ఎడ్వర్డ్ స్నోడెన్‌: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?

ఎడ్వర్డ్ స్నోడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎడ్వర్డ్ స్నోడెన్
బీబీసీ రెడ్ లైన్ Red Line

స్నోడెన్ లీక్ చేసిన పత్రాలు ఏం చెప్తున్నాయంటే...

  • అమెరికా నిఘా సంస్థ ఫోన్ రికార్డులను సేకరిస్తోంది
  • బ్రిటన్ నిఘా సంస్థ ఫైబర్‌ఆప్టిక్ట్ కేబుల్స్‌ను ట్యాప్ చేస్తోంది
  • చైనా నెట్‌వర్క్‌లను అమెరికా హ్యాక్ చేస్తోంది
  • ఈయూ కార్యాలయాల్లో అమెరికా నిఘా సంస్థ రహస్య వినికిడి యంత్రాలను అమర్చి నిఘా పెట్టింది
  • జర్మనీ (మాజీ) చాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ ఫోన్ కాల్స్‌ను రహస్యంగా వినింది
  • అమెరికాలోని దౌత్య కార్యాలయాల మీద నిఘా పెట్టింది
  • లాటిన్ అమెరికా ఖండం వ్యాప్తంగా ఎన్ఎస్ఏ నిఘా కార్యక్రమం నడిపింది
  • అమెరికా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఎన్ఎస్ఏ ప్రతి ఏటా వందల సార్లు ఉల్లంఘిస్తోంది
  • అమెరికా ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా టెక్ట్స్ మెసేజీలను సేకరించి స్టోర్ చేస్తోంది
బీబీసీ రెడ్ లైన్ Red Line

అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా కార్యకలాపాలకు చెందిన భారీ రహస్య పత్రాలను లీక్ చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా తన దేశ పౌరసత్వం ఇచ్చింది.

ఈ పౌరసత్వ పత్రం మీద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంతకం చేశారు.

అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో కాంట్రాక్టర్‌గా పనిచేసిన స్నోడెన్.. అమెరికా నేషనల్ సెక్యూరీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) కార్యకలాపాలను బట్టబయలు చేస్తూ 2013లో రహస్య పత్రాలను లీక్ చేశారు. లక్షలాది మంది అమెరికన్లను ప్రభావితం చేసే ఆ పత్రాలను లీక్ చేసినప్పటి నుంచీ స్నోడెన్.. అమెరికాలో గూఢచర్యం అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

అప్పటి నుంచీ ఆయన రష్యాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. స్నోడెన్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. రష్యా పౌరసత్వం లభించిన అంశంపై స్నోడెన్ బహిరంగంగా స్పందించలేదు.

లక్షలాది మంది అమెరికన్ల టెలిఫోన్ కాల్స్‌ను ఎన్ఎస్ఏ రికార్డు చేయటం చట్టవ్యతిరేకమని అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ 2020లో తీర్పు చెప్పింది.

ఆ తీర్పుతో తను చేసిన పని సరైనదేనని నిరూపణ అయిందని స్నోడెన్ అప్పుడు స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డిగ్రీలు లేని ‘కంప్యూటర్ విజార్డ్’...

ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ 1983 జూన్ 21న నార్త్ కరొలినా రాష్ట్రంలోని ఎలిజబెత్ సిటీలో పుట్టారు. అతడి తల్లి ఎలిజబెత్ వాషింగ్టన్ డీసీలోని అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ)లో క్లర్కుగా పనిచేసేవారు. తండ్రి లోనీ యూఎస్ కోస్ట్ గార్డ్‌లో పనిచేసేవారు. అతడి తల్లిదండ్రులు 2001లో విడిపోయారు.

స్నోడెన్ 1998-99లో టెన్త్ గ్రేడ్‌లో ఉన్న సమయంలో స్కూలు మానేశారు. కానీ కంప్యూటర్ల మీద చాలా ఆసక్తి ఉండేది. దీంతో కమ్యూనిటీ కాలేజీల్లో పలు కంప్యూటర్ కోర్సుల్లో చేరారు కానీ ఏవీ పూర్తి చేయలేదు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ నుంచి కంప్యూటర్ సెక్యూరిటీలో ఆన్‌లైన్ మాస్టర్స్ డిగ్రీ చదివారు. కానీ ఆ కోర్సు కూడా పూర్తిచేయలేదు.

స్నోడెన్ 2003లో అమెరికా సైన్యంలో చేరారు. స్పెషల్ ఫోర్సెస్ విభాగంలో శిక్షణ పొందటం ప్రారంభించారు. అయితే శిక్షణ సందర్భంగా జరిగిన ఒక ప్రమాదంలో స్నోడెన్ రెండు కాళ్లూ విరగటంతో ఆయనను సైన్యం నుంచి విడుదల చేశారు.

అనంతరం.. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో ఎన్ఎస్ఏకు చెందిన రహస్య కార్యాలయానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. ఆ తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో ఐటీ సెక్యూరిటీ విభాగంలో చేరారు.

సాధారణ విద్యకు సంబంధించిన అర్హతలేవీ లేకపోయినా.. కంప్యూటర్ జ్ఞానంలో అతడి అద్భుత ప్రతిభ కారణంగా నిఘా విభాగంలో త్వరగా పైస్థాయిలకు ఎదిగారు.

ఎడ్వర్డ్ స్నోడెన్

ఫొటో సోర్స్, GETTU IMAGES

ఫొటో క్యాప్షన్, ఎడ్వర్డ్ స్నోడెన్

‘భ్రమలు తొలగిపోయాయి...’

స్నోడెన్ 2007 నాటికి దౌత్య హోదాలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సీఐఏ ఏజెంటుగా పనిచేయటం ప్రారంభించారు.

‘‘జెనీవాలో నేను చూసిన విషయాలు.. నా ప్రభుత్వం పనిచేసే తీరు, ప్రపంచం మీద దాని ప్రభావం గురించి.. నిజంగా నా భ్రమలు తొలగిపోయాయి. మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్న పనిలో నేను భాగంగా ఉన్నానని నాకు తెలిసివచ్చింది’’ అని స్నోడెన్ 2013లో ద గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రజలపై ప్రభుత్వ యంత్రాంగాల నిఘా విషయాన్ని బట్టబయలు చేయాలని అంతకుముందు కూడా అనుకున్నానని, కానీ 2008లో బరాక్ ఒబామా దేశాధ్యక్షుడిగా ఎన్నికవటంతో అమెరికా తీరు మారుతుందేమో చూద్దామని ఆగానని కూడా స్నోడెన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే.. ఒబామా ‘‘తన ముందలి ప్రభుత్వ విధానాలనే కొనసాగించారు’’ అన్నారు స్నోడెన్.

స్నోడెన్ 2009లో సీఐఏను వీడి.. బూజ్ అలెన్ హామిల్టన్ వంటి వివిధ ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీల ఉద్యోగిగా ఎన్ఎస్ఐతో పనిచేయటం ప్రారంభించారు.

అమెరికా నిఘా సంస్థ ప్రజల గోప్యతను ఉల్లంఘిస్తుందనేందుకు సంబంధించిన ఆధారాలను సేకరించటానికి రహస్య సమాచారం పొందటం కోసం బూజ్ అలెన్ సంస్థ ఉద్యోగంలో చేరినట్లు స్నోడెన్ 2013లో హాంగ్ కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

స్నోడెన్ తమ సంస్థ ఉద్యోగిగా చేరి మూడు నెలలు అయిందని, ఆయనకు హవాయిలో పోస్టింగ్ ఇచ్చామని, ఆ సమయంలో ఆయనకు 1,22,000 డాలర్ల వేతనం చెల్లిస్తున్నామని బూజ్ అలెన్ ఒక ప్రకటనలో చెప్పింది.

ఎన్ఎస్ఏ కాంట్రాక్టర్‌గా.. హైటెక్ గూఢచర్యం శక్తిసామర్థ్యాలను స్నోడెన్ దగ్గరగా పరిశీలించారు. వాటిపట్ల ఆయనలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది.

అనలిస్టులు.. ప్రభుత్వానికి గల అధికారాలను ఉపయోగించుకుని, తమ ప్రస్తుత, మాజీ ప్రేమికుల ఈమెయిళ్లు సేకరించి, చదవటం, ఆన్‌లైన్‌లో వారి మీద రహస్యంగా నిఘా పెట్టటం చేస్తారని స్నోడెన్ 2019లో ప్రచురించిన తన మొదటి పుస్తకం ‘పర్మనెంట్ రికార్డ్’లో రాశారు.

ఎడ్వర్డ్ స్నోడెన్
ఫొటో క్యాప్షన్, ఎడ్వర్డ్ స్నోడెన్

హవాయి నుంచి హాంగ్ కాంగ్‌కు...

ఆ సమయంలో హవాయిలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నివసిస్తున్న స్నోడెన్.. తొలుత హాంగ్ కాంగ్‌కు వెళ్లారు.

హవాయిలోని వాయ్‌పాహులోని తమ నివాసం నుంచి స్నోడెన్, అతడి గర్ల్‌ఫ్రెండ్.. 2013 మే 1వ తేదీన ఖాళీచేసి వెళ్లినట్లు అక్కడి ఎస్టేట్ ఏజెంట్ ఆ తర్వాత మీడియాతో చెప్పారు.

2013 మే, జూన్‌ నెలల్లో హాంగ్ కాంగ్‌లో తలదాచుకున్న స్నోడెన్.. అక్కడ కొందరు మీడియా ప్రతినిధులను సమావేశపరిచి.. అమెరికా నిఘా సంస్థ రహస్య పత్రాలను లీక్ చేశారు. అయితే తొలుత ఆయన వివరాలు బయటకు రాలేదు.

ఆయన లీక్ చేసిన వివరాలు అమెరికా, యూరప్ సహా ప్రపంచమంతటా పెను సంచలనం సృష్టించాయి.

కొద్ది రోజుల తర్వాత స్నోడెన్‌ను ఇంటర్వ్యూ చేసిన ద గార్డియన్ పత్రిక ఆయన సమ్మతితో ఆయన వివరాలను బయట పెట్టింది.

ఈ రహస్య పత్రాలను బయట పెట్టటానికి ముందు, అమెరికా తిరిగి వెళ్లటం అసాధ్యమని తెలుసు కనుక, చనిపోవటానికి సిద్ధమయ్యే మనిషి లాగా తాను సిద్ధమయ్యానని స్నోడోన్ చెప్పారు.

అమెరికా విడిచి వెళ్లాలని తాను ఎందుకు నిర్ణయించుకునానో వివరిస్తూ.. ‘‘ఈ తరహా పనులు చేసే సమాజంలో జీవించాలని నేను కోరుకోవటం లేదు... నేను చేసే, చెప్పే ప్రతిదానినీ రికార్డ్ చేసే ప్రపంచంలో జీవించాలని నేను కోరుకోవటం లేదు’’ అని స్నోడెన్ 2013లో ద గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

వీడియో క్యాప్షన్, భారత్ గూఢచర్య సంస్థ ‘రా’కు పాకిస్తాన్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీకీ సంబంధాలున్నాయా?

అయితే.. ప్రైవేటు ఫోన్ రికార్డుల నుంచి ఎన్ఎస్ఏ ఎన్నడూ ఉద్దేశపూర్వకంగా సమాచారం సేకరించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఉన్నతస్థాయి అధికారులు బహిరంగంగా ఉద్ఘాటిస్తూ వచ్చారు. కానీ వారు చెప్తున్నదానికి విరుద్ధమైన ఆధారాలను స్నోడెన్ బహిర్గతం చేశారు.

ఈ నిఘా వ్యవహారం బట్టబయలు కావటంతో.. అంతర్గత ఉగ్రవాదం మీద పోరాటంలో నాసా నిఘా కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని ఎన్ఎస్ఏ అధికారులు చెప్పుకొచ్చారు. బసాలే సయీద్ మోలిన్, అహ్మద్ నాసిర్ తాలిల్ మొహముద్, మొహమద్ మొహముద్, ఇస్సా డోరే వంటి వారిని దోషులుగా నిర్ధరించటంలో ఈ నిఘా సమాచారం కీలకంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు.

స్నోడెన్ మీద గూఢచర్యం అభియోగం మోపిన అమెరికా.. ప్రభుత్వ ఆస్తుల దొంగతనం, జాతీయ రక్షణ సమాచారంపై అనధీకృత సంభాషణ, రహస్య నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయటం అభియోగాలను నమోదు చేసింది.

ఈ అభియోగాల్లో ఒక్కో దానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.

వీడియో క్యాప్షన్, చైనా గూఢచర్యం: అమ్మాయిలను ఎర వేస్తారు... రహస్యాలు రాబడతారు

హాంగ్ కాంగ్ నుంచి మాస్కో పయనం...

స్నోడెన్‌ను తమ దేశానికి అప్పగించాలని హాంగ్ కాంగ్ అధికార యంత్రాంగాన్ని అమెరికా కోరింది. హాంగ్ కాంగ్‌తో అమెరికాకు నేరస్తుల అప్పగింతపై ఒప్పందం ఉందని తెలియటంతో స్నోడెన్ 2013 జూన్ 23వ తేదీన హాంగ్ కాంగ్ విడిచి ఒక ఏరోఫ్లోట్ విమానంలో రష్యా రాజధాని మాస్కో వెళ్లారు.

ఈక్వెడార్‌లో ఆశ్రయం కోరాలన్నది అప్పుడు ఆయన ఆలోచన. అయితే.. లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్.. స్నోడెన్ తమ దేశం వచ్చే వరకూ కానీ, తమ దౌత్య కార్యాలయాల్లో దేనికైనా చేరుకునే వరకూ కానీ.. ఆశ్రయం కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని తాము పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది.

స్నోడెన్ పాస్‌పోర్టును, ఇతర పత్రాలను అమెరికా రద్దు చేయటంతో.. ఆయన మాస్కోలోని షెరెమెట్యేవో విమానాశ్రయంలోని ట్రాన్సిట్ జోన్‌లో నెల రోజులకు పైగా గడిపారు.

‘‘మాస్కో మీదుగా లాటిన్ అమెరికా వెళ్లాలన్నది నా ఆలోచన. కానీ నేను మాస్కో విమానాశ్రయానికి చేరుకునే సరికి నా పాస్‌పోర్టును అమెరికా రద్దు చేసింది. దీంతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను. అలా రష్యాలోనే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని స్నోడెన్ అనంతర కాలంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రష్యా ఆయనకు సంవత్సరం పాటు ఆశ్రయం కల్పిస్తూ, రష్యాలో ప్రవేశించటానికి ఆగస్టులో అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన మాస్కోలో నివసించటం మొదలుపెట్టారు.

రష్యా 2020లో స్నోడెన్‌కు శాశ్వత నివాస హక్కులు ఇచ్చింది. తాజాగా పౌరసత్వం ఇచ్చింది. స్నోడెన్ తన గర్ల్‌ఫ్రెండ్ లిండ్సేను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

స్నోడెన్‌ను కొందరు ప్రజల తరఫున పోరాడిన హీరోగా కీర్తిస్తుంటే.. ఇంకొందరు దేశద్రోహిగా నిందిస్తున్నారు. ఆయన మీద కొన్ని సినిమాలు కూడా రూపొందాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)