కోవిడ్-19: అందరూ తప్పనిసరిగా వ్యాక్సీన్లు వేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వొచ్చా?

కోవిడ్-19

ఫొటో సోర్స్, EPA/JAGADEESH NV

    • రచయిత, సల్మాన్ రవి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, దుకాణదారులు తప్పనిసరిగా వ్యాక్సీన్లు వేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

కొన్ని జిల్లాల్లో అయితే వ్యాక్సినేషన్ పూర్తికాకుండా దుకాణాలు తెరవకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. వీటిని డిప్యూటీ కమిషనర్లు జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాలను మేఘాలయ హైకోర్టు కొట్టివేసింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయకూడదని, అలా చేస్తే ప్రాథమిక, వ్యక్తిగత గోప్యతా హక్కుల్ని ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేస్తూ మరికొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా మేఘాలయ ప్రభుత్వంలానే ఆదేశాలు జారీ చేశాయి.

ముఖ్యంగా గుజరాత్‌లోని 18 నగరాల్లో జూన్ 30 కల్లా వ్యాపారులంతా వ్యాక్సీన్లు తప్పనిసరిగా వేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చారు.

గుజరాత్‌లోని మిగతా నగరాలు, జిల్లాలో ఈ గడువును జులై 10గా నిర్దేశించారు. వ్యాక్సీన్లు వేయించుకోకపోతే, ఆ దుకాణాలను మూసివేస్తామని కూడా హెచ్చరికలు జారీచేశారు.

ఇలాంటి సందర్భాల్లో అసలు వ్యాక్సీన్‌ను తప్పనిసరి చేయొచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే ఈ విషయాన్ని ప్రజల అభీష్టానికే వదిలిపెడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

అయితే, తమ సిబ్బంది వ్యాక్సీన్లు వేసుకున్నారో లేదా తెలియజేసే పత్రాలను దుకాణాలు, ఆటోలపై అతికించాలని మేఘాలయ హైకోర్టు సూచించింది. అప్పుడు ప్రజలకు ఎవరు వ్యాక్సీన్లు వేసుకున్నారో, ఎక్కడ ముప్పు ఉంటుందో తెలుస్తుందని అభిప్రాయపడింది.

మేఘాలయ హైకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియా వేదికల్లో దీనిపై చర్చ మొదలైంది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

తప్పనిసరి చేయొచ్చా?

వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయొచ్చా? అనే అంశంపై రోహిణ్ దూబే అధ్యయనం చేపట్టారు. గురుగ్రామ్‌లోని ఓ న్యాయ సేవల సంస్థలో అడ్వొకేట్‌గా ఆయన పనిచేస్తున్నారు.

‘‘1880ల్లో తీసుకొచ్చిన తొలి వ్యాక్సినేషన్ ప్రక్రియలో అందరూ తప్పనిసరిగా పాలుపంచుకోవాలని చట్టం తీసుకొచ్చారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ యాక్ట్‌ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసింది. 1892లో మశూచి టీకాను ఇలా తప్పనిసరి చేశారు. ఈ చట్టాన్ని అతిక్రమించే వారికి శిక్షలు ఉంటాయని కూడా చట్టంలో పేర్కొన్నారు’’అని బీబీసీతో రోహిణ్ చెప్పారు.

అదే విధంగా 2005లో జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైనా మహమ్మారులు వ్యాపించినప్పుడు, విపత్తు లాంటి పరిస్థితులు సంభవించకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం కల్పిస్తోంది.

వైరస్

ఫొటో సోర్స్, Getty Images

న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు?

ఈ విషయంలో చట్టాలను పరిశీలిస్తే కొంత గందరగోళం కనిపిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. భిన్న సందర్భాల్లో భిన్న కోర్టులు వివిధ రకాలుగా స్పందించాయని వివరించారు.

వ్యాక్సినేషన్ మొదటి దశల్లో వైద్య సిబ్బంది అందరూ ఈ వ్యాక్సీన్ వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత పోలీసులు, భద్రతా బలగాలు లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సీన్లు తప్పనిసరి చేశారు. ఆ తర్వాత మిగతా ప్రజలు తమ అభీష్టంమేరకు స్వచ్ఛందంగా వ్యాక్సీన్లు వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అయితే ఈ విషయంలో వ్యక్తిగత గోప్యతా హక్కు, ఆరోగ్య పరిరక్షణ హక్కు మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో పనిచేస్తున్న సీనియర్ అడ్వొకేట్ బి బద్రీనాథ్ వ్యాఖ్యానించారు.

‘‘నిజమే బలవంతంగా వ్యాక్సీన్లు వేయించుకోవాలని ఒత్తిడి చేయకూడదు. అయితే ఇలా వ్యాక్సీన్లు వేయించుకోకపోతే, ఇతరులకు వైరస్ సోకే ముప్పు పెరుగుతుంది కదా. ఎందుకంటే అవతలి వ్యక్తికి కూడా తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే హక్కు ఉంటుంది’’

‘‘మామూలుగా అయితే, నాలుగు గోడల మధ్యే అందరూ ఉండాలని చట్టం చేయకూడదు. కానీ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద మనకు క్వారంటైన్ విధించారుగా. దీని ప్రకారం.. బయటకు వెళ్లడం లేదా అప్పటికే వైరస్ సోకిన వారిని కలవడం లాంటి చర్యలను నేరంగా పరిగణిస్తారు. దీనికిగాను చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ను కూడా ఇలానే అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత గోప్యతా హక్కు, ఆరోగ్యపరిరక్ష హక్కుల మధ్య సమతూకం పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, PA Media

అన్ని వైపుల నుంచి ప్రశ్నలు..

ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద సామాజిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చిన సంగతిని బద్రీనాథ్ గుర్తుచేశారు. అయితే, ఏదిఏమైనప్పటికీ తప్పనిసరిగా వ్యాక్సీన్ వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టులు కూడా చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పాయని వివరించారు.

‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయినా లేదా వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియలు అయినా.. స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు’’ అని మేఘాలయ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

ఎపిడమిక్ డిసెజెస్ యాక్ట్ కింద అవసరమైతే వ్యాక్సీన్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు వెలువరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని రాజ్యంగంపై అధ్యయనం చేస్తున్న సీనియర్ అడ్వొకేట్ సంగ్రామ్ సింగ్ చెప్పారు.

‘‘అయితే వ్యాక్సీన్లు వేసుకుంటే ఇక వైరస్ సోకదని కచ్చితంగా తేలితే అప్పుడే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.

‘‘ఈ వ్యాక్సీన్ల సామర్థ్యంపై ఇప్పటికీ చాలా సందేహాలు మనల్ని వెంటాడుతున్నాయి. ఈ వ్యాక్సీన్లు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో కూడా తెలియదు’’

‘‘ఈ వ్యాక్సీన్లను ఏటా తీసుకోవాలా? అనే అంశంపైనా స్పష్టత లేదు. అలాంటప్పుడు ఈ వ్యాక్సీన్లను తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలను ఎలా ఇస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Reuters

హక్కుల ఉల్లంఘనే

అయితే, చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని రోహిణ్ దూబే చెప్పారు.

‘‘ఉదాహరణకు పచ్చకామెర్లు సహా కొన్ని జబ్బులకు టీకాలు వేసుకుంటేనే తమ దేశంలో అడుగుపెట్టాలని కొన్ని దేశాలు నిబంధనలు విధించాయి. దీని కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ యాక్ట్ పేరుతో కొన్ని ఆఫ్రికా దేశాలు చట్టాలను కూడా తీసుకొచ్చాయి’’ అని ఆయన అన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ మశూచి టీకా తప్పనిసరిగా వేసుకోవాలని జాకబ్‌సన్ వర్సెస్ మాసాచుసెట్స్ కేసులో అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

అయితే, ఈ వాదనతో సంగ్రామ్ సింగ్ సహా చాలా మంది అడ్వొకేట్లు విభేదిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాక్సీన్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి సమగ్ర వివరాలు తెలుసుకునే హక్కును మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తోందని ఆయన అన్నారు. అయితే, ఇప్పటివరకు అలాంటి సమగ్ర సమాచారం మనకు అందుబాటులో లేదని, అలాంటప్పుడు వ్యాక్సీన్లను తప్పనిసరి చేయడం తగదని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)