అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్-పాలస్తీనా పర్యటన లక్ష్యం ఏంటి?

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ పక్కనే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకి బైడన్ పిలుపు

జెరూసలెం నుంచి బీబీసీ ప్రతినిధి జెరెమి బోవెన్

సౌదీ అరేబియా వెళ్లడానికి ముందు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు నిరసనగా పాలస్తీనా అమెరికాతో దౌత్యసంబంధాలను పక్కన పెట్టింది. వీటిని గాడిన పెట్టాలని పెట్టాలని జో బైడెన్ ప్రయత్నిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా బైడెన్ - ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యెయిర్ లాపిడ్‌తో కలిసి - ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని నిలువరించే సంయుక్త ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఇది వైల్డ్ వెస్ట్ కాదు - మిడిల్ ఈస్ట్.

తూర్పు ఆసియా కల్లోలాన్ని నియంత్రించే శక్తి అమెరికాకు పరిమితమే.

చరిత్రాత్మక ఒప్పందంగా చెబుతున్న డిక్లరేషన్‌ మీద జో బైడెన్, ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని యెయిర్ లాపిడ్ సంతకాలు చేశారు. నిజానికి - ఇదంతా ఇంతకు ముందు చెప్పిందే. అయితే బైడెన్ ద్వారా వాటిని మరోసారి వినాలనుకుంటోంది ఇజ్రాయెల్.

''మేము చాలా స్పష్టంగా చెప్పాం. మరోసారి చెబుతున్నా. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం'' అని బైడెన్ చెప్పారు.

కానీ ఇజ్రాయెల్‌కు అణ్వస్త్రాల కంటే దాని సరిహద్దులలోనే ఉన్న లెబనాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. జెరూసలేం నుంచి లెబనాన్‌ మూడు గంటల ప్రయాణ దూరంలోనే ఉంది.

పశ్చిమాసియా ప్రాంతంలో అతి తీవ్రమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే ప్రమాదకర స్థలమిది.

అందుకు కారణం.. ఈ ప్రాంతం ఇజ్రాయెల్‌ - ఇరాన్‌కు అత్యంత సన్నిహిత భాగస్వామి హెజ్బొల్లాకు మధ్య యుద్ధ క్షేత్రంలా మారుతుంది.

2006లో ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన యుద్ధం నిలిచిపోయిన తర్వాత- ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు రెండువైపులా చాలా కష్టపడ్డారు.

కానీ ఇక్కడకు హెజ్బొల్లా వ్యక్తులు వచ్చినపుడు - వాళ్లు ఇజ్రాయలీ బలగాల నిఘాలోకి వస్తారు. లెబనాన్‌లో గస్తీకాసే వ్యక్తుల వెనుక హెజ్బొల్లా తుపాకులు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంటాయని ఇజ్రాయెలీలు భావిస్తున్నారు.

2006లో చోటుచేసుకున్న ఒక్క సంఘటనతో నెల రోజులపాటు యుద్ధం జరిగింది.

ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుని రక్షించడం వీళ్ల ఉద్యోగం. కానీ అది అంతకన్నా ఎక్కువే. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతాల గుండా వెళ్లే అత్యంత ఉద్రిక్త సరిహద్దు రేఖ ఇది. లైన్‌కి అవతల ఇరాన్ మిత్ర దేశాలు, లైన్‌కి ఇవతల అమెరికా మిత్ర దేశాలున్నాయి. అందుకే ఈ విభజన చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రాంతం మళ్లీ రగులుతోంది.

బాంబు దాడులు, హత్యలతో ఇజ్రాయెల్ ఒకరకంగా ఇరాన్‌తో బయటకు కనిపించని యుద్ధం చేస్తోంది.

అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇరాన్‌ అణ్వాయుధ స్థావరాలపై పూర్తిస్థాయి వైమానిక దాడులకు దిగితే - ఈ సరిహద్దు కూడా చిన్నాభిన్నమవుతుంది.

హెజ్బొల్లా వెనుక ఇరాన్ ఉందని మీరు అనుకుంటున్నారా? అని అడగ్గా..

ఇజ్రాయెల్ ఆర్మీ కెప్టెన్ ష్మూయెల్ మామార్ స్పందిస్తూ.. ''అవును. కచ్చితంగా. ఇక్కడ వాళ్లేం చేస్తున్నారో మేము చూస్తున్నాం. ప్రతీరోజూ వాళ్లు ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తున్నాం. అయితే ఇవి చెప్పడం నా ఉద్యోగం కాదు. వ్యూహాత్మక విషయాలను రక్షించడమే మా బాధ్యత. కానీ వాళ్ల దగ్గరున్నవాటంన్నింటినీ మేము చూస్తున్నాం. వాళ్లు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి ఎలా ఆపరేట్ చేస్తున్నారు అన్నీ'' అన్నారు.

తిరిగి జెరూసలెం వస్తే - ఇజ్రాయెల్‌కు - పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలేవీ ఇక్కడ జరగట్లేదు.

ఈ ప్రాంతాన్ని సందర్శించే అమెరికా అధ్యక్షులకు అదొక ప్రధమ ప్రాధాన్యతగా అలవాటైంది.

ఇజ్రాయెలీలు తమ శాశ్వత రాజధానిగా చెప్పుకునే జెరూసలెం నగరం చుట్టూ కొంత పురోగతి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ పక్కన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకోసం మరోసారి బైడెన్ పిలుపునిచ్చారు.

కానీ గోడకు అటువైపు నుంచి చూస్తే - వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనీయులను జెరూసలెం నుంచి వేరు చేస్తూ ఇజ్రాయెల్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మూగబోయింది.

''ఆయనిక్కడి వచ్చింది కేవలం ఇజ్రాయెల్‌కు సాయం చేయడానికే. పాలస్తీనాకు కాదు. అతను మా గురించి ఏమీ పట్టించుకోడు'' అని పాలస్తీనా పౌరుడు జూడ్ సాహి అన్నారు.

''గడిచిన పది పదిహేనేళ్లలో ఎందరో అధ్యక్షులొచ్చారు. కానీ మా పరిస్థితుల్లో ఎలాంటి మార్పుని చూడలేదు'' అని మరొక పాలస్తీనా పౌరుడు విక్టర్ తబాష్ చెప్పారు.

జో బైడెన్ వెళ్లే బెత్లెహాం దారిలో - ఇజ్రాయెల్‌పై జాతి వివక్ష ఆరోపణలు కనిపిస్తున్నాయి.

అయితే వాటిని ఇజ్రాయెల్, అమెరికా తిరస్కరిస్తున్నాయి. కానీ పాలస్తీనాతో పాటుగా అనేక మానవ హక్కుల సంస్థలు వాటిని నమ్ముతున్నాయి.

మేలో ఇజ్రాయెలీ బలగాల చేతిలో హతమైన అమెరికన్ పాలస్తీనా జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లా బొమ్మలను బైడెన్ చూడబోతున్నారు.

అయితే ఈ అమెరికా అధ్యక్షుడికి అన్నిటికన్నా ఏది ముఖ్యం.. ఇజ్రాయెల్ భద్రతా, ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలా, తన పర్యటనలో బాగంగా చివరిగా సౌదీ అరేబియా చేరుకోవడమా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)