యుక్రెయిన్, రష్యా యుద్ధంలో Z అక్షరం ఎందుకంత కీలకంగా మారింది? దీనిని ఏ అర్థంలో వాడుతున్నారు

రష్యన్ జిమ్నాస్ట్ ఇవాన్ కులియాక్‌
ఫొటో క్యాప్షన్, రష్యన్ జిమ్నాస్ట్ ఇవాన్ కులియాక్‌

ఖతర్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో రష్యన్ జిమ్నాస్ట్ ఇవాన్ కులియాక్‌పై అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (ఎఫ్ఐజీ) క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.

పోటీల అనంతరం మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పోడియంపై తన యుక్రెయిన్ ప్రత్యర్థి పక్కనే నిలబడిన ఇవాన్ కులియాక్ టీషర్ట్‌పై ఆంగ్ల అక్షరం 'Z' ఉండడంతో ఎఫ్ఐజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ 'Z' అక్షరం దేనికి సంకేతం? దాని అర్థం ఏమిటి?

యుక్రెయిన్‌పై రష్యా దాడికి మద్దతు చిహ్నంగా ఆంగ్ల అక్షరం 'z'ను రష్యాలో వాడుతున్నారు. రష్యా రాజకీయ నాయకులు దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. కార్లు, వ్యాన్లు, బస్ షెల్టర్లపై ఈ చిహ్నం కనబడుతోంది. ఈ చిహ్నంతో హోర్డింగ్‌లు కూడా వెలిశాయి.

బెల్‌గ్రేడ్‌లో జరిగిన రష్యా అనుకూల ప్రదర్శనల్లో కూడా సెర్బ్స్‌ ఈ గుర్తును ఉపయోగించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ సంకేతం ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి.

రష్యా మిలిటరీ వాహనాలపై 'Z' చిహ్నం
ఫొటో క్యాప్షన్, రష్యా మిలిటరీ వాహనాలపై 'Z' చిహ్నం

ఇది సామాజిక మాధ్యమాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని యూసీఎల్‌లోని స్కూల్ ఆఫ్ స్లావోనిక్ అండ్ ఈస్ట్రన్ యూరోపియన్ స్టడీస్‌కు చెందిన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లెక్చరర్ అగ్లాయా స్నెత్కోవా అన్నారు.

''అనేక విధాలుగా ఈ చిహ్నం, ప్రపంచ పటంలో రష్యా విస్తృతి ఎలా ఉందో, ఎలా ఉంటుందో చూపిస్తుంది'' అని స్నెత్కోవా అన్నారు.

రష్యన్ సిరిలిక్ అల్ఫాబెట్‌లో 'జడ్' అక్షరాన్ని కాస్త భిన్నంగా రాస్తారు. ఇది చూడటానికి '3' అంకెలా కనిపిస్తుంది. చాలామంది రష్యన్లు లాటిన్ అక్షరాలను గుర్తిస్తారు.

'జడ్ అనేది శక్తిమంతమైన, సులభంగా గుర్తించగలిగే ఒక చిహ్నం' అని ఆర్‌యూఎస్‌ఐలో రష్యా అండ్ యూరేసియా రీసెర్చ్ ఫెలో ఎమిలీ ఫెర్రిస్ అన్నారు.

''సులభమైన అంశాలకు ప్రచారం కల్పిస్తే అవి వేగంగా అందరికీ చేరతాయి. కళాత్మక కోణంలో చూస్తే ఇది ఒక శక్తిమంతమైన చిహ్నం కూడా'' అని ఎమిలీ చెప్పారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడికి మద్దతు ఇచ్చే వారందరినీ చేరడానికి ఈ చిహ్నానికి కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయమే పట్టింది.

జడ్ ఆకారంలో నిలబడిన చిన్నారులు, సిబ్బంది

సెంట్రల్ రష్యా నగరం కజన్‌లోని ఒక ధర్మశాల బయట దాదాపు 60 మంది చిన్నారులు, సిబ్బంది కలిసి మంచులో 'z' ఆకారంలో నిలబడి ఫొటో తీసుకున్నారు.

'z' చిహ్నానికి అనేక వివరణలు వ్యాప్తిలో ఉన్నాయి. 'z' అక్షరం ఉన్న రష్యా యుద్ధ ట్యాంకులు యుక్రెయిన్ వైపు బయలుదేరిన తర్వాత తొలిసారిగా ఈ చిహ్నం సామాజిక మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది.

ప్రారంభంలో 'z' అక్షరాన్ని '2' అని అనుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీకి సూచకంగా దీన్ని తీసుకున్నట్లు భావించారు. 2022 ఫిబ్రవరి 22వ తేదీనే... తూర్పు యుక్రెయిన్‌ రీజియన్‌లోని దోన్యస్క్, లూహాన్స్స్ ప్రాంతాలతో స్నేహం, సహకారం, ఉమ్మడి సహాయం తదితర అంశాలపై రష్యా అమోదముద్ర వేసింది.

కానీ ఇప్పుడు అందరూ యుద్ధంలో పాల్గొనే తమ సొంత బలగాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా రష్యా ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

'z' అనేది రష్యా మిలిటరీ సామగ్రికి సాధారణ గుర్తు అని రష్యా ప్రభుత్వ నియంత్రణలోని చానల్ 'వన్' గత వారం పేర్కొంది.

'ఫ్రెండ్లీ ఫైర్'ను నివారించడానికి, స్వీయ సైనికుల గుర్తింపులో రష్యా బలగాలు పొరబడకుండా ఉండేందుకే ఈ చిహ్నాన్ని వాడుతున్నట్లు సార్‌గ్రాడ్ అనే వెబ్‌సైట్ తెలిపింది.

వివిధ మిలిటరీ యూనిట్లను సూచించడానికి విభిన్న సంకేతాలు వాడతారని 'లైఫ్' అనే రష్యా మ్యాగజీన్ వెబ్‌సైట్‌కు రష్యా ప్రత్యేక బలగాల వెటరన్ సెర్గీ కువీకిన్ చెప్పారు.

రష్యాలోని పలు నగరాల్లో జడ్ చిహ్నాన్ని ప్రదర్శించారు

''ఆంగ్ల అక్షరం 'z'తో పాటు చతురస్రంలో 'z', వృత్తాకారంలో 'z', నక్షత్రాకారంలో 'z' వంటి సంకేతాలను కూడా ఉపయోగిస్తారు. ఈ సంకేతాల ద్వారా మిలిటరీ అధికారులు ఆయా బలగాలను సులభంగా గుర్తిస్తారు'' అని ఆయన చెప్పుకొచ్చారు.

తెల్లటి రంగులో ఉన్న ఆ సంకేతాలను చూడటానికి రష్యా యుద్ధవిమానాలు వేగంగా ఎగురుతాయి'' అని టాస్క్ అండ్ పర్పస్ అనే వెబ్‌సైట్‌తో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్ టైసన్ వెట్జల్ అన్నారు. ఫ్రెండ్లీ ఫైర్‌ను నివారించడానికే ఈ చిహ్నాలను ఉపయోగిస్తారని ఆయన కూడా అంగీకరించారు.

రష్యాలో 'z' సంకేతం వ్యాప్తికి కేవలం సోషల్ మీడియా చురుకుతనం మాత్రమే కారణం కాదని అగ్లాయా స్నెత్కోవా సూచించారు. ''ప్రభుత్వం కూడా దీని వెనుక ఉందని'' అన్నారు.

బిజినెస్ జాకెట్‌పై 'z' అనే చిహ్నాన్ని ఎలా రాయాలో చూపించే వీడియోను రష్యా రాజకీయవేత్త మరియా బుటీనా షేర్ చేశారు. అందరికీ కనిపించేలా అలాంటి జాకెట్లు ధరించి కార్యాలయాలకు వెళ్తే, అరవకుండానే ఆ చిహ్నానికి ప్రచారం కల్పించవచ్చని స్నెత్కోవా వివరించారు.

''నియంతృత్వానికి ప్రతీకగా ఆ చిహ్నాన్ని భావించవద్దు. ఈ చిహ్నంపై చాలా మీమ్స్ వస్తున్నాయి. కొందరు 'z'ను స్వస్తికగా మార్చుతూ మీమ్స్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ప్రజలు మాత్రమే ఇలా చేయగలరు'' అని స్నెత్కోవ్ అన్నారు.

Instagram images of 'Zs' and 'Vs' from the Russian defence ministry
ఫొటో క్యాప్షన్, రష్యా రక్షణ శాఖ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Z’, ‘V’ చిహ్నాలు

ఇదే కాకుండా ఇతర గుర్తులు కూడా కనిపిస్తున్నాయి.

'z' ఫొటోలతో పాటు 'v' అనే అక్షరం రష్యా రక్షణ శాఖ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పోస్టుల్లో కనబడుతోంది.

కొన్ని చోట్ల చిహ్నాలతో పాటు 'జా పత్సనోవ్ (సహచరుల కోసం)', 'సిలా వి ప్రవేడ్ (సత్యమే శక్తి)' అనే వ్యాఖ్యలను కూడా జోడిస్తున్నారు.

వోస్తోక్ (తూర్పు), జాపడ్ (పడమర) అనే పదాలకు సూచికగా ఈ రెండు లాటిన్ అక్షరాలను ఎంచుకొని ఉంటారనే భావన కూడా ఉంది. 'z' అక్షరం రష్యా తూర్పు బలగాలను, 'v' చిహ్నం నావికా దళాలను సూచిస్తుందని యుక్రెయిన్ సైన్యం నమ్ముతున్నట్లు సామాజిక మాధ్యమాలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)