భారత్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా

గత నెలలో రెండో బిడ్డ జన్మించిన అనంతరం కొన్ని వారాల పాటు పని నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు

ఫొటో సోర్స్, VINEETA AGARWALA/TWITTER

ఫొటో క్యాప్షన్, గత నెలలో రెండో బిడ్డ జన్మించిన అనంతరం కొన్ని వారాల పాటు పని నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్, ఢిల్లీ

పిల్లల పెంపకం అంత సులభం కాదని అంటున్నారు 35 ఏళ్ల రేహాన్ ఖాన్. దక్షిణ భారత నగరమైన బెంగళూరుకు చెందిన ఖాన్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2020 లాక్‌డౌన్‌లో రేహాన్ ఖాన్‌కు మూడో సంతానం కలిగింది.

ఈసారి తండ్రిగా ఆయన కొత్త అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆయన పనిచేసే కంపెనీ పితృత్వ సెలవులను ఒక వారం నుంచి మూడు వారాలకు పెంచింది. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలో పనిచేసే ఆయన భార్యకు కూడా 15 వారాల సెలవు లభించింది.

''మొదటి నెల చాలా కష్టంగా గడిచింది. ఎందుకంటే బాబుని నిరంతరం శ్రద్ధగా చూసుకోవాల్సి వచ్చింది. మా నిద్రవేళలు కూడా మారిపోయాయి'' అని ఖాన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?

''నా భార్య ఉదయం 3:30 వరకు బాబును చూసుకునేది. ఆ తర్వాత చిన్నారి బాధ్యత నాది. ఆడించడం, పడుకోబెట్టడం లాంటి పనులు చేశాను'' అని ఆయన చెప్పారు.

వర్క్ ఫ్రం హోం విధానం వారికి మరింతగా సహకరించింది. ఖాన్ తల్లిదండ్రులు కూడా వారితో పాటే ఉంటూ పాపాయి బాగోగులు చూసుకున్నారు.

చిన్నారి గడపడం ఒక ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన అనుభవంగా ఖాన్ చెప్పుకొచ్చారు. కానీ తనలాంటి అనుభవం అందరికీ దొరకదని, ఈ అవకాశం తనకు లభించడడం సంతోషంగా ఉందని వివరించారు. చంటిపిల్లల బాగోగులు, పెంపకం గురించి కొన్ని భారతీయ కంపెనీలు ఆలోచిస్తుండటంతో ఖాన్‌కు ఈ అవకాశం లభించింది.

''నా మేనేజర్ ఇండియన్ కాకపోవడం నా అదృష్టం. ఆయన బాస్ కూడా అమెరికన్. వారు ఈ అంశం పట్ల చాలా సున్నితంగా ఉంటారు. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది'' అని ఆయన అన్నారు.

శిశువు జన్మించిన సమయంలో లేదా జన్మించిన ఆరు నెలలలోపు తండ్రి రెండు వారాల సెలవులు తీసుకునేందుకు భారత్‌లోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.

చంటిపిల్లల తండ్రులకు వేతనంతో కూడిన నెల రోజుల సెలవులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని హిమాన్షు అంటున్నారు

ఫొటో సోర్స్, HIMANSHU DHANDA

ఫొటో క్యాప్షన్, చంటిపిల్లల తండ్రులకు వేతనంతో కూడిన నెల రోజుల సెలవులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని హిమాన్షు అంటున్నారు

మరోవైపు ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే భారతీయ మహిళలు, వేతనంతో కూడిన 26 వారాల సెలవులకు అర్హులు. కానీ పురుషులకు మాత్రం పితృత్వ సెలవుల విషయంలో ఒక జాతీయ విధానమేదీ ఇంకా లేదు.

కొన్ని ప్రైవేటు కంపెనీలు పిల్లలను దత్తత తీసుకున్నవారికి, ఎల్జీబీటీ దంపతులకు, చంటిపిల్లలున్న తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వడం ప్రారంభించాయి. టెక్ కంపెనీలు చెప్పుకోదగ్గ స్థాయిలో సెలవులను మంజూరు చేస్తున్నాయి. డ్రింక్స్ కంపెనీ 'డియాగియో'... ఆడామగా అనే తేడా లేకుండా అర్హులైన తల్లిదండ్రులు అందరికీ 26 వారాల పేరంటల్ లీవ్‌ను అందిస్తుంది.

తనకు రెండో బిడ్డ జన్మించిన నేపథ్యంలో కొన్ని వారాల పాటు సెలవు తీసుకుంటున్నట్లు గత నెలలో భారత సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మరోసారి పితృత్వ సెలవుల అంశం చర్చకొచ్చింది.

ఇలాంటి సెలవులను మంజూరు చేసే భారతీయ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు వారి పాలసీల్లో వీటి గురించి ప్రత్యేకంగా పేర్కొంటాయి.

భారత్‌లోని ఉమ్మడి కుటుంబాలు పిల్లల సంరక్షణలో కీలక పాత్ర పోషించాయి. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి నెమ్మదిగా మారిపోతోంది.

వీడియో క్యాప్షన్, మానవ తప్పిదం వలన, ఆసుపత్రిలో ప్రసవం అవగానే, ఇద్దరు తల్లుల బిడ్డలు తారుమారైపోయారు.

తన పని ప్రదేశంలో సెలవుల విషయంలో వస్తోన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫెడరల్ గవర్నమెంట్ వర్కర్ హిమాన్షు ధండా చెప్పారు.

పితృత్వ సెలవులు తీసుకోగలిగినందుకు సీనియర్లు తనను అదృష్టవంతుడిగా పిలుస్తున్నారని హిమాన్షు తెలిపారు. తన సీనియర్లకు ఇలాంటి అవకాశం లభించలేదని అన్నారు.

హిమాన్షు తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మూడు దశాబ్ధాల క్రితం పితృత్వ సెలవులు తీసుకున్న సమయంలో తన తండ్రి వెక్కిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని హిమాన్షు తెలిపారు. ''బిడ్డకు పాలు పట్టడం, చూసుకోవడం తల్లి పని. అక్కడ నీకేం పని ఉందని సెలవు పెట్టావ్? అన సహచరులు ఎగతాళి చేశారని తన తండ్రి తనతో చెప్పినట్లు'' హిమాన్షు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన తండ్రి ఏడు రోజులు సెలవు తీసుకోగలిగారని చెప్పారు.

చంటి పిల్లల తండ్రులకు వేతనంతో కూడిన నెల రోజుల సెలవు ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని హిమాన్షు అభిప్రాయపడ్డారు. ''ముఖ్యంగా పిల్లల పెంపకంలో అనుభవం లేని మాలాంటి తండ్రులకు ఇది చాలా పెద్ద సవాలు. మేం ఊహించనవి చాలా జరుగుతాయి. మీరు మాత్రం కేవలం చిన్నారి గురించి, తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం గురించి మాత్రమే పట్టించుకుంటారు'' అని ఆయన అన్నారు.

స్వీడన్ తరహాలో భారత్‌లో కూడా చట్టబద్ధమైన పేరంటల్ లీవ్ పాలసీ ఉండాలని పుణేలోని ఫ్లేమ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీపర్ణ ఛటోపాధ్యాయ్ భావిస్తున్నారు.

''ఒక అంశాన్ని చట్టపరమైన మార్గంలో పొందుపరచకపోతే, దాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదనే అనుకుంటారు. అంతేకదా? సెలవుల విధానంలో ప్రస్తుతం వస్తోన్న మార్పుల్ని చూస్తే, పిల్లల సంరక్షణ తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత అని ప్రభుత్వాలు ఎంతో కొంత గుర్తించినట్లే కనబడుతున్నాయి'' అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)