మదర్స్ డే : తల్లి కావడానికి సరైన వయసు ఏది

ఫొటో సోర్స్, Pooja Pathak
- రచయిత, రోహన్ నామ్‌జోషి
- హోదా, బీబీసీ మరాఠీ
కొన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం ఉండదు. వ్యక్తిని బట్టి సమాధానం మారుతుంటుంది. అయితే, ఈ ప్రశ్నకు అందరూ సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అలాంటి ప్రశ్నకు తగిన సమాధానాన్ని చెప్పేందుకు మేం నిపుణులతో మాట్లాడాం.
‘‘తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది’’ అనేదే ఆ ప్రశ్న.
పూజ ఖాడే పాఠక్ పుణెలో ఉంటారు. హెచ్ఆర్ ఫీల్డ్‌లో ఆమె పనిచేస్తున్నారు. 23ఏళ్ల వయసులో ఆమె తల్లి కావాలని అనుకున్నారు. ఇప్పుడు ఆమె వయసు 34ఏళ్లు. ఆమె కుమార్తె వయసు 11 ఏళ్లు. ఎప్పుడు తల్లి కావాలనే ప్రశ్నకు ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.
‘‘ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌లోనూ కాంపిటీషన్ ఉంది. అప్పట్లో నా కెరియర్ కూడా అంత గొప్పగా ఉండేది కాదు. అందుకే అప్పుడే తల్లి అయ్యేందుకు విరామం తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడే విరామం తీసుకుంటే, భవిష్యత్‌లో మంచి అవకాశాలు వచ్చినప్పుడు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉండదని భావించాను’’అని పూజ చెప్పారు.
‘‘కెరియర్‌తోపాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాను. 23ఏళ్ల వయసులో నా ఆరోగ్యం చాలా బావుండేది. ఒత్తిడి, ఇతర ప్రభావాలను మెరుగ్గా ఎదుర్కొనే స్థితిలో నా ఆరోగ్యం ఉండేది. మరోవైపు నా బిడ్డ, నాకు మధ్య వయో భేదం ఎక్కువగా ఉండకూడదని అనుకున్నాను’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, AFP
ఇంతకీ ఏది సరైన వయసు?
నిజానికి దీనికి సమాధానం వ్యక్తిని బట్టి మారుతుంటుందని గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్‌షేత్కర్ చెప్పారు. అయితే, 25 నుంచి 35 ఏళ్ల మధ్య తల్లి కావడం మంచిదని ఆమె అన్నారు.
‘‘35ఏళ్ల తర్వాత తల్లికావడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే 25 నుంచి 35ఏళ్లు.. తల్లి కావడానికి సరైన వయసని మేం చెబుతాం. కానీ, ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు’’అని ఆమె చెప్పారు.
‘‘అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫెర్టిలిటీ టెస్టు చేయించుకుంటే మంచిది. దీన్నే యాంటీ ములేరియన్ హార్మోన్ (ఏఎంహెచ్) టెస్టుగా చెబుతుంటారు. మన శరీరంలో ఎన్ని అండాలు ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అండాలు తక్కువగా ఉంటే, మహిళలు అప్రమత్తం కావాలి’’అని ఆమె చెప్పారు.
మరోవైపు తల్లి అయ్యేందుకు సరైన వయసు 25 నుంచి 30 ఏళ్లని నాగ్‌పుర్‌కు చెందిన గైనకాలజిస్టు డాక్టర్ చైతన్య శెబేకర్ చెప్పారు.
‘‘సంతాన సమస్యలతో మా దగ్గరకు వచ్చే వారిలో 30 ఏళ్ల వయసున్న మహిళలు కూడా ఉన్నారు. 30ఏళ్లు దాటిన తర్వాత, మహిళల్లో అండాల సంఖ్య తగ్గిపోతోంది. 32 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత పడిపోతుంది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈ రోజుల్లో ఒవేరియన్ ఏజెంగ్ పెద్ద సమస్యగా మారుతోంది. మా దగ్గరకు వచ్చే మహిళల్లో 30 శాతం మందికి ఇదే సమస్య. పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కొన్నిసార్లు పిల్లలను కనడం వాయిదా వేసుకుంటున్నారు’’అని ఆయన చెప్పారు.
మరోవైపు అండాలను ఫ్రీజింగ్ చేసుకోవడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘పెద్దపెద్ద కంపెనీలు ఈ విషయంలో బీమాను కల్పిస్తున్నాయి. అయితే, అండాలు ఫ్రీజ్ చేసుకోవడం అనేది అందరికీ ఉపయోగపడదు. ముఖ్యంగా సదరు మహిళ వయసును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వయసు తక్కువగా ఉండే మహిళలు తమ అండాలను ఫ్రీజ్ చేసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. ఒకసారి వయసు పైబడితే ఈ విధానం పనికిరాదు’’అని ఆయన అన్నారు.
‘‘పిల్లలకు జన్మనివ్వడం అనేది మహిళలకు రెండో జన్మ లాంటిది. ఎందుకంటే మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు గర్భం దాల్చినప్పుడు చుట్టుముడుతుంటాయి. అందుకే మరీ చిన్నప్పుడు పిల్లలను కనకూడదు. అదేసమయంలో వయసు పైబడే వరకూ ఆగకూడదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆలస్యం అయితే...
ముంబయికి చెందిన రీటా జోషి ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. 20ల వయసులో ఆమె కెరియర్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
ఆమె పెళ్లి చేసుకునే సమయానికి వయసు 35ఏళ్లు దాటిపోయింది. ఆమె పిల్లల కోసం సహజసిద్ధంగా చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు.
చివరగా అక్టోబరు 2020లో ఐవీఎఫ్ పద్ధతిలో ఆమె తల్లి అయ్యారు. లాక్‌డౌన్ వల్ల చికిత్సకు అవసరమైన సమయాన్ని ఆమె కేటాయించగలిగారు.
కెరియర్ వల్ల పెళ్లిని వాయిదా వేసుకోవడంతో చాలా మంది మహిళలను సంతాన సమస్యలు చుట్టుముడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ వయసు ఎందుకంత ముఖ్యం?
మహిళల్లో అండాల సంఖ్యపై వారి వయసు ప్రభావం చూపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ వారిలో ఉండే అండాల సంఖ్య తగ్గిపోతుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
పురుషుల్లో శుక్రకణాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ, అమ్మాయిల్లో పది లక్షల అండాలు ఉంటాయి. రజస్వల అయ్యే సమయానికి ఇవి 3,00,000గా ఉంటాయి. 37ఏళ్లకు ఈ అండాలు 25,000కు తగ్గిపోతాయి. 51ఏళ్లకు కేవలం వెయ్యి అండాలు మాత్రమే ఉంటాయి.
వయసు పెరిగేకొద్దీ అండాల సంఖ్య తగ్గడంతోపాటు అండాల్లోని డీఎన్ఏ, క్రోమోజోమ్‌ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. 80ఏళ్లు వచ్చేసరికి అండాల్లోని డీఎన్ఏ, క్రోమోజోమ్‌లు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి.
మహిళల్లో అండాలపై డాక్టర్ ఆండ్రియా జురిసికోవా పరిశోధన చేపట్టారు.
‘‘మహిళల్లో అండాల సంఖ్య అనేది వారి జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు వారి జీవితంలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఈ సంఖ్యపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా వారిపై పడే ఒత్తిడి, రసాయనాల వల్ల అండాలు ప్రభావితం అవుతాయి’’అని ఆమె చెప్పారు.
‘‘అండాల సంఖ్యతోపాటు వాటి నాణ్యత విషయంలోనూ మనం అప్రమత్తంగా ఉండాలి. వయసు పెరిగేకొద్దీ అండాల నాణ్యత తగ్గిపోతుంది’’అని ఆమె అన్నారు.
క్రోమోజోములు కీలకం
గర్భధారణలో క్రోమోజోమ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. క్రోమోజోమ్‌ల లోపాల వల్ల కూడా సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘క్రోమోజోమ్‌లలో లోపాలతో వచ్చే సంతాన సమస్యలు ఎక్కువగా వయసు పైబడిన వారిలో కనిపిస్తాయి. అయితే, క్రోమోజోమ్‌లలో లోపాలు ఉండేటప్పుడు కూడా చాలా మందికి పిల్లలు పుడుతుంటారు. రుతుక్రమ సమయంలో మాత్రం వారి అండాలు గర్భధారణకు సరిపడవు’’అని ఆండ్రియా చెప్పారు.
ప్రస్తుత సామాజిక పరిస్థితులపై పూజ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో చాలా మంది 25ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. 30ఏళ్లను కూడా తక్కువ వయసుగానే భావిస్తున్నారు. తమకు కావాల్సినప్పుడు పిల్లలను కనొచ్చని అనుకుంటున్నారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాతే పరిస్థితుల తీవ్రత తెలుస్తుంది’’అని ఆమె అన్నారు.
పూజ భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. ప్రస్తుతం ఆమె తన కుమార్తెను ఒంటరిగానే పెంచుతున్నారు. మరోవైపు ఆలస్యంగా తల్లైన రీటా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. తల్లి కావాలని నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద విషయం. దీన్ని సరైన వయసులో తీసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి-
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి-
- పెనైల్ క్యాన్సర్-- పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది-
- పాముల సెక్స్- సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది-
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














