ఆంధ్రప్రదేశ్: 'కోవిడ్ నిబంధనలు ప్రజలు, విపక్షాలకేనా? పాలకులకు వర్తించవా'

కోవిడ్ ప్రమాదం ఉన్నా రాజకీయ పార్టీల నేతలు భారీ సభలు నిర్వహిస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, బహిరంగ సభకు హాజరైన ప్రజలు
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో టేబుల్‌పై ఉన్న ఒక డ్రింక్‌ను పక్కన పెట్టి, మంచి నీళ్ల బాటిల్ తీసుకున్నారు. ఆ ఘటన జరిగిన వెంటనే ఆ డ్రింక్ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. రొనాల్డో వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.

అదే వీడియోను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది.

కోవిడ్ నియమాలు పాటించాలంటూ వినూత్న పద్దతుల్లో ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎవరి కోసం నిబంధనలు?

అయితే, కొందరు నాయకులు మాత్రం ఎటువంటి కోవిడ్ నియమాలు పాటించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వందలాది మందితో ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ సభ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఎంఎల్‌సీ తోట త్రిమూర్తులు కూడా కోవిడ్ ప్రొటోకాల్ పట్టింపు లేకుండా తూర్పుగోదావరి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కోవిడ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్న సమయంలో ప్రజలు సైతం నిబంధనలు పాటించడం తగ్గించేస్తున్నారు. ఇటువంటి చర్యలే మరో వేవ్‌కు కారణమవుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాయకులే కోవిడ్ నిబంధనలను పాటించకపోతే ప్రజలను పాటించమని ఎలా చెబుతారనే సందేహం కూడా వస్తోంది.

సభల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం చాలా కష్టమైన పని
ఫొటో క్యాప్షన్, బహిరంగ సభల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం చాలా కష్టమైన పని

ప్రతిపక్షం వలనే కోవిడ్ వస్తుందా..? అధికారపక్షమంటే దానికి భయమా...?

కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ విశాఖ అపోలో ఆసుపత్రిలో పని చేస్తున్న అపర్ణకు పోలీసులు ఫైన్ వేశారు. దానిని ప్రశ్నించిన ఆమెపై విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఐపీసీ 352, 353 వంటి సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

ఈ విషయం రాష్ట్ర స్థాయిలో వివాదంగా మారింది.

కోవిడ్ నిబంధనలు పాటించకుండా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని సభలు, ర్యాలీలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ప్రతిపక్ష నాయకుల విషయంలో మాత్రం విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల నివారణ చట్టం-1897ల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ నెల 6వ తేదీన సంగం డెయిరీ పాలకవర్గంపై విజయవాడలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా పాలక వర్గ సమావేశం నిర్వహించారని పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

బండారు సత్యనారాయణ
ఫొటో క్యాప్షన్, బండారు సత్యనారాయణ

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో మే 29న సమావేశం నిర్వహించారని, కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం సమావేశాలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని, సెక్షన్లు 188, 269, 270లతో పాటు ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.

"పది మంది సమావేశం నిర్వహిస్తేనే కేసులు నమోదు చేస్తే, మరి వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు నిర్వహిస్తున్న భారీ సభలు, సమావేశాలు, ర్యాలీల మాటేమిటి? అధికార పార్టీకి నిబంధనలు, చట్టాలు వర్తించవా?" అని టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.

"లోకేశ్, కొల్లు రవీంద్ర, అచ్చెంనాయుడు ఇలా మా నాయకులందరిపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టారు. అంటే కోవిడ్ ప్రతిపక్ష నాయకుల ద్వారానే వస్తుందా? అధికార పక్షనాయకులు దేవుళ్లు, దేవతలా?" అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని నేతలు చెబుతున్నారు.
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని నేతలు చెబుతున్నారు.

నోరెత్తితే కోవిడ్ ఉల్లంఘన కేసులు...

ప్రస్తుతం ప్రభుత్వానికి అంటువ్యాధుల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాలు అస్త్రాలుగా దొరికాయని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారందరిపైనా కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెడుతున్నారని, ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చినా కూడా కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటున్నారని జీవీఎంసీ కార్పోరేటర్ జి. గంగారావు బీబీసీతో అన్నారు.

"విశాఖపట్టణంలో పాలిమర్స్ గ్యాస్ లీకైనప్పుడు 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో స్థానికులు పాలిమర్స్‌కు వ్యతిరేకంగా అందోళనలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం బాధితులపైనే కోవిడ్ కేసులు పెట్టి వారిని భయపెట్టే ప్రయత్నం చేసింది" అని గంగారావు గుర్తు చేసుకున్నారు.

"ఇటీవల శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్పలరాజు నిర్వహించిన సభ అయితే కోవిడ్ కేసులను ఖచ్చితంగా పెంచుతుంది. అయినా ఆయనపై ఏ కేసులు లేవు. ప్రభుత్వం తనకు నచ్చని వారిపై కేసులు పెట్టేందుకు కోవిడ్ ప్రొటోకాల్ చట్టాలను వాడుకుంటోందే తప్ప, నిజంగా నిబంధనలు ఉల్లంఘించినవారిని ఏం చేయలేకపోతోంది" అన్నారాయన.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ సభలు, ర్యాలీలు తరచూ జరుగుతున్నాయి.
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో భారీ సభలు, ర్యాలీలు తరచూ జరుగుతున్నాయి.

రాజకీయ నాయకులకే ప్రాధాన్యత

కరోనా ప్రబలకుండా ఉండాలన్నా, దానిని క్రమంగా నియంత్రించాలన్నా కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

లాక్‌డౌన్, కర్ఫ్యూలతో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తగ్గుతున్న క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే, కేసులు సంఖ్య పెరగడంతో పాటు థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"కోవిడ్ తగ్గినా కూడా సంవత్సరం వరకు మాస్కులు తప్పనిసరిగా వాడాలి. గుంపులుగా గుమిగూడకుండా ఉండాలి. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. సభలు, సమావేశాలు అసలు వద్దేవద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముప్పు తప్పదు. నేను చూసినంత వరకు కోవిడ్ నిబంధనలు పట్టించుకోని వారిలో రాజకీయ నాయకులే ముందున్నారు" అని విశాఖలో కోవిడ్ ఆసుపత్రి డాక్టర్ వెంకటేశ్ అన్నారు.

ర్యాలీ నిర్వహించిన తోట త్రిమూర్తులు

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్, ర్యాలీ నిర్వహించిన తోట త్రిమూర్తులు

'కోవిడ్ చట్టాలు' ఏం చెబుతున్నాయి?

కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ చట్టం- 2005, అంటువ్యాధుల నివారణ చట్టం -1897లను అమలు చేస్తున్నాయి.

ఈ చట్టాలను ఉల్లంఘస్తే శిక్షలతో పాటు జరిమానాలు కూడా కట్టాలి. పాటించాల్సిన నిబంధనలు, ఉల్లంఘిస్తే భరించాల్సిన శిక్షను సెక్షన్ల వారీగా ఈ చట్టాల్లో పొందుపరిచారు.

విపత్తు నిర్వహణ చట్టం- 2005

సెక్షన్‌ 51: ప్రభుత్వాల నిబంధనల ఉల్లంఘన

సెక్షన్‌ 52: ఉద్దేశపూర్వకంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం

సెక్షన్‌ 53: విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులను ఎవరైనా దుర్వినియోగం చేయడం

సెక్షన్‌ 54: ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం

సెక్షన్‌ 55: ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశించడంలో ప్రభుత్వ అధికారికి అధికారాలు

సెక్షన్‌ 56: విధి నిర్వహణలో విఫలం కావడం లేదా అనుమతి లేకుండా విధుల నుంచి తప్పుకోవడం

సెక్షన్‌ 57: విపత్తు నిర్వహణ చట్టం-ఉల్లంఘించే సంస్థలపై చర్యలు...వంటివి సెక్షన్ల వారీగా విపత్తు నిర్వహణ చట్టంలో ఉంటాయి. ఇందులో నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉండే అవకాశం ఉంది.

అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు
ఫొటో క్యాప్షన్, అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు

అంటువ్యాధుల నివారణ చట్టం - 1897

విపత్తు నిర్వహణ చట్టంతో పాటు ఇతర చట్టాల ద్వారా ఏదైనా వ్యాధి నియంత్రణ సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వాడి వ్యాధుల్ని అరికట్టే చర్యలు చేపట్టవచ్చు.

ఈ చట్ట ప్రకారం రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో విద్యా సంస్థల్ని మూసి వేయడానికి, సరిహద్దు ప్రాంతాలను సీజ్ చేయడానికి, రోగులను హాస్పిటల్‌లో కానీ, నిర్బంధం‌లో కానీ ఉంచడానికి అధికారులకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.

ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్ష విధించవచ్చు. సెక్షన్ 188 ప్రకారం, ఎవరి ప్రాణానికైనా భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై కేసులు నమోదు చేసేందుకు వీలులేదు.

ఆయన మంత్రే కాదు...డాక్టరు కూడా...

అయితే ఈ నిబంధనలు అన్నీ తెలిసినా రాజకీయ నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాల ప్రచారాలు, సభలు, సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, ప్రజల ప్రాణాలు, కోవిడ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పలాస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

"వృత్తిరీత్యా అప్పలరాజు డాక్టర్ కూడా. అయినా ఆయన నిబంధనలు పాటించలేదు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కనీస నిబంధనలు పాటించాల్సి ఉన్నా.. స్వయంగా మంత్రే నిబంధనలు ఉల్లంఘించారు" అని ఆమె ఆరోపించారు.

అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా భారీ ర్యాలీ నిర్వహించి...కోవిడ్ నిబంధనలు పట్టించుకోలేదని, ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో చాలా మంది మాస్కులు ధరించ లేదని, వీరిపై పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయలేదని శిరీష ప్రశ్నించారు.

సభల్లో భౌతిక దూరం నియమాలు పాటించడం లేదు.
ఫొటో క్యాప్షన్, సభల్లో భౌతిక దూరం నియమాలు పాటించడం లేదు.

వ్యాక్సీన్ వేయించుకున్నవారే వచ్చారు...

బహిరంగ సభపై మంత్రి అప్పలరాజుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. కానీ మంత్రిగారు చెప్పమన్నారంటూ... ఆయన పి‌ఆర్‌ఓ రామన్ బీబీసీతో మాట్లాడారు.

"రాష్ట్ర ప్రభుత్వ 'చేయూత' పథకం లబ్ధిదారుల కోసం నిర్వహించిన సభ అది. అంటే అక్కడికి వచ్చిన వారంతా 45 ఏళ్లు దాటిన వారే. 45 ఏళ్లు దాటిన వారందరికి దాదాపు టీకాలు వేయడం జరిగింది. అంటే ఈ సభకు వచ్చినవారందరికీ వ్యాక్సినేషన్ జరిగిందనే అర్థం’’ అని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటిన వారందరికి టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని...ఆ విషయాన్ని కూడా ఈ సభ ద్వారా చెప్పదలిచామని రామన్ వివరించారు.

డీఐజీ జి. పాలరాజు

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్, డీఐజీ జి. పాలరాజు

మరి పోలీసులు ఏం చేస్తున్నారు?

నిబంధనలు ఉల్లంఘిచిన కొందరిపై చర్యలు తీసుకోవడం గానీ, కేసులు పెట్టడం కానీ జరగకపోవడం గురించి బీబీసీ స్థానిక పోలీసులను సంప్రదించింది.

పోలీసులు రాజకీయ నాయకుల కార్యక్రమాలను అపడం లేదా అడ్డుకోవడం చేస్తే, ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికి తెలిసిందేనని, దీనిపై తామేమి మాట్లాడలేమని, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చెప్పారు.

"ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు జరిగినా, అనుమతి తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే జరగాలి. అలా జరగనప్పుడు తప్పనిసరిగా అధికారపార్టీయైనా, ప్రతిపక్షపార్టీయైనా, సాధారణ ప్రజలైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం" అని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి, డీఐజీ జి. పాలరాజు బీబీసీకి చెప్పారు.

"అయితే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతాయి. ప్రజలు స్వచ్చందంగా వస్తారు. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు, దీనిపై స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాం’’ అని పాలరాజు వివరించారు.

కొన్నిసార్లు రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాల దగ్గర పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయని, అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పాలరాజు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)