రష్యా: గ్రోజ్నీ నుంచి యుక్రెయిన్ వరకు, ప్రతిఘటన ఎదురైనచోట బాంబుదాడులతో ఎందుకు విరుచుకుపడుతోంది-గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమి బౌవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యన్ దళాలు ఎలా దాడి చేస్తాయో యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కియెవ్ ఇప్పటికే చూసింది. మారియపోల్, ఇంకా మరికొన్ని నగరాలు కూడా ఈ ప్రమాదాన్ని చూశాయి.
ప్రతిఘటించిన వారిపై రష్యా భారీ కాల్పులతో ప్రతిస్పందిస్తుంది. ప్రతి ఇంటి మీదకు సైనికులను పంపడానికి బదులు నగరంపై బాంబులతో విరుచుకుపడటం రష్యన్ సైనిక విధానం. ఖార్కియెవ్, ఇతర పట్టణాలు, నగరాలు ఇప్పటికే తీవ్రనష్టాన్ని చవిచూశాయి. అనేకమంది పౌరులు మరణించినట్లు కూడా తెలుస్తోంది. ఖార్కియెవ్‌లో స్థానిక ప్రభుత్వం కూడా చాలా నష్టపోయింది.
బహుశా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ''తూర్పు వైపు చూడు, ఎందుకంటే ఇది మీకు కూడా జరగవచ్చు'' అని కీయెవ్ నగరానికి సందేశం పంపుతున్నట్లు కనిపిస్తున్నారు.
గతంలో జరిగిన కొన్ని యుద్ధాలకు సంబంధించి నాకున్న అనుభవాలను బట్టి, రష్యా చర్యలతో పరిస్థితులు మరింత దిగజారవచ్చు.
1990లలో గ్రోజ్నీపై దాడి, 2015లో సిరియాలో సైనిక జోక్యానికి ఇచ్చిన స్థాయిలో పుతిన్ ఈ దాడులకు ఆదేశాలు ఇవ్వలేదు. 1990లలో చెచెన్యాలో భారీ తిరుగుబాటు జరిగింది. దీనిని అణిచివేసేందుకు రష్యా దళాలు గ్రోజ్నీలో ప్రవేశించాయి.

ఫొటో సోర్స్, BBC/JEREMY BOWEN
1994-95లో ప్రారంభమైన మొదటి చెచెన్ యుద్ధాన్ని నేను కవర్ చేశాను. రష్యా సైన్యం, యుక్రెయిన్‌లోలాగానే ఇక్కడ సైనిక ఆపరేషన్‌లలో అనేక తప్పులు చేసింది.
చెచెన్ తిరుగుబాటుదారులు ఇరుకైన వీధుల్లో రష్యన్ సాయుధ సైనిక వాహనాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేశారు. చాలామంది రష్యన్ సైనికులకు ఈ పోరాటంలో పాల్గొంటామని, ప్రాణాలు కోల్పోతామని అనుకోలేదు.
ఇప్పుడు యుక్రెయిన్ పై దాడికి ముందు, రష్యా సైన్యం చాలా ప్రొఫెషనల్‌గా ఉందని సైనిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారు చెప్పింది నిజమే కావచ్చు. కానీ ఈసారి కూడా రష్యా దాడులలో మరోసారి సైనిక పరిమితులు, వ్యూహాత్మక తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి.
యుద్ధానికి వెళ్లాల్సి వస్తుందని తెలియని యువకులు కూడా వారి సైన్యంలో ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతిఘటన కూడా 1995లో చెచెన్యాలో ఉన్నంత బలంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చెచెన్యాలో ప్రతిఘటనను ఎదుర్కోవడానికి రష్యా భారీగా బాంబులను ప్రయోగించింది. కొన్ని వారాలపాటు భారీ ఎత్తున సాగిన కాల్పులు, ప్రతికాల్పులు, వైమానిక దాడులతో గ్రోజ్నీ నగరం శిథిలాలుగా మారింది.
నేను ఆ రోజు చెచెన్ ప్రతిఘటనకు కేంద్రమైన మినుట్కా స్క్వేర్‌లో ఉన్నాను. అక్కడ మళ్లీ మళ్లీ వైమానిక దాడులు జరుగుతున్నాయి. చాలామంది ప్రజలు నేలమాళిగలో దాక్కున్నారు. తినడానికి, తాగడానికి బైటికొచ్చినా వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేది.
ఆ రోజు మినుట్కా స్క్వేర్‌పై జరిగిన క్లస్టర్ బాంబు దాడిలో అనేకమంది చెచెన్ తిరుగుబాటుదారులు చనిపోయారు. రష్యా సైనికులు అనేక భవనాలకు నిప్పు పెట్టారు. ఇరవై నాలుగు గంటల తర్వాత, నగరంలోని ముఖ్యమైన రహదారులన్నీ క్షిపణి దాడులకు గురయ్యాయి.
నగరం మొత్తం పొగ, మంటలతో నిండిపోయింది. మేం వీడియో షూట్ చేస్తున్నప్పుడు భూమి కంపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆకాశం నుంచి బాంబుల వర్షం
యుద్ధాన్ని రిపోర్ట్ చేసిన నా అనుభవంలో, గ్రోజ్నీ తర్వాత నేను చూసిన అత్యంత విధ్వంసకరమైన ప్రదేశం సిరియా.
సిరియాలో జోక్యం చేసుకోవాలన్న రష్యా నిర్ణయం బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కాపాడింది. రష్యాను మరోసారి ప్రపంచ శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో పుతిన్ వేసిన పెద్ద అడుగు ఇది.
ఈ రెండు తిరుగుబాట్ల పై రష్యా విజయం సాధించడానికి కారణం, అక్కడ తీవ్రమైన కాల్పులకు, వైమానిక దాడులకు దిగడమే.
2016 చివరిలో సిరియాలోని అలెప్పోలో కూడా రష్యా ఇలాగే వ్యవహరించింది. నగరం తూర్పు భాగాన్ని వివిధ తిరుగుబాటు గ్రూపులు ఆక్రమించాయి. ఆ తర్వాత ఇది రష్యా కాల్పులు, వైమానిక దాడులలో తీవ్రంగా ధ్వంసమైంది.
ఈ సైనిక చర్యలో రష్యా వైపు నుండి పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిగాయి. సిరియా ప్రభుత్వంతోపాటు, ఇరాన్ బాంబర్లు కూడా తిరుగుబాటుదారులపై దాడులకు పాల్పడ్డారు.

ఫొటో సోర్స్, BBC/JEREMY BOWEN
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలను చుట్టుముట్టడం, వైమానిక దాడులతో పాటు భారీ కాల్పులు జరపడంలాంటివి సిరియాలో రష్యా ఉపయోగించిన వ్యూహం.
అయితే, ఈ వ్యూహంలో రష్యా తరఫున పోరాడుతున్నవారిని, ప్రజలను అక్కడి నుంచి తరలించాలి. కానీ వారిలో చాలామంది చనిపోయారు.
తూర్పు అలెప్పోలో ఇలాంటి దాడులు జరిగిన కొన్ని వారాల తర్వాత నేను అక్కడికి వెళ్లాను. ప్రతిచోటా విధ్వంసం జరిగినట్లు ఆధారాలు కనిపించాయి.
యుద్ధంతో విధ్వంసానికి గురికాని భవనం ఒక్కటి కూడా నాకు కనపడలేదు. పట్టణాలు, నగరాలు శిథిలావస్థకు చేరాయి. ఈ శిథిలాలతో రోడ్లు కూడా మూసుకుపోయాయి.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతంలో రష్యా వ్యూహానికి ప్రతివ్యూహం కూడా నేను గమనించాను. తూర్పు గుటాలోని తిరుగుబాటుదారులు తమపై వైమానిక దాడులు, కాల్పుల నుంచి తప్పించుకోవడానికి నగరంలోంచి సొరంగం వేశారు.
కానీ, రష్యన్ సైన్యపు భారీ ముట్టడి, కాల్పులు ఈ వ్యూహంపై విజయం సాధించాయి. చాలామంది తిరుగుబాటుదారులు మరణించారు. తర్వాత ఈ ప్రాంతం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతంలో రష్యా వ్యూహానికి ప్రతివ్యూహం కూడా నేను గమనించాను. తూర్పు గుటాలోని తిరుగుబాటుదారులు తమపై వైమానిక దాడులు, కాల్పుల నుంచి తప్పించుకోవడానికి నగరం గుండా సొరంగం వేశారు.
కానీ, రష్యన్ సైన్యపు భారీ ముట్టడి, కాల్పులు ఈ వ్యూహంపై విజయం సాధించాయి. చాలామంది తిరుగుబాటుదారులు మరణించారు. తర్వాత ఈ ప్రాంతం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, BBC/JEREMY BOWEN
యుక్రెయిన్‌లో ఏం జరుగుతుంది?
ఖార్కియెవ్, మరియుపూల్ నగరాలలో ఇంత వరకు ఏం జరిగిందో, చెచెన్యా, సిరియాలలో రష్యా ఎలా ప్రవర్తించిందో ఇక్కడ కూడా అదే జరుగుతుందా అన్నది కీయెవ్‌లోని ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
రష్యా చరిత్రలో యుక్రెయిన్ ప్రాముఖ్యత గురించి పుతిన్ స్వయంగా రాశారు. కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్‌ను తిరిగి పొందే క్రమంలో ఆయన దానిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారా? యుక్రెయిన్ విషయంలో ఎదురవుతున్న ఆంక్షలు, ప్రతిఘటన పుతిన్ పాలన స్థిరత్వానికి ముప్పు కలిగిస్తే, ఆయన మరింత కఠినమైన చర్యలకు దిగుతారా?
తన బలగాల బలహీనతలను రష్యా భారీ బాంబు దాడులతో భర్తీ చేస్తోందని రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ అలా జరగకూడదని యుక్రెయిన్ ప్రజలు ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













