సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?

ఫొటో సోర్స్, PuneetBarnala/BBC
- రచయిత, వికాస్ త్రివేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్కూలులో పిల్లలు తమ బ్యాగ్ లోనుంచి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకం తెరచి రెండో చాప్టర్ దగ్గరకు వెళ్లారు. నేడు భారత చరిత్రను మలుపుతిప్పిన కీలక ఘట్టానికి సంబంధించిన పాఠాన్ని మనం చదువుకోబోతున్నామని టీచర్ చెప్పారు. ‘‘ద న్యూ కింగ్ అండ్ హిస్ కింగ్‌డమ్’’ పాఠాన్ని ఆయన మొదలుపెట్టారు. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ కథ. అంటే దిల్లీ కథ.
ఎన్‌సీఈఆర్‌టీ ఏడో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో మనకు ఈ పాఠం కనిపిస్తుంది. దాదాపు అన్ని చరిత్ర పుస్తకాల్లో దీని గురించి ఉంటుంది.
అయితే, చరిత్రను పిల్లలు చదవడం ఎంత కష్టమో, వివరించడమూ అంతే కష్టమని తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పారు. ‘‘సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’’ సినిమాలో ఆయన కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల మీడియాతో అక్షయ్ కుమార్ మాట్లాడారు. ‘‘మన పాఠ్య పుస్తకాల్లో పృథ్వీరాజ్ గురించి రెండు, మూడు లైన్లు మాత్రమే కనిపిస్తుంది. కానీ, దండెత్తిన వారి గురించి పెద్దపెద్ద పాఠాలు ఉంటాయి. మన సొంత రాజుల గురించి మనం తెలుసుకోకపోవడం దారుణం. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఈ సినిమా కథ డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది వివరించినప్పుడు.. పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చాలా విషయాలు తెలిశాయి. అయితే, ఇదంతా నిజమా లేదా కల్పితమా? అని నేను ఆయనను అడిగాను’’అని అక్షయ్ కుమార్ చెప్పారు.
ఇప్పుడు చాలా మందిని తొలచివేస్తున్న ప్రశ్న ఇదే. పృథ్వీరాజ్ కథ నిజమా లేదా కల్పితమా? దీనిపై చరిత్రకారులు ఏం అంటున్నారు?

ఫొటో సోర్స్, YRF/TrailerGrab
పృథ్వీరాజ్ రాసో ఏమిటి?
పృథ్వీరాజ్ చౌహాన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్‌లోనూ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపిస్తాయి.
పృథ్వీరాజ్ రాసోను ఆదికాలం అంటే 1,000 నుంచి 1,400 ఏళ్ల మధ్య కాలంలో రాశారు. హిందీ చరిత్రను నాలుగు భాగాలుగా విభజిస్తారు. వీటిలో మొదటిది ఆదికాలం, రెండోది భక్తికాలం, మూడోది రీతికాలం, నాలుగోది ఆధునిక కాలం. వీటిలో మొదటి, ప్రాచీన కాలాన్ని ఆదికాలంగా పిలుస్తారు.
పృథ్వీరాజ్ రాసోలో పృథ్వీరాజ్ జీవితానికి సంబంధించిన చాలా కథలు కనిపిస్తాయి. దీన్ని చంద్ బరదాయీ రచించారు.
‘‘అజ్మేర్ రాజు సోమేశ్వర్‌కు దిల్లీకి చెందిన రాజు అనంగపాల కుమార్తె కమలతో వివాహమైంది. సోమేశ్వర్, కమలల కుమారుడే పృథ్వీరాజ్. అనంగపాల రెండో కుమార్తెను కన్నౌజ్‌కు చెందిన విజయపాలకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి జయచంద్ జన్మించాడు. అయితే, అనంగపాల తన మనుమడైన పృథ్వీరాజ్‌ను దత్తత తీసుకున్నారు. అయితే, పృథ్వీరాజ్ విషయంలో జయచంద్ అసూయతో ఉండేవాడు. జయచంద్ ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. దీనితోపాటు తన కుమార్తె సంయోగితకు స్వయంవరం కూడా ఏర్పాటుచేస్తాడు. ఈ కార్యక్రమానికి పృథ్వీరాజ్ రాడు. దీంతో కోపోద్రిక్తుడైన జయచంద్.. పృథ్వీరాజ్ విగ్రహాన్ని ద్వారం దగ్గర నిలబెడతాడు. అయితే, అప్పటికే పృథ్వీరాజ్‌పై ఇష్టం పెంచుకున్న సంయోగిత ఆయన విగ్రహానికి పూలమాల వేస్తుంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ అక్కడికి వచ్చి పోరాడి సంయోగితను దిల్లీకి తీసుకెళ్తాడు’’అని పృథ్వీరాజ్ రాసోలో ఉంటుంది.
‘‘సంయోగితపైనే పృథ్వీరాజ్ దృష్టి మొత్తం ఉండేది. అదే సమయంలో మహమ్మద్ గోరీ దండెత్తాడు. అయితే, అతడిని పృథ్వీరాజ్ ఓడించి విడిచిపెట్టేస్తాడు. దీంతో మళ్లీ గోరీ దండెత్తుతాడు. ఈ సారి పృథ్వీరాజ్‌ను బందించి గజనీ తీసుకెళ్తాడు. పృథ్వీరాజ్ వెంట ఆయన రచయిత చంద్ బరదాయీ కూడా వెళ్తారు. చంద్ సలహాపై గోరీని బాణంతో పృథ్వీరాజ్ కొడతాడు. అయితే, ఆ తర్వాత దాడిలో పృథ్వీరాజ్ మరణిస్తాడు’’అని పృథ్వీరాజ్ రాసోలో పర్కొన్నారు.
చాలా జనపదాలు, సామాజిక పరిస్థితులు కూడా ప్రథ్వీరాజ్ రాసోలో కనిపిస్తాయి. అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, హిందీ పండితులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BookCover
పృథ్వీరాజ్ రాసోను ఎప్పుడు రాశారు?
ఆచార్య రామచంద్ర శుక్లా.. చరిత్రకారుడు, హిందీ పండితుడు. 1884లో ఆయన జన్మించారు. 1941లో మరణించారు.
‘‘హిందీ సాహిత్య కా ఇతిహాస్’’ పేరుతో ఆచార్య శుక్లా ఒక పుస్తకం రాశారు. ‘‘పృథ్వీరాజ్ రాసోలోని అంశాలు చారిత్రక ఆధారాలతో సరిపోలడం లేదు. అసలు దీన్ని ఎప్పుడు రాశారనే విషయంలోనూ సందేహాలున్నాయి. చాలా మంది చరిత్రకారులు ఈ పుస్తకాన్ని 16వ శతాబ్దంలో రాసినట్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దీనిలో చెంగిజ్, తైమూర్ లాంటి పాలకుల పేర్లను ప్రస్తావించడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది’’అని శుక్లా రాసుకొచ్చారు.
‘‘పృథ్వీరాజ్ కాలం 1177 నుంచి 1192 వరకు కొనసాగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే, 140 ఏళ్ల తర్వాత జరిగిన తైమూర్ దాడులను పృథ్వీరాజ్ రాసోలో చంద్ ప్రస్తావించడాన్ని ఎంతవరకు నమ్మగలం?’’
మరోవైపు ప్రముఖ చరిత్రకారుడు, హిందీ రచయిత రాయ్ బహదుర్ పండిట్ గౌరీశంకర్ హరించంద్ ఒజా కూడా పృథ్వీరాజ్ రాసోపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, PuneetBarnala/BBC
‘‘పృథ్వీరాజ్ కాలంనాటి కశ్మీరీ రచయిత జయానక్ ‘పృథ్వీరాజ్ విజయ్’ పేరుతో సంస్కృతంలో ఒక కవిత రాశారు. అయితే, ఇది సమగ్రంగా లేదు. దీనిలోని అంశాలు పృథ్వీరాజ్ చరిత్రతో సరిపోలుతున్నాయి. మరోవైపు పృథ్వీరాజ్ తల్లి కర్పూర్‌దేవీ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది హాంసీ శిలా శాసనంలోని వివరాలతో సరిపోలుతుంది. కానీ, పృథ్వీరాజ్ రాసోలో చాలా అంశాలు చారిత్రక ఆధారాలతో విభేదిస్తున్నాయి’’అని ఆచార్య శుక్లా రాసుకొచ్చారు.
హరియాణాలోని హిసార్‌లో హాంసీ ఉంటుంది. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ కోట ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ లభించిన శాసనాలు, లేఖలు, నాణేలు కూడా పృథ్వీరాజ్ రాసోలోని పేర్కొన్న సంవత్సరాలతో సరిపోలడం లేదు.
ఉదాహరణకు.. పృథ్వీరాజ్, మహమ్మద్ గోరీల మధ్య 1080లో యుద్ధం జరిగిందని పృథ్వీరాజ్ రాసోలో పేర్కొన్నారు. అయితే, పర్షియా చరిత్రలో ఈ యుద్ధం 1191లో జరిగినట్లు చెప్పారు. భారత చరిత్ర పుస్తకాల్లోనూ పర్షియా చరిత్రలో పేర్కొన్న సంవత్సరాన్నే రాస్తున్నారు.

ఫొటో సోర్స్, HaryanaGov
ఎవరేమంటున్నారు?
పృథ్వీరాజ్ రాసోకు అనుకూలంగా చరిత్రకారులు మాట్లాడటంలేదని అనుకోవడానికి వీల్లేదు.
అయితే, ఇక్కడ మనం ముందుగా క్యాలెండర్లలో ఉన్న తేడాను గుర్తించాలి. శాక, విక్రమ్, ఇంగ్లిష్.. పేర్లతో మూడు క్యాలెండర్లు మనకు అందుబాటులో ఉన్నాయి.
శాక క్యాలెండర్ ఇంగ్లిష్ క్యాలెండర్ కంటే 78ఏళ్లు వెనక్కి ఉంటుంది. మరోవైపు విక్రమ్ క్యాలెండర్ 57ఏళ్లు ముందుకు ఉంటుంది.
ఈ క్యాలెండర్లలో తేడావల్లే పృథ్వీరాజ్ రాసోను అపార్థం చేసుకుంటున్నారని ప్రముఖ హిందీ చరిత్రకారులు పండిట్ మోహన్ లాల్ విష్ణు లాల్ పాండ్య, బాబు శ్యాం సుందర్ దాస్, డాక్టర్ దశరథ్ శర్మ చెప్పారు.
‘‘పృథ్వీరాజ్ రాసో రాసిన చంద్‌కు కూడా ఈ తేడాపై చక్కని అవగాహన ఉంది. ఆయన కావాలనే అలా రాశారు’’అని పాండ్య అన్నారు. అయితే, ఆయనతో ఆచార్య శుక్లా విభేదిస్తున్నారు.
‘‘ఒకవేళ పృథ్వీరాజ్ రాసోను అప్పటి కాలానికి చెందిన రచయితే రాసుంటే.. ఏదో కొన్ని అంశాల్లోనే తేడా వచ్చుండేది. మిగతావి చారిత్రక ఆధారాలతో సరిపోలాలి’’అని ఆయన అన్నారు.
ఈ విషయంపై మరింత సమాచారం హిందీ సాహిత్య పుస్తకంలో కనిపిస్తుంది. దీన్ని డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ హర్‌దయాల్ రచించారు.
‘‘పృథ్వీరాజ్ రాసోలో కొన్ని అరబిక్-పర్షియన్ పదాలను ఉపయోగించారు. అందుకే ఇది ఫేక్ అని కొందరు చెబుతున్నారు. కానీ, కవి చంద్.. లాహోర్‌లో ఉండేవారని, ఆ ప్రాంతంపై ముస్లిం పాలకుల ప్రభావం ఉండేదని రాసోకు మద్దతు పలికేవారు చెబుతున్నారు’’అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
ఇన్ని వాదనలు ఉన్నప్పటికీ పృథ్వీరాజ్ రాసోలో పేర్కొన్న అంశాలు చారిత్రక ఆధారాలతో సరిపోలడంలేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Mib_India
ఎందుకీ చర్చ?
ఇంతపెద్ద పృథ్వీరాజ్ రాసో కావ్యాన్ని ఎప్పుడు, ఎవరు రాశారనే చర్చను పరిశీలిద్దాం.
పృథ్వీరాజ్ రాసోను విక్రమ క్యాలెండర్‌లో 1600(ఇంగ్లిష్ క్యాలెండర్‌లో 1543)లో రాసినట్లు గౌరీశంకర్ ఓజా చెబుతున్నారు. అంటే ఇది పృథ్వీరాజ్ కాలానికి 351ఏళ్ల తర్వాత జరిగింది.
‘‘పృధ్వీరాజ్ వంశీకులైన గోవిందరాజ్ లేదా హరిరాజ్‌ల ఆస్థానంలో చంద్ అనే రచయిత ఉండేవారు. ఆయనే పృథ్వీరాజ్ రాసో రాసి ఉండొచ్చు’’అని ఆచార్య శుక్లా అభిప్రాయపడ్డారు.
మరోవైపు పృథ్వీరాజ్ రాసోలో ఉపయోగించిన భాష కూడా అనుమానాలకు తావిస్తోంది. కొన్నిచోట్ల భాష ప్రాచీనంగా కనిపిస్తుంటే కొన్ని పదాలు ఆధునికంగా ఉంటున్నాయి.
‘‘12వ శతాబ్దంలో గ్రంథాలను మనం చూసి చెప్పొచ్చు. కానీ, పృథ్వీరాజ్ రాసో అలా కనిపించదు’’అని హజారీ ప్రసాద్ ద్వివేదీ చెప్పారు. ద్వివేది శిశ్యుల్లో ఒకరైన విశ్వనాథ్ త్రిపాఠి ‘‘హిందీ సాహిత్య్ కా సరల్ ఇతిహాస్’’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
‘‘పృథ్వీరాజ్ రాసో రాసిన కాలంపై చాలా వివాదాలున్నాయి. నేను ఈ పుస్తకం రాస్తున్నాని చెప్పినప్పుడు, తేదీల విషయంలో వివాదముందని, దాన్ని ప్రచురించొద్దని డాక్టర్ బూలర్ చెప్పారు’’అని విశ్వనాథ్ వివరించారు.
అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రకారుడు కల్నల్ జేమ్స్ టాడ్.. పృథ్వీరాజ్ రాసోకు మద్దతు పలుకుతున్నారు. రాజస్థాన్‌లో పనిచేసిన తొలి బ్రిటిష్ అధికారి జేమ్స్ టాడ్.
‘‘యాంటీక్స్ ఆఫ్ రాజస్థాన్’’ పేరుతో జేమ్స్ టాడ్ ఒక పుస్తకం రాశారు. దీనిలో లాస్ట్ హిందూ రూలర్ పేరుతో పృథ్వీరాజ్ చౌహాన్ కథలను వివరించారు.

ఫొటో సోర్స్, Twitter/Mib_india
ఇంతకీ ఏది నిజం?
పృథ్వీరాజ్ రాసోపై ఇన్ని భిన్నమైన వాదనలు వస్తున్నప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ కథల్లో ఏది నిజం అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.
ఇప్పుడు ‘‘పృథ్వీరాజ్ విజయ్’’ గురించి చరిత్రకారులు ఏం అంటున్నారో చూద్దాం.
మధ్యయుగానికి చెందిన చరిత్రకారుల్లో సతీశ్ చంద్ర ఒకరు. పృథ్వీరాజ్ చౌహాన్‌పై సతీశ్ ఒక పుస్తకం కూడా రాశారు.
‘‘గుజరాత్ రాజుల కింద ఉండే చౌహాన్‌లు.. పదో శతాబ్దం చివరి పదేళ్లలో నదౌల్‌లో రాజ్యం ఏర్పాటుచేసుకున్నారు. ఈ వంశానికి చెందిన విగ్రహరాజ చిత్తూరును తమ పాలనలోకి తీసుకున్నారు. అజమేరు(అజ్‌మేర్)లో వీరు స్థిరపడ్డారు. ఆ తర్వాత కాలంలో అంటే 1151లో దిల్లీక(దిల్లీ)ను తోమర్ల నుంచి విగ్రహరాజ కైవసం చేసుకున్నారు. చౌహాన్ రాజుల్లో ప్రసిద్ధి చెందిన వాడు పృథ్వీరాజ్-3.. ఈయన 1177లో సింహాసనాన్ని అధీష్టించారు. చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న రాజ్‌పుత్‌ల రాజ్యాలను పృథ్వీరాజ్ ఆక్రమించారు. అయితే, గుజరాత్‌లోని చాలుక్య రాజుపై ఆయన విజయం సాధించలేకపోయారు. దీంతో గంగా నదీ పరివాహక ప్రాంతాలకు పరిమితమయ్యారు’’అని తన పుస్తకంలోని ఐదో చాప్టర్‌లో సతీశ్ చంద్ర పేర్కొన్నారు.
‘‘బుందేల్‌ఖండ్ రాజధాని మహోబాపైనా పృథ్వీరాజ్ దండెత్తారు. ఈ పోరాటంలోనే బుందేల్‌ఖండ్ వీరులు ఆల్హ, ఊదల్ కథలు కూడా ఉన్నాయి. నేటికీ మహోబాలో వీరి కథలను చెప్పుకుంటారు. పృథ్వీరాజ్‌తో యుద్ధంలో ఊదల్ మరణించారు. దీనిపై ఆల్హ ప్రతీకారం తీర్చుకునేందుకు పృథ్వీరాజ్‌పై యుద్ధం చేస్తారు. యుద్ధంలో పృథ్వీరాజ్‌ను ఓడిస్తారు.. కానీ గురువు ఆదేశాలపై పృథ్వీరాజ్‌ను ప్రాణాలతో విడిచిపెడతారు’’అని సతీశ్ చంద్ర పేర్కొన్నారు.
‘‘పృథ్వీరాజ్ దండెత్తినప్పుడు మహాబా రాజు చందేలాకు కన్నౌజ్‌కు చెందిన జయచంద్ర సాయం చేశారు. మరోవైపు దిల్లీ, పంజాబ్‌లపై దండెత్తినప్పుడు గఢ్వాలాలు కూడా గట్టిగానే ప్రతిఘటించారు. గజనీ దండెత్తినప్పుడు ఈ రాజ్‌పుత్‌ల మధ్య వైరమే వీరు సంఘటితం కాకుండా అడ్డుకుంది. పృథ్వీరాజ్ రాసోలోనూ జయచంద్‌తో పృథ్వీరాజ్‌కు వైరమున్నట్లు పేర్కొన్నారు’’అని సతీశ్ చంద్ర వివరించారు.

ఫొటో సోర్స్, Objects of Translation Book
గోరీతో తొలి యుద్ధం..
కాబూల్‌కు 400 కి.మీ. దూరంలోని అఫ్గానిస్థాన్‌లో గోర్ పేరుతో ఒక ప్రావిన్స్ ఉండేది. షాబుద్దీన్ ముహ్మద్ అలియాస్ ముయీజుద్దీన్ ముహమ్మద్ బిన్ సామ్ స్వస్థలం ఇదే. ఈయన్నే భారత్‌లో మహమ్మద్ గోరీగా పిలుస్తారు.
1173లో గజనీ సింహాసనాన్ని గోరీ అధీష్టించాడు. 1178లో గుజరాత్‌లో ఎడారి మార్గం గుండా గోరీ భారత్‌లోకి ప్రవేశించాడు. అయితే, మొదట యుద్ధంలో అతడు ఓడిపోయాడు. దీంతో మళ్లీ సన్నద్ధమై లాహోర్, పెషావర్, సియాల్‌కోట్‌లను ఆయన స్వాధీనం చేసుకున్నాడు.
అదే సమయంలో చౌహాన్ రాజుల శక్తి కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. చాలా మంది తుర్కు పాలకులను వీరు ఆక్రమిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు.
ఇటు గోరీ, అటు పృథ్వీరాజ్.. ఇద్దరు విస్తరణ కాంక్ష గల రాజులే. హరియాణాలోని కర్నాల్‌లో 1191లో తరాయిన్‌లో గోరీ, పృథ్వీరాజ్‌ల మధ్య తొలి యుద్ధం జరిగింది. బఠిండాపై ఆధిపత్యం కోసం ఇద్దరూ యుద్ధానికి దిగారు.
ఈ యుద్ధంలో గోరీ సైన్యం ఘోరంగా పతనమైందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. మహమ్మద్ గోరీ ప్రాణాలతో యుద్ధ భూమి నుంచి పరారయ్యాడు. యుద్ధంలో విజయం సాధించిన పృథ్వీరాజ్ చౌహాన్ తబర్‌హింద్ వైపు వెళ్లారు. 12 నెలలపాటు తాబర్‌హింద్‌ను పృథ్వీరాజ్ చుట్టుముట్టారు. అయితే, పంజాబ్ నుంచి పూర్తిగా గోరీ సైన్యాన్ని పృథ్వీరాజ్ తరిమికొట్టలేదు.
అదే సమయంలో రెండో యుద్ధం కోసం గోరీ సిద్ధమయ్యాడు.
రెండో యుద్ధంలో...
పృథ్వీరాజ్, గోరీల మధ్య జరిగిన రెండో యుద్ధం భారత చరిత్రనే మలుపుతిప్పింది.
ఈ యుద్ధానికి 20 వేల మంది సైనికులతో గోరీ వచ్చాడు. విలువిద్యా నిపుణులు కూడా సైన్యంలో ఉండేవారు.
‘‘ఆ సమయంలో పృథ్వీరాజ్‌కు వరుస విజయాలు తెచ్చిపెట్టే స్కంద వేరే యుద్ధంలో పోరాడుతున్నారు. అయితే, గోరీతో పొంచివున్న ముప్పును పృథ్వీరాజ్ గమనించారు. వెంటనే చుట్టుపక్కల రాజ్‌పుత్‌ల సాయాన్ని కోరారు. కన్నౌజ్‌కు చెందిన జయచంద్ మినహా చాలా మంది పృథ్వీరాజ్‌కు సాయం అందించారు’’అని సతీశ్ చంద్ర పేర్కొన్నారు.
‘‘దాదాపు మూడు లక్షల సైన్యంతో పృథ్వీరాజ్ ముందుకు వెళ్లారు. 300 ఎనుగులు, చాలా గుర్రాలు కూడా ఆయన సైన్యంలో ఉన్నాయి. కానీ, గోరీ తన సైన్యాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. దీంతో పృథ్వీరాజ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’అని సతీశ్ చంద్ర వివరించారు.
‘‘యుద్ధ భూమి నుంచి పృథ్వీరాజ్ పరారయ్యారు. అయితే, సిర్సా దగ్గర ఆయన పట్టుబడ్డారు. ఒట్టొమాన్ సైన్యం హాంసీ, సరస్వతి, సమానా కోటలను ఆక్రమించింది. అజ్‌మేర్‌ను కూడా పృథ్వీరాజ్ నుంచి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కొంతకాలంపాటు ఆయన్ను పాలించేందుకు అనుమతించారు’’అని సతీశ్ చంద్ర పేర్కొన్నారు.
ఈ ఘటనలకు కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. వీటిలో నాణేల గురించి చెప్పుకోవాలి. వీటికి ఒకవైపు పృథ్వీరాజ్ దేవ్ అని మరోవైపు శ్రీ మహమ్మద్ సామ్ అని ముద్రించారు.
‘‘కొన్ని రోజుల తర్వాత పృథ్వీరాజ్‌ను కుట్రపన్ని హత్య చేశారు. ఆ తర్వాత సింహాసనంపై ఆయన కుమారుడిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కూడా రణథంబౌర్‌కు వెళ్లిపోయారు. అక్కడే మరో శక్తిమంతమైన చౌహాన్ పాలనకు పునాది వేశారు. అయితే, దిల్లీ, తూర్పు రాజస్థాన్ నేరుగా ఒట్టమాన్ పాలన కిందకు వచ్చాయి’’అని సతీశ్ చంద్ర తన పుస్తకంలో వివరించారు.
తరాయిన్ యుద్ధం తర్వాత గోరీ.. దిల్లీ వదిలి గజనీకి వెళ్లిపోయారు. దిల్లీ బాధ్యతలు కుతుబుద్దీన్ ఐబక్ చేతుల్లో పెట్టారు. ఆయన పేరు మీదనే దిల్లీలో కుతుబ్ మినార్ నిర్మించారు.
మళ్లీ 1194లో గోరీ.. భారత్‌కు వచ్చారు. జయచంద్‌తో యుద్ధం చేశారు. దాదాపు గెలిచే స్థితిలో ఉన్న జయచంద్.. బాణం తగలడంతో మృతి చెందారు.
1206లో చివరిసారిగా ఖోఖరీలపై మహమ్మద్ గోరీ దండెత్తాడు. ఆ తర్వాత అతడు గజనీకి వెళ్లిపోయాడు. అక్కడే ఒక ముస్లిం యువకుడు అతడిని హత్య చేశాడు.

ఫొటో సోర్స్, BBC/PuneetBarnala
చాలా కథలు..
పృథ్వీరాజ్ చౌహాన్ నాటి కాలాన్ని హిందీ సాహిత్యంలో ఆదికాలం లేదా వీర్‌గాథ కాలంగా పిలుస్తారు. ఆ సమయంలో రాజుల పోరాట పటిమ గురించి గొప్పగా రాసేవారు.
సంస్కృతీ, సంప్రదాయాలకు విలువనిచ్చే భారత్ లాంటి దేశాల్లో పృథ్వీరాజ్ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
పృథ్వీరాజ్ విజయ్, తాజ్ అల్-మాసిర్, పృథ్వీరాజ్ ప్రబంధ, ప్రబంధ చింతామణి, పురాన్ ప్రబంధ సంగ్రాహ్ లాంటి రచనల్లోనూ పృథ్వీరాజ్ కథలు చాలా ఉన్నాయి.
ప్రతి రచనలోనూ పృథ్వీరాజ్ జీవితానికి సంబంధించిన కొత్త కథ కనిపిస్తుంటుంది. పృథ్వీరాజ్ రోజుల తరబడి నిద్రపోయేవారని, గోరీ దాడి జరిగినప్పుడు ఆయన నిద్రలోనే ఉన్నారని ప్రబంధ చింతామణిలో పేర్కొన్నారు.
టెక్సాస్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ సింథియా టాల్‌బోట్.. ‘ద లాస్ట్ హిందూ ఎంపరర్’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
పృథ్వీరాజ్ జీవితానికి సంబంధించిన వాస్తవాలు ‘‘పృథ్వీరాజ్ విజయ్’’లో పేర్కొన్న అంశాలు దగ్గరగా ఉంటాయని సింథియా పేర్కొన్నారు.
తాజ్ అల్-మాసిర్‌ను పర్షియన్ రచయిత హసన్ నిజామీ రాశారు. 1191లో గోరీ ఓటమి గురించి దీనిలో చెప్పలేదు. అయితే, తిరుగుబాటు లేవనెత్తడం వల్లే పృథ్వీరాజ్‌కు మరణ శిక్ష విధించారని పేర్కొన్నారు.
పుస్తకాలకు అతీతంగా..
‘‘పృథ్వీరాజ్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆనాటి విశేషాలకు సంబంధించిన వివరాలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి’’అని ప్రొఫెసర్ సింథియా చెప్పారు.
ఈ డాక్యుమెంట్లు, పుస్తకాల సంగతి పక్కనపెడితే, అజ్‌మేర్‌లో పృథ్వీరాజ్ మెమోరియల్ ఉంది. అక్కడ మనకు పృథ్వీరాజ్ విగ్రహం కనిపిస్తుంది. చేతిలో బాణాలు పట్టుకొని ఆయన గుర్రం మీద కూర్చున్నట్లుగా ఆ విగ్రహం ఉంటుంది.
అక్కడకు వచ్చే చాలా మంది పృథ్వీరాజ్ రాసోలోని కథలను నిజమని నమ్ముతుంటారు. అక్షయ్ కుమార్ సినిమాలోనూ ఈ కథ మనకు కనిపిస్తుంది.
మరోవైపు మన చరిత్ర పుస్తకాల్లో పృథ్వీరాజ్ గురించి వివరంగా రాయాల్సిన అవసరముందని కేంద్ర విద్యా శాఖ మంత్రిని అక్షయ్ కుమార్ అభ్యర్థించారు.
ఈ సినిమా కోసం డైరెక్టర్ చంద్రప్రకాశ్ 18ఏళ్ల పాటు హోం వర్క్ చేశారని ఒక ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ చెప్పారు.
‘‘వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ చరిత్రను మనం చరిత్ర కోణంలోనే చూడాలి. నేటి పరామితులు, దృక్పథాల చట్రాల్లో చరిత్రను బందించాలని చూడకూడదు’’అని అక్షయ్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి
- ‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు?’ - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













