లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో

ఫొటో సోర్స్, YOGEN SHAH/THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES
లలిత్ మోదీ భారతదేశానికి తెలియని పేరు కాదు. నేడు టీ20 క్రికెట్ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఆయన సహకారం ఎవరూ మర్చిపోలేరు. 2015లో ఐపీఎల్ వివాదాల్లో చిక్కుకున్నప్పుడు లలిత్ మోదీ పాత్రపై ప్రశ్నలు, సందేహాలు తలెత్తాయి.
గురువారం లలిత్ మోదీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో తన సంబంధాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఆయన పేరు మరోసారి వారల్లో చోటుచేసుకుంది.
సీనియర్ పాత్రికేయుడు నారాయణ్ బారెట్ 2015లో లలిత్ మోదీపై రాసిన కథనాన్ని మరోసారి మీకు అందిస్తున్నాం.

ఫొటో సోర్స్, @LalitKModi
ఆ రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు. ఆయన పాలన జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వెలుపల వరకు సాగేది. కాలం మారినప్పుడు, ఆ స్టేడియం నాలుగు గోడల సరిహద్దును ఆయన అంగీకరించలేకపోయారు.
ఐపీఎల్ వివాదంలో చిక్కుకున్నప్పుడు కొందరు ఆయన రాజస్థాన్ తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తే, కొందరు ఆయన రాకపోతేనే మంచిదని భావించారు.
కొందరు ఆయన్ను అమితంగా అభిమానిస్తే, మరి కొందరు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. లలిత్ మోదీ దాదాపు నాలుగు సంవత్సరాలు (2005-2009) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
జుంజును జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర సింగ్ రాథోడ్ లలిత్ మోదీని అభిమానిస్తారు. ఆయన రాకతో క్రికెట్‌కు ఎంతో మేలు జరిగిందని, ఆయన త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని, పరిణామాల గురించి ఆలోచిస్తూ కూర్చోరని అన్నారు.
"ఆయన ఒక అడుగు ముందుకు వేశారంటే, ఇంక ఏం జరిగినా పట్టించుకోరు. ఈ రోజు ఈ స్టేడియంలో ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉండడానికి ఆయనే కారణం" అని రాథోడ్ చెప్పారు.
కోటా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అమీన్ పఠాన్ ఒకప్పుడు లలిత్ మోదీకి ప్రధాన సేనాధిపతి. ఇప్పుడు బద్ధ వ్యతిరేకి.
"ఆయన చాలా మొండివాడు. క్రికెట్ పరువు తీశాడు. నేడు ఆయనే వల్ల ఆట మొత్తం అపఖ్యాతి పాలైంది. ఆయన వచ్చినప్పుడు క్రికెట్‌కు మంచి చేస్తారని భావించారు. కానీ ఆయన దానితో వ్యాపారం చేశారు. అందుకే మేం నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన డబ్బు కోసం మాత్రమే పని చేస్తున్నారు" అని పఠాన్ అన్నారు.

ఫొటో సోర్స్, CARL COURT/AFP VIA GETTY IMAGES
నమ్మకంపై ప్రశ్నలు
కోటా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పఠాన్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఆయన్ను అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. అయితే, తన నిరసనను రాజకీయాలతో ముడిపెట్టి చూడకూడదని పఠాన్ అన్నారు.
రాచరిక రాష్ట్రంలో నిర్మించిన సవాయి మాన్‌సింగ్ స్టేడియంపై రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ చట్టపరమైన నియంత్రణను కలిగి ఉంది. కానీ లలిత్ మోదీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తరువాత కౌన్సిల్ ఆయన కోటలోకి మారింది. కౌన్సిల్ ప్రారంభమైన 53 ఏళ్లలో తొలిసారిగా దాని హోదా తగ్గింది.
గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాలు గతంలో ఈ స్టేడియంలోనే జరిగాయి. బహుశా ఇది క్రికెట్ ప్రభావం కావచ్చు, మూడు సంవత్సరాల పాటు ఈ రెండు పండుగలను స్టేడియంలో నిర్వహించలేదు.
అయితే, ఇందులో తప్పేమీ లేదని రాథోడ్ అంటారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
స్టేడియం వైభవం
ఈ స్టేడియం రెండు ప్రపంచ కప్‌లను చూసింది. 1983లో భారత, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా చూసింది. ఈ మ్యాచ్ చూడ్డానికి అప్పటి పాకిస్తాన్ పాలకుడు జియా-ఉల్-హక్ కూడా వచ్చారు.
లలిత్ మోదీ హయాంలో ఈ క్రీడా ప్రాంగణం వైభవంతో తులతూగింది. క్రికెటర్లతో పాటు మోడల్స్, సెలబ్రిటీలు వెలుగులు విరజిమ్మారు. బాలీవుడ్ స్టార్స్‌ను చూడగానే చీర్‌లీడర్లు కూడా రెచ్చిపోయేవారు.
క్రికెట్‌కు లలిత్ మోదీ సహకారం అందించడంపై మాజీ క్రికెట్ అసోసియేషన్ అధికారి మాట్లాడుతూ, "ఆయన బాలీవుడ్ తారల భుజాలపై చేతులు వేసి మాట్లాడడం చూశాను కానీ, ఏ వర్ధమాన ఆటగాడినీ అలా చేయి వేసి ప్రోత్సహించలేదు. ఆయన ఏ జిల్లాలోనైనా క్రికెట్‌ను ప్రోత్సహించడానికి వెళ్లారా? 2004 కంటే ముందు రాజస్థాన్‌లో లలిత్ మోదీ గురించి ఎవరికీ తెలియదు. బీజేపీ అధికారంలోకి రావడంతో క్రికెట్ అసోసియేషన్‌లో ఆయన అవతారమెత్తాడు. మోదీ నాగౌర్ నివాసి కావడంతో అక్కడి జిల్లా యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రజలకు ఒక్కసారిగా తెలిసింది. కానీ, ఆయన నాగౌర్‌లో ఎప్పుడూ కనిపించలేదు" అని అన్నారు.
నాగౌర్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర నందు మాట్లాడుతూ, “ఆయన నాగౌర్‌లోని ఆస్తులు కొన్నారు. ఆయన నాగౌర్ నివాసి అనడానికి ఇదే ఆధారం. అందులో తప్పేమీ లేదు.
నందు దృష్టిలో లలిత్ మోదీ ఉదార స్వభావి. కానీ, ఆయన ప్రత్యర్థులు మాత్రం ప్రభుత్వం దయ చూపిందని, స్పోర్ట్స్ యాక్ట్‌లో మార్పు చేసి అధికార బలంతో ఆయనకు పట్టం కట్టిందని అంటారు.
అధికార పీఠంలో కూర్చున్న మోదీ కొందరిని మొదటి పేర్లతో పిలవడం చూశారు. చాలా మంది ప్రభుత్వ అధికారులు ఆయన ఆగ్రహానికి గురయ్యారు. కొందరితో ఆయనకు వివాదాలు వచ్చాయి.

చేయిజారిపోయింది
2009లో లలిత్ మోదీ రెండోసారి క్రికెట్ సంఘం ఎన్నికల బరిలోకి దిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి సీపీ జోషి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం లలిత్ మోదీ చేయిజారిపోయింది.
2014లో రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో క్రికెట్ అసోసియేషన్‌లో మళ్లీ మోదీకి పట్టాభిషేకం ఖాయమనే భావన సర్వత్రా నెలకొంది. మాజీ మంత్రి జోషి మద్దతుదారులు కూడా లలిత్ మోదీ శిబిరంలో చేరారు. కానీ, ఈసారి కూడా ఆయనకు గ్రహాలు అనుకూలించలేదు.
అందుకే ఆయన వైభవానికి సాక్ష్యంగా నిలిచిన క్రికెట్ మైదానం ఇప్పుడు ఆయనకు అందనంత దూరం జరిగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- రిపోర్టర్ జమీర్ మరణం: ‘జర్నలిజంలో ఆర్థికంగా స్థిరపడటం కష్టమని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామనుకున్నాడు’
- చిన్న పిల్లల ఫార్ములా పాలు, ఆహారంలో విషపూరితమైన పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ అవశేషాలు ఉన్నాయా?
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













