Hijab: ఇరాన్, కర్ణాటకల్లో వివాదం హిజాబ్‌కు సంబంధించిందా, లేక మహిళల ఇష్టాయిష్టాలకు చెందినదా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిది
మహసా అమీనీ మరణం తర్వాత గత తొమ్మిది రోజులుగా ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మొత్తం రోడ్ల పైకి వచ్చిందని చెప్పడంలో తప్పేమీ లేదు. దేశంలోని 80 కంటే ఎక్కువ నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి.
నిరసనల సందర్భంగా భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 35 మంది మరణించారు. వందలాది సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులు అరెస్ట్ అయ్యారు.
ఒక అమెరికా సంస్థ చెప్పినదాని ప్రకారం, సోమవారం నుంచి ఇప్పటివరకు 11 మంది జర్నలిస్టులను దిగ్బంధించారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను పూర్తిగా నిలిపేశారు. కొన్ని చోట్లా ఇంటర్నెట్ సేవలు మందగించాయి.
22 ఏళ్ల మహసా అమీనీ, సెప్టెంబర్ 16న చనిపోయారు. చనిపోవడానికి ముందు మూడు రోజుల పాటు టెహ్రాన్‌లోని ఆసుపత్రిలో ఆమె కోమాలో ఉన్నారు.
తలపై నుంచి హిజాబ్‌ను సరిగా ధరించలేదనే ఆరోపణలతో ఇరాన్‌లోని మోరాలిటీ పోలీసులు, సెప్టెంబర్ 13న ఆమెను అరెస్ట్ చేశారు.
ఇరాన్‌లోని చట్టాల ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌ను ధరించాలి. మహిళలు, తలమీద ఒక్క వెంట్రుక కూడా బయటకు కనిపించకుండా బిగుతుగా హిజాబ్‌ను ధరించాలి.
మహసా అమీనీ కూడా ఆ రోజు హిజాబ్ ధరించారు. కానీ, వదులుగా హిజాబ్‌ను వేసుకోవడం వల్ల తల వెంట్రుకలు కొన్ని బయటకు కనిపించాయి. అందుకే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
గస్త్-ఎ-ఇర్షాద్ (గైడెన్స్ గస్తీ దళాలు) అనేది ఇరాన్‌లో ఒక ప్రత్యేక పోలీసు విభాగం. ప్రజలు ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించేలా చూడడం, "సక్రమంగా" దుస్తులు ధరించని వ్యక్తులను నిర్బంధించడం వంటివి వీరి విధుల్లో భాగం.
కస్టడీలోకి తీసుకున్న తర్వాత మహసాకు గుండెకు సంబంధించిన సమస్య ఏర్పడిందని పోలీసులు చెప్పారు. దాని కారణంగానే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మరణించారని పోలీసులు అంటున్నారు.
కానీ, పోలీస్ కస్టడీలో మహసాను హింసించారని, దానివల్లే మహసా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER
హిజాబ్ ధరించనందుకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు తిరస్కరించిన అధ్యక్షుడు
ఇరాన్‌లోని హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌లను తగులబెడుతూ నిరసనలు చేస్తున్నారు.
మహసా అమీనీ మరణానికి అసలు కారణం ఏదైనా కావొచ్చు. కానీ, ఆమె మృతిపై ప్రపంచం మొత్తం స్పందిస్తోంది. వీధుల నుంచి సోషల్ మీడియా వరకు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె ప్రస్తావన వచ్చింది.
ప్రముఖ జర్నలిస్ట్ క్రిస్టియాన్ అమన్‌పూర్, న్యూయార్క్‌లో ఇరాన్ అధ్యక్షుడు రైసీని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ ఇంటర్వ్యూ రద్దు అయింది.
క్రిస్టియాన్ అమన్‌పూర్ హిజాబ్ ధరించి ఇంటర్వ్యూ చేయాలని రైసీ కోరుకున్నారు. కానీ, హిజాబ్ ధరించడానికి క్రిస్టియాన్ నిరాకరించారు. దీంతో ఇంటర్వ్యూ జరగలేదు.
తర్వాత ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు రైసీ వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, CHRISTIANE AMANPOUR
భారత్‌లోనూ హిజాబ్‌పై దుమారం
భారత్‌లో కూడా ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
భారత్‌లో ఈ చర్చకు మరింత ప్రత్యేకత ఉంది. కర్ణాటకలో గత ఏడాది ఒక కాలేజీ యాజమాన్యం, ముస్లిం అమ్మాయిలు తరగతి గదిలో హిజాబ్ ధరించకూడదనే షరతు పెట్టింది. ఆరుగురు అమ్మాయిలు, ఈ నిబంధనను వ్యతిరేకించారు.
హిజాబ్ లేకుండా తరగతులకు హాజరు అయ్యేందుకు నిరాకరించారు. ఈ విషయమై వారు కోర్టును ఆశ్రయించారు. కానీ, వారికి కర్ణాటక కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం దక్కలేదు.
చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టును చేరింది. దీనిపై విచారణ ముగిసింది. తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
'హిజాబ్ తప్పనిసరి' అనే చట్టానికి వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు చేస్తోన్న నిరసనలకు భారత్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజలు దీని గురించి విపరీతంగా చర్చిస్తున్నారు.
భారత్‌లోని రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ పక్షాలు అన్నీ కూడా ఇరాన్ మహిళల నిరసనలకు మద్దతు ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, WANA NEWS AGENCY
'హిజాబ్ తప్పనిసరి' అనే షరతుపై వ్యతిరేకత
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారతీయ ముస్లింలు కూడా ఇరాన్ మహిళలు చేస్తోన్న నిరసనలను సమర్థిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు అందరికీ, ఇరాన్‌తో ప్రత్యేకమైన ధార్మిక, సైద్ధాంతిక అనుబంధం ఉంటుంది. కానీ, భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు అందరూ ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వానికి బదులుగా మహిళలు చేస్తోన్న ఈ సామూహిక ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు.
భారత్‌కు చెందిన షియా మత గురువు లేదా సంస్థ ఈ అంశం గురించి ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షియా కమ్యూనిటీ ప్రజలు, ఇరాన్ మహిళలకు అండగా నిలుస్తున్నారు.
ఇరాన్ మహిళల నిరసనల విషయంలో ఏకతాటిపై ఉన్న ప్రజలు... కర్ణాటక హిజాబ్ విషయానికి వచ్చే సరికి బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గజాలా జమీల్ దీని గురించి మాట్లాడారు. ''ఇరాన్, కర్ణాటక .. ఈ రెండు ప్రాంతాల్లోనూ అతిపెద్ద సవాలు ఏంటంటే, మహిళలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం. మహిళలు, ఫ్రిజ్‌లో నుంచి ఏం తీసుకొని తింటున్నారు? వారు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు? అనే అంశాలను నియంత్రించే అధికారం చట్టానికి లేదు'' అని అన్నారు.
భారత్‌లో పర్దా వ్యవస్థ వ్యతిరేక ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దీన్ని వెనుకబాటుతనం, మహిళలపై అణిచివేతగా పరిగణిస్తారా అని అడగగా ఆమె బదులు చెప్పారు.
''చరిత్ర పరంగా చూసుకుంటే, హిజాబ్‌ను వలసవాదానికి వ్యతిరేకంగా ఒక ప్రాముఖ్యమైన చిహ్నంగా చూశారు. అందుకే, భారత్‌లోని కర్ణాటకలో కొంతమంది ముస్లిం అమ్మాయిలు, హిజాబ్ ధరిస్తామని డిమాండ్ చేయడం...ఇరాన్‌లో కొంతమంది తమపై హిజాబ్‌ను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించడం రెండూ సరైనవే'' అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక హిజాబ్ వ్యవహారంతో మారిన ఆలోచన
సంస్కృతి రాజకీయాల్లో ఏ దుస్తులకైనా ప్రాముఖ్యత ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాలాన్ని బట్టి అది మారుతుందని గజాలా చెప్పారు.
''మహిళలను నిరాడంబరంగా ఉండాలంటూ ఎందుకు నియంత్రిస్తారంటూ పాశ్చాత్య మహిళల ఉద్యమంలో చర్చ ఎక్కువగా జరుగుతుంది. 'మంచి మహిళ' అనే ఒత్తిడి నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ వారు పోరాడతారు. కానీ, భారత్‌లో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు'' అని గజాలా చెప్పారు.
భారత్‌లో మహిళా ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆలోచనలో మార్పు రావడానికి కర్ణాటక హిజాబ్ వ్యవహారం దోహదపడిందని ఆమె అన్నారు.
''మహిళలు కలిసి పోరాడాలి''
కవితా కృష్ణన్ ఒక ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త. ఆమె చాలా ఏళ్ల పాటు సీపీఐ (ఎంఎల్) పొలిట్ బ్యూరో, కేంద్రీయ సమితి సభ్యురాలిగా ఉన్నారు. ఆమె, ఇరాన్‌లో జరుగుతోన్న నిరసనలను ప్రజా ఉద్యమంగా, ప్రజా విప్లవంగా వర్ణించారు. దీనికి మహిళలు నేతృత్వం వహిస్తున్నారని అన్నారు.
''ఇరాన్‌లో ఇస్లాం పేరుతో మహిళలపై బలవంతంగా హిజాబ్‌ను రుద్దడం, భారత్‌లో యూనిఫామ్ పేరుతో ముస్లిం అమ్మాయిల హిజాబ్ తొలిగించడానికి హిందుత్వ శక్తులు ప్రయత్నించడం అనేది అధికారం పేరిట మహిళలను నియంత్రించే ప్రయత్నంగా భావించాలి. దీనికి వ్యతిరేకంగా మహిళలు కలిసికట్టుగా పోరాడాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, MAHSA AMINI FAMILY
''మహసా అమీనీ ఎలా చనిపోయారో ప్రపంచానికి తెలియాలి''
హిజాబ్ ధరించి తమ హక్కుల కోసం, సాటి మహిళల హక్కుల కోసం పోరాడే స్త్రీవాద కార్యకర్తలు ఎంతోమంది తనకు తెలుసు అని కవితా కృష్ణన్ చెప్పారు.
ఇరాన్‌లో జరుగుతోన్న ఉద్యమాన్ని కొంతమంది 'అమెరికా కుట్ర'గా పిలుస్తున్నారు.
''అమెరికా, ఎవరినైనా అణిచివేస్తే మనం దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ ఇరాన్ నియంత, మహిళలను చంపేస్తే దానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వలేమా? ఇలా చేస్తే అమెరికా కూడా సంతోషిస్తుంది. మహిళా హక్కుల కోసం ప్రజలు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా నిలవడం మన కర్తవ్యం. ఏ దేశ ప్రజలు ఇలాంటి ఉద్యమాలు చేసినా వారికి అండగా ఉండాలి'' అన్నారు కవితా కృష్ణన్.
మహసా అమీనీ మరణంతో పాటు తదుపరి నిరసనల్లో సంభవించిన మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్‌కు చెందిన ఒక ప్రసిద్ధ వార్తా పత్రికతో సంబంధం ఉన్న జర్నలిస్ట్ సయ్యద్ హసన్ అన్నారు.
మహసా అమీనీ ఎలా చనిపోయారో ప్రపంచానికి తెలిసేలా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
హిజాబ్ కేవలం సింబాలిక్ సమస్య
కర్ణాటక హిజాబ్ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించిన అమ్మాయిలను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, అందులో కొందరు దాని గురించి ఇప్పుడు మాట్లాడేందుకు నిరాకరించారు. మరికొందరు అందుబాటులోకి రాలేదు.
కర్ణాటక హిజాబ్ కేసులో ఒక ఎన్జీవో తరఫున సుప్రీం కోర్టుకు హాజరైన లాయర్ షారుఖ్ ఆలం, బీబీసీతో మాట్లాడారు.
''ఇరాన్‌లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో హిజాబ్ కేవలం ఒక సింబాలిక్ సమస్య. ఇప్పుడు ఈ వ్యవహారమంతా మహిళల హక్కుల పోరాటంలా మారింది'' అని అన్నారు.
ఆయన ప్రకారం, ఇరాన్‌లో హిజాబ్‌ను వ్యతిరేకిస్తోన్న మహిళలు.. కర్ణాటకలో హిజాబ్‌ను ధరిస్తామని అంటోన్న అమ్మాయిలు చేసే డిమాండ్ నిజానికి ఒక్కటే.
మహిళలే లక్ష్యం
''హిజాబ్ ధరించడం వెనుకబాటుతనానికి, సనాతన సంప్రదాయానికి, ఛాందసవాద ఆలోచనకు నిదర్శనమని భారత ప్రభుత్వం చెబుతోంది. దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా కూడా ఉంది. అలాగే ఇరాన్ ప్రభుత్వం కూడా హిజాబ్ విషయంలో తమ చట్టాల ప్రకారం ఆలోచిస్తోంది’’ అన్నారు ఆలం.
‘‘భారత్, ఇరాన్ దేశాల్లో ప్రభుత్వాల లక్ష్యం మహిళలే. ఎందుకంటే వారు కేవలం హిజాబ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. గడ్డం, టోపీల గురించి ఎవరూ మాట్లాడటం లేదు'' అని ఆలం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రోజర్ ఫెదరర్, రఫాల్ నాదల్: ‘ప్రధాన ప్రత్యర్థులు ఇలా భావోద్వేగాలకు గురవుతారని ఎవరైనా అనుకుంటారా?’
- ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్‌కు ఆఖరి మ్యాచ్
- ఆకలిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏవి?
- పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది
- ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












