అయ్యలసోమయాజుల లలిత: తొలి భారతీయ మహిళా ఇంజనీరు తెలుగు అమ్మాయే

ఫొటో సోర్స్, Roots and Wings: Inspiring Stories of Indian Women
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
'150 ఏళ్ల కిందట సతీసహగమన ఆచారం మేరకు నేను కూడా నా భర్త చితిని ఎక్కాల్సి వచ్చుండేది.'
తొలి భారతీయ మహిళా ఇంజనీరు, అయ్యలసోమయాజుల లలిత ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ 1964లో జరిగిన మొదటి 'విమెన్ ఇంజనీర్స్ సొసైటీ' సమావేశంలో ఈ మాట అన్నారని చెబుతారు.
ఆమె మాటలో ఒక కృతజ్ఞత ఉంది. "హమ్మయ్య! నేనా కాలంలో లేను కాబట్టి బతికిపోయా" అనే భావం ఉంది. ఆడపిల్లగా, అంతకు మించి భర్తను పోగొట్టుకున్న స్త్రీగా, 1937 నాటి భారతీయ సమాజం, ముఖ్యంగా మధ్యతరగతి సమాజం, తనను ఇంజనీరింగ్ చదువుకోనిచ్చినందుకు, ఇంజనీరింగ్ వృత్తిని చేపట్టనిచ్చినందుకు.
చదువుకోనివ్వడం అనే మాటలో ఒకరు అనుమతిని ఇవ్వడమనే భావం ధ్వనిస్తుంది. ఇరవై ఒకటో శతాబ్దపు రెండో దశకం దాటిన మనకు, "విమెన్ ఎంపవర్‍మెంట్" అన్న పదబంధాన్ని అరగదీసిన మనకు, స్త్రీలు అలా ఒకరి అనుమతి మీద ఆధారపడ్డంపై అభ్యంతరాలు ఉండవచ్చు. కానీ, ఐక్యరాజ్యసమితి అధికార గణాంకాల ప్రకారం 2020 నాటికి ఇండియాలో రీసర్చ్ అండ్ డెవలెప్‍మెంట్ సంస్థల్లో ఉన్న 2,80,000 సైటింస్టులు, ఇంజనీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు!
సాంకేతిక విద్యారంగంలోనూ, ఉద్యోగరంగంలోనూ ఎన్నో పథకాలు, పారితోషికాలతో మహిళలను ప్రోత్సహిస్తున్నా అవి ఎందుకు తగిన ఫలితాలు ఇవ్వడం లేదనే ప్రశ్నలకి... తొట్టతొలి భారతీయ మహిళా ఇంజనీరుగా లలిత ప్రస్థానం తెలుసుకుంటే కొన్ని సమాధానాలు దొరకవచ్చు.

ఫొటో సోర్స్, Roots and Wings: Inspiring Stories of Indian Women
బాల్యం - విద్య
1919 ఆగస్టు 27న మద్రాసులో అంటే నేటి చెన్నైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు లలిత. తండ్రి పప్పు సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమెకన్నా పెద్దవారు నలుగురు, చిన్నవారు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆనాటి సమాజ పద్ధతుల ప్రకారం ఇంకా స్కూల్లో చదువుకుంటుండగానే, 15 ఏళ్ల వయసుకే 1934లో లలితకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లు స్కూల్ విద్య కొనసాగినా పదో తరగతి తర్వాత ఆమె చదువు ఆపేశారు.
1937లో శ్యామలకు జన్మనిచ్చారు లలిత. కూతురు పుట్టిన నాలుగు నెలలకే భర్త చనిపోవడంతో తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో ముందుగా క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు పని చేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండీలోనే (సి.ఈ.జి) 1940లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. తండ్రి సిఫార్సుతో ఆమెకు అక్కడ సీటు దొరకడం తేలికైంది.

ఫొటో సోర్స్, https://alltogether.swe.org/
కాంపస్ జీవితం
1940లలో కాంపస్ లైఫ్ ఎలా ఉండేదో ఇప్పుడు మనం ఊహించడం కష్టం. డాక్టర్ శాంతా మోహన్ రాసిన 'ఇన్‍స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్' అన్న పుస్తకంలో ఈ వివరాలు కొంత వరకు ఉన్నాయి.
అసలు, అమ్మాయిలే ఇంజనీరింగ్ కాలేజీల్లో లేని ఆ కాలంలో ముగ్గురు మహిళలు సి.ఈ.జిలో చదువుకున్నారు. లీలమ్మా జార్జ్, థెరిస్సా సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో లలితకు జూనియర్లుగా చేరినా రెండో ప్రపంచ యుద్ధం వల్ల ముగ్గురూ 1943లోనే ఇంజనీరింగ్ పట్టా పొందారు.
లలితకి 25 ఫిబ్రవరి,1944లో ఇచ్చిన డిగ్రీ సర్టిఫికేట్‍లో 'హీ పాస్డ్ ది ఎగ్జామినేషన్' అనే వాక్యంలో 'హీ' (అతను) అనే పదాన్ని కొట్టేసి 'షీ' (ఆమె) అని చేతితో సవరించడం ఆనాటి పరిస్థితులకి అద్దం పడుతుంది.
మహిళా విద్యార్థులు ఈ కోర్సులు చేయడం ఎంత అరుదంటే వారి జెండర్ కోసం ప్రత్యేకించి సర్టిఫికేట్ తయారు చేయించలేదు. లేదా హీ/షీ అనే ఎంపిక ఇవ్వలేదు. అలాంటి కాలంలో ఈ ముగ్గురు మహిళలు పట్టభద్రులయ్యారు!
లలిత చదువుకునే కాలంలో కాంపస్‍లో అమ్మాయిలకి సౌకర్యంగా ఉండేదనీ ఆమె కుమార్తె శ్యామల వాస్టిక్.కామ్‍కి ఇచ్చిన కోట్‍లో అన్నారు. వందల మంది అబ్బాయిలున్న కాలేజీలో ఏకైక అమ్మాయిగా తన తల్లికి పెద్దగా ఇబ్బందులేం ఎదురవలేదని, లలిత కోసం హాస్టల్ అధికారులు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారని శ్యామల తెలిపారు.
అప్పటికి ఆరేడేళ్ల వయసులో శ్యామలను ఆమె బంధువుల దగ్గర ఉంచారు. కుటుంబ సహకారం ఉండడంతో లలిత తన ఇంజనీరింగ్ కోర్సు నిరాటంకంగా పూర్తి చేయగలిగారు.

ఫొటో సోర్స్, Roots and Wings: Inspiring Stories of Indian Women
ఉద్యోగాల్లో రాణించడం
డిగ్రీ పూర్తి చేయడానికి కావాల్సిన ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం లలిత 1943లో ఒక ఏడాది పాటు జమల్‍పూర్ రైల్వే వర్క్-షాప్‌లో పనిచేశారు. అది ఈస్టిండియా కంపెనీవారు 1862లో ప్రారంభించిన పూర్తిస్థాయి వర్క్-షాప్ ఫెసిలిటీ. తర్వాత 1944లో ఆమె సెంట్రల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సిమ్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‍గా పనిచేశారు. తర్వాత తండ్రికి రీసెర్చ్‌లో సాయం చేయడానికి ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. లలిత తండ్రి పేరు మీద అనేక పేటెంట్లు ఉన్నాయి.
1948లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఆ పని కూడా మానేయాల్సి వచ్చింది. 1928లో స్థాపించిన బ్రిటీష్ కంపెనీ, అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్‌కు చెందిన కలకత్తా ఆఫీసులో ఎలక్ట్రికల్ విభాగంలో లలిత చేరారు. అక్కడ డిజైన్ ఇంజనీర్‍గా ట్రాన్స్‌మిషన్ లైన్స్ మీద చేసిన పని ఆమెకు గుర్తింపును తెచ్చింది.
భారతదేశంలో అతి పెద్ద రిజర్వాయర్లలో ఒకటైన భాక్రా నంగల్ డామ్‍కి కావాల్సిన ఎలక్ట్రికల్ జనరేటర్ల మీద ఆమె పని చేశారు. కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్లే కొద్దీ డిజైన్ పనిని పక్కన పెట్టారు లలిత. ఇంగ్లాండులో పరికరాలని తయారుచేస్తున్నవారికి, ఇక్కడ ప్రాంతీయంగా పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం, సర్వీసు అందించే ఇంజనీర్లకి మధ్య వారధిగా ఆమె పని చేశారు. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్‌లో 30 ఏళ్లకు పైగా లలిత పని చేశారు.
పురుషులే అధికంగా ఉండే పని స్థలాల్లో ఆమె ఇన్ని ఉద్యోగ బాధ్యతలను, సింగిల్ పేరెంట్‍గా ఆ రోజుల్లోనే నెట్టుకుని వచ్చారు. కుటుంబానికి దగ్గరగా ఉండి, కూతుర్ని బాగా చూసుకోగలిగే నిర్ణయాలనే కెరీర్ పరంగా తీసుకున్నారు.

ఫొటో సోర్స్, https://alltogether.swe.org/
అప్పట్లోనే Women in STEM ఛాంపియన్
ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇంజనీరింగ్ వృత్తిని చేపట్టడం 1920-30 మధ్య ఊపందుకున్నా రెండో ప్రపంచయుద్ధం నాటికి ఇది మరింత పెరిగిందని electrifyingwomen.org చెబుతోంది. 1960లలో మొదలైన అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, సైంటిస్టుల సమావేశాలే దీనికి నిదర్శనమని చూపించింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన అంతమవడంతో మహిళలకు ఇంజనీరింగ్‌లో అవకాశాలు పెరిగాయి. అంతర్జాతీయ సమావేశాల్లో ఇండియాను ప్రపంచ మ్యాప్ మీద నిలబెట్టిన వారు లలిత.
ఆమె 1953లో ఇన్‍స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (IEE), లండన్ కౌన్సిల్‌లో అసోసియేట్ మెంబర్‍గా ఆ తరువాత 1966లో పూర్తి స్థాయి మెంబర్‍గా ఎన్నికయ్యారు.
జూన్, 1964లో న్యూయార్క్ లో జరిగిన తొలి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి (ICWES) ఆహ్వానాన్ని అందుకున్నారు లలిత. అప్పటికి ఆ సంస్థకు ఇండియాలో ఎలాంటి చాప్టర్ లేకపోయినా ఈ ఆహ్వానం రావడం, దానికోసం వ్యక్తిగత స్థాయిలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆమె ఆ సమావేశానికి హాజరు కావడం విశేషం.
ఆ సమావేశంలో 35 దేశాల నుంచి 500 మంది మహిళా ఇంజనీర్లు పాల్గొన్నారు. అక్కడనుంచి తిరిగి వస్తూ బ్రిటన్‌లో AEI కంపెనీని ఆమె సందర్శించారు. ప్రముఖ వార్తాపత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎలెక్ట్రికల్ న్యూస్, ఫెమీనా, ఈవ్స్ వీక్లీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. స్త్రీ సాంకేతిక విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. 'బ్రిటీష్ ఫ్యాక్టరీలు సందర్శించిన భారతీయ తొలి మహిళా ఇంజనీర్' అని అప్పట్లో వార్తాకథనాలు వెలువడ్డాయి.
1967లో జరిగిన రెండో అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి మరో ఐదుగురు భారతీయ మహిళలు హాజరయ్యేట్టు ఏర్పాట్లు చేశారు!
లలిత అరవై ఏళ్ళ వయసులో, రిటైర్ అయిన రెండేళ్ళకే, 1979 అక్టోబర్ 12న బ్రెయిన్ ఎన్యూరిజం(brain aneurysm)కి గురై మృతిచెందారు.

ఫొటో సోర్స్, The Woman Engineer, Winter, vol 9
ఇప్పుడు లలితను ఎలా తలుచుకుంటున్నారు?
ఈ కథనం రాసేందుకు అవసరమైన సమాచారం వెతికేటప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి.
అంతర్జాతీయంగా గానీ, జాతీయంగా గానీ మహిళా ఇంజనీర్లు ప్రస్తావన వస్తే అక్కడ లలిత గురించి ఒక మాటైనా ఉంది. ఆమె చేసిన ఇంజనీరింగ్ పనితో పాటుగా స్త్రీ సాంకేతిక విద్య కోసం ఆమె తీసుకున్న చొరవని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకున్నారు. డా. శాంతా మోహన్ రాసిన పుస్తకం 'ఇన్‍స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్' లలిత మీద రాసిన వ్యాసం తోనే మొదలవుతుంది.
సాంకేతిక, ఇంజనీరింగ్ సంస్థలు, యూనివర్సీటీలు ఆమెను ఈ మధ్యకాలంలో మళ్లీ తలచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
Women in Engineering Affinity Group అనే గ్రూప్ ద్వారా 2019లో ఆమె పేరు మీద IEEE హైదరాబాద్ విభాగం 'లలిత మెమోరియల్ లెక్చర్' నిర్వహించింది. ప్రతి ఏడాది ఈ లెక్చర్ సిరీస్ కొనసాగించాలన్నది వారి లక్ష్యం. పంజాబ్‍లోని ప్లక్షా యూనివర్సిటీలో 'అయ్యల సోమయాజుల లలిత ఫండ్' ఏర్పాటు చేసి ఎక్కువమంది బాలికలు, మహిళలు సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యను చేపట్టేలా చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Blush
లలిత గురించి కొత్త తరాలకు తెలియాలి
ఈ కింది రెండు ట్వీట్లని గమనించండి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ & మాథ్ (STEM) లో గ్రాడ్యుయేట్ అవుతున్న మహిళల శాతం గణాంకాలని చూస్తే ఇండియా దక్షిణాఫ్రికాతో సమానంగా 43 శాతంతో మొదటి స్థానంలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ విషయంలో అమెరికా, గ్రేట్ బ్రిటన్ లాంటి ధనిక దేశాలు కూడా కింద ఉన్నాయి. కానీ, ఇంతమంది పట్టభద్రులు అవుతున్నా అనేక కారణాల వల్ల మన అమ్మాయిలు ఉద్యోగం, రీసెర్చ్‌లోకి ఎక్కువగా రాలేక పోతున్నారు. ఈ విషయంలో 15 శాతంతో భారత్ చాలా అడుగున ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు ఉన్నత స్థాయిలకు ఎదగలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహిళా విద్యను, కెరీర్‍లను 'అవసరానికి పనికొస్తుందిలే' అన్న వైఖరితో చూడడం. మ్యారేజ్ మార్కెట్‌లో అమ్మాయిలకి గిరాకీ ఉండటం కోసం ఎంసెట్లు, ఇంజనీరింగ్ సీట్ల హంగామా ఉన్నా, ఒకసారి పెళ్లైపోయాక ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకోవచ్చనే వైఖరి. లలిత జీవితకాలంతో పోల్చుకుంటే వైజ్ఞానికపరంగా మనం ఎంత ముందుకు సాగినా స్త్రీ విద్య, వృత్తి విషయాల్లో ఇంకా సాధించాల్సిన పురోగతి ఎంతో ఉంది.
అందుకే, లలిత జీవితం స్ఫూర్తిదాయకం. 18వ ఏటనే భర్తను పొగొట్టుకోవడం దారుణమే. అయినా, ఆమె తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకున్నారు. అందుకు, ఆనాటి పరిస్థితుల్లో కష్టతరమైన ఇంజనీరింగునే ఎన్నుకున్నారు. తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో డిగ్రీ చేయగలిగినా, చిన్న పాపను చూసుకుంటూ ఆనాటి ఎలక్ట్రికల్ కంపెనీల్లో నెట్టుకురాగలిగారంటే అది కుటుంబ సభ్యుల సహాయ సహకారాల వల్లనే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












