పోలవరం గ్రౌండ్‌రిపోర్ట్: ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోందా, లేదా? పనుల్లో అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?

పోలవరం ప్రాజెక్ట్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జీవ‌నాడిగా చెప్పుకొనే పోల‌వ‌రం ప్రాజెక్ట్ సుదీర్ఘ‌కాలంగా పెండింగ్ లో ఉంది. ప్రభుత్వాలు గడువులు పొడిగించుకుంటూ వస్తున్నాయి. ప్రాజెక్టు ఎప్పుడు పూర్త‌వుతుందనే స్ప‌ష్ట‌త మాత్రం రావడం లేదు.

2021 నాటికి పూర్తిచేస్తామ‌ని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో పోలవరం పనుల తీరును తెలుసుకొనేందుకు ప్రాజెక్ట్ ప్రాంతంలో బీబీసీ పర్యటించి అందిస్తున్న సవివర కథనం ఇది.

జగన్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోయింది. వివిధ కార‌ణాల‌తో తొలి ఐదు నెలలు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఆగస్ట్ నుంచి అక్టోబరు వరకు మూడుసార్లు గోదావరి వరద జలాలతో నిండిపోయింది.

నవంబరు 2న పనులు తిరిగి మొదలయ్యాక గత మూడు నెలల్లో ఏ మేరకు జరిగాయన్నది ప్ర‌భుత్వం ఈ నెల 4న సుప్రీంకోర్టుకు సమర్పించిన స్థాయీ నివేదిక చెబుతోంది.

అడ్డగీత
News image
అడ్డగీత

స్థాయీ నివేదిక ప్రకారం- స్పిల్ వే, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ ప‌నులు 1,013.39 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మేర పూర్త‌య్యాయి. అవే ప‌నులు 2019 ఏప్రిల్ నాటికి 989.16 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్లు జ‌రిగాయి. ఏప్రిల్ తర్వాత అదనంగా 24 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌నులే జరిగాయి. ఈ గణాంకాలు ఈ ప‌నులు మందకొడిగా సాగుతున్నాయ‌నే విపక్షాల వాద‌న‌ను బలపరుస్తున్నాయి. స్పిల్ వే కాంక్రీట్ ప‌నుల్లో ఎన్నిక‌ల నాటికి 30.43 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌ని పూర్త‌య్యింది. స్థాయీ నివేదిక ప్రకారం- ఈ ప‌నులు 30.75 ల‌క్ష‌ల క్యూబిక్ మీటర్ల వరకు జ‌రిగాయి. కాంక్రీట్ ప‌నులూ అదే తీరున సాగుతున్న‌ట్టు కనిపిస్తోంది.

ఎర్త్-క‌మ్-రాక్-ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది ప‌నుల్లోనూ పెద్ద పురోగతి లేదు.

పునరావాసం విషయానికి వస్తే- ఎన్నిక‌ల త‌ర్వాత కొత్త‌గా ఎన్ని కుటుంబాలకు పునరావాసం కల్పించారనేది అధికారిక లెక్కల్లో లేదు.

పోలవరం ప్రాజెక్ట్

పనులపై ఏప్రిల్లో చంద్రబాబు ఏం చెప్పారు?

పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల‌ను 2019 ఎన్నిక‌ల‌కు ముందు అప్పటి ప్రభుత్వం వేగవంతం చేసిన‌ట్టు క‌నిపించింది. కాఫర్ డ్యామ్, డ‌యాఫ్రం వాల్, స్పిల్ వే లాంటి ప‌నులు చేపట్టిన‌ట్టు నాటి ప్ర‌భుత్వం చెప్పింది.

2019 ఏప్రిల్ నాటికి మొత్తం ప‌నుల్లో 69 శాతం పూర్త‌యిన‌ట్టు నాటి ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. సిమెంట్ కాంక్రీట్ ప‌నుల్లో 72.4 శాతం పూర్త‌య్యాయని చెప్పారు. "1,169.56 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల సిమెంట్ ప‌నుల‌కు గాను 989.16 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌ని పూర్త‌యింది. రేడియ‌ల్ గేట్స్ ఫాబ్రికేష‌న్ వ‌ర్క్స్ 66.22 శాతం జరిగాయి. ఎగువ కాఫ‌ర్ డ్యామ్ 40.71 శాతం, దిగువ కాఫ‌ర్ డ్యామ్ 25.01 శాతం పూర్తయ్యాయి" అన్నారు.

స్పిల్ వే, అప్రోచ్ చానల్, పైల‌ట్ చానల్, ఇత‌ర ప‌నుల్లో కూడా 3.43 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌ని పూర్తి చేసిన‌ట్టు పోలింగ్ తర్వాత 2019 ఏప్రిల్ 16న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో ఆయన వివ‌రించారు.

పోలవరం

రివ‌ర్స్ టెండ‌రింగ్: మారిన కాంట్రాక్టర్

మేలో ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి జరిగాక ప్రభుత్వ ప్రాథమ్యాల్లో మార్పు వచ్చింది.

చంద్ర‌బాబు హ‌యాంలో ట్రాన్స్‌ట్రాయ్ ప్ర‌ధాన కాంట్రాక్ట్ సంస్థ‌గా ప‌నులు సాగించింది. ఆ త‌ర్వాత న‌వ‌యుగ లాంటి సంస్థ‌లు ప‌నుల్లో భాగ‌స్వాముల‌య్యాయి. జగన్ ప్ర‌భుత్వం పోల‌వ‌రం విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు మొగ్గు చూపింది. ఈ విధానంలో 12.6 శాతం త‌క్కువ‌కే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ సంస్థ‌కు కాంట్రాక్ట్ అప్ప‌గించిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో రూ.628 కోట్లు ఆదా చేశామ‌ని చెప్పింది.

రివ‌ర్స్ టెండ‌రింగ్‌పై న‌వ‌యుగ సంస్థ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. మేఘా కంపెనీ ప‌నులు చేప‌ట్టేందుకు 2019 న‌వంబ‌ర్ 1న హైకోర్ట్ అనుమతించింది. రూ.4,358 కోట్ల‌కు కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న మేఘా సంస్థ న‌వంబ‌ర్ 2న భూమిపూజ‌ చేసి, ప‌నులను తిరిగి మొదలుపెట్టింది.

తర్వాత ఏపీ సాగునీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, పోల‌వ‌రం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు, ముఖ్యమంత్రి జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌నుల‌ను ప‌రిశీలించారు. అధికారుల‌తో స‌మీక్షలు నిర్వ‌హించారు.

పోలవరం

నిధుల సంగ‌తి?

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి వ్య‌యాన్ని భ‌రించేందుకు కేంద్రం అంగీక‌రించింది.

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) నుంచి రుణం తీసుకుని ఏపీ ప్ర‌భుత్వానికి అందించ‌డానికి కేంద్ర జ‌ల‌వ‌న‌రుల సంస్థ‌, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదిరింది. 2010-11 నాటి నిర్మాణ వ్య‌యం అంచ‌నాల ప్ర‌కారం కేంద్రం పూర్తిగా చెల్లించేందుకు అంగీక‌రించింది. అందుకు ఏపీ ప్ర‌భుత్వం వ్య‌యం చేసిన రూ.5,800 కోట్ల‌ను కేంద్రం తిరిగి చెల్లించాల్సి ఉంది. అందులో రూ.1,850 కోట్లు చెల్లించేందుకు ఇటీవ‌ల ఆదేశాలు ఇచ్చింది. నిధులు ఇప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వానికి అందలేదు.

ప్రాజెక్ట్ నిర్మాణం తొలి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తి కాక‌పోవ‌డం, 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌డంతో అంచ‌నాలను స‌వ‌రించాల్సి వ‌చ్చింది. పోల‌వ‌రం నిర్మాణ వ్య‌యాన్ని రూ. 55,548.87 కోట్లుగా నిర్ధరించారు.

ప్రాజెక్టు సవివర నివేదిక(డీపీఆర్)-2కి పోల‌వ‌రం టెక్నిక‌ల్ అడ్వైజరీ క‌మిటీ అంగీకారం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉంది. కేంద్ర కేబినెట్ ఆమోదమూ ల‌భిస్తే రూ. 34,489 కోట్లు ఇంకా ఖ‌ర్చు చేయాల్సి ఉన్నందున ఆ నిధుల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అందులో అత్య‌ధికం పున‌రావాసం కింద ముంపు బాధితుల‌కు చెల్లించాల్సి ఉంటుంది.

పోలవరం ప్రాజెక్ట్ బోర్డు

పవర్ స్టేషన్ పనులు తదుపరి దశలో చేపడతాం: ఎస్‌ఈ

ప‌నులు తిరిగి ప్రారంభించి మూడు నెల‌ల‌వుతున్నా వేగం పుంజుకున్నట్టు క‌నిపించ‌డం లేదు. మేఘా సంస్థ ప్ర‌స్తుతం స్పిల్ వే ప‌నుల‌ను చేప‌ట్టింది. స్పిల్ వే కాంక్రీట్ వ‌ర్క్, స్పిల్ చానల్ డీవాట‌రింగ్ ప‌నులు సాగిస్తోంది.

కాఫ‌ర్ డ్యామ్ ప‌నులూ జ‌రుగుతున్నాయ‌ని పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఎస్‌ఈ ఎం.నాగిరెడ్డి బీబీసీకి తెలిపారు.

"ప్రాజెక్టు ఎర్త్ వర్క్ దాదాపు పూర్త‌య్యింది. స్పిల్ వే కాంక్రీట్ వ‌ర్క్ 20 శాతం మిగిలి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం పూర్త‌వుతుంది. ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. జూన్ నాటికి వ‌ర‌ద‌లు వ‌స్తాయి కాబ‌ట్టి కాఫర్ డ్యామ్ ప‌నులు పూర్తి చేసి నీటిని స్పిల్ వే మీదుగా మ‌ళ్లించేందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాం. ప‌నులు దానికి అనుగుణంగానే జ‌రుగుతున్నాయి. వ‌చ్చే సీజ‌న్ లో కాలువ‌ల ద్వారా నీటిని అందించేందుకు ఆటంకాలు లేకుండా చూస్తున్నాం" అని ఆయన చెప్పారు.

కేంద్ర బృందాలు ప‌నుల తీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాయని, నిధుల విడుద‌ల‌కు కూడా అంగీక‌రించ‌డంతో పోల‌వ‌రంలో జాప్యం ఉండ‌దని, అందుకు అనుగుణంగా పున‌రావాసం కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.

ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నులు మాత్రం త‌దుప‌రి ద‌శ‌లో చేప‌డ‌తామని ఆయ‌న పేర్కొన్నారు.

పోలవరం నిర్మాణం

పారదర్శకంగా చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తాం: మంత్రి అనిల్

పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టిన ప‌నులను స‌కాలంలో పూర్తి చేస్తామ‌ని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ బీబీసీతో చెప్పారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్ట్ లో ప‌నుల క‌న్నా ప్ర‌చారం ఎక్కువ చేసిందని ఆయన ఆరోపించారు. ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని చెప్పారని, అందుకే వాటిని సరిదిద్ది రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా ప‌నులు అప్ప‌గించామని, ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాకుండా నివారించామని మంత్రి అన్నారు.

2021 జూన్ నాటికి స్పిల్ వే పూర్త‌వుతుందని అనిల్ చెప్పారు. "2.17 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌నులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తాం. దానికి త‌గ్గ‌ట్టుగా పున‌రావాసం మీద దృష్టి పెట్టాం. తొలిద‌శ‌లో 100 గ్రామాల ప్ర‌జ‌ల‌కు పున‌రావాసం క‌ల్పించాలి. 18 వేల కుటుంబాల‌ను త‌ర‌లించాల్సి ఉంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

పనులు పడకేశాయి: బుచ్చయ్య చౌదరి

పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చేలా రికార్డు స్థాయిలో ప‌నులు సాగించిన ఘ‌నత చంద్ర‌బాబు ప్ర‌భుత్వానిద‌ని టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి బీబీసీతో వ్యాఖ్యానించారు.

"వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చినప్పటి నుంచి పోల‌వ‌రం ప‌నులు ప‌డ‌కేశాయి. చంద్రబాబు ప్ర‌తి వారం సమీక్ష చేయడంతో అప్ప‌ట్లో ప‌నులు పరుగులు పెట్టాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఎనిమిది నెల‌ల పాల‌న‌లో పది శాతం ప‌నులు కూడా చేయలేకపోయారు. ఇక మిగిలిన కీల‌క ప‌నులు ఎప్ప‌టికి అవుతాయో స్ప‌ష్ట‌త లేదు. నిర్ల‌క్ష్యం తాండ‌విస్తోంది. ఎన్నిసార్లు అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినా ఉప‌యోగం క‌నిపించ‌డం లేదు" అని ఆయన పెదవి విరిచారు.

పోలవరం

పున‌రావాసం ఎంత వరకు వచ్చింది?

పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క భాగం ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్. దానికి దాదాపు 80 అడుగుల లోతు నుండి కాంక్రీట్ వేశారు. నదీగర్భంలో 1,750 మీటర్లు పొడవు, 41 మీటర్ల ఎత్తుతో దీని నిర్మాణం జ‌రుగుతుంది. అడుగు భాగం 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. పైభాగంలో 30 మీటర్ల వెడల్పు వుంటుంది. దీనిని నిర్మించాలంటే గోదావ‌రి జ‌లాల మ‌ళ్లింపు అవ‌స‌రం.

నీటిపారుద‌ల శాఖ అధికారులు స్పిల్ వే పూర్తి చేస్తూనే నీటిని అటువైపు మ‌ళ్లించేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణాల‌కు పూనుకుంటున్నారు. ఎగువ‌న ఒక‌టి, దిగువ‌న ఒక‌టి రెండు కాఫర్ డ్యాములు నిర్మించి ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ నిర్మాణానికి ఆటంకాలు లేకుండా చూసేందుకు అధికారులు, ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు.

రెండు కాఫర్ డ్యాముల నిర్మాణంలో ఇప్ప‌టివ‌ర‌కు 65 శాతం పూర్త‌య్యింది. నిరుడు గోదావ‌రి వ‌ర‌ద‌ల వల్ల దేవీప‌ట్నం మండ‌లంలో ఎక్కువ ప్రాంతాలు నీట మునగ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ డ్యాములేనని స్థానికులు వాపోయారు.

ఈ రెండు కాఫర్ డ్యామ్ లు పూర్తి చేస్తే సుమారు వంద గ్రామాల‌కు గోదావ‌రి నీరు చేరుతుంది. జ‌నావాసాల్లో న‌దీ జ‌లాలు చేరక ముందే నిర్వాసితుల‌కు పున‌రావాసం క‌ల్పించాల్సి ఉంటుంది.

పున‌రావాసం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని సహాయం-పునరావాసం(ఆర్ అండ్ ఆర్) స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ టి.బాబూరావు నాయుడు బీబీసీతో చెప్పారు.

"నిర్వాసితుల‌ పున‌రావాసానికి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంది. ఇప్ప‌టివరకు ఎనిమిది గ్రామాల‌నే త‌ర‌లించాం. కాఫర్ డ్యామ్ పూర్తయ్యే నాటికి క‌నీసం వంద గ్రామాలకు పున‌రావాసం ఏర్పాటు చేయాలి. అందుకోస‌మే 20 వేల కుటుంబాల‌కు పున‌రావాస ప్యాకేజీ అమ‌లుతోపాటు కాల‌నీల నిర్మాణం వేగవంతం చేశాం. వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నే దృక్ప‌థంతో ముందుకు సాగుతున్నాం" అని బాబూరావు వివరించారు.

అడ్డగీత

పోల‌వ‌రం ప‌నుల‌పై ఈ నెల 4న సుప్రీంకోర్టుకు ఏపీ ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన స్థాయీ నివేదికలోని వివరాలు:

స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ త‌వ్వ‌కం ప‌నులు 1,169.59 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్లకుగాను 1,013.39 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల వరకు పూర్త‌య్యాయి.

స్పిల్ వే కాంక్రీట్ పనులు 38.88 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల‌కుగాను 30.75 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల వరకు జరిగాయి.

ఎర్త్-క‌మ్-రాక్-ఫిల్ డ్యామ్ పునాది ప‌నులు పూర్త‌య్యాయి.

గేట్ల ఫ్యాబ్రిక్రేష‌న్ ప‌నులు సాగుతున్నాయి.

పోలవరం నిర్మాణం

ఎగువ కాఫ‌ర్ డ్యామ్ పనులు 72.56 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల‌కుగాను 44.4 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల వరకు పూర్త‌య్యాయి.

దిగువ కాఫ‌ర్ డ్యామ్ పనులు 26.84 ల‌క్ష‌ల ఘ‌న‌పు మీట‌ర్ల‌కుగాను 9.27 ల‌క్షల ఘ‌న‌పు మీట‌ర్ల పనులు పూర్త‌య్యాయి.

కుడి ప్ర‌ధాన కాలువ తవ్వకం పనులు 100 శాతం పూర్త‌య్యాయి. 175.375 కిలోమీట‌ర్ల‌కుగాను 157.51 కిలోమీట‌ర్ల మేర అంటే 89.81 శాతం లైనింగ్ ప‌నులు కూడా జరిగాయి.

ఎడ‌మ ప్ర‌ధాన కాలువ తవ్వకం పనులు 87.74 శాతం జరిగాయి. 210.928 కిలోమీటర్లకుగాను 185.073 కి.మీ. మేర త‌వ్వ‌కాలు పూర్త‌య్యాయి. లైనింగ్ ప‌నులు 60.97 శాతం జరిగాయి.

మొత్తంగా హెడ్ వ‌ర్క్స్ 58.5 శాతం, కుడి ప్ర‌ధాన కాలువ ప‌నులు 91.69 శాతం, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ ప‌నులు 69.96 శాతం పూర్తయ్యాయి.

పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 371 ఆవాసాల‌కు చెందిన 1,05,601 కుటుంబాలు ప్ర‌భావితమవుతున్నాయి. ఇప్ప‌టివరకు 3,922 కుటుంబాల‌కే పున‌రావాసం క‌ల్పించారు.

పున‌రావాసం కోసం ఇప్ప‌టివరకు రూ.6,371 కోట్లు ఖ‌ర్చుచేయ‌గా, ఇంకా రూ.26,796 కోట్లు అవ‌స‌రం ఉంది.

అడ్డగీత
స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)