'శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా కేరళ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?’ - తృప్తి దేశాయ్

తృప్తి దేశాయ్

ఫొటో సోర్స్, TRUPTI DESAI / FACEBOOK

ఫొటో క్యాప్షన్, తృప్తి దేశాయ్
    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శబరిమల ఆలయంలోకి తమను వెళ్లకుండా కేరళ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని భూమాత బ్రిగేడ్ సామాజిక ఉద్యమ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ప్రశ్నిస్తున్నారు.

నవంబర్ 20 తర్వాత తమ సంస్థలోని మరో నలుగురు మహిళలతో కలిసి తాను ఆలయంలోకి వెళ్తానని ఆమె చెబుతున్నారు.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రవేశించకుండా నిషేధం ఉండేది.

అయితే, 2018, సెప్టెంబర్ 28న వయసుతో సంబంధం లేకుండా మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది.

ఆ తీర్పు వెల్లడైన తర్వాత తృప్తి దేశాయ్ కోచి విమానాశ్రయంలో కొన్ని గంటలపాటు నిరీక్షించారు.

శబరిమల ఆలయంలోకి ఆమె వెళ్లాలనుకున్నారు. అయితే, భారీ నిరసనల కారణంగా ఆమె ప్రయత్నం ఫలించలేదు.

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గతవారం రివ్యూ బెంచ్ పరిశీలనకు వెళ్లింది. ఆలయాలతో పాటు చర్చిలు, మసీదులు, పార్సీ మందిరాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న కేసులనూ రివ్యూ బెంచ్ పరిశీలించనుంది.

మరోవైపు శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళా యాక్టివిస్టులకు భద్రత కల్పించబోమని కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రకటించింది.

శబరిమల ఆలయం భక్తుల సందర్శనార్థం శనివారం సాయంత్రం తెరుచుకుంది. మరో రెండు నెలలపాటు భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని అనుమతించొద్దని ప్రభుత్వానికి న్యాయపరమైన సలహా అందినట్లు కథనాలు వచ్చాయి.

2018లో కేరళ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన వైఖరి ప్రదర్శించింది. అప్పుడు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళలందరికీ పోలీసు రక్షణ కల్పించింది.

సుప్రీం తీర్పును నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని, గత ఏడాదిలా ఈ అంశంపై మళ్లీ 'రాజకీయాలు' చేయుద్దని కేరళ దేవస్థానాల శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

శబరిమల ఉద్యమ ప్రదర్శనలు చేసే చోటు కాదని, ప్రచారం కోసం ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటనలు చేసేవారికి తమ ప్రభుత్వం సహకరించబోదని ఆయన స్పష్టం చేశారు.

శబరిమల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

గతేడాది సుప్రీం తీర్పు తర్వాత కేరళలో బీజేపీ, ఇతర రైట్ వింగ్ సంస్థల నుంచి పెద్ద స్థాయిలో నిరసనలు వచ్చాయి.

కోర్టు తమను ఆలయంలోకి అనుమతించకుండా స్టే ఏమీ ఇవ్వలేదని, కేరళ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని తృప్తి దేశాయ్ ప్రశ్నిస్తున్నారు.

''సుప్రీం కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అవమానిస్తోంది. యాక్టివిస్ట్‌లు సుప్రీం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని అంటోంది. భక్తులను, యాక్టివిస్ట్‌లను మీరు వేరు చేసి ఎలా చూస్తారు? మేం రెండు కేటగిరీల్లోకి వస్తాం'' అని ఆమె అన్నారు.

అయితే, శబరిమల ఆలయంలోకి ప్రవేశం విషయంలో మహిళల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి.

మహిళల మతపరమైన హక్కుల కోసం తాను నిలబడతానని కోచికి చెందిన న్యాయవాది శ్యామా కురియకోస్ అన్నారు. ప్రపంచంలో అసలు వివక్షే ఉండని ప్రదేశాల్లో శబరిమల ఒకటని ఆమె అభిప్రాయపడ్డారు.

గుడిలోకి ప్రవేశించే భక్తులందరూ దీక్ష చేసి ఉండాలని శ్యామా అన్నారు. శబరిమల పుణ్య క్షేత్రమని, పర్యటక స్థలం కాదని వ్యాఖ్యానించారు.

''భక్తితో వెళ్లాలనుకునేవారిని ఎవరూ అడ్డుకోకూడదు. శబరిమల ఆలయం మహిళలకు వ్యతిరేకమన్న భావన మాకు ఎప్పుడూ లేదు. ప్రపంచంలోనే అసలు వివక్షే ఉండని ప్రదేశాల్లో శబరిమల ఒకటి'' అని శ్యామా అన్నారు.

కేరళలోని కన్నూర్‌లో మహిళలను మాత్రమే అనుమతించే ఆలయాలు చాలా ఉన్నాయని ఆమె చెప్పారు.

''మహిళల్లో ఓ వర్గం అయ్యప్ప దర్శనం చేసుకోవాలనుకునేవారైతే.. ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా లింగ సమానత్వ అంశాన్ని చాటాలనుకుంటున్న వర్గం మరొకటి. ఈ పరిణామంతోనే రాజకీయ పార్టీలు కూడా ఇందులో జోక్యం చేసుకున్నాయి'' అని శ్యామా అన్నారు.

శబరిమల తీర్పు రివ్యూ బెంచ్ పరిశీలనకు పంపడాన్ని బీజేపీ స్వాగతించింది.

2014లో బీజేపీ మేనిఫెస్టోలో 'ఉమ్మడి పౌర స్మృతి వచ్చే వరకూ దేశంలో లింగ సమానత్వం రాదని మా పార్టీ విశ్వసిస్తోంది' అని పేర్కొన్నారు.

2016లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తామని బొంబాయి హైకోర్టుకు విన్నవించింది.

ట్రావెన్‌కోర్ దేవస్థానం ట్రస్టు నిర్వహణలో శబరిమల ఆలయం ఉంది. కేరళ ప్రభుత్వానికి ఇది అనుబంధ సంస్థ.

శబరిమల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

2018లో శబరిమల ఆలయంపై తీర్పునిస్తూ.. ''మహిళలపై సెలెక్టివ్ నిషేధం హిందూయిజంలో అనివార్యమైన అంశం కాదు'' అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్ర అన్నారు.

తాజాగాతో సుప్రీం కోర్టు మరోసారి 'అనివార్య మతాచారాల'ను నిర్వచించే పనిని తలకెత్తుకుంది.

1958లో తొలిసారి ఈ అంశం కోర్టు ముందుకు వచ్చింది. 'అంటరానితనం' హిందూ మతంలో అనివార్యమైన అంశం కాదని అప్పుడు కోర్టు తేల్చింది.

2018 శబరిమల తీర్పులో.. మహిళల ప్రవేశంపై నిషేధం కూడా, ఒక రకమైన 'అంటరానితనమే'నని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

శబరిమల ఆలయ ప్రవేశం అంశంలో కులపరమైన కోణం కూడా ఉందని శ్యామా కురియకోస్ అన్నారు.

పాండాలం రాజులు ఆ ప్రాంతంలోకి రాక ముందు శబరిమల ఆలయం నిర్వహణ మాలా అరయ ఆదివాసీ వర్గం చేతుల్లో ఉండేది.

మాలా అరయ తెగకు చెందిన కందన్, కరుతమ్మ అనే దంపతులకు అయ్యప్ప జన్మించారని ఆదివాసీలు నమ్మేవారు. 12వ శతాబ్దంలో ఆలయం ఏర్పాటైంది. 1950లో ఆలయ నియంత్రణ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చేతుల్లోకి వచ్చింది.

''అది ఆదివాసీల ప్రాంతం. వారి ఆచారాల్లో లింగ వివక్ష ఏమీ లేదు. 160 ఏళ్ల క్రితం రాజులు ఆ ఆలయాన్ని తమ పాలనలోకి తీసుకున్నారు. ఆదివాసీల హక్కులను పట్టించుకోలేదు. లింగ సమానత్వమే కాదు, ఇక్కడ కుల పోరాటం ఉంది. ఆలయంపై తమ హక్కులను పునరుద్ధరించుకోవాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. సుప్రీం కోర్టు గత తీర్పు సమయంలో ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. ఇప్పుడు ఈ వివాదం మతానికి, నాస్తికులకు మధ్య పోరాటంలా మారింది. వాటిని చల్లార్చే బాధ్యత ప్రభుత్వం మీద పడింది'' అని శ్యామా అన్నారు.

తృప్తి దేశాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తృప్తి దేశాయ్

ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం కోసం వాదిస్తూ రవి ప్రకాశ్ అనే న్యాయవాది.. శబరిమల స్వతంత్ర మత సంస్థ కాదని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు ప్రభుత్వ నిధులు అందుతాయని అన్నారు.

గతేడాది తీర్పు పరిధిని విస్తృతం చేస్తూ, సమీక్ష జరపాలని కోర్టు తీసుకున్న నిర్ణయం సరైందని పీపుల్ ఫర్ ధర్మ సంస్థ తరఫున వాదిస్తున్న సాయి దీపక్ అంటున్నారు.

మతపరమైన విషయాల్లో లౌకిక రాజ్యాంగ సంస్థలైన కోర్టులు ఎంతవరకూ జోక్యం చేసుకోవచ్చన్న ప్రశ్నపైనా కోర్టు ఇప్పుడు దృష్టి సారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తృప్తి దేశాయ్ లాంటి వారు మాత్రం ఈ వాదనలతో సంతృప్తి చెందడం లేదు.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించే హక్కును కోర్టే కల్పించిందని, స్టే ఆర్డర్ ఏదీ లేనందున తాను ఆలయానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.

''నన్ను వాళ్లు అడ్డుకోలేరు'' అని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)