భారత్‌ మాదిరిగానే బ్రెజిల్‌లోనూ ఈవీఎంలపై ఆరోపణలు... అక్కడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం ఎంత వరకు సురక్షితం

బ్రెజిల్ ఓటింగ్ మెషిన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ ఓటింగ్ మెషిన్లు
    • రచయిత, జులియానా గ్రాగ్నాని, జేక్ హోర్టాన్
    • హోదా, బీబీసీ రియాల్టీ చెక్ & వరల్డ్ సర్వీస్ డిజిన్ఫర్మేషన్ టీం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద భారత్‌లో ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది.

ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేయొచ్చని ఆరోపించే పార్టీలు చాలానే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 2019 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ, 2018 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించింది.

ఇప్పుడు ఇలాంటి చర్చ బ్రెజిల్‌లోనూ నడుస్తోంది. నేడు ఆ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరొకసారి ఆ పదవికి పోటీపడుతున్నారు.

అక్కడ వాడే ఈవీఎం మెషిన్ల మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వాడే మెషిన్లతో మోసాలకు పాల్పడొచ్చని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఆరోపిస్తూ వచ్చారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా 2020 ఎన్నికల్లో ఇలాగే ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో బ్రెజిల్ ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం.

బ్రెజిల్ ఓటింగ్ మెషిన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి నెంబరును మెషిన్లో ఎంటర్ చేయాలి
ఎర్రన గీత

బ్రెజిల్ ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

  • బ్రెజిల్‌లో 1996 నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారానే ఓటింగ్ జరుగుతోంది.
  • పోటీ పడే అభ్యర్థుల జాబితా మెషిన్ మీద ఉంటుంది.
  • ప్రతి అభ్యర్థికి ఒక నెంబరును కేటాయిస్తారు.
  • ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటే, ఆ అభ్యర్థికి కేటాయించిన నెంబరును ఓటింగ్ మెషిన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో మెషిన్ లెక్కిస్తుంది. ఆ జాబితాను ఎన్నికల కేంద్ర కార్యాలయానికి పంపుతుంది.
  • ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్న పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తారు.
  • ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిపే జాబితాను కూడా ఓటింగ్ మెషిన్ ప్రింట్ చేస్తుంది.
  • ఓటింగ్ అయిపోయిన తరువాత అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఆ జాబితాలను ప్రదర్శిస్తారు.
  • బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు రికార్డు చేసే ఓట్లకు మెషిన్లు రికార్డు చేసిన ఓట్లకు లెక్క సరిపోతుందో లేదో చెక్ చేస్తారు.

ఈ ఏడాది తొలిసారి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.

ఎర్రన గీత
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022 ఒపీనియన్ పోల్స్‌లో జైర్ బోల్సొనారో వెనుకబడి ఉన్నారు

బోల్సొనారో ఆరోపణ ఏంటి?

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఎంతో కాలంగా ఓటింగ్ మెషిన్లను అనుమానిస్తూ వస్తున్నారు.

2018 ఎన్నికల తొలి రౌండ్‌లో ఏ అభ్యర్థికి 50శాతం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దాంతో రెండోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. నాడు తనకు తొలి రౌండ్‌లోనే విజయం దక్కక పోవడానికి కారణం ఓటింగ్‌లో అవకతవకలు జరగడమేనని ఆయన ఆరోపించారు.

తొలి రౌండ్‌లో ఆయనకు 46శాతం ఓట్లు వచ్చాయి. మరొక 4శాతం వచ్చి ఉంటే ఆయన గెలిచి ఉండేవారు. చివరకు రెండో విడత ఎన్నికల్లో బోల్సోనారో విజేతగా నిలిచారు.

ఆ తరువాత 2018 ఎన్నికల మీద జరిపిన పరిశోధనల్లో మోసం జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించేలేదు.

బ్రెజిల్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం ఉంటుంది కనుక అక్కడ పేపర్ బ్యాలెట్లు ఉండవు. ఈవీఎం మెషిన్ల కంటే 'ప్రింట్ చేయతగిన, ఆడిట్ చేయడానికి వీలుగా' ఉండే పేపర్ బ్యాలెట్లు ఎంతో సురక్షితమైనవి బోల్సొనారో వాదిస్తున్నారు.

'బ్రెజిల్ ఎన్నికల్లో ఆడిట్ చేయడం అసాధ్యం' అంటూ ఈ ఏడాది జులైలో ఆయన అన్నారు. ఈవీఎం మెషిన్ల సాఫ్ట్‌వేర్‌లోని కోడ్‌ను మార్చడం ద్వారా 'రిగ్గింగ్ చేయడం చాలా సులభమని' ఆయన ఆరోపించారు.

బ్రెజిల్ ఓటింగ్ మెషిన్లు

ఫొటో సోర్స్, Getty Images

మోసం చేయొచ్చు అనేదానికి ఆధారాలున్నాయా?

బ్రెజిల్ ఎన్నికల్లో ఓట్లను ఆడిట్ చేయలేరు అని చెప్పడంలో నిజం లేదు. అవసరమైతే పోలైన ఓట్లను మెషిన్ నుంచి రిట్రైవ్ చేయొచ్చు. 2014 అధ్యక్ష ఎన్నికల్లో ఇలాగే ఆడిట్ నిర్వహించారు. ఎటువంటి మోసం జరగలేదని నాడు ఆ ఆడిట్‌లో తేలింది.

'ఎన్నికల్లో మోసం జరిగినట్లుగా నమ్మదగిన ఆధారాలు ఇంత వరకు ఆడిట్‌లో దొరకలేదు' అని 2014 ఆడిట్‌లో పాల్గొన్న ప్రొఫెసర్ మార్కొస్ సింప్లిసియో అన్నారు.

మోసం జరగకుండా అనేక భద్రతా వ్యవస్థలు ఓటింగ్ మెషిన్లలో ఉన్నట్లు బ్రెజిల్‌ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు చెబుతోంది.

రాజకీయ పార్టీల సమక్షంలో కొన్ని ఓటింగ్ మెషిన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి అవి సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేస్తారు.

'మెషిన్లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను అనేక స్థాయిల్లో టెస్ట్ చేస్తారు. నిపుణులు, బయటి హ్యాకర్లు కూడా దాని పనితీరును పరిశీలిస్తారు' అని బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు ఐటీ సెక్రటరీ జులియో వాలెంటీ తెలిపారు.

ప్రతి ఎన్నికలకు ముందు సిస్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులను, సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులను ఎలక్టోరల్ కోర్టు ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది 20 మందికిపైగా ఐటీ నిపుణులు ఓటింగ్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ప్రజలకు కనిపించేలా కాకుండా ఒక 'సీక్రెట్ రూం'లో ఓట్లను లెక్కిస్తున్నారని బోల్సొనారో ఆరోపిస్తున్నారు. కానీ మెషిన్లలో రికార్డు అయిన ఓట్లను లెక్కించే పద్ధతిని రాజకీయ పార్టీల ప్రతినిధులు మానిటర్ చేయొచ్చు.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో

ఫొటో సోర్స్, Reprodução

ఫొటో క్యాప్షన్, బోల్సొనారో అనుచరులు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు

ఈ వదంతులు ఎలా వస్తున్నాయి?

బోల్సొనారోకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా గ్రూపులు ఓటింగ్ మెషిన్ల మీద వదంతులు పుట్టిస్తున్నాయి.

ఇటీవల చేసిన ఒక సర్వే ప్రకారం, బోల్సొనారో మద్దతుదారుల్లో నాలుగో వంతు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్‌ను నమ్ముతున్నామని తెలిపారు. మిగతా మూడు వంతుల మంది తమకు నమ్మకం లేదని చెప్పారు.

ప్రజలను తప్పుదారి పట్టించి, ఎన్నికల వ్యవస్థ మీద సందేహాలు లేవనెత్తేలా వీడియోలను షేర్ చేస్తున్నారు.

బ్రెజిల్‌లో ప్రెసిడెంట్‌తో పాటు సెనేటర్లు, గవర్నర్లను కూడా ప్రజలు ఎన్నుకుంటారు.

ఒక వీడియోలో గవర్నర్‌ను ఎంచుకోవాల్సిన చోట బోల్సొనారో నెంబరు ఎంటర్ చేయడంతో అది 'చెల్లని ఓటు' అనే సందేశం వచ్చింది. ఇలా సందేశం వచ్చినప్పుడు, ఓటు కన్ఫర్మ్ చేసే ముందు సరైన నెంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది.

మరొక వీడియోలో బోల్సొనారో నెంబరు ఎంటర్ చేసినప్పుడు మరొక అభ్యర్థి ఫొటోను మెషిన్ చూపిస్తోంది. అయితే ఆ వీడియో ఎడిట్ చేసినదిగా ఎలక్టోరల్ కోర్టు ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)