Dates: ఆంధ్రప్రదేశ్‌లో ఖర్జూరం సాగు - ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందంటున్న రైతులు

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఖర్జూరం పంట దిగుబడికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎడారి ప్రాంత దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ఖర్జూరంను నేరుగా వ్యాపార అవసరాల కోసం ఇక్కడ సాగు చేస్తుండటం ఆసక్తిగా మారింది.
సాధారణంగా మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఖర్జూరం సాగు ఎక్కువ. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఖర్జూరం పండిస్తారు.
అయితే, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పుడిప్పుడే ఖర్జూరం సాగుపై ఔత్సాహిక రైతులు కొందరు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఇళ్లలో, పొలం గట్లపై ఈ మొక్కలు వేస్తున్నా వాణిజ్య పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్‌లో తక్కువే.
ఇప్పుడు ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కొందరు రైతులు వాణిజ్య పంటగా ఖర్జూరాన్ని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఒకేసారి 15 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు.
ఇది ప్రయోగాత్మకమని అధికారులు చెబుతుండగా, ఇప్పటికే దిగుబడి మొదలు కావడంతో తమకు ఆశాజనకంగా ఉందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో వ్యాపారం మూతపడింది.. ఖర్జూరం సాగు మొదలైంది
గుంటూరు నగరంలో నివసించే ఎండీ బాషా ఇటీవల కరోనా సమయంలో తన వ్యాపారం మూతపడడంతో స్థిర ఆదాయం లభించే మార్గాలు వెతుక్కోవాలనుకున్నారు.
అందులో భాగంగా ఖర్జూరం పండించాలనే నిర్ణయానికి వచ్చి కారంపూడి సమీపంలోని ఒప్పిచర్లలో ఉన్న తమ పొలంలో సాగు ప్రారంభించారు.
పంట వేయడానికి ముందు ఖర్జూరం పండే వివిధ ప్రాంతాల్లో పర్యటించి అందులోని కష్టనష్టాలు, లాభ నష్టాలన్నీ తెలుసుకుని ఈ సాగు ప్రారంభించినట్టు ఆయన చెబుతున్నారు.
"వ్యాపారాలు సరిగా లేవు కాబట్టి స్థిరమైన ఆదాయం కోసం వెతికాం. ఉద్యాన పంటలైతే ఇబ్బంది ఉండదని తెలిసింది. ఖర్జూరం సాగు ఆలోచన రావడంతో ప్రయత్నాలు మొదలు పట్టాం. దేశంలోని అనేక చోట్లకు వెళ్లి దీని గురించి అధ్యయనం చేశాం. మక్కాలో కూడా ఖర్జూర సాగు చూశాం. నా మిత్రులు కూడా నాతో కలిశారు’’ అని బాషా బీబీసీతో అన్నారు.
‘‘ఉమ్మడిగా ముగ్గురం కలిసి ఒకేసారి 15 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. అంతకుముందు సీడ్లింగ్స్ తెచ్చి ఇంటి దగ్గర ఖర్జూరం చెట్లు పెంచాం. వాటి పెరుగుదల తీరు చూశాక అనుభవం వచ్చింది. మంచి దిగుబడి సాధించవచ్చని గ్రహించి సాగు ప్రారంభించాం" అని ఆయన వివరించారు
వ్యవసాయంలో వినూత్నంగా ప్రయత్నిస్తేనే లాభదాయకంగా ఉంటుందనే అభిప్రాయంతో ఈ పంట సాగు ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రస్తుతానికి అంతా సజావుగా సాగుతోందని తెలిపారు.

మొక్క రూ. 3,500
ఖర్జూరం పంటకు ఒప్పిచర్లలోని ఎర్ర ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయని తొలుత నిర్ధరణకు వచ్చామని వారు చెప్పారు.
కొండవాలు ప్రాంతంలో వాతావరణం కూడా సహకరిస్తుందనే అభిప్రాయానికి వచ్చి మూడేళ్ల క్రితం ఇక్కడ మొక్కలు నాటామని అన్నారు. ముఖ్యంగా వర్షాలు, చలికాలంలో గాలుల తీవ్రత వంటివి దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలు నాటామని తెలిపారు.
బరీష్, మోట్ జోన్, అజ్వ, సగారి రకాల ఖర్జూరం మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి.
ఇప్పటికే కొన్ని మొక్కలు ఫలసాయం అందిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
గుజరాత్‌లోని కచ్ కార్పొరేషన్, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఖర్జూరం మొక్కలు తీసుకొచ్చారు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 3,500 కాగా, మొత్తం 750 మొక్కలు నాటారు.
‘వర్షాకాలంలో జాగ్రత్తగా చూసుకోవాలి.. తెగులు రావొచ్చు’
ఖర్జూరం సాగులో అనుభవం ఉన్న షేక్ నానా సాహెబ్ అనే వ్యక్తిని ఈ మొక్కల రక్షణ కోసం నియమించారు. గతంలో వివిధ ప్రాంతాల్లో ఖర్జూరం తోటల్లో నానా సాహెబ్ పనిచేశారు.
"నేలను పరిశీలించాం. ఎర్ర నేల ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రాజస్థాన్ తరహాలోనే ఇక్కడి నేల ఉంది. ఇప్పటి వరకూ 60 చెట్లు గెలలు కాశాయి. మిగిలినవి కూడా తయారవుతున్నాయి. మామూలుగా నాలుగేళ్లకు పంట వస్తుంది. మూడేళ్లకే దిగుబడులు మొదలు కావడం ఆనందంగా ఉంది" అంటూ నానా సాహెబ్ వివరించారు.
ఖర్జూరం మొక్కలకు వర్షాకాలంలో కొంత సమస్య ఎదురవుతుందన్నారు. ఎడారి పంట కావడంతో వానల సమయంలో తెగుళ్లు సోకడం, పురుగులు పట్టడం వంటివి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందుకు తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఒకసారి నాటితే 60 ఏళ్ల వరకూ ఫలసాయం
ఖర్జూరం మొక్కలు మూడేళ్లు దాటిన తర్వాత దిగుబడి అందించడం ప్రారంభిస్తాయి. మొక్క నాటిన అరవై ఏళ్ల వరకూ ఫలసాయం ఉంటుంది.
ఒకసారి ఖర్జూరం మొక్కలు నాటిన తర్వాత తొలి నాలుగైదేళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఆ తర్వాత కొంత ఆదాయం మొదలవుతుంది. అంతేకాకుండా ఏటా దిగుబడి పెరుగుతూ ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఖర్జూరం గెలలు దిగుబడి మొదలైన తర్వాత దానిని ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో మనం తినే ఖర్జూరానికి, చెట్టు నుంచి దించిన గెలలకు మధ్య చాలా చేయాల్సి ఉంటుందని బాషా చెప్పారు.
"ఈత పళ్లు మాదిరిగా ఖర్జూరం గెలలు కిందకి దించిన తర్వాత దానిని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి మార్కెట్‌కి పంపిస్తాం. అలాంటి ప్రాసెసింగ్ యూనిట్ కూడా మేం ఏర్పాటు చేస్తున్నాం. ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే పల్నాడులో పండిన ఖర్జూరం ఇక్కడి నుంచే మార్కెట్‌కి పంపించే అవకాశం ఉంటుంది. లేదంటే ఎగుమతి చేసినా ఆదాయానికి ఢోకా ఉండదు" అని బాషా వివరించారు.

అంతర పంటలు వేసుకోవచ్చా?
ఖర్జూరం సాగు చేసేందుకు ఖర్చు కూడా ఎక్కువేనని రైతులు అంటున్నారు. దాదాపుగా ఏటా ఎకరానికి లక్ష రూపాయల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు.
ఖర్చుల భారం తగ్గించుకోవడానికి అంతరపంటలతో అదనపు ఆదాయం సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నట్టు నానా సాహెబ్ వివరించారు. ఇప్పటికే ఒప్పిచర్లలోని వీరి తోటలో జామ, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తున్నారు.
ఇదంతా ప్రయోగాత్మకంగానే భావించాలని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఖర్జూరం పంటకు పల్నాడు ఎంతమేరకు సానుకూలం అన్నది ఇంకా నిర్ధరణ కాలేదని, అయినా రైతులు స్వతహాగా చేస్తున్న ప్రయత్నాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని పల్నాడు జిల్లా ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీజే బెన్నీ అన్నారు.

"జిల్లాలో వివిధ రకాల నేలలున్నాయి. అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటాయి. వాటిలో ఎర్రనేలలు ఖర్జూరం సాగుకి అనుకూలమైనవి అనడంలో సందేహం లేదు. అయితే నేలతో పాటుగా వాతావరణ పరిస్థితులను కూడా గమనించాలి. అందుకే ప్రభుత్వం ఖర్జూరం సాగు చేసేందుకు ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. కానీ, రైతులే ఈ సాగు ప్రారంభించారు" అంటూ ఏడీ బెన్నీ వివరించారు.
ఖర్జూరం సాగుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు ప్రస్తుతానికి లేవని ఆయన తెలిపారు. అదే సమయంలో ఆ తోటలో ఉన్న అంతర పంటల కోసం సబ్సిడీలు అందించామన్నారు. తాను కూడా ఖర్జూరం తోట చూశానని, దిగుబడులు మొదలయ్యాయని ఏడీ అన్నారు. ఖర్జూరం సాగు ప్రస్తుతానికి పరిశీలన దశలో ఉందని, తొలిసారిగా కమర్షియల్‌గా సాగు చేయడం ఆహ్వానించదగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.
పల్నాడులో ఇప్పుడు ఖర్జూరం సాగు చాలామందిని ఆకర్షిస్తోంది. ఈ రైతులు ఎంతమేరకు సక్సెస్ అవుతారన్నది రాబోయే రెండు మూడేళ్లలో తేలబోతోంది. ఆ తర్వాత మరింత మంది ఈ పంట వైపు మొగ్గు చూపుతారన్నది అధికారుల అంచనా.
ఇవి కూడా చదవండి:
- షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?
- ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
- మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?
- ఇరాన్: యాభైఏళ్ల కిందటే అత్యాధునిక జీవితాన్ని చూసిన మహిళల జీవితాలు తర్వాత ఎలా మారిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













