తాజ్ మహల్: ‘మూసి ఉన్న గదుల్లో దాగిఉన్న ఆ రహస్యాలు ఏంటంటే..’

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోని అతిగొప్ప కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌లోని మూసి ఉన్న గదుల్లో ఏవైనా రహస్యాలు దాగి ఉన్నాయా?
భారత్‌లోని ఒక హైకోర్టుకు చెందిన జడ్జిలు అయితే ఈవిధంగా ఆలోచించరు. అందుకే ఈ అంశానికి సంబంధించిన దాఖలైన పిటిషన్‌ను గురువారం కొట్టివేశారు.
తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచిన 20కి పైగా గదులను తెరిచి అందులోని వాస్తవ చరిత్రను పరిశోధించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఒక సభ్యుడు పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇంకా చెప్పాలంటే... మూసి ఉన్న ఆ గదుల్లో హిందువుల దేవుడు 'శివుడి'కి సంబంధించిన ఆలయం ఉందని చరిత్రకారులు, ఆరాధకులు చేసిన వాదనల్లోని నిజానిజాలను తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు పిటిషనర్ రజనీశ్ సింగ్ చెప్పారు.
ఆగ్రా నగరంలోని యమునా నది తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్ మహల్. తమ 14వ బిడ్డకు జన్మినిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన స్మారకాన్ని ఇటుక, ఎర్రని ఇసుకరాయి, పాలరాతితో నిర్మించారు. ఇందులో ఉపయోగించిన అల్లిక పని ఎంతో ప్రశస్తి చెందింది. ఇన్ని విశేషాలున్న తాజ్‌మహల్ భారత్‌లోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా నిలిచింది.
అయితే, అందరూ ఆమోదించిన ఈ చరిత్ర రజనీశ్ సింగ్‌ను ఆకట్టుకోలేకపోయింది. ''మూసి ఉన్న గదుల వెనుక ఉన్న చరిత్రను మనందరం తెలుసుకోవాలి'' అని ఆయన కోర్టును అభ్యర్థించారు.
రజనీశ్ సింగ్ తెరవాలని కోరుతున్న చాలా గదులు తాజ్‌మహల్ బేస్‌మెంట్‌లో ఉన్నాయి. అయితే, ఆ గదుల్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు అని అధికారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGES
‘ఆ గదుల్లో ఏముందంటే..’
మొఘల్ ఆర్కిటెక్చర్ పరిశోధకురాలు, తాజ్ మెజిస్టీరియల్ స్టడీ రచయిత ఎబ్బా కోచ్... తన పరిశోధన సందర్భంగా తాజ్‌మహల్‌లోని గదులను, దారులను సందర్శించారు. వాటిని ఫొటోలు తీశారు.
ఈ గదులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవి నెలల కోసం భూగర్భంలో నిర్మించినవి. నదీతీరం వైపు ఉన్న తాజ్‌మహల్ గ్యాలరీలో వరుసగా గదులు ఉంటాయి. నదీతీరం వెంబడి 15 గదులు వరుసగా ఉన్నట్లు ఎబ్బా కోచ్ గుర్తించారు. ఇరుకుగా ఉండే దారి గుండా ఆమె ఆ గదుల వద్దకు చేరుకున్నారు.
అందులో ఏడు గదులు పెద్దగా, నలువైపులా గూళ్లతో ఉండగా... ఆరు గదులు చతురస్రాకారంలో, మరో రెండు గదులు అష్టభుజి ఆకారంలో ఉన్నాయి. పెద్దగా ఉండే గదుల ముఖద్వారం నదీతీరం వైపు ఉంటుంది. ఆ గదుల్లో అందమైన పేయింటింగ్‌లు, అలంకరణలు, నక్షత్రాల జాలీలు ఉన్నట్లు ఆమె కనుగొన్నారు.
''చక్రవర్తి, ఆయన రాణులు ఉల్లాసంగా గడపడానికి ఇది ఒక చల్లని, అందమైన ప్రదేశంగా ఉండి ఉంటుంది'' అని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలోని ఆసియన్ ఆర్ట్ ప్రొఫెసర్ ఎబ్బా కోచ్ అన్నారు.
మొఘల్ వాస్తు కళలో ఇలాంటి భూగర్భ గ్యాలరీలు ఉండటం సర్వ సాధారణం. పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఉన్న ఒక మొఘల్ కోటలో కూడా ఇటువంటి గదులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, SEPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGE
‘ఆ తర్వాత అధికారులు గదులను మూసేశారు..’
షాజహాన్ తరచుగా యమునా నదిపై పడవలో ప్రయాణించి తాజ్‌మహల్‌కు చేరుకునేవారు. అక్కడి విశాలమైన మెట్ల మార్గం ద్వారా ఆయన తాజ్‌మహల్ లోపలికి ప్రవేశించేవారు.
''నేను తాజ్‌మహల్‌ను సందర్శించినప్పుడు అందంగా పేయింటింగ్ చేసిన కారిడార్‌ను చూశాను. ఆ కారిడార్, విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటుంది. కచ్చితంగా అది చక్రవర్తి ప్రయాణించే మార్గమే'' అని 20 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని సందర్శించిన అమితా బేగ్ చెప్పారు.
1978లో వరదలు వచ్చే వరకు ఆ భూగర్భగదులు, సందర్శకుల కోసం తెరిచి ఉండేవని దిల్లీకి చెందిన చరిత్రకారులు రాణా సఫ్వీ గుర్తు చేసుకున్నారు. ఆమె ఆగ్రాలో పెరిగారు.
''వరదల కారణంగా స్మారకంలోకి నీరు చేరుకున్నాయి. భూగర్భంలోని కొన్ని గదుల్లో బురద మేట వేసింది. వాటికి కొంత పగుళ్లు వచ్చాయి. ఆ తర్వాత సందర్శకులు అందులోకి వెళ్లకుండా అధికారులు వాటిని మూసివేశారు. అంతకుమించి అక్కడ ఏమీ లేదు'' అని ఆమె చెప్పారు. పునరుద్ధరణ పనులు నిర్వహించే సమయంలో ఆ గదులను తెరుస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP
తాజ్ మహల్‌పై కల్పిత కథలు..
తాజ్‌కు సంబంధించి పురాణగాథలు, కల్పిత కథలు వాడుకలో ఉన్నాయి.
ప్రస్తుత కట్టడానికి ఎదురుగా 'బ్లాక్ తాజ్'ను నిర్మించాలని షాజహాన్ అనుకోవడం... తాజ్‌మహల్‌ను యూరోపియన్ ఆర్కిటెక్ట్ నిర్మించారనడం ఇలాంటి కథల్లో కొన్ని.
అంతేకాకుండా కొంతమంది పాశ్చాత్య మేధావులు ఏమంటారంటే... ముస్లిం సమాజంలో మహిళలకు తక్కువ స్థానం ఉండేది, అలాంటి ఒక మహిళ కోసం ఈ తాజ్‌మహల్‌ను నిర్మించలేదు అని వారు అభిప్రాయపడ్డారు.
తాజ్‌మహల్ వద్ద సందర్శకుల కోసం పనిచేసే గైడ్లు... ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆర్కిటెక్ట్, దాని కోసం పనిచేసిన వర్కర్లను షాజహాన్ ఎలా చంపారో కథలు కథలుగా వివరిస్తుంటారు.
తాజ్‌మహల్ నిజానికి శివునికి అంకితం చేసిన ఒక హిందూ దేవాలయం అని భారత్‌లో ఎప్పటినుంచో ఒక మొండి వాదన ఉంది. 1761లో సూరజ్ మల్ అనే హిందూ రాజు ఆగ్రాను జయించిన తర్వాత... తాజ్‌మహల్‌ను దేవాలయంగా మార్చాలని ఆస్థాన పూజారి ఆయనకు సూచించినట్లు చెబుతారు. ''తాజ్‌మహల్ నిజానికి ఒక శివాలయమే'' అని ఒక పుస్తకంలో పీఎన్ ఓక్ పేర్కొన్నారు. 1964లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీరైటింగ్ ఇండియన్ హిస్టరీ అనే సంస్థను పీఎన్ ఓక్ స్థాపించారు.
తాజ్‌మహల్ అనేది భారతీయ సంస్కృతికి కళంకం అని దీన్ని దేశద్రోహులు నిర్మించారని 2017లో బీజేపీ నేత సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు.
హిందూ రాజకుటుంబానికి చెందిన భూమిని లాక్కొని షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారని బీజేపీ ఎంపీ దియా కుమారి అన్నారు.
ఈ రకమైన సిద్ధాంతాలు గత దశాబ్ద కాలంగా మితవాద వర్గంలో కొత్త ఊపును తెచ్చాయని సఫ్వీ అన్నారు. "తాజ్‌పై నిశితమైన పండితుల పరిశోధన కంటే ఎక్కువగా కాల్పనిక కథలే ఉన్నట్లుగా అనిపిస్తోంది'' అని ఎబ్బా కోచ్ పేర్కొన్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- మన పాలపుంతలో మహా కాల బిలం ఫొటోకు చిక్కింది...
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ... మీ జేబుపై పడే భారమెంత?
- 'ఏడాదిలోగా మనుమడో, మనుమరాలినో కనివ్వండి, లేదా 5 కోట్ల పరిహారం కట్టండి' -కొడుకు, కోడలిపై తల్లిదండ్రుల కేసు
- అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















