షేన్ వార్న్: లిక్విడ్ డైట్‌లతో బరువు తగ్గుతుందా, అవి సురక్షితమేనా

లిక్విడ్ డైట్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిలిప్పా రాక్స్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ గత శుక్రవారం చనిపోయారు. అంతకుముందు ఆయన త్వరగా బరువు తగ్గడానికి 14 రోజులుగా లిక్విడ్ డైట్‌లో ఉన్నట్లు సమాచారం.

చనిపోవడానికి కొన్ని రోజుల ముందు షేన్ వార్న్ ట్విట్టర్‌లో ఒక పాత ఫొటో పెట్టి, "జూలై కల్లా నేను బరువు తగ్గి ఇలా (ఈ ఫొటోలో ఉన్నట్టు) అయిపోవాలి" అని రాశారు.

వార్న్ ఇంతకుముందు ఇలాంటి డైట్ ప్లాన్ అనేకసార్లు ప్రయత్నించారని ఆయన స్నేహితులు చెప్పారు. అయితే, ఆయన ఆకస్మిక మరణానికి కారణం అదే అనడానికి ఆధారాలేమీ లేవు.

ఇలాంటి డైట్‌లు ఎంతవరకు సురక్షితం? శరీరంపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

వీడియో క్యాప్షన్, లిక్విడ్ డైట్‌తో బరువు తగ్గడం సాధ్యమేనా?

లిక్విడ్ డైట్‌ల ప్రయోజనం ఏమిటి?

లిక్విడ్ డైట్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటి లక్ష్యం ఒకటే.. శరీరానికి తక్కువ కేలరీలు అందిస్తూ త్వరగా బరువు తగ్గడమే.

తక్కువ కేలరీలు ఇచ్చే షేక్స్, సూప్స్ కన్నా పండ్లు, కూరగాయల రసాలు మెరుగని చాలామంది భావిస్తారు. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయని, చర్మాన్ని కాంతిమంతం చేస్తాయని నమ్ముతారు.

అయితే, ఇలాంటి విపరీతమైన డైట్‌లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, చాలామందికి సరిపడకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బరువు తగ్గాలనుకునేవారు డాక్టర్ల పర్యవేక్షణలో డైట్ ప్లాన్ చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే చాలా రకాల డైట్‌లు ఎంతవరకు పనిచేస్తాయో తెలీదు. ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలీదు.

"జ్యూస్ డైట్‌లు చాలామందిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే, వాళ్లకు సమస్య త్వరితంగా పరిష్కారం కావాలి. కానీ, డైటింగ్ చేయడం చాలా కష్టం" అని బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్‌కు చెందిన ఐస్లింగ్ పిగోట్ చెప్పారు.

"డైటింగ్ పనిచేస్తుంది. కానీ, అందరికీ అన్నీ ఒకేలా పనిచేయవు. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా వీటిని మార్కెట్ చేస్తే మాత్రం విచారం కలుగుతుంది" అని ఆమె అన్నారు.

పండ్లు, కూరగాయల రసాలు శరీరానికి మినరల్స్, విటమిన్స్ అందిస్తాయి. కానీ, కొవ్వు పదార్థాలు ప్రొటీన్లను అందించవు. ఫైబర్ కూడా తగినంత అందదు. పండు మొత్తాన్ని తొక్క, గింజలతో సహా జ్యూస్ చేస్తే కొంతవరకు ఫైబర్ అందుతుంది.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

దుష్ప్రభావాలు

"లిక్విడ్ డైటింగ్‌లో ఒక వారం తరువాత బాగా అలిసిపోయినట్టు, శక్తంతా పోయినట్టు అనిపిస్తుంది. పోషకాహార విలువలు సమపాళ్లలో లేని డైట్ వలన శరీరానికి కావలసినవన్నీ అందవు. ఇది దీర్ఘకాలంలో చాలా హాని కలిగించవచ్చు" అని ప్లైమౌత్ యూనివర్సిటీలోని హ్యూమన్ న్యూట్రిషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గెయిల్ రీస్ అన్నారు.

శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గిపోతాయి. మహిళల్లో ఇది రక్తహీనతకు దారితీయవచ్చు. కండరాలు క్షీణిస్తాయి. జీర్ణవ్యవస్థ, ఊపిరితిత్తులు, కాలేయం సాధారణ స్థాయిల కన్నా ఎక్కువగా పనిచేస్తాయి.

తలనొప్పి, కళ్లు తిరగడం, విపరీతమైన అలసట, విరేచనాలు లేదా మలబద్దకం లాంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు.

పళ్ల రసాల్లో సహజ ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి దంతాలపై ఉండే ఎనామెల్‌ను తొలగిస్తాయి. తక్కువ కేలరీలు తీసుకోవడం వలన శ్వాస వాసన మారుతుంది.

లిక్విడ్ డైట్‌తో త్వరగా బరువు తగ్గవచ్చు. కానీ, మళ్ళీ సాధారణ డైట్‌కు వచ్చేసాక త్వరగా బరువు పెరిగే రిస్క్ కూడా ఉందని పిగోట్ అన్నారు.

వేలంవెర్రిగా చేసే డైటింగులు "విషపూరితమైన ఆహారపు అలవాట్లకు" ఆజ్యం పోస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆహారం పట్ల ప్రతికూల వైఖరిని ప్రోత్సహిస్తున్నాయని, బరువు తగ్గించడానికి బదులు పెంచుతున్నాయని అన్నారు.

మన శరీరం చెప్పే మాట వినాలని, వారం, నెల కాకుండా దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూర్చే ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని ఆమె సూచించారు.

సమతుల ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

'వెయిట్ సైకిలింగ్ ప్రమాదం ఉంది'

"బరువు తగ్గడానికి విపరీతమైన డైటింగులు చేయడం దీర్ఘకాలంలో మంచిది కాదు. వీటివల్ల శరీరం నుంచి నీరు పోతుంది లేదా సన్నగా ఉండే కండరాలు తగ్గుతాయి. అంతే తప్ప కొవ్వు తగ్గదు. ఇలాంటి క్రాష్ డైటింగులు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం లాంటి వ్యాధులు రావచ్చు" అని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సైమన్ స్టీన్‌సన్ చెప్పారు.

అలాగే, 'వెయిట్ సైకిలింగ్' ప్రమాదం కూడా ఉంటుందని స్టీన్‌సన్ హెచ్చరించారు. అంటే వేలంవెర్రిగా డైటింగులు చేస్తూ బరువు తగ్గడం, పెరగడం.. మళ్లీ తగ్గడం, పెరగడం.. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.

బరువు తగ్గడానికి సమతుల ఆహరం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, కాయలు, గింజలతో కూడిన వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవడం, రోజంతా చురుకుగా ఉండడం మెరుగైన పద్ధతి.

లిక్విడ్ డైట్ల కన్నా మనం రోజూ తీసుకునే ఆహారంలో ఆల్కాహాల్, వేపుళ్లు, బిస్కట్లు, జంక్ ఫుడ్ లాంటివి లేకుండా జాగ్రత్తలు పాటించడం దీర్ఘకాలంలో మేలు చేస్తుందని డాక్టర్ రీస్ సూచించారు.

ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, డైట్ ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం మేలు.

సరైన పద్ధతిలో తీసుకుంటే లిక్విడ్ డైట్ కొందరికి పనిచేయవచ్చు. అది కూడా ఆ డైట్ శరీరానికి సరిపడితేనే. కానీ, చాలామందికి ఇవి పాటించడం చాలా కష్టం. అనవసరమైన రిస్క్ కూడా.

వీడియో క్యాప్షన్, తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)