మెటబాలిజమ్: 30ల వయసులో బరువు పెరగడానికి జీవక్రియలు కారణం కాదు -అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్
మధ్య వయసులో అడ్డంగా శరీరం పెరిగిపోవడానికి ‘‘జీవక్రియా రేటు నెమ్మదించడం’’ కారణం కాదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో శక్తి వినియోగాన్ని విశ్లేషిస్తూ ఈ పరిశోధన చేపట్టారు.
దీనిలో ఎనిమిది రోజుల నుంచి 95ఏళ్ల మధ్య వయసున్న 29 దేశాలకు చెందిన పౌరులు పాల్గొన్నారు. 30ల వయసులో కూడా ‘‘జీవక్రియా రేటు(మెటబాలిజం)’’ పక్కాగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.
పుట్టిన తర్వాత తొలి సంవత్సరంలో జీవక్రియా రేటు పతాక స్థాయిలో ఉంటుందని దీనిలో వెలుగులోకి వచ్చింది. 20ల నుంచి 60ల వయసు వరకూ మెటబాలిజం స్థిరంగానే ఉంటుందని బయటపడింది. ఈ అధ్యయనంతో మన శరీరం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కండలు తిరిగినా లేదా కొవ్వు పేరుకున్నా ఒకేలా..
మన శరీర మనుగడకు మెటబాలిజం ఇంధనం లాంటిది. దీనిలో జరిగే రసాయనిక చర్యలు ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. ఈ శక్తే మన శరీరాన్ని నడిపిస్తుంది.
శరీరం ఎంత పెద్దది ఉంటే అంత ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కండలు తిరిగిన దేహమైనా లేదా కొవ్వుతో నిండిన శరీరమైనా.. పరిమాణం బట్టే మెటబాలిజం ఆధారపడి ఉంటుంది.
పరిమాణానికి అనుగుణంగా శరీరంలో ప్రతి అంగుళానికి ఎంత పరిమాణంలో జీవక్రియలు అవసరం అవుతాయో తాజాగా పరిశోధకులు విశ్లేషించారు.
దీని ఫలితాలు ‘‘ఫోర్ ఫేజెస్ ఆఫ్ మెటబాలిక్ లైఫ్’’ పేరుతో ‘‘ద జర్నల్ సైన్స్’’లో ప్రచురితం అయ్యాయి.

- పుట్టినప్పటి నుంచి తొలి ఏడాది వరకు: పుట్టినప్పుడు తల్లితో సమానంగా ఉండే జీవక్రియా రేటు.. క్రమంగా పెరుగుతూ వయోజనుల కంటే 50 శాతం ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది.
- 20ల వరకు: మొదటి ఏడాది నుంచి 20ల వయసు వరకు ఇది కాస్త నెమ్మదిస్తుంది. టీనేజీ సమయంలో ఏలాంటి పెరుగుదలా ఉండదు.
- 20 నుంచి 60 వరకు: 20ల తర్వాత స్థిరపడిన ఈ జీవక్రియా రేటు 60ల వరకు స్థిరంగానే కొనసాగుతుంది. మధ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.
- ఆ తర్వాత: 60ల తర్వాత ఇది తిరోగమన బాట పడుతుంది. 90ల వయసుకు వచ్చే సరికి మధ్య వయసుతో పోలిస్తే 26 శాతం నెమ్మదిగా జీవ క్రియలు కొనసాగుతాయి.
‘‘జీవక్రియా పనితీరును ఇదివరకు ఎప్పుడూ మనం ఇలా చూడలేదు. దీనిలో ఎన్నో ఆశ్చర్యకర సంగతులు ఉన్నాయి’’అని యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్‌కు చెందిన ప్రొఫెసర్ జాన్ స్పీక్‌మన్ వ్యాఖ్యానించారు.
‘‘30ల వయసులో జీవక్రియల్లో మార్పు ఉండదనే అంశం నన్ను నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపై మధ్య వయసులో బరువు పెరిగితే, మెటబాలిజం తగ్గడమే కారణమని చెప్పకూడదేమో’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలల్లో పోషకాహార లోపం..
ఈ అధ్యయనంలో ఇంకా చాలా ఆశ్చర్యకర సంగతులు ఉన్నాయి.
టీనేజీలో లేదా గర్భం దాల్చినప్పుడు జీవక్రియా రేటు ఒక్కసారిగా పెరుగుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని తాజా పరిశోధనలో రుజువైంది. అంతేకాదు మెనోపాజ్ సమయంలోనూ ఇది పడిపోదని తేలింది.
పిల్లల తొలి ఏడాది వారి జీవితంలో ఎంత ముఖ్యమైనదో ‘‘తొలి ఎడాది జీవక్రియా రేటు పెరుగుదల’’ నొక్కి చెబుతోంది. చిన్నప్పుడు పోషకాహార లోపంతో బాధపడినవారు జీవితాంతం ఎందుకు అనారోగ్య సమస్యలతో బాధపడతారో ఇది వివరిస్తోంది.
‘‘మెటబాలిజం గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఆహారం లేదా వ్యాయామం అంటుంటారు. నిజానికి దీన్ని మనం లోతుగా చూడాల్సిన అవసరముంది. మన శరీరంలో కణాలు ఎలా పనిచేస్తున్నాయో మనం మొదట తెలుసుకోవాలి’’అని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెర్మన్ పాంట్జెర్ బీబీసీతో చెప్పారు.
‘‘మన శరీర కణాలు తొలి ఏడాదిలో చాలా బిజీగా ఉంటాయి. వయసు మళ్లిన తర్వాత ఈ కణాలు పనితీరు మందగిస్తుంది.’’
అధ్యయనంలో పాల్గొన్నవారి మెటబాలిజాన్ని ‘‘డబ్లీ లేబల్డ్ వాటర్ (డీఎల్‌డబ్ల్యూ)’’ విధానం సాయంతో లెక్కించారు.
డీఎల్‌డబ్ల్యూ విధానంలో శరీరం నుంచి బయటకు వచ్చే నీటిని విశ్లేషిస్తారు. దీనిలోని భార స్థితిలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులను పరిశీలిస్తారు.
ఈ విధానం కాస్త క్లిష్టమైనది. పైగా ఖర్చుతో కూడుకున్నది. దీంతో 6,400 మందిపై పరిశోధన చేపట్టేందుకు 29 దేశాల్లోని పరిశోధకులు కలిసి పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఔషధాలతో...
జీవక్రియా రేటులో మార్పులపై అవగాహనతో వైద్య రంగంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘మెటబాలిజం మారుతున్నప్పుడు క్యాన్సర్‌లు భిన్నంగా వ్యాప్తి చెందుతాయా? భిన్న దశల్లో మార్పులను ఔషధాలతో సమం చేయొచ్చా? లాంటి అంశాలపై అవగాహనకు తాజా పరిశోధన తోడ్పడుతుంది’’అని ప్రొఫెసర్ హెర్మన్ పాంట్జెర్ వివరించారు.
మెటబాలిజంలో మార్పులు చేయగలిగే ఔషధాలు.. మలి వయసులో వచ్చే వ్యాధులను నెమ్మదింప చేయగలవా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది.
‘‘మానవ జీవక్రియా చర్యలపై ఈ సంచలన పరిశోధన కొత్త చర్చలకు ఆహ్వానం పలుకుతోంది’’అని విస్కాన్సిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు రోజాలిన్ ఆండర్సెన్, తొమోథి రోడ్స్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊబకాయం..
‘‘ఎక్కువ మంది బరువు పెరిగే మధ్య వయసు, దాని ముందు దశ (20ల వయసు)ల మధ్య జీవక్రియా రేటుల తేడా చాలా తక్కువగా ఉంటుందని బయటపడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది’’అని కింగ్స్ లండన్ కాలేజీ ప్రొఫెసర్ టామ్ శాండెర్స్ వ్యాఖ్యానించారు.
‘‘అతిగా తినడం వల్లే ఊబకాయం వస్తుంది. అంతేకానీ శక్తి వినియోగం తగ్గడం వల్ల కాదు.. అనే వాదనను తాజా అధ్యయనం బలపరుస్తోంది.’’
‘‘శరీరం ఉపయోగించే మొత్తం శక్తిని కచ్చితంగా గణించడం చాలా కష్టం. అయితే, ప్రస్తుతం ప్రపంచ ఇంధన సంక్షోభంతోపాటు మన శరీరంలో ఖర్చుపెట్టకపోవడంతో విపరీతంగా పెరుగుతున్న ఇంధనంపైనా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సోరెన్ బ్రేజ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








