Weekend Agriculture: పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు జిల్లా కలెక్టర్లు పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. అంతేకాదు పొలం గట్టు మీదనే కూర్చొని అన్నం కూడా తిన్నారు.
వారు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే కాదు భార్యభర్తలు కూడా కావడం విశేషం. వీరు నాట్లు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఏఎస్ ఆఫీసర్ అయిన విజయ కృష్ణన్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె భర్త ఎ.ఎస్.దినేశ్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. వారు వారాంతంలో ఇద్దరు పిల్లలను తీసుకుని బాపట్ల మండలం మురుకుందపాడు గ్రామంలోని పొలాల్లో వరి నాట్లు వేశారు. అక్కడే పొలం గట్టున కూర్చుని అన్నం తిన్నారు. సన్నిహితుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా వీరితో వచ్చారు.
ఐఏఎస్ దంపతులిద్దరూ ఈ పని ఎందుకు చేసినట్టు అనేది ఆసక్తిగా మారింది. గతంలో కూడా వారు చేసిన వివిధ కార్యక్రమాలు కూడా చర్చనీయంగా మారాయి.

ఫొటో సోర్స్, UGC
గతంలోనూ భిన్నంగా...
విజయ కృష్ణన్ 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమెది తమిళనాడు. ఆమె బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. గతంలో రంపచోడవరం సబ్-కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌తో పాటు ఏపీ సీఆర్డీయే, ఏపీ టూరిజం వంటి శాఖల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు.
బాపట్ల జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2022 ఏప్రిల్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
గతంలో రాజమండ్రి సబ్-కలెక్టర్‌గా ఉన్న సమయంలో అక్కడి ఏరియా ఆసుపత్రిలోనే ఆమె కాన్పు అయింది. ఆసుపత్రిలో కాన్పు ప్రాముఖ్యతపై ఆదివాసీ మహిళల్లో అవగాహన పెంచడంతో పాటు, కాన్పులకు ప్రభుత్వ ఆసుపత్రులు సురక్షితం అని చాటి చెప్పేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు నాడు విజయ కృష్ణన్ చెప్పారు.
రంపచోడవరం సబ్-కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఆమె భర్త దినేశ్ కుమార్ అక్కడే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, UGC
కరోనా సమయంలో దినేశ్ కృషి..
దినేశ్ కుమార్ కూడా తమిళనాడుకు చెందిన వారే. ఆయన 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు.
దినేశ్ కుమార్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఏటా సెలవులకు సొంతూరు వెళ్లినప్పుడు తమ పొలంలో పనులు చేయడం అలవాటని ఆయన బీబీసీకి తెలిపారు.
దినేశ్ కుమార్ కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేశారు. గతంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన ఆయన, ఆ తరువాత ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
కరోనా సంక్షోభం వచ్చినప్పుడు ఆయన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా మంది భయపడుతున్న సమయంలో స్వయంగా దినేశ్ కుమార్ స్మశానానికి వెళ్లారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో భాగమయ్యారు.
అలాగే గుంటూరులోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి దినేశ్ చేసిన ప్రయత్నం వల్ల మృతదేహాలతో కరోనా వ్యాపిస్తుందనే భయాలను తగ్గించగలిగారనే అభిప్రాయాలు వినిపించాయి. జాయింట్ కలెక్టర్ హోదాలో ఆయనే స్వయంగా స్మశానానికి వెళ్లడం, చాలామందికి భరోసా ఇచ్చిందనే ప్రశంసలు దినేశ్ అందుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
'పిల్లలకు మూలాలు తెలియచేయాలనే'
తమ పిల్లలకు వ్యవసాయం గురించి తెలియచేయాలనే ఉద్దేశంతోనే పొలంలో నాట్లు వేసినట్లు విజయ్ కృష్ణన్, దినేశ్ కుమార్ తెలిపారు.
'పిల్లలకు వ్యవసాయం గురించి తెలియచేయాలనేది మా లక్ష్యం. అందుకోసమే వీలున్నప్పుడు పొలాల్లోకి తీసుకెళ్తాం. చాలా సందర్భాల్లో వారికి వ్యవసాయ పనుల గురించి ప్రత్యక్షంగా తెలియచేసేందుకు ప్రయత్నించాం.
ఈ ఆదివారంతోపాటు సెలవులు కూడా రావడంతో వారితో పాటుగా మరికొంత మంది పిల్లలు కలిశారు. అందరం కలిసి పొలాల్లోకి వెళ్లాం. వరి సాగులో తొలుత నాట్లు వేస్తారు కాబట్టి, అది ఎలా వేస్తారన్నది పిల్లలకు తెలియచేసేందుకు పొలంలోకి దిగాం. పిల్లలు కూడా బాగా ఆనందించారు' అంటూ బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బీబీసీతో అన్నారు.
'మా పిల్లలు ఇద్దరూ ప్రస్తుతం ఒంగోలులో 3వ తరగతి, 1వ తరగతి చదువుతున్నారు. ఇలాంటి ఫీల్డ్ ట్రిప్, వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని నమ్ముతున్నాం' అని ఆమె చెప్పారు.
'రైతుల కష్టనష్టాలు కూడా తెలిశాయి'
పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించడంతోపాటు రైతులు, కూలీల సమస్యలను మేం తెలుసుకునే అవకాశంగా దీన్ని భావించామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ బీబీసీతో అన్నారు.
'చాలా సేపు పొలంలో ఉన్నాం. రైతులతో మాట్లాడాం. చుట్టు పక్కల ఉండే రైతులు కూడా వచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది.
వారితో నేరుగా మాట్లాడి పంట సాగుకి ఎంత ఖర్చు అవుతుంది? దిగుబడులు ఎలా ఉంటున్నాయి? ఆదాయం ఎలా ఉంటోంది? అనే విషయాలు నేరుగా తెలుసుకున్నాం. రైతు కూలీల సమస్యలు కూడా బాగా అర్థమయ్యాయి. మా పరిధిలో పరిష్కరించే అవకాశం ఉన్న సమస్యల మీద దృష్టి పెడతాం. విధానపరమైన సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఇదో మార్గం అని భావించాం' అని ఆయన వివరించారు.
'ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు జరుగుతున్న ప్రయోజనాల గురించి నేరుగా వారితో మాట్లాడడం వల్ల మరింత స్పష్టత వచ్చింది. రైతు భరోసా కేంద్రాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడింది' అని దినేశ్ అన్నారు.
మొత్తానికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు ఐఏఎస్ భార్యభర్తలు తమ పిల్లలకు కూడా వ్యవసాయం గురించి అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













