షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: ‘నేను వార్న్‌కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లు

షేన్ వార్న్

ఫొటో సోర్స్, Getty Images

అది 1993 జూన్ 4. అప్పటికి ఆస్ట్రేలియాలోనే పెద్దగా ఎవరికీ తెలీని 23 ఏళ్ల షేన్ వార్న్ అనే యువకుడు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన బంతిని విసిరాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మైక్ గాటింగ్ ఆ బంతిని ఆడేలోపే మెరుపు వేగంతో స్టంప్స్‌కు తగిలింది. గాల్లో గిరగిరా తిరుగుతూ గాటింగ్ లెగ్ స్టంప్ దగ్గర పిచ్ అయిన ఆ బంతి, ఆయన అడ్డుకునేలోపే బ్యాట్‌ పక్కనుంచి మెరుపులా దూసుకెళ్లి ఆఫ్ స్టంప్‌కు తగిలింది.

అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి స్పిన్ అప్పటివరకూ ఎవరూ చూళ్లేదు. అంతే ఆ ఒకే ఒక బంతి షేన్ వార్న్ అనే పేరు అందరి నోటా వినిపించేలా చేసింది.

కానీ, 'బాల్ ఆప్ ది సెంచరీ' వేసిన అదే యువకుడు దానికి రెండేళ్ల ముందు ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో చోటు సంపాదించడానికి నానా తంటాలూ పడ్డాడు. కొందరితో నువ్వు అసలు క్రికెట్‌కు పనికిరావని కూడా అనిపించుకున్నాడు.

1991లో ఒక ఆటగాడు చివరి నిమిషంలో తప్పుకోవడంతో షేన్ వార్న్ అక్రింగ్టన్ జట్టులో స్థానం సంపాదించగలిగాడు.

ఆ సమయంలో అతడిని మైదానంలో చూసే చాలా మంది ఆటగాళ్లు ఈ కుర్రాడు క్రికెట్ పిచ్‌కు బదులు సమద్రంలో సర్ఫ్ బోర్డుకు సరిగ్గా ఉంటాడు అనుకునేవారు.

కౌంటీ క్రికెట్‌లో అడుగుపెట్టగానే వికెట్ల వేట మొదలవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న షేన్ వార్న్‌ను ఇంగ్లండ్ పిచ్‌లు నిరాశపరిచాయి.

సీజన్ ప్రారంభంలో వికెట్లు తీయడానికి వార్న్ నానా తంటాలూ పడ్డాడు. ఎందుకంటే అవి చాలా తడిగా ఉండేవి, వాతావరణం చలిగా ఉండేది.

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వార్న్ అక్కడ గట్టిగా ఉండే ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేయడానికి అలవాటుపడ్డాడు.

షేన్ వార్న్

ఫొటో సోర్స్, Getty Images

వార్న్ బౌలింగ్‌లో సొంత జట్టు కష్టాలు

కానీ, ఇంగ్లండ్‌లో అతడి బౌలింగ్ బ్యాట్స్‌మెన్లకు విందు భోజనంలా మారింది. అందరూ వార్న్ బౌలింగ్‌ను ఉతికేసేవారు. దీంతో వికెట్లు పడగొట్టలేక, బ్యాటింగ్ సరిగా చేయలేక అతడు సతమతం అయ్యాడు.

తర్వాత, లాంకషైర్ లీగ్‌లోకి అడుగుపెట్టిన వార్న్ స్నేహితులు, సీనియర్ల సలహాలతో తన లెగ్ స్పిన్‌కు పదును పెట్టారు. ఆ లీగ్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్లు అసలు అతడి బౌలింగ్ ఆడలేకపోయేవారు.

వార్న్ బౌలింగ్ అతడి సొంత జట్టుకు కూడా చుక్కలు చూపించింది.

ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వార్న్ తన ఒక్కో రకం డెలివరీకి వికెట్ కీపర్‌కు ఒక సిగ్నల్ ఇచ్చేవాడు. అతడు కుడికాలిని తాకాడంటే ఫ్లిప్పర్ వేస్తున్నాడని సిగ్నల్. వెనక గీరుకున్నాడంటే గుగ్లీ అని గుర్తించాలి. కానీ మ్యాచ్‌ల విషయానికి వచ్చేసరికి వికెట్ కీపర్‌ వార్న్ సీక్రెట్ సిగ్నల్స్ అర్థం చేసుకోలేక నానా తంటాలూ పడేవారు.

ఒకసారి షేన్ వార్న్ బౌలింగ్‌లో కీపింగ్ చేయలేకపోవడంతో ఒక మ్యాచ్‌లో మూడు సార్లు కీపర్‌ను మార్చాల్సి వచ్చిందని ఆయనతో ఆడిన బార్కర్ చెప్పారు.

వారిలో ఒకరైతే గ్లోవ్స్ తీసి కింద విసిరికొట్టి "నేనాయనకు కీపింగ్ చేయలేను" అని చెప్పేశాడు. అలాంటప్పుడు వార్న్‌కు చాలా ఇబ్బందిగా అనిపించేది.

తర్వాత 1991లో ఆస్ట్రేలియా బీ టీమ్ కోసం వార్న్‌కు పిలుపొచ్చింది. అప్పుడు అది జింబాబ్వే టూర్‌ వెళ్తోంది.

తర్వాత ఏ టీమ్‌కు కూడా ఆడిన వార్న్ కేవలం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లే ఆడి 1992 జనవరిలో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

భారత్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పెద్దగా సత్తా చూపలేకపోయినా, 1993లో ఇంగ్లండ్‌లో యాషెస్ టూర్ జట్టుకు సెలక్ట్ కావడం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.

ఆ సిరీస్‌లో గ్యాంటింగ్‌కు వేసిన తొలి బంతిని 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా మార్చిన షేన్ వార్న్ ఆ తర్వాత వెనక్కు చూసుకోలేదు.

షేన్ వార్న్

ఫొటో సోర్స్, Getty Images

వార్న్ ఏది చేసినా హెడ్‌లైనే

2016లో షేన్ వార్న్ 'అయాం ఏ సెలబ్రిటీ: గెట్ మీ అవుటాఫ్ హియర్' అనే రియాలిటీ షో చేశాడు. అందులో ఆయన పది మంది ప్రముఖుల్లో ఆయన ఒకరు.

కానీ, ఈ షో గురించి పత్రికల్లో ఎప్పుడు హెడ్ లైన్స్ వచ్చినా అది షేన్ వార్న్ గురించే అయ్యేది.

ఈ క్రికెటర్ మామూలుగా మాట్లాడినా, విచిత్రంగా ఏదైనా చెప్పినా అవన్నీ హాట్ టాపిక్స్ అయ్యాయి.

"గ్రహాంతరవాసులు కోతుల నుంచి మనుషులను తయారుచేసి పిరమిడ్లు కట్టారు" అని చెప్పినా, సాలీడు అంటే తనకు భయమని ఒప్పుకున్నా అవన్నీ పతాక శీర్షికలకు ఎక్కేసేవి.

వార్న్‌కు సంబంధించి ప్రతి వార్తకూ క్రేజ్ ఉందని ఇవి నిరూపించాయి.

2016లో ఆస్ట్రేలియా నిర్మాత దర్శకుడు జార్జ్ మిల్లర్‌కు మ్యాడ్ మాక్స్-ఫ్యూరీ రోడ్ చిత్రానికి ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చినపుడు కూడా ఆ దేశంలో అందరూ అయాం ఏ సెలబ్రిటీ ప్రోగ్రాంలో షేన్ వార్న్ ఏం చేస్తున్నాడనేదే చర్చించుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో ఈ క్రికెటర్‌కు ఉన్న పాపులారిటీ అలాంటిది.

మెల్‌బోర్న్ శివార్లకు చెందిన షేన్ వార్న్ క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే ఆస్ట్రేలియా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఎలా సంపాదించాడు అనడానికి అతడు టెస్టుల్లో 708, వన్డేల్లో 293 తీసిన వికెట్లు కలిపి 1001 కారణాలు చెప్పచ్చు.

షేన్ వార్న్

ఫొటో సోర్స్, Getty Images

వివాదాలతో సహవాసం

టీమ్ మేట్స్ షేన్ వార్న్‌ను ముద్దుగా హాలీవుడ్ అని పిలుచుకుంటారు. పదే పదే వివాదాలు, సెక్స్ స్కాండిల్స్ చుట్టుముట్టినా అవేవీ ఈ లెగ్ స్పిన్నర్‌ పాపులారిటీని కాస్త కూడా తగ్గించలేకపోయాయి.

తిరుగులేని క్రికెటర్‌గా ఉన్నప్పుడే షేన్ వార్న్ ఎన్నో సెక్స్ స్కాండల్స్‌లో చిక్కుకున్నారు. చివరకు సిమోన్ కల్లహాన్‌ను పెళ్లాడడంతో వాటికి తెరపడింది.

2003లో ఒక డైయూరిటిక్ తీసుకున్నందుకు ఆయన్ను ఏడాదిపాటు క్రికెట్ నుంచి నిషేధించారు.

అది తన ప్రదర్శన కోసం కాదని, తన లుక్ కోసమే తీసుకున్నానని వార్న్ అప్పుడు చెప్పారు.

ఒక భారత బుకీతో సంబంధాలు ఉన్నాయని కూడా షేన్ వార్న్ శిక్ష ఎదుర్కున్నారు.

సిగరెట్ తాగుతున్నప్పుడు ఫొటో తీసిన టీనేజి యువకుడి కెమెరా లాక్కున్నందుకు విమర్శలకు గురయ్యారు.

2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరైన షేన్ వార్న్ 46 ఏళ్ల వయసులో బ్రిటిష్ మోడల్-యాక్ట్రెస్ లిజ్ హర్లీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని మళ్లీ మీడియాలో నిలిచాడు. ఆ బంధం ముగిసిన తర్వాత ఆమెను తన గుడ్ ఫ్రెండ్‌గా చెప్పారు.

తన అందమైన లుక్స్ కోసం షేన్ వార్న్ డాక్టర్ల చుట్టూ కూడా తిరిగారు, బొటాక్స్ కూడా చేయించుకున్నట్టు అంగీకరించారు. కానీ తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

వివాదాలు పక్కనపెడితే 139 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో షేన్ వార్న్ అంత అత్యంత టాలెంటెడ్ బౌలర్‌ బహుశా ఎవరూ లేరు.

వార్న్ తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి 12 మంది స్పిన్నర్లు వచ్చారు. కానీ వారిలో ఎవరూ ఏ విషయంలోనూ అతడి దరిదాపుల్లోకి కూడా రాలేదు.

వీడియో క్యాప్షన్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)