యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్‌స్కా: తెర వెనుక ఉండి భర్తని నడిపిస్తున్న ప్రథమ మహిళ

ఒలెనా జెలెన్‌స్కా

ఫొటో సోర్స్, facebook/olenazelenska.official

యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తొలిరోజుల్లో, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీకి దేశం విడిచిపెట్టి వెళ్లే ప్రతిపాదన వచ్చింది. దానికి ఆయన సూటిగా జవాబిస్తూ "నాకు ఆయుధాలు కావాలి, రవాణా కాదు" అని ఒక వీడియోలో అన్నారు.

జెలియెన్‌స్కీ భార్య ఒలేనా జెలెన్‌స్కా, వారి పిల్లలు సాషా, సిరిల్ కూడా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

రష్యా, తన తరువాత తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని జెలియెన్‌స్కీ చెప్పడంతో, ఇప్పుడు అందరి చూపులు ఒలేనా వైపు మళ్లాయి.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఆచూకీని గోప్యంగా ఉంచారు. కాగా, ఒలేనా సోషల్ మీడియా ద్వారా దేశంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు.

వీడియో క్యాప్షన్, ‘బాంబులు పడుతున్నా మేము వెళ్లిపోతున్నాం. మాకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత’

"ఈరోజు నేను భయపడను, ఏడవను. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తాను. నా పిల్లలు నన్ను చూస్తున్నారు. నేను వాళ్లతోనే ఉంటాను. నా భర్త పక్కనే నిలబడతాను. మీ అందరితో ఉంటాను" అని ఆమె గత వారం రాశారు.

అలాగే ఇతర దేశాల ప్రథమ మహిళలను ఉద్దేశించి ఆమె మరొక సందేశం పోస్ట్ చేశారు.

"యుక్రెయిన్‌కు మేమెలా సాయం చేయగలమని పలువురు ప్రథమ మహిళలు నన్ను అడుగుతున్నారు. నా జవాబు ఇదే.. ప్రపంచానికి నిజం చెప్పండి."

మానవతా సహాయం అందించగలవారికి కూడా ఆమె సందేశం అందించారు.

44 ఏళ్ల ఒలేనాకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 20 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. యుక్రెయిన్‌లో ఆమెను ఇంఫ్లుయెన్సర్ (ప్రభావవంతమైన వ్యక్తి)గా గుర్తిస్తారు.

ఒలెనా జెలెన్‌స్కా

ఫొటో సోర్స్, facebook/olenazelenska.official

ఆర్కిటెక్చర్ చదువు విడిచిపెట్టి కామెడీలోకి..

ఒలేనా జెలెన్‌స్కా, మధ్య యుక్రెయిన్‌లోని క్రివీ రిహ్ నగరంలో పెరిగారు. వొలదిమీర్ జెలియెన్‌స్కీ కూడా క్రివీ రిహ్‌కు చెందినవారే.

కాలేజీ రోజుల నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. ఒలేనా ఆర్కిటెక్చర్ చదివారు. జెలియెన్‌స్కీ లా చదివారు.

తరువాతి రోజుల్లో ఇద్దరూ తమ కెరీర్లు మార్చుకుని టీవీ, సినిమాల్లోకి వెళ్లారు. జెలియెన్‌స్కీ కమెడియన్‌గా ఎదిగారు. 'క్వార్టల్ 95' అనే టీవీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఒలేనా ఈ సంస్థలో కార్యక్రమాలకు స్క్రీన్‌ప్లే రాసేవారు.

ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తరువాత 2003లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం వారికి ఒక పాప పుట్టింది. 2013లో బాబు పుట్టాడు.

ఒలెనా జెలెన్‌స్కా

ఫొటో సోర్స్, facebook/olenazelenska.official

2019లో జెలియెన్‌స్కీ భారీ ఆధిక్యంతో అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేంతవరకు ఒలేనా రాజకీయల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

తన భర్త ఎన్నికల్లో పోటీ చేస్తారని సోషల్ నెట్‌వర్కల ద్వారానే తనకు తెలిసిందని ఒలేనా గతంలో చెప్పారు.

వెంటనే ఆమె, "ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అని భర్తను నిలదీశారు.

"నేను మర్చిపోయాను" అన్నారు జెలియెన్‌స్కీ.

అయితే, ఎన్నికల్లో పోటీ చేయడం గురించి వారిద్దరి మధ్య సంభాషణ మొదలైనప్పుడు ఆమె పూర్తి మద్దతు ఇచ్చారని జెలియెన్‌స్కీ చెప్పారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

'నాకు తెర వెనుక ఉండడమే ఇష్టం'

ఒలేనా జెలెన్‌స్కాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. కానీ, యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆమె, తన తోటి పౌరులను ప్రోత్సహించడానికి, సంక్షోభాన్ని ఎదుర్కునే దిశలో సాయం అడగడానికి సోషల్ నెట్‌వర్క్‌లకు ఉపయోగించుకుంటున్నారు.

2019లో ఫోకస్ మ్యాగజీన్ ఆమెను అత్యంత ప్రభావవంతమైన 100 మంది యుక్రెయినియన్ల జాబితాలో చేర్చింది.

అదే సంవత్సరం వోగ్ మ్యాగజీన్ స్థానిక ఎడిషన్ ముఖచిత్రంగా నిలిచారామె. ఈ పత్రిక కోసం ఆమె ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రథమ మహిళగా తన బాధ్యతలు, లక్ష్యాలు, జీవన శైలి, తన భర్త రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆమె మాట్లాడారు.

"పబ్లిసిటీ లేదా మీడియాతో మాట్లాడడం ఒత్తిడితో కూడూకున్నదని చెప్పలేను. కానీ, నాకు తెర వెనుక ఉండడమే ఇష్టం. నా భర్త ఎప్పుడూ ముందు నిల్చుంటారు. తన వెనుక నీడలో ఉండడమే నాకిష్టం.

వేడుకలకు కేంద్రంగా ఉండను. జోక్స్ చెప్పను. అది నా ప్రవృత్తి కాదు. అయితే పబ్లిసిటీ వలన కూడా కొన్ని లాభాలు ఉంటాయని గ్రహించాను. ముఖ్యంగా సామాజిక అంశాల గురించి మాట్లాడడానికి ఇది చాలా అవసరం" అని ఒలేనా అన్నారు.

పిల్లల పోషకాహారం, పారాలింపిక్స్, గృహ హింస మొదలైన సమస్యలపై పోరాటానికి ఆమె మద్దతు ఇస్తారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ తన గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఎందుకు కోరుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)