యుక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫానిషైన: ‘స్కూళ్లు, ఆసుపత్రులపైనా బాంబులు వేస్తున్న రష్యా’

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌లో ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడుతోందని, ఆసుపత్రులు, నర్సరీలు, స్కూళ్లపైనా అటాక్ చేస్తోందని యుక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫానిషైన అన్నారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. యుక్రెయిన్ సైన్యం నుంచి రష్యాకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైందని, దీంతో ప్రజలకు వ్యతిరేకంగా రష్యా భారీ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు.
భూమిపైనుంచి దాడులు చేయటంతో పాటు ఆకాశం నుంచి కూడా బాంబులు వేస్తూ రష్యా 'తీవ్రవాద ప్రణాళిక'ను అమలు చేస్తోందని ఆమె ఆరోపించారు.
ఆరోగ్య సదుపాయాలపైనా దాడులు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది.
''యుక్రెయిన్‌లో ఆరోగ్య రంగంపై పలు దాడులు జరిగాయి, ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు'' అని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ ఆదివారం తెలిపారు.
ప్రజలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుందని బ్రిటిష్ ప్రభుత్వం ఆరోపించింది.

''1999లో చెచెన్యాలోను, 2016లో సిరియాలో కూడా రష్యా ఇలాంటి వ్యూహాలనే అమలు చేసింది. భూమి పైనుంచి, ఆకాశం నుంచి దాడులు చేసింది'' అని బ్రిటన్ తన ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొంది.
ఫిబ్రవరి 24వ తేదీన యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా 351 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి పరిశీలకులు శనివారం ప్రకటించారు. అయితే, వాస్తవానికి రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సామాన్యుల వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపారు.
ఇప్పటి వరకూ 15 లక్షల మంది యుక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం వెల్లడించింది.
''యుక్రెయిన్ పట్టణాల్లో రష్యా సైనిక వ్యూహాలు అమలు చేస్తోంది'' అని బీబీసీ టీవీ ఆదివారం ఉదయం కార్యక్రమంలో మాట్లాడుతూ యుక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫానిషైన అన్నారు.
''ఆసుపత్రులపైనా, కిండర్ గార్డెన్లపైనా, స్కూళ్లపైనా, సామాన్యులు నివసించే ఇళ్లపైన కూడా బాంబులు వేశారు. వాస్తవంగా జరుగుతోంది ఇదే. యుక్రెయిన్ మరోసారి రష్యా ఉగ్రవాద ప్రణాళికల దాడిని చవిచూస్తోంది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా కూడా సైనికులను, సామాగ్రిని కోల్పోయి తీవ్రంగా నష్టపోయిందని, అయినా ఇవేవీ రష్యాను ఆపలేవని, పైగా.. రష్యా మరింతగా రెచ్చిపోయేలా చేస్తుందని స్టెఫానిషైన తెలిపారు.
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలపైనా, స్కూళ్లు, ఆసుపత్రుల వంటి ప్రజల మౌలిక సదుపాయాలపైనా దాడులు జరపకూడదు. యుద్ధాన్ని నియంత్రించేందుకు వీటిని పాటించేలా గతంలో అన్ని దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఒక బాలిస్టిక్ క్షిపణి ఆసుపత్రిని పేల్చేసిందని, క్లస్టర్ బాంబులు కిండర్ గార్డెన్, నర్సరీలపై పడ్డాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.
ఇవి కూడా చదవండి:
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?
- రొమాన్స్‌లో మహిళలు యాక్టివ్‌గా ఉంటే తప్పా, కామసూత్ర పుట్టిన దేశంలో ఎందుకీ పరిస్థితి?
- Women's day స్పెషల్: 'మహిళా నవోదయం' - మహిళల కోసం, మహిళలు రాసే వార్తలతో.. మహిళలే నడుపుతున్న పత్రిక
- యుక్రెయిన్-రష్యా యుద్ధం: పశ్చిమ దేశాలు ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









