టర్ గీత.

కాగా, ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోటి మందికి పైగా మొదటి డోసు అందించగా, సుమారు 30 లక్షల మందికి రెండో డోసు వేశారు.

ఒక్కరోజులో అత్యధిక వ్యాక్సీన్లు వేసిన ప్రాంతాల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో రెండు ఏపీవే ఉన్నాయి. ఇక తెలంగాణలో కూడా మొదటి డోసు వేయించుకున్నవారి సంఖ్య కోటి దాటింది.

మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహాలే కాక, తెలంగాణలో వైద్యరంగం రూపు రేఖలే మారుస్తామని తెలంగాణ సర్కారు అంటోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహాలే కాక, తెలంగాణలో వైద్యరంగం రూపు రేఖలే మారుస్తామని తెలంగాణ సర్కారు అంటోంది

తెలంగాణలో ఏం జరుగుతోంది?

కరోనా మూడవ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహాలే కాక, తెలంగాణలో వైద్యరంగం రూపు రేఖలే త్వరలో మార్చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

వైద్య వసతుల గురించి జూన్ 8న జరిగిన కేబినెట్ మీటింగులో విస్తృతంగా చర్చించారు. భారీ ఎత్తు వైద్య రంగ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు ప్రకటించారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 19 చోట్ల ప్రభుత్వ డయగ్నస్టిక్ ల్యాబ్‌లు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

‘‘కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత, థర్డ్ వేవ్ రానుందనే వార్తల నేపథ్యంలో, పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని.. అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, మందులను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించినట్లు’’ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

పిల్లల కోసం ఆసుపత్రులలో వసతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పిల్లల కోసం ఆసుపత్రులలో వసతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ వైద్య రంగ స్థితిగతుల పరిశీలనకు ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది.

దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న శ్రీలంకకు కూడా వెళ్లి ఈ బృందం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

అయితే, కోవిడ్ మరో వేవ్ వస్తే, ఎదుర్కోవడానికి ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక సమాచారం అందలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)