కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బార్బరా పీర్షనెక్
- హోదా, ది కాన్వర్జేషన్
అల్జీమర్స్ జబ్బును, ఇతర నాడీసంబంధిత సమస్యల తొలి సంకేతాలను గుర్తించగలిగే ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌ను సాన్ డియేగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తయారు చేశారు.
ఒక వ్యక్తి కనుపాపల పరిమాణంలో మిల్లీమీటరు కన్నా తక్కువ స్థాయిలో జరిగే మార్పులను సైతం సెల్ ఫోన్‌లోని నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా ఈ యాప్ పసిగడుతుంది. ఈ మార్పులను పరిశీలించటం ద్వారా సదరు వ్యక్తి జ్ఞాపక శక్తి స్థాయిని అంచనా వేస్తారు.
ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. మన కళ్లను చూసి దాదాపుగా అన్ని రకాల జబ్బులు, అనారోగ్యాలను గుర్తించగలిగే పరిస్థితులు వస్తాయి. మన శరీరంలోని ఇతర అవయవాలు, భాగాలను పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, టెక్నాలజీ, పద్ధతులకన్నా.. తక్కువ చొచ్చుకెళ్లే టెక్నాలజీ, పద్ధతులతో పారదర్శకంగా ఉండే కళ్లను పరీక్షించే వీలుంటుంది.
కానీ, అసలు ఏ టెక్నాలజీ అవసరం లేకుండానే.. కేవలం మన కళ్లలోకి చూసి అనేక రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించటం సాధ్యమే. మన కళ్లు చూపే ప్రమాద సంకేతాల్లో కొన్ని ఇవి.

ఫొటో సోర్స్, Getty Images
1. కనుపాప పరిమాణం
కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తుంది. ప్రకాశవంతమైన వాతావరణంలో కనుపాప చిన్నదవుతుంది. వెలుతురు తగ్గే కొద్దీ కనుపాప పెద్దదవుతుంది.
ఈ కనుపాప పరిమాణం హెచ్చుతగ్గుల ప్రతిస్పందన నెమ్మదిగానో, ఆలస్యంగానో జరుగుతున్నట్లయితే అది పలు అనారోగ్యాలను సూచిస్తుంది. అందులో అల్జీమర్స్ వంటి వ్యాధులు, మందుల ప్రభావాలు, మాదకద్రవ్యాల వినియోగించారనే దానికి ఆధారాల వంటివి ఉంటాయి.
కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించే వారిలో కనుపాపలు ఉబ్బి కనిపిస్తాయి. హెరాయిన్ వాడేవారిలో కనుపాపలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
2. ఎరుపు లేదా పసుపు కళ్లు
కంటిలోని తెల్లగుడ్డు రంగు మారటం కూడా మన శరీరంలో ఏదో తేడా ఉందనే సంకేతం కావచ్చు.
కళ్లు ఎరుపు రంగులోకి, రక్తంతో ఎరుపెక్కిన రంగులో కనిపిస్తే.. అది అధికమోతాదులో మద్యం లేదా, మాదకద్రవ్యాలను తీసుకున్నదానికి సంకేతం కావచ్చు. కళ్లలో నలత లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కళ్లు ఎర్రగా మారవచ్చు. అయితే ఈ సమస్య చాలా వరకూ రోజుల్లోనే తగ్గిపోతుంది.
ఒకవేళ కళ్లు ఇలా రంగి మారి ఎక్కువ కాలం అలాగే ఉంటే మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్, వాపు, లేదా కాంటాక్టు లెన్సులు, సొల్యూషన్లకు రియాక్షన్‌ను అది సూచించవచ్చు.
మరీ తీవ్రమైన కేసుల్లో ఎరుపు కళ్లు గ్లుకోమాకు సూచనకావచ్చు. ఈ జబ్బు అంధత్వానికి దారితీయగలదు. ఇక తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే అది జాండిస్ (కామెర్లు) జబ్బుకు గుర్తు. కాలేయానికి జబ్బు సోకిందని చిహ్నం.
కామెర్లు సోకటానికి కారణాలు చాలా ఉంటాయి. కాలేయం వాపు (హెపటైటిస్), జన్యుపరమైన లేదా ఆటోఇమ్యూన్ జబ్బులు, కొన్ని రకాల మందులు, వైరస్‌లు, ట్యూమర్లు వంటి వాటివల్ల ఈ జబ్బు రావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. ఎరుపు చార
కంటి తెల్లగుడ్డు మీద ఒక ఎర్రని, రక్తపు చార వంటి గుర్తు కనిపించిందంటే.. అది అక్కడి ఒక చిన్న రక్త నాళం చిట్లిందని అర్థం. ఈ పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణాలు తెలియవు. కొన్ని రోజుల్లోనే ఆ చార కనిపించకుండా పోతుంది.
అయితే.. అధిక రక్తపోటుకు లేదా మధుమేహానికి సూచిక కావచ్చు. అంతేకాదు, రక్త సరఫరాలో గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడి అధిక రక్తస్రావానికి దారితీయగల ప్రమాదానికి ఈ రక్త చారిక సంకేతం కావచ్చు.
రక్తం పలుచబారటానికి వాడే ఆస్పిరిన్ వంటి మందులు కూడా ఈ చారకు కారణం కావచ్చు. ఈ సమస్య తరచుగా వస్తున్నట్లయితే తమకు ఇస్తున్న మందుల మోతాను సమీక్షించాల్సిందిగా సదరు వ్యక్తి తనకు చికిత్స చేస్తున్న వైద్యుడ్ని కోరవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
4. నల్లగుడ్డు చుట్టూ వలయం
కంటిలో నల్లగుడ్డు (శుక్ల పటలం) చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే అది తరచుగా.. అధిక కొవ్వుకు చిహ్నంగా, గుండె జబ్బు ప్రమాదం ఎక్కువ ఉన్నదని చెప్పే సంకేతంగా పరిగణిస్తారు.
ఈ వలయం మద్యపాన వ్యసనాన్ని కూడా వెల్లడించవచ్చు. అలాగే వయోవృద్ధుల కళ్లలో కూడా ఈ వలయాలు కనిపిస్తుంటాయి. అందుకే దీనికి వైద్య పరిభాషలో ఆర్కస్ సెనిలిస్ అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
5. లావాటి గడ్డ
కళ్లలో మనం చూడగానే చాలా భయపెట్టే సమస్యలు ఒక్కోసారి అతి నిరపాయకరమైన, చాలా సులభంగా చికిత్స చేయగలిగే సమస్యలు కావచ్చు.
కంటి తెల్లగుడ్డు మీద పుట్టుకువచ్చే పసుపురంగులోని లావాటి గడ్డ పింగుకులా. ఇది కొవ్వు, మాంసం ఒకచోట పేరుకుని ఏర్పడే గడ్డ. దీనిని చుక్కల మందుతో సులభంగా తగ్గించవచ్చు. లేదంటే చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించవచ్చు. నిజానికి ఈ గడ్డను అది కార్నియాను - అంటే నల్లగుడ్డును తాకకముందే తొలగించి తీరాలి.
ఒకవేళ అది పెరిగుతూ పోయేదాకా అశ్రద్ధ చేస్తే.. నల్లగుడ్డు (శుక్ల పటలం) మీద పెట్రీజియం అనే ఒక తెరవంటిది ఏర్పడుతుంది. అది చూపును మసకబారుస్తుంది.
తరచుగా సూర్యుడి అతినీలలోహిత వెలుతురు బారిన పడటం పింగుకులా, పెట్రీజియం రెండిటికీ ఒక ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6. ఉబ్బిన కళ్లు
కళ్లు బయటకు పొడుచుకువచ్చినట్లు ఉబ్బుగా ఉండటం మామూలు ముఖాకృతిలో భాగంగా ఉండవచ్చు.
కానీ, మామూలుగా ఉబ్బెత్తు కళ్లు లేని వారికి.. కళ్లు ఉబ్బుతూ బయటకు పొంగుతున్నట్లుగా రావటం మొదలైతే.. అందుకు థైరాయిడ్ గ్రంథి సమస్య కారణం కావచ్చు. దీనికి వైద్య సాయం అవసరం.
ఒకటే కన్ను బయటకు పొడుచుకువచ్చినట్లు అయితే.. దానికి కారణం ఏదైనా గాయం కానీ, ఇన్ఫెక్షన్ కానీ కావచ్చు. అరుదైన కేసుల్లో కంటి వెనుక ట్యూమర్ (గడ్డ) ఏర్పడటం కూడా కారణం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
7. రెప్పల మీద కురుపులు
కళ్లే కాదు, కనురెప్పలు కూడా చాలా అనారోగ్యాల గురించి సూచిస్తుంటాయి. ఇవి ప్రధానంగా కనురెప్పల గ్రంథులకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలు.
కనురెప్పల్లో తరచుగా కనిపించే సమస్య స్టై లేదా చలాజియాన్. ఎక్కువగా పై కనురెప్ప మీద.. అరుదుగా కింది కనురెప్ప మీద ఒక ఎర్రటి గడ్డ ఏర్పడుతుంది. నూనె గ్రంథికి అడ్డంకులు తలెత్తటం వల్ల ఈ కురుపులు పుట్టుకొస్తాయి.
స్టై లేదా చలాజియన్ అని పిలిచే ఈ కనురెప్పల కురుపులు మామూలుగా వాటికవే తగ్గిపోతాయి. లేదంటే వెచ్చటి కాపడం పెట్టటం ద్వారా తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గకుండా ఎక్కువ కాలం కొనసాగితే దీనిని చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించాలి.

ఫొటో సోర్స్, Getty Images
8. కళ్లు అదరటం
ఇక కనురెప్పలు అదరటం (ఆక్యులార్ మయోకిమియా) చాలా తరచుగా జరుగుతుంటుంది. దీనికి ఇరిటేషన్, శరీరంలో వేడి సెగలు (హాట్ ఫ్లాషెస్) కారణం కావచ్చు. ఒక్కోసారి ఇవి కనిపించే దానికన్నా చాలా తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి.
ఈ కళ్లు లేదా కనురెప్పలు అదరటం అనే ఈ పరిస్థితి చాలా వరకూ ఒత్తిడి వల్ల కానీ పోషకాహార సంతులనం లోపించటం వల్ల కానీ, అధిక మోతాదులో కెఫీన్ సేవించటం వల్ల కానీ తలెత్తే నిరపాయమైన సమస్య.
ఈ కథనం కేవలం ఒక గైడ్ మాత్రమే. మీ ఆరోగ్యం గురించి మీకు సందేహాలు ఉన్నట్లయితే వైద్య నిపుణులను సంప్రదించండి.
బార్బరా పీర్షనెక్ బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీ రీసెర్చ్, ఇన్నోవేషన్ విభాగం ప్రొఫెసర్, డిప్యూటీ డీన్.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
- యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















