మగ డాక్టర్లతో సర్జరీ చేయించుకున్న మహిళలు ఎక్కువగా చనిపోతారా?

వియత్నాంలోని ఒక హాస్పిటల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళా సర్జన్లలాగా స్త్రీల సమస్యలను పురుష డాక్టర్లు అర్ధం చేసుకోరని అధ్యయనంలో తేలింది
    • రచయిత, కాగిల్ కాసపోగ్లు
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

మీరు సర్జన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం పడిందా ? అయితే తప్పకుండా మహిళా సర్జన్ దగ్గరికే వెళ్లండి. ఎందుకంటే మహిళా సర్జన్ దగ్గరకు వెళితేనే మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే, మహిళా సర్జన్లతో పోలిస్తే మగ సర్జన్లు ఆపరేషన్ చేస్తే మహిళలు చనిపోయే అవకాశం 32% ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

అయితే, సర్జన్ ఆడ అయినా, మగ అయినా పురుషులలో ఇలాంటి మరణాలు తక్కువని తేలింది.

అలాగే, మగ సర్జన్ల దగ్గర ఆపరేషన్‌లు చేయించుకున్న మహిళలు నెల రోజుల్లో మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఎక్కువసార్లు కలిగిందని కూడా ఈ అధ్యయనం తేల్చింది.

మరి ఇలా ఎందుకు జరుగుతోంది? కారణం తెలుసుకోలేకపోయాం అంటున్నారు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన క్రిస్టోఫర్ వాలీస్.

తమ అధ్యయనంలో తేలిన ఈ విషయానికి కారణాలు కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నామని క్రిస్టోఫర్ బీబీసీతో అన్నారు.

మరి మహిళా సర్జన్ల చేతిలో ఎందుకు సురక్షితంగా ఉంటారన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొందరు మహిళా సర్జన్లను సంప్రదించాం. వారు చెప్పిన కొన్ని అంశాలు ఇవి.

ఒనీకా విలియమ్స్

ఫొటో సోర్స్, Hospital Emerson

ఫొటో క్యాప్షన్, "మహిళలు ఎక్కువగా ఆందోళనతో ఉంటారని పురుషులు భావిస్తుంటారు. శస్త్ర చికిత్స తరువాత వారు మహిళలు చెప్పే సమస్యలను పెద్దగా పట్టించుకోరు" అని యూరాలజిస్ట్ ఓనీకా విలియమ్స్ అన్నారు

బాధ పట్ల అవగాహన

కెనడాలోని ఒంటారియోలో 2007-2019 సంవత్సరాల మధ్య కాలంలో 2,937మంది సర్జన్ల దగ్గర చికిత్స పొందిన సుమారు 10 లక్షలమంది రోగులను ఈ అధ్యయనం పరిశీలించింది.

మగ సర్జన్ల దగ్గర చికిత్స పొంది మహిళా రోగులు ఎందుకు ఎక్కువమంది మరణించారు అన్నదానికి కచ్చితమైన సమాధానం దొరకలేదు. కానీ, అందుబాటులో ఉన్న ఇతర మెడికల్ లిటరేచర్‌లో దీనికి కొన్ని వివరణలు కనిపించాయి.

ఇందులో కనిపించిన ఒక కారణం బాధ పట్ల అవగాహన. మగ వైద్యులకు మహిళా రోగులలోని లక్షణాల తీవ్రతను తక్కువగా అంచనా వేస్తారు.

అమెరికా బోస్టన్ నగరంలోని టఫ్ట్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో యూరాలజిస్ట్‌గా పని చేస్తున్న ఒనీకా విలియమ్స్ దీనితో ఏకీభవించారు.

‘‘మహిళల కంప్లయింట్ల విషయంలో పురుష డాక్టర్లు పక్షపాతంతో వ్యవహరిస్తారు. మహిళలు ప్రతిదానికి కంగారు పడతారని, తొందర పెడతారని వాళ్లు భావిస్తారు. అందుకే శస్త్రచికిత్స అనంతర ఫిర్యాదులపై వాళ్లు తక్కువ శ్రద్ధ చూపించే అవకాశం ఉంది’’ అని ఒనీకా అన్నారు.

‘‘నొప్పి అని చెప్పినా లెక్క చేయరు. బాధను తక్కువ అంచనా వేస్తారు’’ అన్నారామె.

న్యూయార్క్‌లోని నార్త్‌వెల్ హెల్త్ యూనివర్సిటీలో వాస్కులర్ సర్జన్ అయిన జెన్నిఫర్ స్వాన్ కూడా ఇది నిజమేనంటున్నారు.

"మగ సర్జన్లు ఒక మహిళా రోగి ఆందోళనలు, సమస్యలను సీరియస్‌గా పట్టించుకునే అవకాశం తక్కువ’’ అన్నారామె. అందుకే వారి మహిళా పేషెంట్లలో మరణాల రేటు ఎక్కువగా ఉండొచ్చని స్వాన్ అభిప్రాయపడ్డారు.

మహిళా సర్జన్ నాన్సీ బాక్స్‌టర్

ఫొటో సోర్స్, Unidad de Salud de Toronto

ఫొటో క్యాప్షన్, "సర్జన్లు అనగానే అందరికీ మగవారే గుర్తుకు వస్తారెందుకు" అని ప్రశ్నిస్తున్నారు టొరంటో యూనివర్సిటీలో మహిళా సర్జన్ నాన్సీ బాక్స్‌టర్

యాటిట్యూడ్ ప్రాబ్లం

‘‘పురుషుల కన్నా, మహిళల్లో బాధను చాలామంది తక్కువ అంచనా వేస్తారు’’ అని టొరంటో యూనివర్సిటీలో సెయింట్ మైఖేల్స్ కాలేజ్ హాస్పిటల్‌లో కొలొరెక్టల్ సర్జన్ అయిన నాన్సీ బాక్స్‌టర్ అన్నారు.

అయితే, ఈ మరణాలకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. "ప్రజలు సర్జన్ దగ్గరకు వెళ్లాలంటే మగ సర్జన్ గురించే ఆలోచిస్తారు’’ అన్నారామె.

‘‘ఒక రోగిని చూసినప్పుడు అతని జెండర్‌ ఏంటనే దానిపై మగ సర్జన్ల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో స్త్రీ, పురుష సర్జన్ల వ్యవహార శైలిలో తేడా ఉంటుంది’’ అని బాక్స్‌టర్ బీబీసీతో అన్నారు.

మగ కార్డియాలజిస్టుల కంటే మహిళా కార్డియాలజిస్టులు రోగులను మెరుగ్గా చూస్తారని, ఇది మెరుగైన ఫలితాలకు దారితీస్తుందని ఆమె అన్నారు.

ఇందుకు గుండె సమస్యలతో బాధపడుతున్న రోగుల మీద జరిపిన ఓ అధ్యయనాన్ని ఆమె ఉదహరించారు.

‘‘సర్జరీ ఫెయిల్యూర్స్‌లో మగ వైద్యులకన్నా ఆడ వైద్యులు ఎక్కువగా పనిష్మెంట్‌కు గురవుతారని మాకు తెలుసు. వాళ్ల రిజల్ట్స్ తక్కువగా ఉంటే రిఫరల్స్ కూడా తక్కువగా వస్తాయి’’ అన్నారామె.

‘‘అందుకే మహిళా సర్జన్లు ఎక్కువ శ్రద్ధతో పని చేస్తారు’’ అని బాక్స్‌టర్ వివరించారు.

డాక్టర్ జెన్నిఫర్ స్వాన్

ఫొటో సోర్స్, Jennifer Svahn

ఫొటో క్యాప్షన్, పురుష సర్జన్లు మహిళా రోగుల లక్షణాలు, సమస్యల పట్ల తక్కువ శ్రధ్ధ చూపిస్తారని వాస్క్యులార్ సర్జన్ డాక్టర్ జెన్నిఫర్ స్వాన్ అంటున్నారు.

కమ్యూనికేషన్

‘‘బలమైన భావోద్వేగాలతో కూడిన మేధస్సు, తాదాత్మ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మహిళా సర్జన్ల సక్సెస్ రేటుకు కారణం కావచ్చు’’ అని విలియమ్స్ విశ్లేషించారు.

మహిళా వైద్యులు వారి రోగులతో మాట్లాడే విధానం కూడా వాళ్ల సమస్యను అర్ధం చేసుకోవడంలో ఉపయోగపడుతుందని యూనివర్శిటీ ఆఫ్ కాన్సాస్ మెడికల్ సెంటర్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ అయిన కిమ్ టెంపుల్టన్ అంటున్నారు.

రోగ నిర్ధారణ చేయడానికి, చికిత్సను సిఫార్సు చేయడానికి అవసరమైన సమాచారాన్ని బయటకి చెప్పుకోవడంలో డాక్టర్-పేషెంట్ మధ్య సంబంధం కీలకమని టెంపుల్టన్ అన్నారు.

‘‘శస్త్ర చికిత్స సమస్యలు, ఆందోళనలను అర్ధం చేసుకుని, వాటిని ఆరంభంలోనే పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది’’ అన్నారామె.

రోగి స్త్రీ, వైద్యుడు పురుషుడు అయినప్పుడు ఈ రిలేషన్ దెబ్బతింటుందని గతంలో జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కమ్యూనికేషన్ సమస్య కేవలం వైద్యుడిపై మాత్రమే ఆధారపడి ఉండకపోవచ్చు.

పురుషులలో ఆపరేషన్ అనంతర నొప్పులను మహిళా సర్జన్లు కూడా తక్కువ అంచనా వేసే అవకాశం ఉందని కూడా ఒంటారియో అధ్యయనం పేర్కొంది. దీనిని స్వాన్ కూడా అంగీకరించారు.

మహిళా డాక్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

సర్జన్‌గా నేను...

పురుషులు ఆధిపత్యం చెలాయించే ఈ రంగంలో లింగ వివక్ష చాలా కాలం నుంచి ఉంది. మహిళలు ఈ వృత్తిని వదిలేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

2015లో మహిళా సర్జన్లు #ILookLikeaSurgeon అనే నినాదంతో ఈ వివక్షను సవాలు చేస్తూ ట్విట్టర్‌లో ఉద్యమం మొదలు పెట్టారు.

మహిళా సర్జన్లకు నిత్యం తమ జెండర్‌ ను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విలియమ్స్ అన్నారు.

‘‘చాలామంది రోగులు, సిబ్బంది నన్ను సర్జన్‌గా భావించరు. నేను వేరే పనేదో చేసేదాన్నిలాగా భావిస్తుంటారు’’ అన్నారు విలియమ్స్.

‘‘నన్ను మెడికల్ అసిస్టెంట్ అనో, సెక్రటరీ అనో, డైటీషియన్, ఇంకా నా అదృష్టం బాగుంటే నర్స్ అనో అనుకుంటుంటారు’’ అన్నారామె.

‘‘కొన్నిసార్లు నన్ను నేను రోగికి పరిచయం చేసుకుని, రోగ నిర్ధరణ, శస్త్రచికిత్సా విధానం, సమస్యలు, ప్రయోజనాల గురించి చర్చించిన తర్వాత కూడా, నాకు సర్జరీ చేసేది ఎవరు అని అడుగుతుంటారు’’ అన్నారు విలియమ్స్.

‘‘మహిళా సర్జన్లు తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి చాలా షో చేయాల్సి ఉంటుంది’’ అని విలియమ్స్ అభిప్రాయపడ్డారు.

‘‘మగ సర్జన్లు ఉన్నతమైనవారని రోగులకు ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది. అందుకే మేం మగ సర్జన్ల కంటే తక్కువైన వాళ్లం అనే భావనను పొగట్టడానికి ప్రయత్నిస్తుంటాం. ఇందుకోసం అదనంగా శ్రమ తీసుకుని ప్రతి రోగిని పరిశీలిస్తుంటాం’’ అని విలియమ్స్ అన్నారు.

మహిళా డాక్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

లింగ అసమానత్వం

ఈ అధ్యయనం ఫలితాలు జనాభాలో ఒక ట్రెండ్‌ను చూపుతుందని, దాని అర్ధం మగ డాక్టర్ల వల్ల ఆడ పేషెంట్లు అంతా నష్టపోతారని అర్ధం కాదని ఈ అధ్యయనం నిర్వహించిన క్రిస్టోఫర్ వాలీస్ అన్నారు.

‘‘మహిళా సర్జన్ల కారణంగా రోగులు మెరుగ్గా చికిత్స పొందుతున్నారంటే, సర్జరీలలోని అన్ని విభాగాలలో మహిళల సంఖ్యను పెంచాలి. ఎక్కువమందిని రోగులకు అందుబాటులో ఉంచాలి’’ అన్నారు స్వాన్.

శస్త్ర చికిత్స విభాగంలో లింగ సమతుల్యతను మెరుగుపరచాల్సిన అవసరముందని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫియోనా మైంట్ అన్నారు.

అయితే, మహిళా సిబ్బంది సెక్సిజం సమస్యను ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారిందని విలియమ్స్ అభిప్రాయపడ్డారు.

‘‘ఒక రోజు రాత్రి నేను ఒక మగ పేషెంట్‌ను చూడాల్సి వచ్చింది. అతనికి కంగారు తగ్గించడానికి నర్స్ అతనితో జోక్‌లు వేస్తోంది. నువ్వు ఆమె వచ్చినప్పుడు నిన్ను కంట్రోల్‌లో పెట్టుకో. సరసాలాడొద్దు అని ఆ పేషెంట్‌తో నర్సు చెప్పింది’’ అన్నారు విలియమ్స్.

‘‘అతను ఒక పురుషుడు అన్న భావనతో ఆమె నన్ను అతని ముందు ఒక వస్తువుగా మార్చింది. ఆ రోగి నన్ను సర్జన్‌గా కాకుండా, అగౌరవపరచదగిన, హద్దు మీరదగిన మహిళగా చిత్రించింది’’ అని విలియమ్స్ గుర్తు చేసుకున్నారు.

సెక్సిజం, లింగ వివక్షలను అధిగమించడం అనేవి మహిళలను ఈ వృత్తి లోకి ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయని విలియమ్స్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి బాక్స్‌టర్ చెప్పిందని కరెక్టేనని, సర్జన్ అంటే పురుష సర్జన్ అనే చాలామంది భావిస్తారని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)