#CWC22 INDvPAK: పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతురు ఫాతిమాతో భారత ప్లేయర్ల ఫన్‌టైమ్

ఫొటో సోర్స్, instagram/therealpcb/ICC
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2022లో భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌన్గనూయిలో తొలి మ్యాచ్ ఆడింది.
పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. పాకిస్తాన్ జట్టును 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసి, 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
వాస్తవానికి ఒక దశలో 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పూజ వస్త్రకర్ (59 బంతుల్లో 67 పరుగులు), స్నేహ్ రాణా (48 బంతుల్లో 53 పరుగులు) తమ అర్థ సెంచరీలతో ఆదుకున్నారు.
మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్లే తమ జట్టు బలమని చెప్పారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకా మెరుగుపడాల్సి ఉందని, రాబోయే రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు.
పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ మాట్లాడుతూ.. తాము తొలుత బాగానే బౌలింగ్ చేశామని, అయితే కొన్ని లూజ్ బాల్స్ వేయడం వల్ల ఆట తమ చేతుల్లోంచి చేజారిందన్నారు. భారత జట్టుపై తాము ఒత్తిడి కొనసాగించలేకపోయామని, మధ్యలో పరుగులు లీకయ్యాయని తెలిపారు. తమ బ్యాటింగ్ కూడా మెరుగుపడాల్సి ఉందని, తమ లోపాలన్నింటినీ రాబోయే మ్యాచ్ నాటికి మెరుగుపర్చుకుంటామన్నారు.
కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు టాప్ ప్లేయర్లు హర్మాన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంథాన, షెఫాలీ వర్మతో పాటు ఇంకొందరు సభ్యులు పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కుమార్తె ఫాతిమాను ముద్దు చేస్తూ, కబుర్లు చెప్పడం, సెల్ఫీ దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఈ వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
''భారత్, పాకిస్తాన్‌ల నుంచి క్రికెట్ స్ఫూర్తి.. చిన్నారి ఫాతిమా మొదటి క్రికెట్ పాఠం'' అని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది ఐసీసీ.
ఐసీసీ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది దీనిని వీక్షించారు. సుమారు 8 వేల మంది దీనిని షేర్ చేయగా.. వేలల్లో యూజర్లు కామెంట్లు చేశారు.
బిస్మా మరూఫ్ తన కుమార్తెను ఫాతిమాను భుజాన వేసుకుని నిద్రపుచ్చుతున్నట్లుగా పాపను జోకొడుతుండగా.. ఆ పాప చుట్టూ ఉన్న భారత జట్టు సభ్యులను చూస్తోంది.
39 సెకండ్ల హర్మాన్‌ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ రిచా ఘోష్‌లు పాపను ఆడిస్తుండగా.. ఆ పాప హర్మాన్‌ప్రీత్ కౌర్ చేతిలో చెయ్యి వేస్తోంది. దీంతో బిస్మా మరూఫ్ సహా అందరూ బిగ్గరగా నవ్వేస్తున్నారు.
పక్కనే ఇతర పాకిస్తాన్ జట్టు సభ్యులతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, twitter/TheRealPCB/ICC
కాగా, హర్మాన్‌ప్రీత్ కౌర్ సెల్ఫీ తీస్తుండగా.. ఆరు నెలల ఫాతిమా కెమెరావైపు చూస్తుండటం పలువురు యూజర్లను ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, twitter/ICC
బిస్మా మరూఫ్ గతేడాది ఆగస్టులో పాప ఫాతిమాకు జన్మనిచ్చారు. ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఫాతిమాను కూడా తీసుకువెళ్లేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బిస్మా మరూఫ్‌కు అనుమతి ఇచ్చింది.
చేతిలో పాపను ఎత్తుకుని స్టేడియంకు వచ్చిన బిస్మా మరూఫ్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భుజానికి క్రికెట్ కిట్ వేసుకుని, చేతిలో బిడ్డను ఎత్తుకుని, పాపను కూర్చోబెట్టే తోపుడు బండితో పాటు ఉన్న ఫొటోను కూడా ఐసీసీ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, twitter/maroof_bisma
ఇవి కూడా చదవండి:
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?
- రొమాన్స్‌లో మహిళలు యాక్టివ్‌గా ఉంటే తప్పా, కామసూత్ర పుట్టిన దేశంలో ఎందుకీ పరిస్థితి?
- Women's day స్పెషల్: 'మహిళా నవోదయం' - మహిళల కోసం, మహిళలు రాసే వార్తలతో.. మహిళలే నడుపుతున్న పత్రిక
- యుక్రెయిన్-రష్యా యుద్ధం: పశ్చిమ దేశాలు ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








