మహిళల క్రికెట్ ప్రపంచ కప్ INDvsPAK: తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన భారత్

స్మృతి మంధన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతి మంధన

మహిళల ప్రపంచ కప్ మొదలైంది. 12వ వుమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత, పాకిస్తాన్ మహిళా జట్లు న్యూజీలాండ్‌లోని మౌంట్ మాంగనూయ్‌లో తలపడ్డాయి.

భారత్, పాకిస్తాన్ పురుషుల జట్లలాగే మహిళా జట్లు కూడా ఐసీసీ లేదా ఖండాంతర ఈవెంట్స్‌లో ఆడుతుంటాయి. భారత్-పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు మొదటిసారి 2005లో ఆసియాకప్‌లో తలపడ్డాయి.

ఈ రెండు జట్లు ఆడిన 10 వన్డేల్లోనూ భారత మహిళా జట్టు పాకిస్తాన్‌పై గెలిచింది. మొత్తం 11 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడితే భారత్ ఒక్కటి ఓడింది.

ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా మిథాలీ రాజ్, వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట కాస్త తడబడినా తరువాత, భారత్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. 245 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందుంచారు.

బ్యాటింగ్‌లో మొదటి నుంచీ తడబడిన పాకిస్తాన్ 137 వద్ద చతికిలపడింది.

107 పరుగుల తేడాతో భారత్, పాకిస్తాన్‌పై భారీ విజయం సాధించింది.

మహిళల క్రికెట్ ప్రపంచ కప్

ఫొటో సోర్స్, JAN KRUGER-ICC

భారత్ బ్యాటింగ్

స్మృతి మంధన, షెఫాలీ వర్మ మొదట బ్యాంటింగ్‌కు దిగారు. షెఫాలీకి ఇది తొలి వరల్డ్ కప్. అయితే, ఒక్క రన్ కూడా కొట్టకుండానే ఆమె వెనుదిరిగారు.

మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి శర్మ, స్మృతితో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఒక సిక్స్, మూడు ఫోర్లతో స్మృతి అర్థ సెంచరీ పూర్తి చేశారు. దీప్తి 57 బాల్స్‌లో 40 పరుగులు చేసి వెనుదిరిగారు.

తరువాత వచ్చిన మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌లు పదేసి పరుగులు కూడా చేయకుండానే వరుసగా ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు.

7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన స్నేహ రాణా, పూజ వస్త్రాకర్ మ్యాచ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు.

పూజ 59 బంతుల్లో 67 పరుగులు చేయగా, స్నేహ 48 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

స్నేహ, పూజ సాధించిన కీలకమైన ఇన్నింగ్స్‌తో, 50 ఓవర్లు పూర్తయేసరికి భారత్ 244 పరుగులు సాధించింది.

పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, నష్రా సంధు రెండేసి వికెట్లు తీశారు.

మహిళల క్రికెట్ ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ బ్యాటింగ్

245 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. సిద్రా అమీన్, జవేరియా ఖాన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

కానీ, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో జవేరియా ఖాన్ 11 పరుగులకే వెనుదిరిగారు. 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

మూడో స్థానంలో వచ్చిన బిస్మా మరూఫ్, సిద్రా కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. రెండు ఫోర్లు కొట్టి బిస్మా దూకుడు మీద కనిపించారు. కానీ, భారత్ బౌలర్ దీప్తి, బిస్మాను 15 పరుగులకే పెవిలియన్ బాట పట్టించారు.

భారత్ బౌలర్లు పట్టు బిగించడంతో తరువాత వచ్చిన నలుగురు పాకిస్తాన్ బ్యాటర్లు పదేసి పరుగుల లోపే అవుటయ్యారు. 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ చిక్కుల్లో పడింది.

తొమ్మిదవ స్థానంలో వచ్చిన డయానా బైగ్ 68.57 స్ట్రైక్ రేటుతో తన జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

రాజేశ్వరి గైక్వాడ్, తన అద్భుతమైన బౌలింగ్‌తో 10 ఓవర్లలో కేవలం 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు.

ఝాలన్ గోస్వామి 10 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా, స్నేహ రాణా 9 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, మేఘనా సింగ్ చెరొక వికెట్ తీశారు.

పాకిస్తాన్ 43 ఓవర్లలో 137 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)