ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంపు.. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ మినహా మిగతా సినిమాలకు నిబంధనలు ఇవీ..

సినిమా థియేటర్ బాక్సాఫీస్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో నెం.13 విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో 13 లో టిక్కెట్ల ధరలను నిర్ణయించింది. ఇందులో పంచాయితీల నుంచి మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల వరకు ఉన్న ధియేటర్లలో కనిష్టంగా ధర రూ. 20, గరిష్ట ధర రూ. 125 రూపాయిలు ధరలు.

మల్లీప్లెక్స్ లలో తక్కువగా రూ. 100 ఎక్కువ రూ. 250 (రిక్లైయినర్ సీట్లు) ఉండాలని నిర్ణయిస్తూ జీవోను జారీ చేసింది. గతంలో విడుదల చేసిన జీవో నెం. 35 లో అయితే ఇవే ధరలు కనిష్టం రూ. 5, గరిష్టంగా రూ. 100 గా నిర్ణయించింది.

"జీవో నెం. 35 ధరలకి, ఇప్పడు జీవో నెం. 13 ధరలకు వ్యత్యాసం చాలా ఉంది. ఇవే ధరలను గతంలో ప్రకటిస్తే అసలీ వివాదమే ఉండదు. ఏదిఏమైనా ఇప్పడు ప్రకటించిన ధరలు సినిమా పరిశ్రమ డిమాండ్ చేసిన ధరలతో సమానంగా ఉన్నాయి. మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో మేం జీఎస్టీతో కలిపి రూ. 150 టిక్కెట్ ధర ఉండాలని కోరాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంతో దానిని రూ. 125 (దీనికి జీఎస్టీ అదనం)గా ప్రకటించింది. అంటే దాదాపు మేం కోరినట్లే ఉంది. అలాగే ధియేటర్ల మెయింటెనెన్స్ ఛార్జీ రూ. 3 ఉంటే దానిని రూ. 5 రూపాయలకు పెంచింది. ఇది థియేటర్ల యాజమాన్యానికి చాలా ఉపయోగం. దీనిని మేం గత 15 ఏళ్లుగా కోరుతున్నాం" అని విశాఖపట్నంకు చెందిన సినీ ఎగ్జిబిటర్ ప్రసాద్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు

పెద్ద సినిమాలకు పండుగ

ప్రభుత్వం జీవో నెం. 35 ధరలను సవరిస్తూ కొత్త జీవో ఎప్పుడు విడుదల చేస్తుందా అని పెద్ద సినిమాలు తీసిన నిర్మాతలు, అందులో నటించిన హీరోలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

జీవో నెం. 35 గతేడాది ఏప్రిల్ లో వచ్చింది. అప్పటి నుంచి భారీ సినిమాల నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. అయితే ప్రభుత్వం నుంచి జీవో విడుదలవుతుందని చూసి చూసి చివరకు అఖండ, భీమ్లా నాయక్ వంటి సినిమాలు విడుదల చేసేశారు.

"రాధేశ్యామ్, ఆర్ఆర్‌ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఒకసారి వాయిదా కూడా పడింది. ఈ నేపథ్యంలో వచ్చిన కొత్త జీవో పరిశ్రమకు పెద్ద శుభవార్తే. పైగా ఇప్పటికే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు జీవో రిలీజ్ కాకముందే తమ సినిమా తేదీలను ప్రకటించేశాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. పైగా గతంలోలా కాకుండా ఇప్పుడు రోజుకు 5 షోలు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చారు. దీని వలన కూడా భారీ సినిమాలకు లాభమే." అని ప్రసాద రెడ్డి చెప్పారు.

‘అన్ని సెంటర్లకు ఓకే’

"గతంలో ప్రభుత్వం చెప్పిన ధరలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో బాగానే ఉన్నాయి. కానీ బీ, సీ సెంటర్ల విషయంలో మాత్రం చాలా తక్కువగా నిర్ణయించింది. ఇప్పుడు సవరించిన ధరలు గ్రామ పంచాయితీ ధియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ ల వరకు అన్ని థియేటర్లకు ఓకే." అని ప్రసాద రెడ్డి అన్నారు.

జగన్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో

కొత్త జీవో ప్రకారం ధరలు ఇవే...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన జీవో ప్రకారం కొత్త ధరలు ఇవి. ఈ ధరలకు జీఎస్టీ, థియేటర్ల నిర్వహణ ఛార్జీలు అదనం.

మున్సిపల్ కార్పోరేషన్లలోని..

  • నాన్‌ ఏసీ థియేటర్లలో రూ.40 - రూ.60
  • ఏసీ థియేటర్లలో రూ.70 - రూ.100
  • స్పెషల్‌ థియేటర్లలో రూ.100 - రూ.120
  • మల్టీప్లెక్స్‌లో రూ.150 - రూ.250

మున్సిపాల్టీల్లో..

  • నాన్‌ ఏసీ థియేటర్లలో రూ.30 - రూ.50
  • ఏసీ థియేటర్లలో రూ.60 - రూ.80
  • స్పెషల్‌ థియేటర్లలో రూ.80 - రూ.100
  • మల్టీప్లెక్స్‌లో రూ.125 - రూ.250

నగర/గ్రామ పంచాయితీల్లో..

  • నాన్‌ ఏసీ థియేటర్లలో రూ.20 - రూ.40
  • ఏసీ థియేటర్లలో రూ.50 - రూ.70
  • స్పెషల్‌ థియేటర్లలో రూ.70 - రూ.90
  • మల్టీప్లెక్స్‌లో రూ.125 - రూ.250

రూ.100 కోట్లు దాటాలి... ఏపీలో 20శాతం షూటింగ్ జరగాలి

తెలుగు సినిమా హీరోలు భారీ రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే సినిమా నిర్మాణ తగ్గి, టిక్కెట్ ధరలు తగ్గినా ఇబ్బంది ఉండదంటూ ప్రభుత్వ ప్రతినిధులు, ఆ హీరోలను చూసే సినిమాకి జనం వస్తారంటూ సినీ ఇండ్రస్ట్రీ ప్రతినిధులు... టిక్కెట్ల ధరల వివాదం సందర్భంగా వాదోపవాదాలు చేసుకున్నారు. అయితే దీనిపై కూడా ప్రభుత్వం తన జీవోలో క్లారిటీ ఇచ్చింది.

హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా బడ్జెట్‌ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది.

సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునే అవకాశం పొందాలంటే ఆ సినిమాల షూటింగ్ ఏపీలో కనీసం 20 శాతం జరగాలనే క్లాజ్ పెట్టింది.

అదే విధంగా చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొంది.

ఆ రెండు సినిమాలకు మినహాయింపు - మంత్రి పేర్ని నాని

టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు వర్తించవని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వివరణ ఇచ్చారు.

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఆ రెండు సినిమాలూ ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం షూటింగ్ జరుపుకోనప్పటికీ.. కొత్త టికెట్ రేట్లు, 5 షోల పర్మిషన్ వాటికి ఉంటుందని తెలిపారు.

కానీ ఇక పై వచ్చే సినిమాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం షూటింగ్ కచ్చితంగా జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ అధికారి

థియేటర్లపై దాడులు, తాళాలు..

జీవో నెం 35 ప్రకారం టిక్కెట్లు అమ్మాలని, దీనిని సరిగా అమలు చేసే బాధ్యతను ఎమ్మార్వోలు, జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.

ఆ సమయంలో విడుదలైన అఖండ వంటి సినిమాలు నడిచే థియేటర్ల వద్దకు స్వయంగా జాయింట్ కలెక్టర్లు వెళ్లి టిక్కెట్ విక్రయాలను పరిశీలించారు. అదనపు ధరలకు అమ్మినా, కోవిడ్ నిబంధనలు పాటించని, మెయింటెనెన్స్ సరిగా లేని థియేటర్లను సీజ్ చేశారు.

ఇలా ఏపీలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జరిగింది. ఈ సందర్భంలోనే థియేటర్లు నిర్వహించలేమంటూ ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టారు. తక్కువ ధరలు కారణంగా థియేటర్లలో సినిమాలను ప్రదర్శించడం లేదంటూ చాలా చోట్ల బోర్డులు కూడా పెట్టారు.

"ప్రస్తుత జీవోతో టిక్కెట్ల వివాదానికి తెరపడినట్లే. దాదాపు ఎగ్జిబిటర్లు కోరినట్లు థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా పెంచారు. దీంతో ఒక రకంగా రాజకీయంగా మారుతుందని అనుకున్న ఈ సమస్యకు చెక్ పడినట్లే. కరోనా, టిక్కెట్ల ధరల వివాదం నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. టిక్కెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో థియేటర్లపై ఆధారపడి బతుకుతున్న క్యాంటీన్, పార్కింగ్, టిక్కెట్ కట్టింగ్ స్టాఫ్‌కు మళ్లీ ఉపాధి దొరుకుతుంది" అని విశాఖ జగదాంబ థియేటర్ మేనేజర్ సురేశ్ చెప్పారు.

రాధేశ్యామ్ ప్రభాస్

ఫొటో సోర్స్, facebook/ActorPrabhas

'రాధేశ్యామ్ ప్రభాస్ చెప్పినట్లే...'

మార్చి 11వ తేదీన ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలవుతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం (07.03.22) హైదరాబాద్‌లో రాధేశ్యామ్ మూవీ టీం మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో ‘మా సినిమా రిలీజ్ కాబోతోంది. ఈలోగా జీవో వస్తే బాగుండు’ అని ప్రభాస్ అన్నారు.

"రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ చూశాను. అందులో భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పే వ్యక్తిగా ప్రభాస్ నటించారు. ప్రభాస్ ప్రెస్ మీట్ లో టిక్కెట్ రేట్లు పెరిగితే బాగుంటుందని, అది తాను నటించిన సినిమా రిలీజ్ ముందే జరిగితే మంచిదని అన్నారు. సాయంత్రానికి జీవో వచ్చింది. కొత్త ధరలతో ఫస్ట్ లాభం పొందే సినిమా రాధేశ్యామ్. వరుసగా పెద్ద సినిమాలు ఉండటంతో... ఇక థియేటర్ల వద్ద పండుగే" అని మరో ఎగ్జిబిటర్ జగదీశ్ బీబీసీతో అన్నారు.

'భీమ్లా నాయక్ తర్వాతే అని మాకు తెలుసు'

గత పది నెలలుగా ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు చెందిన వారికి మధ్య చర్చలు, వాదోపవాదాలు, సమావేశాలు చాలానే జరిగాయి. ఒక దశలో చాలా మంది ఎగ్జిబిటర్లు ఇక సినిమా థియేటర్లు నడపలేమంటూ చేతులెత్తేశారు. ఈ తరుణంలో సినీ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళీ తదితరులతో ఒక బృందం సీఎం జగన్ ను కలిసింది.

ఈ బృందం ఏపీ సీఎం జగన్ తో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి కొత్త జీవో జారీ చేస్తామని ప్రభుత్వం ఆ బృందానికి హామీ ఇచ్చింది.

అయితే ఆ జీవో ఎప్పుడు విడుదలవుతుందా అని సినిమా నిర్మాణాలు పూర్తైయి విడుదలకు సిద్ధమైన సినిమాల నిర్మాతలు ఎదురు చూశారు.

"మా హీరో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టిక్కెట్ ధరలు పెంపు కోసం చూసి చూసి సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేశారు. ఆ తర్వాత జీవో రిలీజ్ అవుతుందని మాకు తెలుసు. అనుకున్నట్లుగానే ఈరోజు (07.03.22) జీవో రిలీజ్ చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్, పారదర్శకత అంటూ ప్రభుత్వం చాలా కబుర్లు చెప్పింది, కానీ అది మా నాయకుడు పవన్ కల్యాణ్‌పై పగతో మాత్రమే చేసినట్లుంది. భీమ్లా నాయక్ సినిమా కోసమే ప్రభుత్వం జీవో విడుదలను ఆలస్యం చేసింది" అని జనసేన నాయకులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి సురేశ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)