ఆళ్లగడ్డ పోలీసులు: ‘కేసులు పెరుగుతున్నాయని శాంతి పూజలు చేశారు, దోష నివారణకు గోమూత్రం చల్లారు’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
నేరాలు అదుపు చేయడం, శాంతిభద్రతలు పరిరక్షించడం పోలీసుల కర్తవ్యం. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడితే అనుగుణమైన చర్యలు తీసుకొని నేరాలు అదుపు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పోలీసులు విభిన్నంగా వ్యవహరించారు.
తమ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయంటూ శాంతి పూజలకు పూనుకున్నారు. స్టేషన్‌లోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోష నివారణ చర్యలంటూ గోమూత్రం కూడా చల్లారు. దాంతో పోలీసుల తీరు మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఈ చర్యలను తప్పుబడుతున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుని నేరాలను నియంత్రించడం గురించి ఆలోచించాల్సిన పోలీసులు శాంతి పూజలంటూ పోలీస్ స్టేషన్‌ని ధూపదీపాలతో నింపేయడం ఆశ్చర్యంగా మారింది. అయితే అది సహజంగా జరిగే ప్రక్రియనే అంటూ పోలీసులు తేలికగా మాట్లాడుతుండడం విశేషం. వాటిని కొందరు వార్తలుగా చిత్రీకరించారంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు.
అసలేం జరిగింది..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల స్వల్పంగా కేసులు పెరిగాయి. 2021 తొలి రెండు నెలల్లో 37 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కానీ ఈసారి కేసుల సంఖ్య 41కి పెరిగింది. అదే సమయంలో ఇటీవల స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిలో ఓ కానిస్టేబుల్ పాముకాటుకి గురయ్యారు. ఇదంతా పోలీసులకు కీడు చేస్తుందనే అభిప్రాయానికి వచ్చి శాంతి పూజలు నిర్వహించినట్టు పలు కథనాలు వచ్చాయి.
స్టేషన్ ఆవరణలో మార్చి 6వ తేదీన అర్చకులతో ప్రత్యేకంగా నిర్వహించిన పూజలు అందులో భాగమేనని పలువురి అభిప్రాయం. స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతుండటం, సిబ్బంది అనారోగ్యానికి గురి అవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు శాంతి పూజలకు పూనుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ పూజలు జరిగిన మాట వాస్తవమేనని బీబీసీకి ఆళ్లగడ్డ పీఎస్ ఇన్‌స్పెక్టర్ నంద్యాల కృష్ణయ్య తెలిపారు.
''పోలీస్ స్టేషన్‌లో పూజలు చేయకూడదా.. చేయకూడదనే ఆదేశాలు వస్తే మానేస్తాం. మేం నిబంధనల ప్రకారమే వ్యవహరించాం. కానీ కొందరు దానిని వార్తల కోసం అలా చిత్రీకరించారు. వాటిపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నాం. ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాం'' అని బీబీసీతో సీఐ కృష్ణయ్య అన్నారు.

ఫొటో సోర్స్, UGC
గోమూత్రం కూడా చల్లారు..
సాధారణంగా వివిధ ప్రత్యేక సందర్భాల్లో పూజలు నిర్వహించినప్పటికీ ఈసారి పెద్ద స్థాయిలో వాటిని నిర్వహించడమే విశేషంగా మారింది. అదే సమయంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన గోమూత్రం స్టేషన్ ఆవరణ అంతటా చల్లిన తీరు పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
ఆళ్లగడ్డలోనే కాకుండా అనేక పీఎస్‌లలో దేవుడి పటాలు, వాటికి పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పూజలు చాలా సమయం పాటు జరిగాయి. అవి జరుగుతున్నంతవరకు స్థానికులు, ఇతరులందరినీ స్టేషన్ బయటే నిలబెట్టారు. ఆ తర్వాత గోమూత్రం తీసుకొచ్చి స్టేషన్ అంతటా చల్లడం అందరూ చూశారు. ఇదంతా ఎవరో కీడు చేశారని, దోష నివారణలో భాగంగానే చేసినట్టు పట్టణంలో ప్రచారం జరుగుతోంది అంటూ స్థానికుడు ఎం రవి తెలిపారు.
ఇలాంటి పూజలు, గోమూత్రం చల్లడం వంటివి గతంలో ఎన్నడూ తమకు తెలియదని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
కేసులు పెరిగితే పూజలు చేస్తారా?
కేసులు పెరిగినా తగిన విధంగా వ్యవహరించేందుకే తామున్నామని పోలీసులు అంటున్నారు. ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పర్యవేక్షణ సజావుగా చేస్తున్నామని కూడా చెబుతున్నారు
కేసులు పెరుగుతున్నాయనే కారణంతో పూజలు చేయడం విడ్డూరమే కాకుండా, అందరూ తప్పుబట్టాల్సిన అంశం అని బీబీసీతో జనవిజ్ఞాన వేదిక నాయకుడు పి. పరమేశ్ అన్నారు.
'' కేసులు పెరిగితే పూజలు చేయడం, శాంతిభద్రతలు అదుపు తప్పితే దండాలు పెట్టడం కాదు పోలీసులు చేయాల్సింది. పోలీస్ స్టేషన్‌లో పూజలు చేసి, ధూపదీపాలు వంటివి అనుమతించకూడదు. ఇలాంటివి లౌకికతత్వానికి విరుద్ధం. అశాస్త్రీయంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు. ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాల్లో శాస్త్రీయంగానే వ్యవహరించాలి. అందుకు భిన్నంగా అంధ విశ్వాసాలను ఆశ్రయించడం సహించకూడదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా చిత్తూరు జిల్లాలో థియేటర్ వద్ద మేకపోతుని బలి ఇవ్వడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జీవహింస నివారణ చట్టంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 34, 429 ల కింద కేసు నమోదైంది.
ఓవైపు ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే మరోవైపు తమ విశ్వాసాలకు పోలీస్ స్టేషన్‌ని కేంద్రంగా మార్చిన వైనం వివాదాస్పదమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంపు.. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ మినహా మిగతా సినిమాలకు నిబంధనలు ఇవీ..
- ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్: ఏ పార్టీ గెలవనుంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి
- తమిళిసై vs కేసీఆర్: తెర వెనుక ఏం జరిగింది? గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు కరెక్టేనా?
- యుక్రెయిన్లోనే ఏపీ వైద్యుడు: జాగ్వర్, పాంథర్లతో కలిసి బేస్మెంట్లోనే జీవనం
- అయ్యలసోమయాజుల లలిత: తొలి భారతీయ మహిళా ఇంజనీరు తెలుగు అమ్మాయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












