కొరియా సంస్కృతి: 'మీ వయసు ఎంత?' మహిళలనైనా సరే.. ఈ ప్రశ్న అడగడమే ఇక్కడ మర్యాద..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వివియన్ సోంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'మీ వయసు ఎంత' అని అడగడం చాలా సంస్కృతుల్లో అమర్యాదగా భావిస్తారు. కానీ దక్షిణ కొరియాలో మీ వయసెంత అని అడగటం మర్యాదపూర్వకమే. అలా వయసు తెలుసుకోవటం సంభాషించే వారి మధ్య పెద్దా చిన్నా వ్యత్యాసానికి వీలు కల్పిస్తుందని ఇక్కడి జనం భావిస్తారు.
మొదటిసారి దక్షిణ కొరియాలో పర్యటించిన ప్రవాస బ్రిటిషర్ జోయెల్ బెన్నెట్ మంచి భోజనం పెట్టినందుకు ఒక రెస్టారెంట్ యజమానికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంలో భాషాపరంగా పొరపాటు చేసినట్లు తెల్సుకున్నారు.
పదేళ్ల కిందట, హోటల్ యజమాని అయిన 60 ఏళ్ల వృద్దురాలితో అప్పుడు 23 ఏళ్ల బెన్నెట్ 'గమావో' అన్నారు. అంటే కొరియన్‌లో మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు చెప్పానని ఆయన భావించారు.
ఇప్పుడు 33 ఏళ్ల వయసులో ఉన్న బెన్నెట్, ఆ రోజు మామూలుగా థాంక్యూ చెప్పేశారు. కానీ కొరియాలో అలా చెప్పడం అమర్యాదగా అవమానకరంగా భావిస్తారు.
"కృతజ్ఞతలు చెప్పటంలో ఇన్ని రకాలుంటాయని నేను గుర్తించలేదు. నేనెప్పుడూ థ్యాంక్యూ అంటే థ్యాంక్యూ అనే అనుకున్నాను" అని బెనెట్ చెప్పారు.
కానీ, కొరియా సంస్కృతి ప్రకారం, పెద్ద వయసున్న రెస్టారెంట్ యజమాని కంటే ఎంతో చిన్న వాడైన బెన్నెట్ కొరియాలో గౌరవప్రదమైన కొరియా భాష మాట్లాడుతారని ఆశిస్తారు.
ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భాషల్లో కొరియా భాష కూడా ఒకటి. ఎందుకంటే కొరియన్‌లో మాట్లాడేందుకు వివిధ స్థాయిల్లో భాషా ప్రయోగాలుంటాయి. వయసును బట్టి, సా్దమాజిక స్థాయిని బట్టి, ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి మాట్లాడే భాషలో తేడాలు ఉంటాయి.
అందుకే, దక్షిణ కొరియాలో మీరు కొత్తగా ఎవరినైనా కలిస్తే, మొదట మీ వయసెంత అని అడిగి తెలుసుకుంటారు.
అలా, మీ వయసు, పుట్టిన ఏడాది చెప్పడం అక్కడ సామాజికంగా పాటించే ఆచారం మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఏ స్థాయి సాన్నిహిత్యం ఉండాలో నిర్దేశించేది, వారి మధ్య పెద్దా చిన్నా తేడాలను నిర్ణయించేది కూడా వయసు తేడానే.
ఒక్క ఏడాది వయసు తేడా ఉన్నా, అది ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. వాళ్లు కలిసి ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మాట్లాడేటపుడు ఎలాంటి భాషను ఉపయోగించాలో నిర్దేశించే వాటిలో మొదట వచ్చేది వయసేనని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కొరియన్ భాష ప్రొఫెసర్ జీయున్ కియేర్ వివరించారు.
అందుకే ప్రజలు ఇతరుల వయసు గురించి ముందే తెల్సుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అందుకు కారణం ఇతరుల వయసు గురించి వారికి ఆసక్తి ఉండడం కాదు, వారి వయసుని బట్టి ఎలాంటి భాష ఉపయోగించాలో స్పష్టత కోసమే అది అడుగుతారు.
కానీ పశ్చిమ దేశాల్లో కొత్తవాళ్లను నేరుగా మీ వయసెంత అని అడగటం అమర్యాదగా భావిస్తారు.
కొరియా సంస్కృతిలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని అర్ధం చేసుకోవడానికి, మనం మొదట దక్షిణ కొరియాను తరతరాలుగా ప్రభావితం చేసిన నవీన కన్ఫ్యూషియనిజం శాశ్వత ప్రభావం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది చిన్నవారు పెద్దల పట్ల గౌరవం చూపించడం, సామాజిక వ్యవస్థ లాంటి వాటి చుట్టూ కేంద్రీకృతమైన ఒక పురాతన భావజాలం. జాషియన్ రాజవంశం పాలనలో 500 ఏళ్ల పాటు ఆ దేశాన్ని నడిపించిన సిద్ధాంతాలివి. కొరియా సామాజిక నిబంధనలను నిర్ధేశించేవి కూడా ఇవే.
మానవత్వం, ఆచారం అనే రెండు పదాల్లోనే మొత్తం కన్‌ఫ్యూషియనిజాన్ని పూర్తిగా నిర్వచించవచ్చని వర్జీనియాలోని జార్జ్ మేసన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రో యాంగ్ చాన్ చెబుతున్నారు.
చైనా చరిత్రలో విప్లవం ఉవ్వెత్తిన ఎగసిన కాలంలో, అంటే క్రీ.పూ. 551 నుంచి 479 సమయంలో తత్వవేత్త కన్‌ఫ్యూషియస్ తత్వం పుట్టుకొచ్చిందని రో యాంగ్ వివరించారు.
కొరియన్ భాషలో మాట్లాడేందుకు, రాసేందుకు ఏడు లెవెల్స్ ఉన్నాయి. రోజువారీ సంభాషణలను రెండు విధాలుగా విభజిస్తారు. సులభంగా మాట్లాడే భాషా విధానాన్ని బన్మాల్ అని, మర్యాదపూర్వకంగా మాట్లాడే భాషను జోందేమాల్ అని పిలుస్తారు. ఈ భాషలో సాధారణంగా వాక్యం చివర్లో యో అనే పదాన్ని చేర్చి మాట్లాడతారు.
సరిగా మాట్లాడే శైలిని గుర్తించడానికి చాలా శ్రద్ధ, చర్చ అవసరం అవుతుంది. మీరు ఏదైనా పొరపాటు పదం ఉపయోగిస్తే, అది చాలా గొడవకు కారణం అవుతుంది. మీరు మరో వ్యక్తితో విజయవంతంగా మాట్లాడలేరు అని కియెర్ చెప్పారు.
నిజానికి ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. కొరియా ప్రజలు కూడా తప్పుగా పలుకుతుంటారు. దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ పేపర్ ప్రచురించిన రచయిత కియేర్, మాట్లాడ్డంలో పొరపాట్లు జరగడం వల్ల 2008-2017 మధ్య దక్షిణ కొరియాలో వందకు పైగా హింసాత్మక ఘటనలు, దాడులు జరిగినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియాలో పెద్దల సమక్షంలో మద్యపానానికి కూడా ఓ లెక్క, పద్ధతి ఉంటుంది. అందుకు సంబంధించిన నిబంధనలు చూస్తే కళ్లు తిరుగుతాయి.
గ్లాసులో మందు పోసేటపుడు పెద్దలకు గౌరవసూచకంగా సీసాను మీరు రెండు చేతులతో పట్టుకునే మందు పోయాలి. మీరు మందు తాగేటపుడు పెద్దల నుంచి తల తిప్పుకుని తాగాలి. పెద్ద వారి గ్లాసు ఎక్కువ సేపు ఖాళీగా ఉండకుండా చూడాలి. మీ గ్లాసు కింద పెట్టే ముందు పెద్ద వాళ్ల గ్లాసు కింద పెట్టే వరకూ ఆగాలి.
ఒకవేళ మీరు మందు తాగేటపుడు, మీ సమక్షంలో ఉన్న పెద్ద వారి నుంచి తల పక్కకు తిప్పుకుని తాగకపోతే.. వారిని అవమానించినట్లే.
''కొరియాలో సామాజిక నైతిక సూత్రాలు.. కుటుంబానికి కొనసాగింపుగా ఉంటాయి. సమాజాన్ని మనమొక విస్తృత కుటుంబంలా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీకన్నా పెద్ద వయసు వ్యక్తిని కలిసినపుడు వారిని మీరు మీ అన్నగానో, అక్కగానో భావించి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని చూసే ఓ ఆసక్తికరమైన విధానం. మానవాళి అనేది మన కుటుంబానికి కొనసాగింపు మాత్రమే అనే దృష్టి అది'' అని చెప్పారు డెలియా జు.
అయితే.. సీనియర్ - జూనియర్, పెద్దా - చిన్నా, మగా - ఆడా సంబంధాల్లో పరస్పర గౌరవానికి సంబంధించిన కన్ఫ్యూషియన్ సూత్రం ఈ సుదీర్ఘ కాలంలో ఎక్కడో తప్పిపోయిందని రో అంగీకరిస్తారు.
ఆదరణకు ప్రతిగా గౌరవాన్ని అందించే పరస్పర ప్రయోజనకరమైన ఈ సంబంధాలు.. ఎక్కువ, తక్కువ అనే నిచ్చెనమెట్ల వ్యవస్థగా మారిపోయిందని.. ఇందులో వేధింపులకు, అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి. భార్యాభర్తల సంబంధాల్లోనూ, ఉద్యోగ సంబంధాల్లోనూ ఈ ఎక్కువ, తక్కువ వ్యవస్థ వల్ల జరుగుతున్న వేధింపుల ఉదంతాలు కొన్ని తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.
ఈ పరిస్థితుల్లో 'ఈ జాతి బతకాలంటే కన్ఫ్యూషియస్ చనిపోవాలి' అంటూ ఆధునిక కొరియన్ స్కాలర్ కిమ్ క్యుంగ్-ఇల్ రాసిన పుస్తకం వివాదాస్పదమైంది.
అయితే.. దక్షిణ కొరియా సమాజంలో ఉన్న సమస్య కన్ఫ్యూషియనిజం కాదని.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోవటమని రో అంటారు. ''కన్ఫ్యూషియనిజం అనేది ఒక సజీవ సంప్రదాయం. మనం మన సంప్రదాయాలను ఆధునిక సమాజానికి అనుగుణంగా పునరుత్తేజితం చేయాలి. పునర్నిర్వచించాలి'' అంటారాయన.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- రష్యా, అమెరికా, బ్రిటన్, చైనాల్లో అణ్వాయుధాలను నొక్కే బటన్ ఎవరి అధీనంలో ఉంటుంది
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ యుద్ధాన్ని నడిపిస్తున్నారు, మరి పుతిన్ను నడిపిస్తున్నదెవరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










