ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి

ద్వారక

ఫొటో సోర్స్, Arfabita/Getty Images

ఫొటో క్యాప్షన్, ద్వారక
    • రచయిత, మిథున్ ప్రమాణిక్
    • హోదా, బీబీసీ న్యూస్

గత శతాబ్దం రెండవ భాగంలో భారతదేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుత ద్వారక నగరానికి సమీపంలో అదే పేరుతో ఉన్న పురాతన నగరం కోసం నీటి అడుగున అన్వేషణ ప్రారంభించారు. ఈ నగరం ఉనికిని ధృవపరిచే ఆధారాల కోసం వెతికారు.

సముద్రం అడుగున రాతి దిమ్మెలు, స్తంభాలు వంటి శిథిలాలెన్నో దొరికాయి. అయితే, ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది.

"భారతదేశంలో ద్వారకకు ప్రాముఖ్యం ఉంది. మహాభారత కాలంలో ఉనికిలో ఉన్న నగరమని ఇక్కడి ప్రజల విశ్వాసం" అని భారత పురావస్తు శాఖ ఏడీజీ డాక్టర్ అలోక్ త్రిపాఠి అన్నారు.

డాక్టర్ అలోక్ త్రిపాఠి నీటి అడుగున పురాతన అవశేషాల పరిశోధనలో నిపుణుడు. అరేబియా సముద్రంలో మునిగిపోయిన శిథిలాల అన్వేషణ చేస్తారు.

"నీటి అడుగున జరిపిన అతి ముఖ్యమైన తవ్వకాల్లో ద్వారక కోసం చేసిన ప్రయత్నం ఒకటి. ఈ ప్రదేశం మతపరమైన, చారిత్రకమైన ప్రాముఖ్యం కలిగి ఉంది. పురావస్తు శాస్త్ర పరిధిలో కూడా ఇది ప్రత్యేకమైనది" అని ఆయన చెప్పారు.

ద్వారక

ద్వారక కథ

భారతదేశంలోని ముఖ్యమైన తీర్థ స్థలాల్లో ద్వారక ఒకటి. మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది. కృష్ణుడి మరణం తరువాత అరేబియా మహా సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు.

"భగవాన్ శ్రీకృష్ణుడు ఈ నగరంలో వందేళ్లు జీవించాడు. గోమతి నది ఒడ్డున 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రాజ్యమిది. ఇక్కడే గోమతి నది అరేబియా మహా సముద్రంలో కలుస్తుంది" అని ద్వారక ఆలయ పూజారి మురళీ ఠాకూర్ చెప్పారు.

ద్వారక ఆలయ నిర్వాహకుడు నారాయణ్ బ్రహ్మచార్య మాట్లాడుతూ, "భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సముద్రం ద్వారకను తనలో కలిపేసుకుంది. మహాభారతం మూడవ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించారు. కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాక స్వర్గానికి వెళతాడు. అప్పుడు సముద్ర దేవతలు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కు తీసుకుంటారు" అని అన్నారు.

గత శతాబ్దం మధ్యలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగరం ఉనికికి సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాలను కనుగొనడానికి ప్రయత్నించారని డాక్టర్ అలోక్ త్రిపాఠి చెప్పారు.

"కచ్చితమైన ఆధారాలు దొరికితే చారిత్రకంగా ద్వారకా నగరం ఉనికిని ధృవపరచవచ్చు. ఈ అన్వేషణలో భాగంగా, 1960లలో పూణెలోని దక్కన్ కాలేజీ సముద్ర గర్భంలో తొలిసారిగా తవ్వకాలు జరిపింది. 1979లో భారత పురావస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది. ఈ తవ్వకాల్లో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి. అవి క్రీ.పూ 2000 నాటివిగా భావిస్తున్నారు" అని త్రిపాఠి వివరించారు.

వీడియో క్యాప్షన్, డైనోసార్ పొడవు 10 మీటర్లకంటే ఎక్కువే ఉండి ఉంటుందని అంచనా

సముద్ర గర్భంలో ద్వారక కోసం అన్వేషణ

"సముద్రం నుంచి బయటికొచ్చిన నేలపై ద్వారకా నగరం నిర్మితమైనట్లు కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు. కానీ, సముద్రపు నీరు మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు ద్వారక మునిగిపోయింది" అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మాజీ అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ నిగమ్ చెప్పారు.

"ప్రస్తుతం ఉన్న ద్వారకాధీశ్ ఆలయం సమీపంలో నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ అనేక ఆలయాల శిథిలాలు లభించాయి. సముద్రపు నీరు ముందుకొస్తున్న కొద్దీ ఇవన్నీ మునిగిపోయాయి. ఈ పరిశోధన ఆధారంగా, భారతదేశంలోని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.ఆర్.రావు సముద్ర తీరం వెంబడి తవ్వకాలు జరిపితే పురాతన నగర శిథిలాలు బయటపడవచ్చని భావించారు" అని రాజీవ్ నిగమ్ వివరించారు.

"ఈ అన్వేషణలో అనేక కళాకృతుల అవశేషాలు బయటపడ్డాయి. అందమైన రంగు రంగుల వస్తువులు లభించాయి. వాటిపై ఎన్నో రంగులు ఉన్నాయి. 500ల కన్నా ఎక్కువ కళాకృతులు, రకరకాల నమూనాలు లభించాయి. ఇవన్నీ రెండు వేల సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి. పలు రాతి దిమ్మెలు లభించాయి. కానీ, ఈ రాళ్లకు, బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియలేదు. తవ్వకం జరిపిన చోట అంతర్గత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది" అని డాక్టర్ అలోక్ త్రిపాఠి వివరించారు.

ద్వారక

పురావస్తు ఆధారాలు

సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేకం బయటపడ్దాయి. రాతి దిమ్మెలు, స్తంభాలు నీటిపారుదల పరికరాలు మొదలైనవి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. చర్చలు జరుగుతున్నాయి.

"2007లో భారీ తవ్వకాలు జరిగాయి. ఆ ప్రాజెక్టుకు నేను డైరక్టరుగా వ్యవహరించాను. ద్వారక భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది. దాని స్థానం పురాణాల్లో వర్ణించినట్టే ఉంది. ద్వారకా నగరానికి సమీపంలో గోమతి నది ఉంది. ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. అందుకే దీనికి 200 చదరపు మీటర్ల పరిధిలో తవ్వాలని నిర్ణయించాం. పురావస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో లోతైన పరిశోధన చేశాం. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాఖండాలు బయటపడ్డాయి’’అని డాక్టర్ త్రిపాఠి వివరించారు.

‘‘మేం వెళ్లిన చోటల్లా రాళ్లకు నంబర్లు వేశాం. ఇంకా లోతులకు వెళితే, ఆ ప్రాంతమంతా ఈ ప్రదేశాలు సహజ వృక్షసంపదతో కప్పేసి ఉన్నాయి . ఆ స్థలంలో పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. నిస్సందేహంగా ఇక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉండేదన్నదానికి రుజువులు అవి" అన్నారాయన.

"సముద్ర ఉపరితలంలో ఎలాంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడానికి పాత రికార్డులను కంప్యూటర్ ద్వారా ప్రొజెక్షన్ చేశాం. పదిహేను వేల సంవత్సరాల కిందట సముద్రపు ఉపరితలం వంద మీటర్ల దిగువన ఉండేది. మెల్ల మెల్లగా ఉపరితలం పెరుగుతూ వచ్చింది. ఏడు వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది. మూడున్నర వేల సంవత్సరాలకు ముందు ద్వారకా నగరం అక్కడ ఉండేది. దీని తరువాత సముద్రం మళ్లీ పైకి వచ్చి, నగరం మునిగిపోయింది" అని డాక్టర్ రాజీవ్ నిగమ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)