సినీ నటుడు ప్రభాస్ ఇల్లు సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు: ప్రెస్‌ రివ్యూ

ప్రభాస్

ఫొటో సోర్స్, Prabas/fb

సినీ నటుడు ప్రభాస్‌ ఇల్లును రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

ఆ స్థలంలో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్‌ చేశారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించారు. వీరి నుంచి కొంత భూమి కొనుగోలు చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లారు.

వీరి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ స్థలాన్ని ఫిర్యాదుదారుల పేరిట పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి తహసీల్దార్‌ పట్టా చేయకపోవడంతో శివరామకృష్ణ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో తహసీల్దార్‌కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు కేసు కొట్టేసింది.

అయితే ‘నిర్మాణాలు ఎలా తొలగిస్తారని అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు చెప్పారు’ అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

కాగా, ప్రభాస్ గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారని ఈనాడు వెల్లడించింది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, chandrababu/fb

‘బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలి’

బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు ఈనాడు వెల్లడించింది.

ఆయన సోమవారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనే కాదు, ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని అన్నారు.

ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్‌ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈవీఎంలో రికార్డు అంతా పోతుందని, మళ్లీ లెక్కించడానికి సైతం ఆస్కారం ఉండదన్నారు.

అమెరికాలో కూడా బ్యాలెట్‌తోనే ఎన్నికలకు వెళుతున్నారని, ప్రపంచమంతా ఈవీఎంలకు వ్యతిరేకంగానే ఉందని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్నారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. తానేదో టీఆర్ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను గతంలోనే టీఆర్ఎస్‌తో కలిసి వెళదామనుకున్నానని చెప్పారు. తెలుగువాళ్లు కలిసి ఉంటే సమస్యలు జాతీయస్థాయిలో పరిష్కరించుకోవచ్చని భావించానని చంద్రబాబు చెప్పినట్లు ఈనాడు తెలిపింది.

ఏటీఎం

ఫొటో సోర్స్, Getty Images

ఏటీఎంనే ఏమార్చారు

'హైదరాబాద్ కేంద్రంగా ఓ దొంగల ముఠా చిన్న టెక్నిక్‌తో ఏటీఎంలనే ఏమార్చింది. సాంకేతిక సమస్య సృష్టిస్తూ డబ్బులు దోచుకుంది' అని సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

విత్‌డ్రా చేసుకున్నా.. డబ్బులురానట్లు చూపేలా ఏటీఎంలో వారు మార్పులు చేశారు. ఈ వ్యవహారం మొత్తం 4 సెకన్లతో పూర్తి చేశారు. పైగా బ్యాంకులకు ఫిర్యాదు చేసి మళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి పొందారు. హరియాణా-రాజస్థాన్‌ సరిహద్దుల్లోని మేవాట్‌ రీజియన్‌కు చెందిన ముఠా ఈ పనిచేసింది.

ఈ టెక్నిక్‌తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్‌ వేసి హైదరాబాద్‌ వచ్చిన ఈ గ్యాంగ్‌.. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది. వీరి నుంచి పలు బ్యాంకులకు చెందిన 31 డెబిట్‌ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు.

మేవాట్‌ రీజియన్‌కు చెందిన అఖ్లక్‌ అహ్మద్‌ (ఐటీఐ ఫిట్టర్‌ విద్యార్థి), ముంథీజ్‌ (ఐటీఐ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషన్‌ విద్యార్థి), తౌఫీఖ్‌ (పళ్ల వ్యాపారి), తస్లీమ్‌ (ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ విద్యార్థి), షాకీర్‌ మహ్మద్‌ (రైతు) ఓ ముఠాగా ఏర్పాడ్డారు. వీరు ఏటీఎం మెషీన్‌ను ఏమార్చే విధానం గుర్తించారు. పరిచయస్తులు, స్నేహితుల ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్‌ చేరుకున్న ఈ ఐదుగురు రెండు బృందాలుగా ఏర్పడ్డారు.

సెక్యూరిటీ గార్డుల్లేని, పాత ఏటీఎం మెషీన్లను గుర్తించేవారు. తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో లావాదేవీ మొత్తం పూర్తి చేసేవారు. డబ్బులు వచ్చాక లావాదేవీ పూర్తయ్యేందుకు నాలుగైదు సెకన్ల సమయం ఉంటుంది. ఆ తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ సమయాన్నే ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది.

ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్‌కు ఉన్న కెమెరాకు చేయి అడ్డుపెట్టేవాడు. మరో వ్యక్తి ఆ మెషీన్‌లో సాంకేతిక సమస్య సృష్టించేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకొచ్చినా అందులో మాత్రం లావాదేవీ ఫెయిల్‌ అయినట్లు నమోదయ్యేది. ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్‌ ప్రింట్‌ వచ్చేది. దీన్ని వాట్సాప్‌ ద్వారా అసలు కార్డు వినియోగదారుడికి పంపేవాళ్లు. ఈ విషయం బ్యాంకుకు ఫిర్యాదు చేసి తిరిగి ఖాతాలో పడేలా చర్యలు తీసుకోవాలని కోరేవారని సాక్షి పేర్కొంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఫొటో సోర్స్, kcr/fb

'బిందెల గోస బంద్ గావాలె'

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్‌ భగీరథ పథకం నూటికి నూరుశాతం పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లు ఈనాడు తెలిపింది.

కచ్చితంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలని సీఎం అన్నారు.

కొండలు, గుట్టలు, అటవీ మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని ఆవాసాలకు మంచినీళ్లు అందివ్వాలని స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ లేదా మనిషి మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట ఎక్కడా కనిపించాల్సిన అవసరం లేకుండా చూడాలని.. పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఖర్చుకు వెనకాడొద్దని చెప్పారు.

సోమవారం ప్రగతి భవన్‌లో మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్లవారీగా పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ''అచ్చంపేట, సిర్పూర్‌ నియోజకవర్గాలు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూలల్లో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకూ మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి''

''జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరాకాని ఇల్లు ఒక్కటి కూడా మిగలొద్దు. అన్ని గ్రామాలతో పాటు దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలన్నింటికీ మిషన్‌ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ద్వారానే ప్రభుత్వ లక్ష్యం నేరవేరినట్లవుతుంది'' అని పేర్కొన్నట్లు ఈనాడు వెల్లడిచింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)